వలస ఓటర్లకు ఎన్నికల సంక్రాంతి
- DV RAMANA
- May 3, 2024
- 3 min read
`ఆంధ్రకు వచ్చి ఓటు వేసేందుకే ఉత్సుకత
`వారిని రప్పించేందుకు అభ్యర్థుల సన్నాహాలు
`ఎన్నికలకు తోడు వేసవి సెలవులతో వాహనాలకు డిమాండ్
`10. 11 తేదీల్లో రైళ్లు, బస్సులు అన్నీ ఫుల్
`ఒక్క 11వ తేదీనే రాష్ట్రేతర ప్రాంతాల నుంచి ఏపీకి 3వేల బస్సులు

-డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి
(ఎన్నికల రచ్చబండ)
సంక్రాంతి సీజన్‌లో ఎక్కడెక్కడో ఉన్న తెలుగువారంతా సొంతూళ్లకు తరలిరావడం కొత్త కాదు. ఫలితంగా రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలకు ఫుల్ డిమాండ్ నెలకొంటుంది. కొన్ని నెలల ముందే రిజర్వేషన్ బుకింగ్‌లు పూర్తి అయిపోతాయి. హౌస్‌ఫుల్ బోర్డులు వెక్కిరిస్తుంటాయి. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు టికెట్ల రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచేసి రద్దీ సీజన్‌లో సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు కూడా సరిగ్గా అదే పరిస్థితి నెలకొంది. అదేంటి జనవరిలోనే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం కదా.. మళ్లీ ఇప్పుడు ఈ రద్దీ ఏమిటి? అని సందేహం రావచ్చు. నిజమే కావచ్చు కానీ.. ఈసారి నాలుగు నెలల వ్యవధిలోనే రెండో సంక్రాంతి వచ్చింది. అదే ఎన్నికల సంక్రాంతి. ఎవరు.. ఎక్కడ ఉన్నా.. ఎన్నికల సమయంలో సొంత ఊరికి వెళ్లి.. తాము అభిమానించే పార్టీకో, నాయకుడికో ఓటు వేయాలని ఉబలాటపడటం సహజం. అదే విధంగా పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ సమయానికి సొంతూళ్లకు రప్పించి అనుకూల ఓటింగ్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అదిగో.. అలా వచ్చిందే ఈ ఎన్నికల సంక్రాంతి. దానికితోడు వేసవి సెలవులు కూడా తోడై రైళ్లు, బస్సులు, ట్యాక్సీలు, ఇతర వాహనాలకు ఫుల్ డిమాండ్ నెలకొంది. ఇంకా చెప్పాలంటే కొరత ఏర్పడిరది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలతోపాటు అనేక రాష్ట్రేతర, రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి సర్వీసులు నిర్వహించే రైళ్లు, బస్సులన్నీ రిజర్వేషన్ ఫుల్ అనే బోర్డులు పెట్టేశాయి.
10, 11 తేదీల్లో అన్నీ ఫుల్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో ఒకేరోజు మే 13న పోలింగ్ జరగనుంది. ఆ ముందు రోజు నాటికి అంటే 12వ తేదీనాటికే సొంతూళ్లకు చేరుకోవాలని రాష్ట్రాతర ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి నిమిత్తం నివాసం ఉంటున్న ఏపీ ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ మేరకు ఈ నెల 10, 11 తేదీల్లో అక్కడినుంచి బయల్దేరి వచ్చేలా రవాణా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చాలామంది ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకోవడంతో ఆ రెండు రోజుల్లో రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్నీ ఫుల్ అయిపోయాయి. ఇప్పుడు అన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి ప్రయత్నించేవారికి నో సీట్ అన్న బోర్డులు నిరాశకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం విద్యాసంస్థలకు వేసవి సెలవులు నడుస్తున్నాయి. దానికితోడు ఈ నెల 11 రెండో శనివారం, 12 ఆదివారం కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఆ రెండు రోజులు సెలవులే. ఈ నెల 13న పోలింగ్ రోజు ఎలాగూ సెలవే కాబట్టి సొంతూరుకు వెళ్లినట్లు ఉంటుంది, ఓటుహక్కు వినియోగించుకున్నట్లు ఉంటుంది. పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో సెలవులు ఎంజాయ్ చేసినట్లు ఉంటుందన్న ఆలోచనతో ఈసారి పెద్దసంఖ్యలో జనాలు సొంతూళ్లకు తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా వారం క్రితమే 10, 11 తేదీల్లో రైళ్లు, బస్సులన్నీ ఫుల్ అయిపోయాయి. వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్టులు కనిపిస్తున్నాయి. దాంతో పలువురు సొంత వాహనాలపై ఆధారపడుతున్నారు. మిగతా వారంతా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నారు. కార్లు, బస్సులు, మినీవ్యాన్లు ఇలా అందుబాటులో ఉన్న వాహనాలను బుక్ చేసుకుని సొంతూళ్లో వాలిపోవాలని తాపత్రయ పడుతున్నారు. అవి కూడా చాలావరకు ఫుల్ అయిపోయాయి.
ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థుల ఏర్పాట్లు
ఓటర్ల ప్రయత్నాలు, పాట్లు ఇలా ఉంటే బరిలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థులు కూడా వలస ఓటర్లపై దృష్టి సారించారు. అధికార వైకాపా, ప్రతిపక్ష ఎన్డీయే కూటమి మధ్య ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరుగుతోంది. దాంతో ఏ ఒక్క ఓటూ వదులుకునేందుకు పార్టీలు, అభ్యర్థులు సిద్ధంగా లేరు. ఓటర్లు ఎవరికివారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా.. మరోవైపు అభ్యర్థులు కూడా గ్రామాల్లోని చోటా నాయకులు, లేబర్ మేస్త్రీల సాయంతో గంపగుత్తగా వలస ఓటర్లను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలా వచ్చే ఓటర్లకు రవాణా ఖర్చులతోపాటు ఓటుకు ఇంత అని ఇచ్చేందుకు కూడా ఒప్పందాలు చేసుకుంటున్నారు. దాంతో వాహనాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడిరది. ఆంధ్ర, తెలంగాణాల్లో పోలింగ్ ఒకేరోజు జరుగుతున్నప్పటికీ ఆంధ్రలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతుండగా, తెలంగాణ పార్లమెంటు ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్రవాసుల్లో చాలామంది రెండుచోట్లా ఓట్లు ఉన్నప్పటికీ వారంతా ఆంధ్రకు వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోనే కాకుండా నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, రామగుండం, ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేట తదితర ప్రాంతాల్లోనూ ఆంధ్ర సెటిలర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దాంతో పది, పదకొండు తేదీల్లో ఆయా ప్రాంతాల నుంచి బయల్దేరే బస్సులన్నీ ఫుల్లు అయిపోయాయి. ఉద్యోగాలు, ఉపాధి పేరుతో ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ చాలామంది ఆంధ్రలోని తమ స్వగ్రామాల్లోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వంటివి అందుకుంటున్నారు. దాంతో ఇక్కడ తమకు మేలు చేస్తున్న పార్టీకే ఓటు వేయాలని భావిస్తున్నారు. కొందరైతే ఒక గ్రూపుగా ఏర్పడి తమ ప్రాంత నేతలకు సమాచారం ఇస్తున్నారు. తమకు వాహనాలు సమకూర్చాలని కోరుతున్నారు.
ఆరోజు ఏపీకి వేలాది బస్సులు
దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్ర ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. సాధారణంగా ఎంపీ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలకే ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లేందుకు పెరిగిన రద్దీని, వాహనాలకు నెలకొన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ రవాణా సంస్థలు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. వీటికితోడు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా వాహనాలను బుక్ చేసుకుంటుండటంతో ఈ నెల 11న ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు సుమారు మూడువేల బస్సులు రానున్నట్లు సమాచారం. ఒక్క హైదరాబాదు నుంచే రెండు వేల బస్సులు బుక్ అయినట్లు తెలిసింది. హైదరాబాదులో 11వ తేదీన బయలుదేరే ఈ బస్సులు.. తిరిగి పోలింగ్ పూర్తి అయిన తర్వాత 13వ తేదీ సాయంత్రం ఇక్కడి నుంచి వలసల ఓటర్లను తీసుకుని తిరుగు ప్రయాణమవుతాయి. వలస ఓటర్లను తరలించేందుకు అన్ని పార్టీలు ప్రత్యేకంగా కొందరు మనుషులను నియమించుకున్నాయి. వారే వలస ఓటర్ల వివరాల సేకరణ, ఏయే ప్రాంతాల్లో ఉంటారు. వారిని ఎలా తరలించాలి వంటి విషయాలన్నీ చూసుకుంటున్నారు.
Comments