వక్ఫ్ చట్టం.. ఎందుకింత వివాదం?
- DV RAMANA
- Aug 10, 2024
- 4 min read
వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలకు కొత్త బిల్లుతో కత్తెర
1995 చట్టానికి 40 సవరణలు ప్రతిపాదించిన కేంద్రం
ఇది ముస్లిం మత వ్యవహారాల్లో జోక్యమేనని విమర్శలు
కలెక్టర్లకే సర్వాధికారాలు కల్పించడంపై అభ్యంతరాలు
ఆస్తులు, అధికారాలు లాక్కోవడానికేనని ఆరోపణలు

వక్ఫ్ చట్టం.. అందులో సవరణలకు కేంద్రం ప్రతిపాదించిన బిల్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బిల్లుకు మద్దతుగా, వ్యతిరేకంగా ఎవరి వాదనలు వారు వినిపిస్తుండటంతో ఇదో పెద్ద వివాదంగా మారింది. లోక్‌సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ప్రవేశపెట్టిన సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. తీవ్రవాదోపవాదాల అనంతరం బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు పంపించాలని సభలో నిర్ణయించారు. ఆ మేరకు వివిధ పార్టీలకు చెందిన 21 మంది సభ్యులతో జేపీసీ లోక్‌సభ స్పీకర్ నియమించారు. ఇంతకూ వక్ఫ్ చట్టం ఏమిటి? వక్ఫ్ బోర్డు ఏమిటి? ఆ చట్టంలో కేంద్రం ప్రతిపాదించిన 40 సవరణల ఉద్దేశం ఏమిటి? ముస్లిం సంఘాలు, ప్రతిపక్షాలు ఈ సవరణలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో పరిశీలిద్దాం.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
మైనారిటీలుగా ఉన్న ముస్లిం సమాజానికి చెందిన ఆస్తుల పరిరక్షణ, నిర్వహణకు స్వాతంత్య్రానంతరం 1954లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని తొలిసారి తీసుకొచ్చింది. కొన్ని దశాబ్దాల తర్వాత 1995లో ఒకసారి, 2013లో రెండోసారి వక్ఫ్ చట్టంలో కేంద్రం కొన్ని సవరణలు చేసింది. ఈ రెండు సవరణలూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ`1, 2 ప్రభుత్వాల హయాంలో జరగ్గా తాజాగా మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మూడుసారి సవరణలు ప్రతిపాదించింది. సుమారు 40 సవరణలతో కూడిన బిల్లును మంత్రి కిరణ్ రిజుజు మూడురోజుల క్రితం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వక్ఫ్ బోర్డుకు ఉన్న అపరిమిత, అనియంత్రిత అధికారాలను తగ్గించడం, ప్రాతినిధ్యం లేని ముస్లింలలోని కొన్ని వర్గాలకు, మహిళలకు వక్ఫ్ బోర్డుల్లో ప్రాతినిధ్యం కల్పించడం, జిల్లా కలెక్టర్లకు వక్ఫ్ ఆస్తుల సంరక్షణ బాధ్యతలు కట్టబెట్టడం ప్రస్తుత సవరణ బిల్లు ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గత యూపీఏ ప్రభుత్వాలు చేసిన సవరణలతో వక్ఫ్‌బోర్డుల్లో ఇతర ప్రభుత్వ వ్యవస్థలేవి జోక్యం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిరదన్నది కేంద్ర ప్రభుత్వ వాదన. అలాగే సాధారణ ముస్లింలు, ముస్లిం మహిళలు, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళల పిల్లలు, షియాలు, బోహ్రాలు వంటివారికి వక్ఫ్ బోర్డుల్లో చోటు కల్పించాలన్న డిమాండ్‌ను పరిష్కరించడం కూడా ప్రస్తుతం సవరణల లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. అయితే మత సంస్థల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు, ముస్లిం సంఘాలు విమర్శిస్తున్నాయి.
ఇతర మతసంస్థలకు లేనన్ని అధికారాలు
లౌకికి దేశంగా చెప్పుకొనే భారత్‌లో ఇతర ఏ మత సంస్థలకూ లేని అధికారాలు ముస్లిం సంస్థ అయిన వక్ఫ్ బోర్డుకు ఎందుకు కల్పించారని ముస్లిమేతరులు ప్రశ్నిస్తున్నారు. దేశంలో 30 వక్ఫ్ బోర్డులు ఉంటే వాటి పరిధిలో సుమారు 9.4 లక్షల ఎకరాల భూములు ఉన్నాయని అంచనా. వాటి విలువ సుమారు 1.20 లక్షల కోట్లు ఉంటుందంటున్నారు. ఈ ఆస్తుల నుంచి ఏటా సుమారు రూ.200 కోట్ల ఆదాయం బోర్డుకు లభిస్తోంది. దేశంలో రక్షణ, రైల్వే శాఖల తర్వాత అత్యధిక ఆస్తులు కలిగిన సంస్థ వక్ఫ్ బోర్డు మాత్రమేనని, కానీ ఈ ఆస్తుల నిర్వహణలో జోక్యం చేసుకునే అధికారం ఏ ప్రభుత్వ వ్యవస్థకు లేకుండా చేశారన్న విమర్శలు ఉన్నాయి. సౌదీ అరేబియా, ఒమన్ వంటి ముస్లిం దేశాల్లోనూ ఇన్ని ఆస్తులు, ఇన్ని అధికారాలు ముస్లిం సంస్థలకు లేవని అంటున్నారు. ఏదైనా భూమిని లేదా ఆస్తిని తమదిగా వక్ఫ్ బోర్డు ప్రకటిస్తే.. ఇక ఆ నిర్ణయాన్ని మార్చే శక్తి ఎవరికీ ఉండదు. చివరికి కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేవు. ఇదే అదనుగా కేవలం 200 మంది ముస్లిం పెద్దలు దేశంలోని వక్ఫ్ బోర్డులను, ఆస్తులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో జస్టిస్ సచార్ కమిషన్, రెహమాన్ ఖాన్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు అప్పడి కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులను ఉపసంహకరించుకోవడంతో కొత్త కొన్ని అంశాలు చేర్చడమే ప్రస్తుతం కేంద్ర ప్రాతిపాదించిన బిల్లు ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేస్తోంది.
బిల్లులో ప్రతిపాదించిన కొన్ని సవరణలు
ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకునేందుకు వీల్లేదు. కొత్త చట్టం అమల్లోకి వస్తే వక్ఫ్‌బోర్డులు తమ ఆస్తులను జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (కలెక్టర్) కార్యాలయంలో తప్పనిసరిగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఆదాయ, వ్యయాల వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది.
బోర్డు స్వరూపాన్ని మార్చడంతో పాటు అందులో కొత్తగా మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తారు. రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు చొప్పున మహిళా సభ్యులు ఉంటారు.
వక్ఫ్ బోర్డుకు చెందిన వివాదాస్పద, పాత ఆస్తులను కొత్తగా పరిశీలిస్తారు. వక్ఫ్ బోర్డు లేదా ఎవరైనా వ్యక్తులు క్లెయిములు, కౌంటర్ క్లెయిములు చేసిన ఆస్తులకు కొత్త సవరణ వర్తిస్తుంది. ప్రతిపాదిత చట్టం ప్రకారం.. వక్ఫ్ బోర్డు చేసే అన్ని క్లయిమ్‌లను తప్పనిసరిగా, పారదర్శకంగా ధృవీకరించాల్సిందే.
వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 19, 14లలో మార్పులు చేస్తారు. దీనివల్ల సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు రూపురేఖలు మారే అవకాశం ఉంది.
వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని ఇప్పుడు హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ నిబంధన లేదు. 1995 చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఒక భూమిని తనదిగా వక్ఫ్ ప్రకటిస్తే అది ఆ బోర్డుకే వెళ్లిపోతుంది. దాన్ని కోర్టులోనూ సవాలు చేసే పరిస్థితి లేదు. ఇది పిటిషనర్‌కు న్యాయవ్యవస్థ నుంచి న్యాయం కోరకుండా నిరోధిస్తోంది. దేశంలో మరే మత సంస్థకూ ఇలాంటి అధికారాలు లేవు.
వక్ఫ్ ఆస్తులను పేద ముస్లింల ప్రయోజనం కోసం ఉపయోగించాలి. కానీ పరిస్థితి అలా లేదు. పలుకుబడి ఉన్న ముస్లిం పెద్దలు ఈ ఆస్తులను తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు గుర్తించారు. పలు ఆస్తులను బలవంతంగా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించడంపై కూడా వివాదం ఉంది. ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు వక్ఫ్ ఆస్తులను పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు కల్పిస్తున్నారు.
పిల్లలు కలిగి ఉన్న ముస్లిం మహిళ భర్త నుంచి విడాకులు తీసుకుంటే ఆమెతోపాటు బిడ్డల పోషణకు ప్రత్యేక ఏర్పాటు లేదు. కొత్త బిల్లులో దానికి అవకాశం కల్పిస్తున్నారు.
వక్ఫ్ అంటే ఏమిటి?
వక్ఫ్ అనేది అరబిక్ పదం. దీని అర్థం ‘ఆపడం’ లేదా ‘లొంగిపోవడం’. ఇస్లాంలో వక్ఫ్ ఆస్తిని శాశ్వత మత, ఛారిటబుల్ ట్రస్ట్‌కు అంకితం చేస్తారు. ఈ ఆస్తులను మతపరమైన కార్యక్రమాలకు, పేదలకు, విద్య తదితర అవసరాలకు ఉపయోగిస్తారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇవి వక్ఫ్ ఆస్తులను రిజిస్టర్ చేసి, సంరక్షించడంతోపాటు వాటిపై లావాదేవీలను నిర్వహిస్తాయి. వక్ఫ్ చట్టం ప్రకారం అన్ని వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ రిజిస్ట్రేషన్ సంబంధిత రాష్ట్ర వక్ఫ్ బోర్డులోనే జరుగుతుంది. ఈ ఆస్తులపై నియంత్రణ అధికారం వక్ఫ్ బోర్డుకే ఉంది. వీటిని బోర్డు పరిధిలో ముతవల్లీ(మేనేజర్)లు పర్యవేక్షిస్తుంటారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. అన్ని వివాదాలను ఈ కోర్టు పరిష్కరించేలా 1995లో చేసిన సవరణల ద్వారా అధికారం కల్పించారు. ఈ అధికారాలన్నింటినీ తాజా సవరణ బిల్లు ద్వారా లాగేసుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అభ్యంతరాలేమిటి?
కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరేసి ముస్లిం మహిళలకు చోటు కల్పించడం ముస్లిం వర్గాలు ప్రధాన అభ్యంతరాల్లో ఒకటి. అలాగే ముస్లిమేతరులకూ స్థానం కల్పించడం. ఇద్దరు లోక్‌సభ, ఒక రాజ్యసభ సభ్యులకు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో చోటు కల్పిస్తారు. ఈ ముగ్గురు ముస్లింలే అయ్యుండాలనే నిబంధనేమీ లేదు. పాత చట్టం ప్రకారం తప్పనిసరిగా ముస్లిం ఎంపీలకే కౌన్సిల్‌లో చోటు ఉండేది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ స్వరూపాన్ని ఎప్పుడైనా మార్చే అధికారాన్ని తాజా బిల్లు కేంద్రానికి కట్టబెడుతోంది.
ఒక ఆస్తి వక్ఫ్‌కు చెందినదా.. ప్రభుత్వానిదా అనే వివాదం తలెత్తితే దానిపై నిర్ణయాధికారాన్ని కొత్త కలెక్టర్లకు కల్పించింది. వక్ఫ్ చట్టం-1995లోని సెక్షన్-6 ప్రకారం ప్రస్తుతం ఇలాంటి వివాదాల్లో వక్ఫ్ ట్రిబ్యునళ్లు తీర్పులిస్తున్నాయి. దీనివల్ల అక్రమంగా ఆస్తులు దక్కించుకోవడానికి స్వార్థపరులు ట్రిబ్యూనళ్లను అడ్డం పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
బోరాలు, అగాఖానీల కోసం ప్రత్యేకంగా ఔఖాఫ్ బోర్డు ఏర్పాటు చేస్తారు. వక్ఫ్ బోర్డుల్లో షియాలు, సున్నీలు, బోరాలు, ఆగాఖానీలు, ముస్లింలోని ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా కొత్త బిల్లులో ప్రతిపాదించారు.
తన ఆస్తిని దానంగా ఇవ్వడానికి ఒక వ్యక్తి సిద్ధపడినపుడు.. అతను రాసిన చెల్లుబాటయ్యే అంగీకారపత్రాన్ని (వక్ఫ్‌నామా) కొత్త బిల్లు తప్పనిసరి చేస్తోంది. ప్రస్తుతం ఒక వ్యక్తి మౌఖికంగా కూడా తన ఆస్తిని వక్ఫ్‌కు ఇచ్చేసే పరిస్థితి ఉంది.
ఒక ఆస్తి వక్ఫ్‌కి చెందినదా? కాదా? అని నిర్ణయించే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉండదు. కొత్త ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుతం ఉన్న ముగ్గురు సభ్యుల వక్ఫ్ ట్రిబ్యూనల్ ఇద్దరు సభ్యులకే పరిమితం కానుంది. ఈ ట్రిబ్యూనల్ నిర్ణయాలు కూడా అంతిమం కావు. ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని 90 రోజుల్లో హైకోర్టులో సవాల్ చేయొచ్చు.
కేంద్రం ప్రతిపాదించిన ఒక సవరణ వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత గందరగోళంగా మారుస్తుందంటున్నారు. ఇప్పటికే అనేక బాధ్యతల భారంతో పని చేస్తున్న కలెక్టర్లు లేదా డిప్యూటీ కమిషనర్లు వీటిపై దృష్టి సారించే అవకాశం ఉండదని, దాంతో వివాదాల ఆస్తుల నిర్ధారణ, వివాదాల పరిష్కారంలో జాప్యం జరుగుతుందంటున్నారు.
Comments