top of page

‘వదిలేయడం’ కుదరదు

Writer: NVS PRASADNVS PRASAD
  • మోజు తగ్గడానికి సవాలక్ష కారణాలు

  • చివరి రోజు పెరిగే అవకాశం

  • 2017`19 పాలసీతో పోలికుండదు

  • ప్రభుత్వ ఆదాయానికి ఢోకా లేదు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లాలో ప్రైవేటు మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు వేయడానికి వీళ్లేదని, అన్ని ప్రాంతాల్లోనూ తెలుగుతమ్ముళ్లే ఈ వ్యాపారం చేస్తారని టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం వెనుక ఓ పెద్ద ఎత్తుగడే ఉంది. తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే పత్రికల్లోనే ఇటువంటి కథనాలు రావడం గమనార్హం. ఒక దరఖాస్తుకు రూ.2లక్షలు చొప్పున నాన్‌ రిఫండబుల్‌ డీడీ తీయాలి. ఒక షాపునకు ఒక దరఖాస్తు వేస్తే వచ్చే పరిస్థితి లేదు. కనీసం 10 దరఖాస్తులైనా వేయాలి. తీరా షాపు లక్కీ డ్రాలో వస్తే, తెలుగుదేశం నేతలు వ్యాపారం చేసుకోనివ్వరనే సంకేతాలు పంపడం కోసమే ఈ కథనాలు ప్రచురితమవుతున్నాయి. యథావిధిగా వైకాపా అధికార గెజిట్‌ సాక్షి కూడా ఇదే ట్రాప్‌లో పడిరది. దరఖాస్తు రుసుము ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరకూడదనేది సాక్షి ఉద్దేశం కావచ్చు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే రాష్ట్రంలో రెండుమూడు చోట్ల తప్ప మరెక్కడా వైన్‌షాపులకు సంబంధించి దరఖాస్తు చేసుకోడానికి ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కావడంలేదు. కేవలం చివరి రోజు వరకు వేచిచూసి దరఖాస్తులు వేయాలనే కోణంలో చాలామంది వ్యాపారులు ఉన్నారు.

గతసారి వేలంవెర్రి ఇప్పుడుండదు

ఏది ఏమైనా 2017`19 మద్యం పాలసీలో పడినన్ని దరఖాస్తులు ఈసారి రాకపోవచ్చు. ఎందుకంటే.. నాన్‌ రిఫండబుల్‌ డీడీ రుసుమే రూ.2 లక్షలు ఉంది. దీనికి తోడు ఎవరుపడితే వారు షాపు లైసెన్స్‌కు దరఖాస్తు చేయడం కుదరదు. ఆ మేరకు ఇన్‌కమ్‌ టాక్స్‌ కడుతున్నవారు, వైట్‌ మనీ బ్యాంకు బ్యాలెన్స్‌లో ఉన్నవారు మాత్రమే ఇందుకు అర్హులు. బుధవారంతో ముగిసిపోయే దరఖాస్తు గడువుకు జిల్లాలో 158 మద్యం దుకాణాలకు ఆదివారం వరకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో 503 దరఖాస్తులు వచ్చాయి. అదే 2017`19 పాలసీలో ఒక్క శ్రీకాకుళం టెరిటొరీలోనే అంటే.. ఏడు స్టేషన్ల పరిధిలో 3,300 దరఖాస్తులు వచ్చాయి. అలాగే పలాస టెరిటొరీలో కూడా కాస్త అటుఇటుగా ఇంతే సంఖ్యలో దరఖాస్తులు పడ్డాయి. కారణం.. నాన్‌ రిఫండబుల్‌ ఫీజు రూరల్‌కు రూ.50వేలు, నగరానికి రూ.లక్ష చొప్పున ఉండేది. ఇప్పుడు అన్ని షాపులకు ఒకే లెక్కన రూ.2లక్షలు చేశారు. దీంతో ఒక్కొక్కరు గతంలో 25 అప్లికేషన్లు వేసినచోట ఈసారి 5 అప్లికేషన్లు వేయడం గగనమైపోతుంది. పోనీ 2019 నుంచి ఇప్పటి వరకు మద్యం వ్యాపారం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండి సంపాదించారా? అంటే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆ అవకాశం బయటివారికి ఇవ్వలేదు. ఇప్పుడు ఆస్తుల మీద బ్యాంకు లోన్లు తెచ్చి, బంగారం కుదువ పెట్టి రూ.2లక్షలు రాదని తెలిసి దరఖాస్తు వేయడానికి అంత సుముఖత ఉండదు. దీన్నే తెలుగుదేశం పత్రికలు భూతద్దంలో చూపిస్తున్నాయి. గత వ్యాపారస్తులెవరూ ఇందులోకి రాకపోతే ఏకపక్షంగా తెలుగుదేశం నాయకులకే షాపులు ఉండిపోతాయన్న భావనలోనే ఈ కథనాలు వండి వారుస్తున్నట్టు వ్యాపారస్తులు భావిస్తున్నారు.

ఎమ్మెల్యే వర్సెస్‌ దాసన్న

శ్రీకాకుళం జిల్లానే ఉదాహరణగా తీసుకుంటే నరసన్నపేట నియోజకవర్గంలో తప్ప మరెక్కడా దరఖాస్తులు బయటివారు వేయకూడదన్న సిగ్నల్స్‌ లేవు. నరసన్నపేటలో కూడా ఎమ్మెల్యే తనయుడు 18 షాపులకు వేస్తారని, పాతవారు రాకూడదన్న ఆదేశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇది ఏమేరకు వాస్తవమో తెలియదుగాని ఆదివారం వరకు 2019 పాలసీ వరకు మద్యం వ్యాపారం చేసినవారెవరూ దరఖాస్తులు వేయలేదు. ఒకరిద్దరు ఆన్‌లైన్‌లో వేసినట్లు భోగట్టా. నరసన్నపేట టౌన్‌లో 8, పోలాకిలో 3, జలుమూరులో 3, సారవకోటలో 4 షాపులకు దరఖాస్తు చేయాల్సి ఉంది. ఒకప్పుడు జిల్లాలో లిక్కర్‌ సిండికేట్‌ను నరసన్నపేట నుంచే ఆపరేట్‌ చేసేవారు. పీలా జగ్గారావు గాని, ఈశ్వరరావు గాని నరసన్నపేట కేంద్రంగానే సిండికేట్‌ నడిపారు. అటువంటి చోట ఈసారి పాత వ్యాపారస్తులెవరూ దరఖాస్తు చేసుకోకూడదన్న ప్రచారంపై మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ కూడా ధీటుగానే స్పందించినట్లు చెబుతున్నారు. ఆదివారం ఎక్సైజ్‌ అధికారులతో మాట్లాడి తామూ దరఖాస్తులు వేస్తామని, ఇందులో తేడాలొస్తే బాగోదని చెప్పినట్లు తెలుస్తుంది.

భయపెడుతున్న మండలం యూనిట్‌ నిబంధన

అన్నింటికంటే ముఖ్యంగా వేలంవెర్రిగా మొదటి రోజు నుంచే దరఖాస్తులు పోటెత్తకపోవడానికి ప్రధాన కారణం ఏ షాపునకు దరఖాస్తు చేయాలో తెలియకపోవడం. గతంలో ప్రతీ షాపునకు ఓ నెంబరు ఇచ్చి, ఆమేరకు దరఖాస్తులు తీసుకొని, అందులో డ్రా వేయడం ద్వారా వచ్చినవారికి ఆ షాపును కేటాయించేవారు. కానీ ప్రస్తుత పాలసీలో మండలం యూనిట్‌గా నిర్ణయించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే శ్రీకాకుళం నియోజకవర్గంలో గార మండలాన్నే తీసుకుంటే కళింగపట్నం, శ్రీకూర్మం, గార, ఒప్పంగి ప్రాంతాల్లో షాపులకు ఎక్కువ సేల్‌ ఉంటుంది. ఇప్పుడు లక్కీడ్రాలో ఎవరికైనా షాపు తగిలితే కళింగపట్నం, శ్రీకూర్మం, గార వంటి షాపులు కేటాయిస్తారన్న గ్యారెంటీ లేదు. గార మండలంలో ఏదో ఒక షాపు ఇవ్వొచ్చు. ఇటువంటి చోట రాజకీయ నాయకులకు ఎక్కువ సేల్‌ ఉన్న షాపులను కట్టబెడతారు. లైసెన్స్‌ ఫీజు మాత్రం వారికి, వీరికి సమానమే. అలాగే ఎచ్చెర్లలో కేకేనాయుడు పేట, కేశవరావుపేటలో ఎక్కువ సేల్‌ ఉంటుంది. అన్నింటికంటే తక్కువ ధర్మవరంలో వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు ఎచ్చెర్ల మండలం ఒక యూనిట్‌గా షాపు సంపాదించిన వ్యక్తికి మొదటి రెండు షాపులు కాకుండా ధర్మవరం షాపు కేటాయిస్తే అన్నీ మూసుకొని తీసుకోవాల్సిందే. శ్రీకాకుళం రూరల్‌లో రాగోలు, ఒప్పంగి, సింగుపురం, శిలగాం సింగువలసలో ఎక్కువ సేల్‌ ఉంటుంది. మండలం యూనిట్‌గా షాపు గెలుచుకున్న బయటివారికి ఇప్పిలి, కళ్లేపల్లి లాంటి తక్కువ సేల్‌ ఉన్న షాపులు కేటాయించవచ్చు. దీనికి భయపడుతున్న వ్యాపారస్తులు దరఖాస్తు చేసుకోడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు తప్ప ఎక్కడా మద్యం షాపులు మేమే చేసుకుంటాం, మీరు దరఖాస్తు చేయకండి అని చెప్పే పరిస్థితి లేదు. జిల్లాలో పైసా పెట్టుబడి లేకుండా రాజకీయ నాయకుల్లో ఎక్కువ శాతం మంది ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు మద్యంలో పెట్టుబడి పెట్టి ఓటరు దగ్గర చెడ్డయిపోవడం అనవసరం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page