మంత్రి అచ్చెన్నను కలిసిన దళిత సంఘాల జేఏసీ
నిమ్మ హయాం నుంచి భ్రష్టు పట్టిపోయిందని ఫిర్యాదు
ప్రస్తుత రిజిస్ట్రార్ కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

అక్రమాలకు ఆలవాలంగా మారిన స్థానిక యూనివర్సిటీ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియజేయాలని దళిత సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వర్సిటీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేసింది. మాజీ వీసీ ప్రొఫెసర్ నిమ్మ వెంకట్రావు హయంలో ఆయన శిష్యుడైన ఎడ్యుకేషన్ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హనుమంతు సుబ్రహ్మణ్యం పెత్తనం సాగించి వర్సిటీని పూర్తిగా భ్రష్టు పట్టించినా ఇప్పటివరకు చర్యలు లేవని ఆరోపించారు. ఈ మేరకు దళిత సంఘాల జేఏసీ ప్రతినిధులు సోమవారం నిమ్మాడలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీకాకుళంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వర్సిటీలో జరిగిన, జరుగుతున్న అక్రమాలను వివరించారు. నిమ్మ వెంకట్రావు హయాంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు విరుద్ధంగా అడ్డగోలు నియామకాలు జరిపి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. కంప్యూటర్ల కొనుగోళ్లలోనూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, దానిపై పలుమార్లు విచారణ జరిగినా బాధ్యులపై ఇంతవరకు చర్యలు లేవని విమర్శించారు. ఈ అక్రమాలపై దళిత సంఘాలు కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్నా ప్రస్తుత వీసీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నిమ్మ వెంకట్రావు హయాంలో ఎటువంటి నోటిఫికేషన్లు లేకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా జరిపిన అడ్డగోలు నియామకాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత వీసీకి తెలియకుండా తన సొంతవారిని రిజిస్ట్రార్ నియమించుకుంటున్నారని ఆరోపించారు. గతంలో స్థానిక వర్సిటీలో డీపీవోగా పని చేసి అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇక్కడి నుంచి వెళ్లిపోయి ఏలూరు డేటా మేనేజ్‌మెంట్ సర్వీసులో ఎనిమిది నెలలు పని చేసిన వ్యక్తి మళ్లీ ఇక్కడికి ఉద్యోగిగా రావడానికి ఎవరు అనుమతించారని ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులను రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏ నిబంధనల ప్రకారం నియమించారని నిలదీశారు. ఇది అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు.
దళిత ఉద్యోగులకు అన్యాయం
వర్సిటీలో దళిత ఉద్యోగల పట్ల అంటరానితనం కొనసాగుతోందని ఆరోపించారు. డాక్టరేట్‌తో సహా అన్ని అర్హతలు ఉన్న దళిత మహిళను సబ్జెక్ట్ కాంట్రాక్టుగా నియమించి, ఆమె తర్వాత చేరివారికి రెగ్యులర్ పోస్టింగులు ఇవ్వడా, లైబ్రరీ అసిస్టెంట్‌కు ప్రమోషన్ ప్రొసీడిరగ్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడం, కీలక పదవుల్లో దళితులకు అవకాశం కల్పించకపోవడం వర్సిటీ పెద్దల వివక్షకు నిదర్శనమని విమర్శించారు. యూనివర్సిటీలో ఏకైక ఆదివాసీ ఉద్యోగిని పూర్తిగా పక్కనపెట్టడం వెనక ఉద్దేశమేమిటో వీసీ, రిజిస్ట్రార్ నోరు విప్పాలని జేసీ డిమాండ్ చేసింది. విశ్వవిద్యాలయంలోని మొత్తం ఉద్యోగుల్లో స్వీపర్లతో సహా మొత్తం 15 మందే ఎస్సీ, ఎస్టీలు ఉన్నారంటే ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను తుంగలో తొక్కి రాజకీయ సిఫార్సులతో, డబ్బు కట్టలతోనే నియామకాలు జరుపుతున్నారని ఆరోపించారు. వర్సిటీ పాలకమండలి అనుమతి లేకుండా 2019 నుంచి 2023 జనవరి వరకూ జరిగిన నియామకాలు, ప్రమోషన్స్‌పై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ దళిత సంఘాల జేఏసీ దశలవారీగా ఆందోళనలు చేస్తున్నా వర్సిటీ పాలకులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిజిస్ట్రార్ తప్పుడు వైఖరి
విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఏకపక్షంగా తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారని ఆరోపించారు. లైబ్రరీ అసిస్టెంట్‌కు ప్రమోషన్ ఇవ్వాలని స్వయంగా వీసీ ఆదేశించగా రిజిస్ట్రార్ మొదట ప్రొసీడిరగ్స్ ఇచ్చి.. మళ్లీ వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. జియో సైన్స్ విభాగంలో పనిచేసిన దళిత మహిళకు డాక్టరేట్‌తో సహా అన్ని అర్హతలు ఉన్నందున ఆమెను ఇంజినీరింగ్ విభాగం ఫ్యాకల్టీగా నియమించాలని వీసీ ఇచ్చిన ఆదేశాలను సైతం రిజిస్ట్రార్ ఖాతరు చేయలేదని విమర్శించారు. వీసీ ఆదేశాలను నెల రోజులు పక్కన పెట్టి చివరికి ఆమెను సబ్జెక్టు కాంట్రాక్ట్‌గా నియమించడం కులవివక్ష కాక ఇంకేమిటిని ప్రశ్నించారు. రిటైర్డు ఉద్యోగులను తీసుకోవద్దని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తుంటే.. వాటికి విరుద్ధంగా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులను ఎలా నియమించారో రిజిస్ట్రార్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఒక ఉద్యోగి ఒకే డిపార్టుమెంటులో కొనసాగడం మళ్లీ ఆమెకే ప్రిన్నిపల్ పదవి ఇవ్వడం, ఒకే ఉద్యోగికి రెండు మూడు పదవులు కట్టబెట్టడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని తెలియదా అని ప్రశ్నించారు. ఎన్‌ఎస్‌ఎస్ విభాగంలో నిధుల దుర్వినియోగం జరిగిందని అడిట్‌లో తేలినా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మళ్లీ ఆమెకే కొత్త బాధ్యతలు అప్పగించడం వెనుక రిజిస్ట్రార్ కుల పక్షపాతం ఉందని ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా ఒకే వ్యక్తి ఎగ్జామినేషన్ డీన్‌గా కొనసాగడం, అయనపై ఆన్సర్‌షీట్స్, ఓఎంఆర్ షీట్స్ కాంట్రాక్టులో లక్షల రూపాలయ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి కూడా ఇదే కారణమన్నారు.
నిమ్మ వెంకట్రావు హయాంలో షాడో వీసీగా పెత్తనం చేసిన ఎడ్యుకేషన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ హనుమంతు సుబ్రహ్మణ్యం కంప్యూటర్ల కొనుగోళ్లలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై మూడుసార్లు విచారణ జరిగినా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వడంతో సహా నిమ్మ వెంకట్రావు హయాంలో అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా వాటిపై దర్యాప్తు ఎప్పుడు జరిపిస్తారో? ఎప్పుడు బాధ్యులపై చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిమ్మ వెంకట్రావు హయాం నుంచి పూర్తిగా భ్రష్టు పట్టిన యూనివర్సిటీని పూర్తిగా ప్రక్షాళన చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి ఏమిటో చెప్పాలని జేఏసీ నేతలు కోరారు. ముఖ్యంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తక్షణమే చొరవ తీసుకుని విజ్ఞప్తి చేశారు. అడ్డగోలుగా నియమించిన 34 మందిని విధుల తొలగించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ మహిళ వికలాంగుల మైనారిటీలను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెలా అప్పారావు, సామాజిక న్యాయపోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్, కులనిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకర్, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా సహాయ కార్యదర్శి బైరి ధనరాజ్, అంబేడ్కర్ చైర్ సాధన సమితి జిల్లా కన్వీనర్ టొంపల రమణ, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు, సల్లా రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments