వడగాలుల ముట్టడిలో ఐరోపా
- DV RAMANA

- Jul 1
- 3 min read
జూన్ నెలలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు
1300 దాటిన మరణాలు.. పగిలిపోతున్న రోడ్లు
2003 విపత్తును మించిన ఉపద్రవమంటున్న శాస్త్రవేత్తలు
మారుతున్న వాతావరణ పరిస్థితులే కారణమని హెచ్చరిక

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
వేసవిలో మనదేశంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 సెల్సీయస్ డిగ్రీలు దాటిపోతుంటాయి. మన రాష్ట్రంలోని రాయలసీమ, సెంట్రల్ దక్షిణాంధ్ర ప్రాంతాల్లో అయితే 45 నుంచి 50 డిగ్రీలను కూడా తాకుతుంటాయి. మనకు ఇది కామన్. ఉష్ణతాపం తీవ్రంగా ఉన్నప్పటికీ అంత వేడిని తట్టుకోవడం మనకు అలవాటైపోయింది. కానీ శీతల వాతావరణం ఉండే ఐరోపా దేశాలు ఇప్పుడు ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్నాయి. హీట్‌వేవ్స్(వడగాలులు) తాకిడికి అక్కడి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంతకూ అక్కడ నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే.. 43 డిగ్రీలే. ఈమాత్రం ఉష్ణోగ్రతలకే యÖరప్ నిప్పుల కొలిమిలా మారింది. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన, సుదీర్ఘమైన హీట్‌వేవ్ కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నది. కార్బన్ కాలుష్యానికి తోడు ఎల్‌నినో ప్రభావం మొదలుకావడంతో యÖరోపియన్ దేశాల ప్రజలు నరకం చూస్తున్నారు. ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడి పగలు, రాత్రిని నమోదు చేయగా.. బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు జూన్ నెలలో ఆల్‌టైమ్ రికార్డ్ ఉష్ణోగ్రతలను చవిచూశాయి. ఎండ తీవ్రతకు పలుచోట్ల కాంక్రీట్ స్లాబ్‌లు పగుళ్లుబారుతున్నాయి. రైలు పట్టాలు దెబ్బతినడం, రోడ్లు పగిలిపోవడంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. చాలాచోట్ల డాంబర్ రోడ్లపై తారు కరిగిపోతున్నది. ఎండల కారణంగా ఇప్పటికే 1,300 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఈ హీట్‌వేవ్స్ వాతావరణంలో సంభవిస్తున్న ఒక ప్రమాదకరమైన మార్పునకు సంకేతమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకంతోనే వాతావరణంలో వేగంగా మార్పులు సంభవిస్తున్నట్టు తేల్చి చెప్పారు. ఫలితంగా చరిత్రలోనే ఈ జూన్ నెల అత్యంత తీవ్రమైన వేడి నెలగా రికార్డు సృష్టించాయి.
అల్లాడిపోతున్న దేశాలు
యూరప్ గ్లోబల్ వార్మింగ్ కోరల్లో చిక్కుకున్నది. సూర్యుడు నిప్పుల కొలిమిలా మారడంతో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు దేశాల్లో భానుడి తాపం ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్ దాటేయడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పశ్చిమ యూరప్‌లో మొదలైన ఈ నిప్పుల తుపాను క్రమంగా ఇతర యూరప్ దేశాలకు విస్తరించింది. గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి. డెన్మార్క్‌లో ఏకంగా 1874 నాటి రికార్డు బద్ధలైంది. దాదాపు 150 ఏళ్ల తర్వాత అక్కడ అత్యధికంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. స్విట్జర్లాండ్‌లో 38.8 డిగ్రీలు, చెక్ రిపబ్లిక్‌లో 40.8 డిగ్రీలతో ఆల్‌టైమ్ రికార్డులు నమోదయ్యాయి. బ్రిటన్ చరిత్రలోనే అత్యధికంగా 37.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో మిలియన్ల మంది అల్లాడిపోతున్నారు. పశ్చిమ యూరప్‌లో డజన్ల కొద్దీ ప్రాణాలను బలితీసుకుని, వైద్య, ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసిన వడగాలులు ఇప్పుడు జర్మనీ, మధ్య యూరోప్ వైపు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో జర్మనీలో 41.7 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది.
వంద రెట్లు పెరిగిన ముప్పు
గతంతో పోలిస్తే భూమి ప్రమాదకరంగా వేడెక్కుతున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తీవ్ర ఎండలు నమోదైన 1976 నాటితో పోలిస్తే 3.5 డిగ్రీలు, భీకర మరణాలు సంభవించిన 2003తో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్ అదనపు అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం వాతావరణ విపత్తు వంద రెట్లు పెరిగిందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. జర్మనీలో ఎండల తాకిడికి ప్రసిద్ధ ఆటోబాన్ హైవేపై ఉన్న కాంక్రీట్ స్లాబ్‌లు పేలిపోవడంతో అధికారులు పలు రహదారులను మూసివేశారు. ఫ్రాన్స్‌లో రోడ్లు కరిగిపోతుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. విద్యుత్ అంతరాయాలు, రైళ్ల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర నరకం చూస్తున్నారు. అణుశక్తి కేంద్రాల్లో కూలింగ్ సమస్యలు తలెత్తడంతో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది. అనేక దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. హీట్‌వేవ్ దెబ్బకు ఒక్క ఫ్రాన్స్‌లోనే వెయ్యి మరణాలు నమోదైనట్టు తెలిసింది. ప్యారిస్ పరిసర ప్రాంతాల్లో మరణాల రేటు వేగంగా పెరుగుతుండటంతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. గత వారం నుంచి మరణాలు పెరిగాయని, మృతుల్లో అధిక శాతం 65 ఏళ్లు పైబడిన వృద్ధులేనని, ఇళ్లలోనే మరణిస్తున్న వారి సంఖ్య 40శాతం పెరిగిందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఇటలీ, ఇంగ్లండ్ దేశాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. ప్రస్తుతం జర్మనీ, పోలెండ్, చెక్ రిపబ్లిక్, హంగేరీలాంటి దేశాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరాల్లో జనం నీడ కోసం, చల్లదనం కోసం చెట్లు, ఫౌంటెన్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. 2003 ఇలాంటి విపత్తునే ఎదుర్కొన్న తర్వాత యూరప్ దేశాలు మేల్కొన్నాయి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, చర్యల వల్ల మరణాల రేటు కొంత తగ్గింది. ఒక అధ్యయనం ప్రకారం.. 2003 స్థాయిలో ఇప్పుడు వడగాలులు వీస్తే అప్పటి కంటే 75 శాతం తక్కువగానే మరణాలు సంభవించే అవకాశం ఉంది. సమస్యల్లా వాతావరణ మార్పుల తీవ్రత వేగంగా పెరుగు తుండటమే. ఈ ఏడాది మేలోనే బ్రిటన్‌లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలో యూరప్‌లో వేడి వల్ల రెండు లక్షల మంది చనిపోయారు. ఇది శాంపిల్ మాత్రమే.. భవిష్యత్తులో మిలియన్ల మంది ప్రభావితం అవుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్కిటిక్ మంచు వేగంగా కరుగుతుండటం వల్ల యూరప్ ఖండం అంతే వేగంగా వేడెక్కుతున్నదని అంటున్నారు.
హీట్ డోమ్ ప్రభావమే కారణమా?
జూన్ నెలలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి వాతావరణంలో ఏర్పడిన హీట్ డోమ్ ప్రభావం ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యవస్థలో వేడి గాలి పైకి పోకుండా వాతావరణం కిందికి నొక్కి ఉంచుతుంది. అది భూమిని తాకినప్పుడు మరింతగా సంకోచించి విపరీతంగా వేడెక్కుతుంది. ఈ ప్రక్రియ వల్ల మేఘాలు ఏర్పడే అవకాశం లేక సూర్యరశ్మి నేరుగా భూమిని తాకి ఉష్ణోగ్రతలను అసాధారణ స్థాయికి పెంచేస్తుంది. వాతావరణ మార్పుల వల్లే ఈ విపత్తు సంభవిస్తున్నదని, ఒకప్పుడు ‘తరానికి ఒకసారి’ వచ్చే ఈ తరహా వడగాలులు ఇప్పుడు ప్రతి ఏటా వస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో అధినేత టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ ‘ఎక్స్ ’ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. బొగ్గు, చమురు, గ్యాస్‌లాంటి శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా దహనం చేయడం వల్ల పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి కాలంతో పోలిస్తే భూమి ఇప్పటికే 1.4 డిగ్రీల సెల్సియస్ వేడెక్కింది. దీనివల్లే వాతావరణ పరిస్థితులు తరచూ విషమిస్తున్నాయి. భూతాపాన్ని నియంత్రించకుంటే మున్ముందు మరిన్ని ఘోరాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్ అధ్యయనాల ప్రకారం.. యూరప్‌లోని దాదాపు 850 నగరాల్లో 45 శాతం నగరాలు జూన్ నెలలో ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు సృష్టించాయి.






Comments