top of page

వదలొద్దు దొరా! పోయింది బంగారం కాదు.. ప్రాణం

Writer: NVS PRASADNVS PRASAD
  • వేడుకొంటున్న బ్యాంకు ఉద్యోగులు

  • గార ఎస్‌బీఐ కేసు పునఃవిచారణ

  • అదుపులో ఆర్‌ఎం, ఫీల్డ్‌ ఆఫీసర్‌, ఆడిటర్లు

  • పోలీసులకు సహకరించడంలేదని భోగట్టా

  • ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

గార ఎస్‌బీఐలో తాకట్టు నగల మాయం, ఆ వెంటనే బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ స్వప్నప్రియ ఆత్మహత్య కేసులో అసలు దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైంది. ఇందులో భాగంగా బ్యాంకు అధికారులను, బాధ్యులను తప్పించేసి కేవలం స్వప్నప్రియ సోదరుడ్ని అరెస్ట్‌ చేసి కేసును ఛేదించేశామని చెప్పుకున్న వ్యవహారంలో వాస్తవాలు బయటకు తీసే పనికి కూటమి ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగానే గత పోలీస్‌ బాస్‌ కనుసన్నల్లో జరిగిన ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న అనేక లోపాలను గుర్తించి కొత్త ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఈ కేసును తిరగదోడుతున్నారు. ఇందులో భాగంగా అప్పుడు బ్యాంకు రీజనల్‌ మేనేజర్‌గా పని చేసిన టీఆర్‌ఎం రాజుతో పాటు ఆడిటర్లు, ఫీల్డ్‌ ఆఫీసర్లను తీసుకువచ్చి విచారిస్తున్నారు. ఇందులో అనేక విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. తీగ లాగితే మొత్తం డొంక కదుల్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారట. గార బ్యాంకు వ్యవహారంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఆదేశాలు రావడంతో కేవలం ఈ కేసు వరకే పరిశోధనలు జరిపి మిగిలిన విషయాలు విడిచిపెట్టాలన్న భావనతో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రీజనల్‌ మేనేజర్‌గా ఇక్కడ పని చేసిన టీఆర్‌ఎం రాజు తన పరిధిలో అనేక చోట్ల ఇలాంటి కుంభకోణాలకే పాల్పడ్డారు. దిగువస్థాయి సిబ్బందిని బలి చేసి, ఆ తర్వాత వారిని భయపెట్టి రికవరీ చేయడంతో అనేక విషయాలు వెలుగులోకి రాకుండాపోయాయి. అయితే స్వప్నప్రియ కేసులో మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకోవడం, ఆమె సోదరుడ్ని అరెస్ట్‌ చేయడంతో టీఆర్‌ఎం రాజు పాపం పండిపోయింది. ఇలాంటి వ్యవహారమే నరసన్నపేట ఎస్‌బీఐ బజారు బ్రాంచ్‌లో జరిగితే అక్కడ మేనేజర్‌ శ్రీకర్‌ను పక్కన పెట్టేశారు. వాస్తవానికి రీజనల్‌ మేనేజర్‌ ప్రమేయం లేకుండా అక్కడ బినామీ రుణాలు మంజూరు చేసే అవకాశం లేదు. కానీ రీజనల్‌ మేనేజర్‌ అండదండలు ఉన్నాయని, ఆయన చెప్పినట్లు బినామీ అకౌంట్లలోకి డబ్బులు పంపిన శ్రీకర్‌ ఇప్పుడు గాలిలో ఉన్నారు. గార ఎస్‌బీఐలో కూడా లాకర్‌లో ఉండాల్సిన బంగారు నగలు ప్రైవేటు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన వ్యవహారంలోనూ టీఆర్‌ఎం రాజు హస్తం ఉంది. ఇలా ప్రైవేటు బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు, ఎస్‌బీఐలో బినామీ పేర్లతో ఎంఎస్‌ఎంఈ లోన్ల ద్వారా వచ్చిన డబ్బులు టీఆర్‌ఎం రాజు తన దగ్గరిబంధువు చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌లో పెట్టినట్లు ఎప్పట్నుంచో అనుమానాలున్నాయి. వ్యవహారం బయటకు పొక్కనంత వరకు ఆ సొమ్మును రొటేషన్‌ చేసి టీఆర్‌ఎం రాజు పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు నడిపారని తెలుస్తుంది. గార బ్రాంచిలో అప్పటికి కొన్నేళ్లుగా లాకర్‌లో ఉంచిన బంగారం ప్రైవేటు బ్యాంకులకు తరలిపోవడం తప్ప మళ్లీ దాన్ని విడిపించి లాకర్‌లో పెట్టే పనిని టీఆర్‌ఎం రాజు చేయలేదు. ఎందుకంటే వైకాపా హయాంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా కుదేలైపోయింది. అదే సమయంలో తెలంగాణలో కూడా మార్కెట్‌ డౌన్‌లో ఉంది. లాకర్‌లో బంగారం మొత్తం బయటకు వెళ్లిపోవడంతో మళ్లీ దాన్ని విడిపించి లాకర్‌లో పెట్టడానికి సొమ్ములు లేకపోవడంతో ఈ విషయాన్ని ఓ పద్ధతి ప్రకారం టీఆర్‌ఎం రాజే అప్పటి తెలుగుదేశం నేతను పట్టుకొని లీక్‌ చేసి దీన్ని పెద్ద ఇష్యూగా మలిచారు. వాస్తవానికి ఇది పెద్ద కేసే. కాకపోతే అందులో టీఆర్‌ఎం రాజు, ఫీల్డ్‌ ఆఫీసర్‌ చింతాడ శ్రీను, బ్యాంకు మేనేజర్ల ప్రమేయం లేకుండా జరిగివుంటే ఇది కచ్చితంగా పెద్ద ఇష్యూనే. తమ సొంత ప్రయోజనాల కోసం లాకర్‌ కస్టోడియన్లను తన గుప్పెట్లో పెట్టుకొని నగలు తాకట్టు పెట్టించి, ఆ సొమ్మును తిలా పాపం, తలా పిడికెడుగా సర్దుకున్నారు. ఇందులో టీఆర్‌ఎం రాజు, చింతాడ శ్రీనివాసరావులది పెద్ద వాటా. అలాగే నరసన్నపేట బజారు బ్రాంచి కుంభకోణంలో కూడా వీరిదే మొదటి వరుస. గార వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచి స్వప్నప్రియ మరణించే వరకు వారి కుటుంబం మీద ఒత్తిడి తెచ్చి తాకట్టు పెట్టిన బంగారు నగలను వారితో అప్పు చేయించి మరీ విడిపించి, వారితోనే గార బ్రాంచికి పంపించి వీటన్నింటినీ రికార్డు చేసి ఓ పథకం ప్రకారం టీఆర్‌ఎం రాజు అప్పటి ఎస్పీకి స్వప్నప్రియ సోదరుడి మీద ఫిర్యాదు చేశారు. అదే సమయంలో తమ వద్ద కుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయంటూ స్వప్నప్రియ మొబైల్‌తో పాటు ఆమెకు సంబంధించిన అన్ని రికార్డులను ఆమె సోదరుడు అప్పటి ఎస్పీకి అందజేసి వచ్చేశారు. కట్‌ చేస్తే.. స్వప్నప్రియ సోదరుడే నిందితుడంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. స్వప్నప్రియ బ్యాంకు నుంచి పట్టుకుపోయిన బంగారాన్ని బయట తాకట్టు పెట్టి, ఆ సొమ్మును ఆమె సోదరుడికిస్తే, ఆయన ఆన్‌లైన్‌ ట్రేడిరగ్‌లో పెట్టారని, అందులో నష్టాలు వచ్చాయని స్వయంగా అప్పటి ఎస్పీ రాధిక విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. ఆన్‌లైన్‌ ట్రేడిరగ్‌ చేయాలంటే డి`మేట్‌ అకౌంట్‌ ఉండాలి. పోలీసులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ప్రకారం ఇప్పటి వరకు స్వప్నప్రియ సోదరుడికి డి`మేట్‌ అకౌంట్‌ ఉందని, లేదా ఆమె తల్లి పేరుతో అయినా ఉందని పోలీసులు రుజువు చేయలేకపోయారు. ఈ కేసులో అప్పుడు ఇన్వెస్టిగేషన్‌ చేసిన గార ఎస్‌ఐ కామేశ్వరరావు ప్రాథమికమైన విచారణ కూడా జరపలేదని తేలింది. కేవలం టీఆర్‌ఎం రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఆయన చెప్పిన అభూతకల్పనల ఆధారంగానే స్వప్నప్రియ సోదరుడ్ని అరెస్ట్‌ చేశారు. స్వప్నప్రియతో పాటు జాయింట్‌ కస్టోడియన్‌గా ఉన్న సురేష్‌ మీద స్వప్నప్రియ కుటుంబమే దాడి చేసిందని బయటకు ఉప్పందించారు. దీని ద్వారా ఒక్క స్వప్నప్రియ మాత్రమే బెదిరించి భయపెట్టి మరీ బంగారం పట్టుకుపోయిందనే ప్రచారానికి తెరలేపారు. తర్వాత సురేష్‌ మీద అసలు దాడే జరిగినట్లు ఆధారాలు లేవని, కేవలం ఆయన ఆసుపత్రికి వెళ్లి గాయాలు తగిలాయని చెప్పారు తప్ప, ఎక్కడా గాయాల ఆచూకీ లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎప్పుడైతే ఈ కేసులో మీడియా అటెన్షన్‌ పెట్టిందో కేసు మొత్తం స్వప్నప్రియ మీదకు నెట్టేసేందుకు టీఆర్‌ఎం రాజు, పోలీసులు ఆడిన క్రిమినల్‌ గేమ్‌లో భాగమే సురేష్‌ మీద దాడి కథ. ఇక అసలు విషయానికి వస్తే గార బ్యాంకులో బంగారం మాయమైందన్న విషయం వెలుగులోకి రావడానికి నెల రోజుల ముందు జరిగిన ఆడిట్‌లో బంగారం మొత్తం సేఫ్‌గా ఉందని రిపోర్టు వచ్చింది, కానీ అదే బంగారు ఆభరణం ప్రైవేటు బ్యాంకులో రెండేళ్ల నుంచి తనఖాలో ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అంటే ఇక్కడ ఆడిట్‌ విభాగాన్ని మేనేజ్‌ చేసి కీన్‌చిట్‌ తెచ్చుకున్నారు. అది ఎవరు? సాధారణంగా బ్యాంకు నిబంధనల ప్రకారం ఏడాదికి నాలుగు రకాల ఆడిట్‌లు జరుగుతాయి. నాలుగు టీమ్‌లు వస్తాయి. వచ్చినదెవరో బ్రాంచిలో ఉన్న సిబ్బందికి తెలియదు. రిపోర్టులో ఏముందో కూడా బ్రాంచికి తెలియదు. అటువంటప్పుడు నాలుగు బృందాలను కొన్నేళ్లుగా మేనేజ్‌ చేసే వ్యక్తి అసిస్టెంట్‌ బ్యాంకు మేనేజరో, అకౌంటెంటో అయివుండరు. కచ్చితంగా రీజనల్‌ మేనేజర్‌, లేదా ఆ పైస్థాయి వ్యక్తులైతేనే ఆడిట్‌ను మేనేజ్‌ చేస్తారు. ఆడిట్‌ బృందాలను మేనేజ్‌ చేసి, బ్యాంకులో బంగారం ఉందని చెప్పి, ఆ తర్వాత మాయమైందని చెప్పిన టీఆర్‌ఎం రాజు ఇప్పుడు పోలీసుల విచారణలో ఏం చెబుతున్నారో తెలియదు. మరోవైపు టీఆర్‌ఎం రాజు ఎక్కడుంటే అక్కడే 16 ఏళ్లుగా ఉంటున్న ఫీల్డ్‌ ఆఫీసర్‌ చింతాడ శ్రీను పాత్ర కూడా ఇందులో ఉందని ఎవరు ఎన్నిసార్లు గతంలో మొత్తుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన్ను కూడా డీఎస్పీ వివేకానంద తీసుకువచ్చి విచారిస్తున్నారని తెలిసింది. బ్యాంకులో కాంట్రాక్ట్‌ Ê ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా చేరి, ఆ తర్వాత ఆర్‌ఎం కరుణాకటాక్ష వీక్షణాలతో రెగ్యులర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ అయిన చింతాడ శ్రీనివాసరావు ఆస్తులు కోట్లలో ఉన్నాయని బ్యాంకు వర్గాలే చెబుతుంటాయి. ఈ రిజియన్‌ పరిధిలో అనేక బ్యాంకుల్లో బంగారాన్ని బయట తాకట్టు పెట్టడం, బినామీ పేర్లతో రుణాలు వేరేవారి ఖాతాలకు మళ్లించడం, వాటితో వ్యాపారాలు చేయడంలో తన గురువు టీఆర్‌ఎం రాజు బాటలోనే చింతాడ శ్రీనివాసరావు కూడా నడిచారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్లు బయటకు తీస్తే కోట్లాది రూపాయల లావాదేవీలు బయటపడతాయి. వాస్తవానికి చింతాడ శ్రీను ప్రమేయం ఉందని గతంలోనే ఈ కేసుల్లో ఒక నిందితుడైన లోలలాక్షి ఫైనాన్స్‌ అధినేత తిరుమలరావు అప్పటి పోలీసులకు ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. దాని మేరకు కేసును దర్యాప్తు చేయాలని చూసిన అప్పటి సీఐ నాయుడును సెలవులో వెళ్లిపోమని ఆదేశించమని ఆదేశించడంతో ఆయన తన తండ్రికి ఆరోగ్యం బాగులేదని వెళ్లిపోయారు. ఈలోగా అసలు ఎవరి అనుమతి ముందుగా తీసుకొని గార వ్యవహారాన్ని టీఆర్‌ఎం రాజు వెలుగులోకి తెచ్చారో, అదే గార ఎస్‌ఐ కామేశ్వరరావుతో దర్యాప్తు చేయించారు. ఆయన టీఆర్‌ఎం రాజు కోసం, రాజు వలన, రాజు కొరకు ఈ కేసును ఇన్వెస్టిగేట్‌ చేసి స్వప్నప్రియ సోదరుడే నిందితుడని తేల్చేశారు. ఆ తర్వాత ఆధారాలతో సైతం మిగిలినవారి పాత్రను ‘సత్యం’ వెలికితీయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారి పేర్లు కూడా చేర్చారు. కానీ ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అరెస్టులకు వెనుకాడారు. ఈలోగా వారు యాంటిస్పేటరీ బెయిల్‌ కోసం హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు కూడా పోలీసుల అదుపులో ఉన్న టీఆర్‌ఎం రాజు, చింతాడ శ్రీనివాసరావు, ఆడిటర్లు అందరిలాగానే తమకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని చెబుతున్నారట. అయితే రికార్డులు మాత్రం అబద్ధం చెప్పవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరోవైపు టీఆర్‌ఎం రాజు సోదరుడికి ఒక వీఆర్‌లో ఉన్న ఐజీకి సత్సంబంధాలు ఉండటం వల్ల పోలీసు శాఖ మీద విపరీతమైన ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి, డీఎస్పీ వివేకానంద దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదనే రీతిలోనే దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.



댓글


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page