ఎయిర్‌పోర్టు పోలీసుల అదుపులో ఫారెస్టర్
జాయ్ జమీమాతో కలిసి బ్లాక్‌మెయిలింగ్
మూడేళ్ల పాటు కనబడకుండాపోయిన వేణుభాస్కర్‌రెడ్డి
2022లో సొమ్ములు మింగి సర్వీస్ ఇచ్చేసిన సిబ్బంది
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నేరుగా ఐఎఫ్‌ఎస్ అధికారి ఇక్కడ డీఎఫ్‌వోగా పని చేసినా రెండు నెలల్లో చెడగొట్టేయడం మన అటవీశాఖలో ఉన్న ఉద్యోగులకు వెన్నతో పెట్టిన విద్య. అటువంటిది టెంపరరీగా ఆ సీటులో కూర్చున్న అధికారిని వదుళ్తారా? డిపార్ట్‌మెంట్‌లో సెక్షన్ ఆఫీసర్/ ఫారెస్టర్‌గా పని చేసిన ఓ ఉద్యోగి చెప్పా పెట్టకుండా మూడేళ్ల పాటు కనపడకుండాపోయారు. 2022లో ఓ మంచి ముహూర్తాన ప్రత్యక్షం కాగానే ఏమైపోయావ్, ఎందుకు డుమ్మా కొట్టావ్ అని అడగకుండా ఆయన ఇచ్చిన నోట్లకట్టలను తీసుకొని సర్వీసును, బెనిఫిట్స్‌ను ఇచ్చేసిన చరిత్ర మన అటవీశాఖ ఉద్యోగులది. అయితే ఈ ఫారెస్టర్ నుంచి తీసుకున్న లంచం ఒక మహిళను అడ్డుపెట్టుకొని వలపు వల విసరడం ద్వారా సంపాదించినదని తేలింది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వలపు వల విసిరి, ఆ తర్వాత అనేకమందిని బ్లాక్‌మెయిల్ చేసి ఆస్తులు సంపాదించుకున్న ముఠాలో కీలక సభ్యుడ్ని శనివారం విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. విచిత్రంగా వలపువల (హనీట్రాప్) విసిరిన మహిళ, ఆమె వెనుక ఉన్న వేణుభాస్కర్‌రెడ్డి ఇద్దరూ శ్రీకాకుళంవాసులే కావడం కొసమెరుపు. జిల్లాలో మొదలుపెట్టి హైదరాబాద్ వరకు వీరి ముఠా అనేకమందిని తమ వలలో చిక్కుకునేలా చేసి, ఆ తర్వాత కోట్లాది రూపాయలు కొల్లగొట్టేశారు. శ్రీకాకుళానికి చెందిన ధనుకులు, వ్యాపారవేత్తలు, వివాహమైనవారితో ప్రేమాయణం నడిపి, ఆ తర్వాత ఆ ఫొటోలు, వీడియోలు లీక్ చేయకుండా ఉండటం కోసం లక్షలాది రూపాయలు గుంజి ఎంతోమందిని రోడ్డుపాలు చేసిన కొరపాలు జాయ్ జమీమాది శ్రీకాకుళం. ఇక్కడ ఎంతోమందిని వలపు వలలో దించి సొమ్ములు గుంజేసిన తర్వాత విశాఖపట్నం కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో మోసాలకు తెరలేపింది. ఈమెకు సహకరించింది, ఈ ముఠాను విశాఖపట్నంలో లీడ్ చేసింది శ్రీకాకుళం జిల్లా అటవీశాఖలో వజ్రపుకొత్తూరు ఫారెస్టర్‌గా పని చేస్తున్న బి.వేణుభాస్కర్‌రెడ్డి. వేణు 2019లో జిల్లా నుంచి మాయమయ్యారు. ఫారెస్టర్‌గా పని చేస్తున్న వేణు కనీసం సెలవు చీటీ కూడా ఇవ్వకుండా మాయమైపోయాడు. తన కొడుకు కనిపించడంలేదని ఆయన తల్లి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఎంతకాలానికీ ఆయన ఆచూకీ దొరక్కపోవడంతో ఆయన దొరకలేదంటూ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అవన్నీ ఏమయ్యాయో తేల్చకుండానే ఫారెస్ట్ అధికారులు 2022లో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన వేణుభాస్కర్‌రెడ్డికి మళ్లీ ఉద్యోగమిచ్చేశారు. మూడేళ్లపాటు తన మానసిక పరిస్థితి బాగులేక పరారయ్యానంటూ ఓ సర్టిఫికెట్ తీసుకొస్తే, ఆగమేఘాల మీద వేణు ఫైల్‌ను కదిపి వెంటనే పోస్టింగ్ ఇచ్చేశారు. అక్కడితో ఆగకుండా ఈ మూడేళ్లు ఆయనకు రావాల్సిన అన్ని బెనిఫిట్లను పుచ్చపువ్వుల మాదిరిగా చేతిలో పెట్టారు. మూడేళ్ల పాటు జాయ్ జమీమాతో హానీట్రాప్ ముఠాలో కీలకంగా వ్యవహరించిన వేణుభాస్కర్‌రెడ్డి ఆ సొమ్మును అటవీ అధికారుల మొహాన కొట్టి ఎంచక్కా ఎటువంటి గొడవా లేకుండా విధుల్లో చేరిపోయారు. ఒక చిన్న ఆటోలో రెండు దుంగలు దొరికితే ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించే అటవీశాఖ అధికారులు మూడేళ్లపాటు కనిపించకుండాపోయి మానసిక పరిస్థితి బాగులేదని తెచ్చిన ఓ సర్టిఫికెట్‌ను మెడికల్ బోర్డుకు రిఫర్ చేయకుండా ఉద్యోగం, బెనిఫిట్స్ ఇచ్చేయడంపై ఇప్పుడు అటవీశాఖలో పెద్ద చర్చ సాగుతుంది. శ్రీకాకుళం డివిజన్‌లో డీఎఫ్‌వోగా కేవలం మూడు నెలలు మాత్రమే పని చేసిన జి.జి.నరేంద్రన్ కాలంలో జూనియర్ అసిస్టెంట్ కమ్ ఫారెస్టర్ అయిన ఉర్నాన వాసుదేవరావు, మరో జూనియర్ అసిస్టెంట్ కొర్ను చక్రధరరావు, ప్రస్తుతం అకౌంట్స్ విభాగం సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఎ.చంద్రశేఖరరాజు వేణుభాస్కర్‌రెడ్డి హనీట్రాప్‌లో సంపాదించిన సొమ్ములో కొంత మొత్తం ముట్టజెపితే ఆగమేఘాల మీద మళ్లీ రీపోస్టింగ్ ఇచ్చేశారు. అప్పుడు ఈ ఫైల్ మీద సంతకం పెట్టాల్సిన జనరల్ సూపరింటెండెంట్ వి.సత్యనారాయణ నోట్‌ఫైల్ మీద సంతకం చేయనంటే చంద్రశేఖరరాజు ఆ ఛార్జి తీసుకొని వేణుభాస్కర్‌రెడ్డికి పోస్టింగ్ ఇప్పించారు. జాయ్ జమీమా వలపు వల విసరడం ద్వారా వచ్చిన సొమ్మును వేణుభాస్కర్‌రెడ్డి శ్రీకాకుళంలో 2022లో ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి వడ్డీలకు తిప్పుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన అధికారులు వేణుభాస్కర్‌రెడ్డి కోసం గాలిస్తూ శ్రీకాకుళం వచ్చారు. విశాఖలో కేసు నమోదైందని తెలుసుకున్న వేణుభాస్కర్‌రెడ్డి మళ్లీ పరారీ కావడంతో ఇదే అటవీశాఖ ముఠా ఆయనకు చిన్న ప్రమాదం జరిగిందని, నడవలేకపోతుండటం వల్ల సెలవు పెట్టాడని సమర్ధించుకుంటూ వస్తోంది.
వేణు పాపం పండిరదిలా..
హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అజీమ్‌ఖాన్ కొద్ది రోజుల క్రితం ఎయిర్‌పోర్టు పోలీసులకు జాయ్ జమీమా మీద ఫిర్యాదు చేశారు. 2022లో తాను మురళీనగర్ పాస్‌పోర్టు ఆఫీసు బిల్డింగ్ ఎదురుగా ఉన్న బొత్స స్క్వేల్‌లో రతన్‌రాజుకు చెందిన ఆర్‌ఆర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ గేమ్ డెవలపర్‌గా పని చేశానని, అదే ఏడాది జనవరిలో రతన్‌రాజు జాయ్‌జమీమాను ఆయన కుటుంబ స్నేహితురాలిగా పరిచయం చేసి ప్రాజెక్ట్ హెడ్‌గా నియమించారని, అప్పట్నుంచే తనను హనీట్రాప్‌లో దించే ప్రయత్నాలు మొదలయ్యాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెకు సాంకేతిక పరిజ్ఞానం లేనందున తాను పని చేయడానికి వెనుకాడానని, దీంతో తాను చేస్తున్న గేమింగ్ ప్రాజెక్టు వృథా అని రతన్‌రాజుకు చెప్పడంతో ఆయన ప్రాజెక్ట్ నిలిపేయాలని భావించినట్లు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్నుంచి ఆఫీసుకు రెగ్యులర్‌గా రావడం, టెక్నికల్‌గా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టు నటించడం మొదలుపెట్టిందని, అక్కడికి కొద్ది రోజుల్లోనే కెగుష్ అనే యాప్‌ను తయారుచేస్తున్నానని, ఇది ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీ ఇస్తుందని చెప్పి పగలు పనిచేసే కార్యాలయాన్ని రాత్రి షిప్ట్‌కు మార్చిందని, అప్పట్నుంచి తనతో పాటు డిన్నర్ చేయడంతో మొదలుపెట్టి తనను ఆశాంతం ముంచేసిందంటూ మహమ్మద్ అజీమ్‌ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ అంశానికి, వేణురెడ్డికి సంబంధమేమిటంటే.. తాను హైదరాబాద్ వెళ్లిపోతానని చెప్పినప్పుడు జాయ్ జమీమాతో ఉన్న సన్నిహిత ఫొటోలు, వీడియోలను చూపించి ప్రతీరాత్రి ఆమెతో సెక్స్ చేసినట్లు అందరికీ వీటిని షేర్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేసిందని, తనతో సంబంధం కారణంగా గర్భవతినయ్యానని భయపెట్టడంతో ఆమెను వేడుకోవడంతో తన మామ వేణురెడ్డి ఉరఫ్ చిన్నాకు కూడా తెలుసు కాబట్టి, ఆయన నోరెత్తకుండా ఉండటానికి రూ.5 లక్షలు ఇవ్వాలని చెబితే, ఆయన ఖాతాలో ఆ మొత్తాన్ని తన మిత్రుడి ద్వారా వేయించానని బాధితుడు పేర్కొన్నాడు. మురళీనగర్‌లో ఒక ఇంటిని తీసుకొని, దానికి ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఐ`ఫోన్ అన్నీ తనతో కొనిపించి, తామిద్దరం భార్యాభర్తలమంటూ ఆ ఇంటిలో ఫొటోలు అలంకరించిందని, దీంతో తనను విడిచిపెట్టి ఈ కథకు ముగింపు పలకాలని కోరుకుంటే వీడియోకాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి, ఆ లేఖలో తన పేరు రాస్తానని భయపెట్టడం వల్ల ఎవరికీ చెప్పుకోలేకపోయానని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మానసిక క్షోభ భరించలేక హైదరాబాద్ వెళ్లిపోతే అక్కడ బేగంపేటలో అద్దె ఇల్లు తీసుకుని ఉంచాల్సి వచ్చిందని, తన స్నేహితుడి పేరు మీద ద్విచక్ర వాహనాన్ని కూడా కొని ఆమెకు ఇచ్చిన కొంతకాలం తర్వాత విశాఖపట్నం మకాం మార్చిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు, అత్తమామల ఇంటికి వస్తానని, పిల్లలకు ఫొటోలు, వీడియోలు చూపిస్తానని బెదిరించి తన డబ్బు మొత్తం లాక్కుందని, హైదరాబాద్‌లోనే రూ.10 లక్షలు ఇచ్చానని బాధితుడు పోలీసుల ముందు మొరపెట్టుకున్నాడు. చివరకు భరించలేక ఎదురుతిరిగితే తనకు తానే గాయపర్చుకొని పెద్దగా అరవడం వంటి పనులు చేయడంతో బేగంపేటలో ఇంటి యజమాని ఖాళీ చేయమనడంతో మళ్లీ విశాఖపట్నానికి మకాం మార్చామని, ఈ సమయంలో బేగంపేటలో ఉన్న ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ వేణుభాస్కర్‌రెడ్డే తీసుకున్నారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. లక్షలకు లక్షలు ఇద్దరూ వసూలుచేసిన తర్వా చివరిగా రూ.3 కోట్లు ఇస్తే వదిలేస్తానని చెప్పిందని మహమ్మద్ అజీమ్‌ఖాన్ మొరపెట్టుకున్నారు. ఈ డబ్బు కోసం తనను ఏడు రోజుల పాటు బంధించిందని, ఒక సమయంలో కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించడంతో షేర్‌ఆటో ఎక్కి పరారైపోయానని, గోపాలపట్నం వద్ద వేణురెడ్డి, జాయ్ జమీమా తన కారులో ప్రవేశించి ఒక నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి తన ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుపోయారని, జమీమా కత్తి తీసి చంపడానికి ప్రయత్నించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంత చేసినా తాను పోలీసులకు చెప్పలేదని, తిరిగి వారే తనపై గోపాలపట్నంలో మిస్సింగ్ కేసు, ఎయిర్‌పోర్టు స్టేషన్‌లో లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసినట్లు తెలిసి పోలీసుల ముందుకు వచ్చానని బాధితుడు పోలీసులకు తెలిపాడు. దాదాపు కోటి రూపాయలు జాయ్ జమీమా, వేణుభాస్కర్‌రెడ్డి కలిసి దోచుకున్నట్టు ఫిర్యాదు చేశారు. దీనిపైనే వేణుభాస్కర్‌రెడ్డిని ఎయిర్‌పోర్టు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 2019లో హనీట్రాప్ ద్వారా సొమ్ములు సంపాదించడానికే వేణుభాస్కర్‌రెడ్డి పరారయ్యారు. 2022లో ఎప్పుడైతే మహమ్మద్ అజీమ్‌ఖాన్ ఎపిసోడ్ బయటపడిరదో మళ్లీ ఏమీ ఎరగనట్టు వేణు విధుల్లో చేరిపోయారు. ఈ పాపంలో పాలుపంచుకున్న ఫారెస్ట్ సిబ్బందికి హనీట్రాప్ డబ్బులే అందాయి.
Comments