top of page

వణుకుతోంది పసిపిల్లలు కాదు... ఆ కుర్చీల్లో కూర్చున్న పెద్దలే

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jul 23
  • 3 min read
  • బొద్దింకలకెందుకింత మద్దతు?

  • కమలాన్ని కలవరపెడుతున్న కాక్రోచ్

  • దేశాన్ని దారిలో పెట్టుకోవాలన్న ఆలోచనకు హ్యాట్సాఫ్

మూతికి ఖర్చీఫ్ కూడా సరిగ్గా కట్టుకోకుండా తమ మధ్య వచ్చి పడిన టియర్ గ్యాస్ షెల్‌ని ఉన్న పళంగా చేతిలోకి తీసుకుని దూరంగా విసిరేసి పోతాడు ఒక యువకుడు, చుట్టూ కమ్ముకుంటున్న ప్రశంసలని నవ్వుతూ జేబులో వేసుకుని...

పోలీసుల ఎత్తులో సగం కూడా లేని ఓ పసిమొహం అమ్మాయి వారి మీదికి సివంగిలా ఎగిరి దూకుతూ కాలర్ పట్టుకుని మరీ నిలదీస్తుంది...

పోలీసులతో బూటుకాళ్ల దెబ్బలు తిన్న యువకుడు అతి కష్టం మీద లేచి నిలబడి సందు చూసుకుని ఆ పోలీసుకి ఒక చెంప దెబ్బ ఇచ్చి మెలికెలు తిరుగుతూ తుపాకి గుండుకి దొరక్కుండా పారిపోతాడు...

మొహాల మీద తారాడుతున్న మీడియా మైక్‌ని గొప్ప తిరస్కారంతో ఎడంచేత్తో విసిరికొడుతుంది ఓ పౌరుషగత్తె...

కొట్టి కొట్టి అలిసిపోయి సాగిల పడి కూచున్న పోలీసులకి ఫుడ్ ఆఫర్ చేస్తూ పెళ్లివారి మర్యాదలు తలపిస్తారు కొందరు యువకులు...

దండాలు పెడతారు, పూలిస్తారు, కొడుతున్నా కౌగిలించుకుంటారు, ఒకరి చేయి మరొకరు విడవకుండా పట్టుకుంటారు. ఈ పిల్లలు అనుకున్నది సాధించగలరో లేదో తెలీదు. కోట్ల హృదయాలను మాత్రం సాధించుకున్నారు. మాటిమాటికీ తడవుతున్న కళ్లు తుడుచుకుంటూ, అబ్బురపడుతూ, జాగ్రత్త చెపుతూ వేల చేతులతో వారిని పొదువుకోవాలని ఉంది. తలలు పగులుతున్నా, కాళ్లూ చేతులూ దోక్కుపోతున్నా, ఒళ్లంతా లాఠీ దెబ్బలతో కదుం కడుతున్నా.. పోలీసులతో ప్రభుత్వంతో అంత శాంతంగా ఎలా చర్చలు చేస్తున్నారు? ఆ పిల్లల తెలివి, పక్కవారి పట్ల అక్కర, పట్టుదల, నిర్భీతి, అంతేకాదు వారి చమత్కారం- ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రెండు కళ్లూ చాలడం లేదు. లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి నిలబడిన ఆ చేతులు, రేపు ఈ భారతావని నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే చైతన్యవంతమైన శక్తులు. ప్రశ్నిస్తున్న యువతను.. వారి నిరసనను మీరు సమర్థించకపోయినా పరవాలేదు, కానీ కనీసం మానవత్వంతో వారి ప్రజాస్వామిక హక్కును, అనుభవిస్తున్న ఆవేదనను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత.


నా మిత్రుడు దుప్పల రవికుమార్ తన ఫేస్‌బుక్ వాల్ మీద ఉంకించిన మాటల్నే కొంచెం వాడుకుంటున్నాను. ఇంతవరకు ఉన్న ఒక సన్నని గీత చెరిగిపోయింది. జంతర్ మంతర్ దగ్గర జరిగిన సంఘటనలు మన దేశంలో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్యనున్న ఉల్లిపొరలాంటి తెరను చీల్చేసాయి. పోలీసులను ఆయుధాలుగా చేసుకుని యువతను కర్కశంగా కొట్టిన మన ప్రభుత్వం తన మేలి ముసుగులన్నీ తీసేసుకుంది. ప్రపంచం ముందు తన వికృత నగ్న స్వరూపాన్ని చూపిస్తూ నిల్చుంది.

ఒక క్రమ పద్ధతిలో ఓటర్ల లిస్టు తారుమారు చేసి ఒక్కొక్కటిగా రాష్ట్రాలను ఆక్రమించారు. రాహుల్ బయటపెట్టాక మనం నోరెళ్లబెట్టాం. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గొంతెత్తి గోల పెడుతున్నా మనలో చలనం లేదు. మనం ఎవరికి ఓటేసినా అది అతడికే పడడం, ఆ రాత్రే ఈవీఎంలు కాలిపోవడం, వివిప్యాట్ స్లిప్పులు తగలేయడం.. అకౌంటబిలిటీ లేని దుస్థితికి వచ్చేసాం. ఇదొక అప్రకటిత ఎమర్జెన్సీ..

ముందు మహిళలు సీఏఏ కోసం ఉద్యమించినప్పుడు వారివైపు ఆశగా చూసాం. రైతులు దాదాపు రాజధానిని ముట్టడించబోయారు. అన్నం పెట్టే రైతే దేశాన్ని కాపాడతాడనుకున్నాం. ఇప్పుడు ఆశ పిల్లల మీదకు మళ్లించుకున్నాం. వాళ్లను చూస్తే ఎంత ముచ్చటేస్తుందో.. అహింసాయుతమైన పోరాటం, ఎక్కడా మాట తూలకపోవడం, స్పష్టమైన లక్ష్య నిర్దేశనం.. ఇంత నిరాశామయ వాతావరణంలో కూడా ఆశలు మోసులెత్తించే యువత.. అద్భుతం.. వీరే మనకు ప్రాణవాయువు. ఇది రాజకీయ పార్టీల పోరాటం కాదు.. దేశ యువత బతుకులను కాపాడుకునే ధర్మయుద్ధం. అధికార, ప్రతిపక్షాల హద్దులు దాటి గళమెత్తుతున్న ఆ యువతకు మన మద్దతు అత్యవసరం. యువత గొంతు నొక్కితే ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకమవుతుంది.

రాజకీయ కక్షలు, లెక్కల కంటే జాతి భవిష్యత్తు ముఖ్యం. ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం పోరాడుతున్న యువతపై దమనకాండ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేయడమే. స్కూల్ బ్యాగులు వేసుకున్న 16 ఏళ్ల ఆడపిల్లల్ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టడానికి సిగ్గులేదా? చదువు, భద్రత కోసం గళమెత్తితే వాళ్లు మీకు దేశద్రోహులుగా కనిపించారా? పన్నెండో తరగతి పిల్లలు కదా అని లాఠీలతో భయపెట్టాలని చూశారు. బట్టలు చించి దాడులు చేసిన పోలీసుల అహంకారాన్ని ఆ అమ్మాయిలు తుత్తునియలు చేశారు. ఈ చెడిపోయిన వ్యవస్థే మా భవిష్యత్తు కాకూడదంటూ వారు వేసిన ప్రశ్నలకు అధికార పీఠం కదిలింది. ఏ నాయకుడి ప్రసంగం చేయలేని పనిని ఆ పిల్లలు చేసి చూపించారు.

అధికారం చేతిలో ఉందని విర్రవీగుతున్నారు కానీ, నిజానికి ఇక్కడ భయంతో వణుకుతోంది పసిపిల్లలు కాదు... ఆ కుర్చీల్లో కూర్చున్న పెద్దలే. నీట్ పరీక్ష రాసిన వారిలో చాలా మంది హిందువులే. పేపర్ లీక్ అయిందని బాధపడిన వారిలో అధికంగా హిందువులే. ఆ కారణంగా చనిపోయిందీ హిందువులే. వారి కోసం ధర్నా చేస్తున్నదీ అధికంగా హిందువులే. ధర్నా చేస్తున్న వారి పైన లాఠీఛార్జ్ చేయమని చెప్పిందీ హిందువులే. ఇది హిందువుల కోసం ఉన్న ప్రభుత్వం అని భ్రమపడేదీ హిందువులే. తెలుగునాట తెలియడం లేదుగానీ క్రాకోచ్ కలవరపెడుతోంది కమలాన్ని.

దేశం అప్పులో కూరుకుపోతున్నా, మతం పేరు చెప్పి నిధులు, ఓట్లు దోచుకుంటున్నా, తయారీరంగంలో, ఏఐలో వచ్చిన అవకాశాలు జారవిడుచుకున్నా, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నా, విద్య నుంచి ఎన్నికల సంఘం వరకు అన్నీ దిగజారిపోతున్నా, రకరకాల పన్నులతో ప్రజల జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా లాగేసుకున్నా కేవలం దేశం మీద ప్రేమతో నోరెత్తకపోవడం ఒక రకమైన దేశభక్తి.

ఈ దేశాన్ని దారిలో పెట్టుకోవాలి, అన్నిటినీ సరి చేయాలి, నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలి అని రోడ్డెక్కి టియర్ గ్యాస్, లాఠీ దెబ్బలు తింటూ, గట్టిగా రోదిస్తూ ‘నన్ను ఇంకా కొట్టండి సార్ కానీ నా దేశాన్ని బాగుచేయండి’ అని పోరాడుతున్న వారిది మరొక రకమైన దేశభక్తి. నీకు ఎవరిది సరైనది అనిపిస్తే వారి వైపు నిలబడు, అంతేకానీ ఒకరిది తప్పు, మరొకరిది రైటు అని తీర్పులు ఇవ్వవద్దు. ఎవరి దృక్కోణం వారిది!

దేశ రాజధాని వీధుల్లో తమ భవిష్యత్తు కోసం గొంతెత్తిన యువత ఆక్రోశం ఈనాడు సమాజపు ఆత్మసాక్షిని తట్టవలసిన సమయం. జంతర్ మంతర్ వద్ద ఆకలి - దాహాలను దిగమింగుకుని, శరీరం సహకరించకపోయినా తమ ఆశయం కోసం పడికాపులు కాసిన ఈ తరం ఆవేదనను తేలిగ్గా కొట్టిపారేయలేము. నిరసనను అణచివేసే క్రమంలో ఏర్పడిన కట్టుదిట్టాలు వారి ప్రాథమిక మానవ అవసరాలను కూడా హరించివేశాయి. కనీసం మూత్ర విసర్జన చేసుకోవడానికి కూడా వీలులేని పరిస్థితులు, ఒంటిపై పడ్డ లాఠీ దెబ్బలు, శారీరక హింస.. ఇంకో పక్క ఆకలితో పాటు అడుగడుగునా ఎదురవుతున్న అవమానాలను భరిస్తూ కూడా ఆ యువత వీధుల్లో నిలబడింది.

ప్రజాస్వామ్యంలో విభిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే. ఆ కోణంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఉద్యమాన్ని ఎవరైనా సమర్థించకపోవచ్చు లేదా వారితో ఏకీభవించకపోవచ్చు. కానీ, శారీరక యాతనను భరిస్తూ తమ భావి పరిరక్షణ కోసం పోరాడుతున్న వారి ఉద్యమ స్ఫూర్తిని, నిరుపమాన త్యాగాన్ని గుర్తించకపోవడం ఘోరమైన అపరాధం. ఎదుటివారి భావప్రకటనా స్వేచ్ఛను, నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కును అంగీకరించకపోగా... అసత్యాల ముసుగులో యువత పోరాటాన్ని కించపరచడం అత్యంత విచారకరం.

సకల సౌకర్యాలు ఉన్న గదుల్లో కూర్చుని, వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియా వేదికగా చల్లే ఫేక్ సమాచారం తీవ్రమైన హాని కలిగిస్తోంది. ఈ అబద్ధపు ప్రచారాలు.. లాఠీ దెబ్బల గాయాలను దిగమింగుకుని నిలబడ్డ యువత ఆశయాన్ని వెక్కిరిస్తున్నాయి.. దెబ్బలు తింటున్న తమ బిడ్డలను చూసి కంటనీరు పెట్టుకుంటున్న తల్లిదండ్రుల ఆవేదనను గాయపరుస్తాయి. తమకు జరిగిన అన్యాయాన్ని దిద్దుబాటు చేయాలని పోరాడుతున్న యువతను రాజకీయ లబ్ధి కోసం అణచివేయడం, లేదా అబద్ధాల ముద్రలు వేసి దోషులుగా నిలబెట్టడం ప్రజాస్వామిక విలువలకే గొడ్డలిపెట్టు. సత్యాన్ని దాచొచ్చు.. కానీ శాశ్వతంగా ఓడించలేరు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page