వలంటీర్లకు పిలుపొచ్చింది!
- DV RAMANA
- Sep 6, 2024
- 2 min read

ఎన్నికల ముందు నుంచీ త్రిశంకు స్వర్గంలో ఉన్న గ్రామ, వార్డు వలంటీర్లకు ఎట్టకేలకు పిలుపు వచ్చింది. కాస్తంత ఊరట లభించింది. అయితే ప్రస్తుతానికి వరద ముంపులో ఉన్న ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలకే పరిమితం. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లకు శుభవార్త అందే అవకాశాలు లేకపోలేదు. దాంతో హమ్మయ్యా.. అని వలంటీర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. దానికి అనుబంధంగా ప్రతి యాభై ఇళ్లకు ఒక వలంటీర్ ను నియమించింది. ఆ విధంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల మందిని నెలకు రూ.ఐదు వేల గౌరవ వేతనంపై నియమించారు. ఈ వ్యవస్థ వచ్చాక ప్రజలకు సచివాలయాలకు గానీ, ఇతర ప్రభుత్వ కార్యాలయా లకు గానీ వెళ్లాల్సిన శ్రమ తప్పింది. ప్రభుత్వం అందించే సంక్షేమ, ఇతర పథకాలన్నింటినీ వలంటీర్లే ప్రజల ఇళ్లకు వెళ్లి మరీ అందించేవారు. దరఖాస్తు చేయించడం నుంచి పథకాల లబ్ధిని ఇంటికి చేర్చడం వరకు అన్నీ వారే చూసుకునేవారు. ప్రతినెలా ఒకటో తేదీన తెల్లవారుజామునే సామాజిక పెన్షన్లను ఇంటింటికీ వెళ్లి అందిం చేవారు. దాంతో వలంటీర్లు ప్రజల అభిమానానికి పాత్రులయ్యారు. ప్రభుత్వానికి ఏ చిన్న సమాచారం కావా లన్నా వీరి ద్వారానే స్వల్ప వ్యవధిలోనే సేకరించే వెసులుబాటు కూడా కలిగింది. కానీ అప్పటి ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేనలు వలంటీర్ వ్యవస్థపై తీవ్రంగా దుష్ప్రచారం చేశారు. వలంటీర్ వ్యవస్థ అనవసరమన్నట్లు చంద్రబాబు మాట్లాడితే, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అయితే వలంటీర్లు ఇళ్లలోకి వెళ్లి మహిళల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని, రాష్ట్రంలో మహిళల సమాచారాన్ని మాఫియాకు అందజేసి మహిళ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. వీరి కారణంగానే రాష్ట్రంలో 30 వేల మందికిపైగా మహిళలు అదృశ్యమైన ఘటనలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. వలంటీర్లందరూ వైకాపా కార్యకర్తలేనని, వారిని ఎన్నికల్లో విధుల్లో నియమిస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తారని, అందువల్ల వారిని ఎన్నికల విధులకు దూరం గా ఉంచాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడిన తరు ణంలో వలంటీర్లను దూరం చేసుకుంటే వారితో పాటు వారి కుటుంబాల ఓట్లు కూడా దూరమవుతాయని గ్రహించి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వలంటీర్లందరూ అలాంటివారు కాదని, వారి పట్ల తనకు ద్వేషం లేదని పవన్‌కల్యాణ్ సన్నాయినొక్కులు నొక్కితే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్లను కొన సాగించడమే కాకుండా.. వారికి ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని హమీ ఇచ్చారు. ఈ పరి ణామాల నేపథ్యంలో వలంటీర్లు చాలామంది రాజీనామాలు చేసి తమకు నచ్చిన పార్టీ వైపు పనిచేయగా, మిగి లినవారు రాజీనామాలు చేయకపోయినా ప్రభుత్వ విధులకు దూరంగా ఉండిపోయారు. ఆ మేరకు దాదాపు లక్షన్నర మంది వలంటీర్లు కొత్త ప్రభుత్వం వస్తే తమను మళ్లీ విధుల్లోకి తీసుకుంటారని, గౌరవ వేతనం రెట్టింపు వేతనం అందుతుందన్న ఆశతో ఎదురుచూశారు. కానీ ఎన్నికల అనంతరం చంద్రబాబు నేతృత్వం లోని ఎన్డీయే సర్కారు గద్దెనెక్కి మూడు నెలల అవుతున్నా వలంటీర్ల ఊసెత్తలేదు. పైగా గతంలో వలంటీర్లు పంపిణీ చేసిన సామాజిక పెన్షన్లను సచివాలయ సిబ్బందితోనే మూడు నెలలుగా పంపిణీ చేయిస్తోంది. దాంతో వలంటీర్లు రోజూ గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి సంతకాలు చేసి రావడమే తప్ప వారికి వేతనాలు కూడా అందలేదు. తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారై వారు ఆందోళన చెందుతున్న తరుణంలో రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలు వలంటీర్లకు మాత్రం మేలు చేసినట్లు కనిపిస్తోంది. గత నెల చివరిలో కురిసిన భారీ వర్షాలు, కృష్ణానదితో పాటు బుడమేరు, మున్నేరు వాగులకు వచ్చిన వరదలు గతంలో ఎన్నిడూ లేనివిధంగా విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్, కృష్ణా, గంటూరు, బాపట్ల జిల్లాల్లోని చాలా ప్రాంతాలను ముంచేశాయి. బాధితులకు సహాయ పునరావాస చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిమగ్నమైనా చాలా చోట్ల సహాయం అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వలంటీర్లు ఉంటే ఏ ప్రాంతంలో ఎంతమంది నిరాశ్రయులయ్యారు.. ఎంతమందికి సహాయం అవసరం వంటి వివరాలు ఎప్పటికప్పుడు సేకరించి ప్రభుత్వా నికి చేరవేసేవారు. సహాయం పంపిణీలోనూ వారే ముందుండి బాధ్యత వహించేవారు. కానీ వలంటీర్లు లేకపో వడం వల్ల ఆ సమన్వయం కొరవడిరదన్న వ్యాఖ్యలు వినిపించాయి. ప్రభుత్వ పెద్దలు కూడా ఈ లోపాన్ని గుర్తించినట్లున్నారు. అందుకే చడీచప్పుడు లేకుండా వలంటీర్లను పిలిపించి, వరద ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల ముందు వారి నుంచి తీసుకున్న సెల్‌ఫోన్లను సైతం తిరిగి ఇచ్చారు. ఆ మేరకు మున్సి పల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ప్రత్యేకాధికారులకు ఆదేశాలు వెళ్లడంతో వాట్సప్ మెసెజ్‌ల ద్వారా వలంటీర్లను పిలిపించి బాధ్యతలు అప్పగిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వరద ప్రభావిత ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లోనే వలంటీర్లకు పిలిచి సహాయ పునరావాస చర్యల్లో భాగస్వామ్యం కల్పించారు. మరికొందరికి బాధితుల వివరాల సేకరించే బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు వలంటీర్లు బుధవారం నుంచే విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికలముందు రాజీనామాలు చేయకుండా ప్రభుత్వ పిలుపు కోసం ఎదురుచూస్తున్న వారికే ఈ అవకాశం కల్పించారు. ప్రస్తుతానికి వరద ప్రభావిత జిల్లాల వలంటీర్లనే విధుల్లోకి తీసుకున్నప్పటికీ.. మిగతా జిల్లాల వలంటీర్లలో ఈ పరిణామం కొత్త ఆశలు రేపుతోంది. రేపోమాపో తమకు కూడా ప్రభుత్వం నుంచి పిలుపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వలంటీర్ల విషయంలో సర్కారు వైఖరి మారినట్లే కనిపిస్తోంది.
Comments