లైవ్ జామింగ్.. ఉల్లాసం జూమింగ్!
- DV RAMANA

- Jul 29
- 2 min read
తీరక లేని మనిషికి కొత్త వినోద సాధనం
ప్రేక్షకులను ఒకచోట చేర్చడం.. వినోదం అందించడం
మెట్రో సిటీల నుంచి చిన్న నగరాలకు పెరుగుతున్న క్రేజ్
కొద్దిపాటి ఫీజుతో మరో లోకంలో విహరించే అవకాశం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
నిరంతరం కష్టపడే శరీరానికి కాసింత విశ్రాంతి.. అలసిన మనసుకు ప్రశాంతత చేకూర్చే ఉల్లాసభరితమైన వాతావరణం అవసరం. ఈ రెండు అవసరాలను ఏకకాలంలో తీర్చేదే కథా కాలక్షేపం. సినిమాలు వంటి వినోద సాధనాలు లేనికాలంలో మనిషి నాటకాలు, బుర్రకథలు, హరికథలు వంటి కథాకార్యక్రమాలతోనే కాలక్షేపం పొంది రోజంతా పడిన శ్రమను మర్చిపోయి రీఛార్జ్ అయ్యేవాడు. తర్వాతకాలంలో సినిమాలు రంగప్రవేశం చేయడంతో సంప్రదాయ కాలక్షేప కార్యక్రమాలకు ఆదరణ తగ్గిపోయింది. అనంతర కాలంలో వీడియోలు, ఆర్కెస్ట్రాలు.. అన్నింటికీ మించి టీవీలు వంటి అనేకానేక వినోద సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిని ఆస్వాదించే అవకాశం మనకే లేకుండాపోయింది. తీరికలేని, ఒత్తిడి విపరీతంగా పెరిగిన జీవన విధానంలో విశ్రాంతికి, మానసిక ఉల్లాసానికి చోటు లేని దుస్థితి ఏర్పడింది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు పనులతో బిజీ ఉండటం వల్ల శారీరక, మానసిక విశ్రాంతి దుర్లభంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఏ కాస్త కొత్తదనం కనిపించినా, కాస్తంత ఆహ్లాదం, వినోదం లభిస్తాయనిపించినా మానవ సమాజం వాటిని అందిపుచ్చుకునేందుకు తహతహలాడిపోతున్నది. అలాంటివి లభిస్తాయనుకున్న ప్రాంతాల్లో రెక్కలు కట్టకుని వాలిపోతున్నది. ఆ క్రమంలో మానవ సమాజం వెనకటి రోజులకు వెళుతోందా అనిపిస్తోంది. కాలచక్రంతోపాటు వెనుకటి వినోద ప్రక్రియలే మళ్లీ మనముందుకొస్తున్నాయి. దీనికి ‘లైవ్ జామింగ’ అనే ప్రక్రియను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ మధ్యే బాగా ట్రెండింగ్ అవుతున్న ఈ కార్యక్రమం పూర్వకాలంలో ప్రధాన వినోదంగా ఉన్న కథాకాలక్షేప ప్రక్రియనే పోలి ఉంటున్నది. భజనలు, గీతాలాపనలు వంటి కార్యక్రమాలతో కొన్ని గంటలపాటు ఆహూతులు అన్ని మర్చిపోయి ఆస్వాదించడం ద్వారా మానసిక ప్రశాంతతతో తిరిగివెళ్లేలా చేయడమే ఈ లైవ్ జామింగ్ ప్రక్రియ ప్రధాన థీమ్‌గా నిర్వాహకులు చెబుతున్నారు. కాకపోతే అప్పట్లో ఇలాంటి కార్యక్రమాలను ప్రత్యేకించి ఆయా బృందాలు, నిష్ణాతులు మాత్రమే నిర్వహిస్తే ప్రేక్షకులు స్థిమితంగా కూర్చుని ఆస్వాదించడమే తప్ప అందులో ఏవిధంగానూ పాల్గొనే అవకాశం ఉండేదికాదు. దీనికి భిన్నంగా ఇప్పటి లైవ్ జామింగ్‌లో అక్కడ డయాస్ మీద భజన బృందాలు, ఆర్కెస్ట్రా గ్రూపు ప్రదర్శన ఇస్తుంటే దిగువన ప్రేక్షకులు తమ ఆనందాన్ని, ఉత్సాహాన్ని చేతల్లో చూపించే స్వేచ్ఛ, అవకాశం కల్పిస్తున్నారు.
మెట్రోస్ నుంచి చిన్న నగరాలకు
మెట్రో నగరాలు నిరంతరం రద్దీగా, బిజీగా ఉన్నట్లే.. ఆ నగరాల్లో నివసించే ప్రజలు కూడా క్షణం తీరికలేని యాంత్రిక జీవనం గడుపుతుంటారు. ఈ బిజీ లైఫ్ నుంచి కాస్త పక్కకు మళ్లి కూసింత కళాపోషణ లేదా కాసింత వినోదం పొందే అవకాశాన్ని కల్పించే మాధ్యమంగా మహానగరాల్లో లైవ్ జామింగ్ అనే నూతన ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. సుమారు ఏడాదిన్నర క్రితం హైదరాబాద్‌లాంటి కొన్ని నగరాల్లో ప్రారంభమైన ఈ జామింగ్ ప్రక్రియలో ప్రధానంగా రెండు కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి భజన బృందాలతో కీర్తనలు ఆలపించడం ద్వారా ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లడం.. రెండోది ఆర్కెస్ట్రా గ్రూపులతో మధురమైన గీతాలు పాడించడం ద్వారా సంగీతలోకంలో విహరింపజేయడం.. తమను తాము మర్చిపోయి గీతాలకు అనుగునంగా నృత్యాలు చేయడం ద్వారా ఆ కొన్ని గంటలసేపు అన్ని బాధలు, శ్రమలు మర్చిపోయి మానసిక ఉల్లాసం పొందేలా చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి మహానగరాల నుంచి విశాఖపట్నానికి.. అక్కడి నుంచి ఇప్పుడు శ్రీకాకుళం వంటి చిన్న నగరానికి ఈ జామింగ్ సంస్కృతి వేగంగా విస్తరించింది. శ్రీకాకుళంలో ఇప్పటికే లైవ్ భజన్ జామింగ్ పేరుతో రెండు కార్యక్రమాలు జరిగాయి. అయితే ఇవి పూర్తి ఉచితం కావు. శ్రీకాకుళంలో నిర్వహించిన రెండు కార్యక్రమాలకు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.199 వసూలు చేశారు. కానీ విశాఖపట్నం పోర్టు కళావాణి ఆడిటోరియంలో నిర్వహించిన జామింగ్‌కు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.500, రూ.1000, రూ.2000 రూపంలో 3 రకాలుగా వసూలు చేశారు.
తక్కువ ఖర్చు.. ఎక్కువ ఆదరణ
డబ్బులు చెల్లించి మరీ పెద్దసంఖ్యలో జనం ఈ కార్యక్రమాలకు హాజరయ్యారంటే వారు కొత్తదనాన్ని, ఆటవిడుపు కార్యక్రమాలను ఎంతగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాకుళం కార్గిల్ పార్కులో నిర్వహించిన మొదటి లైవ్ జామింగ్‌కు 500 మందికిపైగా హాజరుకాగా.. విశాఖ పోర్టు ఆడిటోరియంలో నిర్వహించిన జామింగ్‌కు కూడా పెద్దసంఖ్యలో ప్రేక్షకులు హాజరుకావడమే కాకుండా కార్యక్రమం జరుగుతున్నంతసేపు ప్రపంచాన్ని మర్చిపోయి భజనలకు అనుగుణంగా భక్తిభావనలో మునిగిపోవడమే కాకుండా.. ఆర్కెస్ట్రా గీతాలకు అనుగుణంగా చిన్నాపెద్దా తేడా లేకుండా గొంతు కలిపారు.. పాదం కదిపి ఒళ్లుమరిచి నృత్యాలు కూడా చేశారు. ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తున్నందున లైవ్ జామింగ్ ప్రక్రియను కొత్త కొత్త థీమ్‌లతో విస్తరించే ఆలోచన కూడా ఉందని శ్రీకాకుళం లైవ్ జామింగ్ నిర్వాహకుడు పాలకొండ ప్రసాంత్ ‘సత్యం’తో మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుతానికి నిర్వాహణ ఖర్చులు పెద్దగా లేవని.. వేదికను వేదిక నిర్వాహకులే ఉచితంగా ఇస్తుండగా, రిజిస్ట్రేషన్ ఫీజుగా వచ్చిన ఆదాయాన్ని భజన బృందాలు తీసుకుంటున్నాయని వివరించారు. ఇక కార్యక్రమ ప్రచారానికి అవసరమైన క్యూఆర్ కోడ్ýతో కూడిన బ్యానర్లు వంటివాటికి మాత్రం ఒక్కో కార్యక్రమానికి రూ.15వేలు ఖర్చు అవుతున్నదని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఈ ప్రక్రియ మరింత ప్రాచుర్యం పొందితే ఆదాయం లభించవచ్చేమోనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికైతే లాభాపేక్షరహితమని వివరించారు.






Comments