వస్తున్నారయ్యో.. ‘గజ’మేతగాళ్లు!
- NVS PRASAD

- 2 days ago
- 3 min read
పార్వతీపురం మన్యంపై ఒకప్పటి డీఎఫ్‌వో శాంతిస్వరూప్ దృష్టి
పోస్టింగ్ కోసం మంత్రుల స్థాయిలో లాబీయింగ్
గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు ఆపరేషన్ గజ నిధులు స్వాహా
ఇప్పుడు మళ్లీ వస్తే తమ బతుకులు బజారేనని అటవీ సిబ్బంది ఆందోళన
ఈయనలాగే ఉత్తరాంధ్రపై కన్నేసిన మరికొందరు అవినీతి అధికారులు
అటవీమంత్రి పవన్‌కల్యాణ్‌కు తెలియకుండానే మంత్రాంగం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
గతంలో శ్రీకాకుళం డీఎఫ్‌వోగా వ్యవహరించి ప్రస్తుతం తిరుపతి ట్రైనింగ్ సెంటర్‌లో పని చేస్తున్న శాంతిస్వరూప్ పార్వతీపురం మన్యం జిల్లాకు రానున్నారని తెలిసి ఉత్తరాంధ్ర ముఖ్యంగా మన్యప్రాంత వన్యప్రాణి, పర్యావరణ ప్రేమికులు నాటి ఏనుగుల భయం కంటే ఎక్కువగా గజగజలాడిపోతున్నారు. కొందరు మంత్రుల ప్రాపకంతో ఆయన పార్వతీపురం మాన్యానికి రావడానికి ప్రయత్నించి సఫలమయ్యారు. ఆయన రాక దాదాపుగా ఖరారైంది. ఈ విషయం తెలుసుకుని అటవీశాఖలో పని చేస్తున్న ఉద్యోగులే ఏ క్షణంలో తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందోనని భయపడిపోతున్నారు. గతంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉండి ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పడిన అటవీ ప్రాంతాల్లో ఒడిశా ఏనుగుల బెడద కొన్నేళ్లుగా ఉంది. కాగా అప్పట్లో శ్రీకాకుళం డీఎఫ్‌వోగా వ్యవహరించిన శాంతిస్వరూప్ ఏనుగులను తరమివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గజ భారీగా నిధులు మేసేశారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అటువంటి అవినీతి అధికారి ఇప్పుడు మన్యం జిల్లాకు అటవీ అధికారిగా రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఎందుకంటే.. ఎర్రచందనానికి శేషాచలం అడవులు ఎలా ప్రసిద్ధో.. గుగ్గిలం చెట్లకు పార్వతీపురం మన్యం అడవులు అంత ఫేమస్. ఈ జిల్లా పరిధిలోని దోనుబాయి, కురపాం, పాలకొండ అటవీ ప్రాంతాల్లో గుగ్గిలం చెట్లు ఎక్కువగా ఉంటాయి. దేశవ్యాప్తంగా గుగ్గిలం కలపను ఇక్కడి నుంచే సరఫరా చేస్తారు. ఇప్పుడు ఈ జిల్లాకే పోస్టింగ్ తెచ్చుకోవడానికి శాంతిస్వరూప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి.

పర్యావరణమంటే తనకు ఎంతో మక్కువని చెప్పుకొనే ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పర్యవేక్షిస్తున్న అటవీశాఖలో అవినీతి తిమింగలాల చేతికి పగ్గాలివ్వడమంటే అడవిని గంపగుత్తగా రాసిచ్చేయడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా కనిపించని గుగ్గిలం చెట్లు పార్వతీపురం మన్యంలో మాత్రమే ఉన్నాయి. శ్రీకాకుళంలో ఫారెస్ట్ రేంజర్‌గా పని చేసిన కాలంలో విజిలెన్స్, మీడియా అవేర్‌నెస్ ఇప్పుడంతగా లేకపోవడంతో శాంతిస్వరూప్ గుగ్గిలం చెట్లు మాయం చేశారనే ఆరోపణలూ లేకపోలేదు. ఎందుకంటే.. ఆయన మొదట ఉద్యోగం కురుపాంలోనే చేశారు. ప్రస్తుతం ఈ మండలం, నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఉన్నాయి. శ్రీకాకుళంలో ఫారెస్ట్ రేంజర్‌గా చేస్తున్నప్ప్పుడే ఆదాయానికి మించిన ఆస్తులున్నాయంటూ శాంతిస్వరూప్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును ప్రభుత్వ స్థాయిలో విత్‌డ్రా చేయించుకోవడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. ఆ తర్వాత కేసు ఏమైందో ఎవరికీ తెలియకుండా పోయింది. ప్రభుత్వ పథకాలకు మంజూరయ్యే నిధులను దోచేయడంలో శాంతిస్వరూప్ దిట్ట. ‘దోచుకో`దాచుకో’ పద్ధతులు పాటించే అటవీశాఖ ఉద్యోగుల్లో శాంతిస్వరూప్ ముందువరుసలో ఉంటారు. విశాఖ వీఎంఆర్‌డీఏలో డీఎఫ్‌వోగా మొక్కలు నాటడం, వాటిని పర్యవేక్షించే పని అప్పగిస్తే, అక్కడ కూడా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఉన్నప్ప్పుడే పార్కుల్లో పని చేయాల్సిన లేబర్‌ను తన సొంత లేఅవుట్ అభివృద్ధి పనులకు వాడుకుంటూ పత్రికýకెక్కారు. వీఎంఆర్‌డీఏ నుంచి జీతాలిచ్చి విజయనగరం అయ్యన్నపేట వద్ద కొనుగోలు చేసిన 20 ఎకరాల భూమిలో లేఅవుట్ వేయడానికి వారిని వాడుకున్నారు. ఈ పనులకు పెద్ద ఎత్తున వీఎంఆర్‌డీఏ నిధులు వాడేశారని కూడా ఆరోపణలున్నాయి. ఈయనగారిపై కుప్పలు తెప్పలుగా అవినీతి ఆరోపణలు రావడంతో తిరుపతి ట్రైనింగ్ సెంటర్‌లో పాఠాలు చెప్పుకోమని కూర్చోబెట్టారు. ఫారెస్ట్ రేంజర్ దగ్గర్నుంచి డీఎఫ్‌వో వరకు సొమ్ములొచ్చే సీట్లలోనే పని చేయడం వల్ల శాంతిస్వరూప్ ఆస్తుల చిట్టా భారీగా పెరిగింది. రాజాం మండలం బొద్దాంలో ఈయనకు 80 ఎకరాల భూమి ఉందని, ఇదే ప్రాంతంలో వేరేగా మరో రెండు ఎకరాలు, విజయనగరం ధర్మపురి ప్రాంతంలో 600 చదరపు గజాల స్థలం, విజయనగరం సిటీ పరిధిలోని అయ్యన్నపేటలో ఈ కొత్త లేఅవుట్, పళ్ల తోటలు పెంచుతున్నారని తెలిసింది. గత రెండు ప్రభుత్వాల హయాంలో అటవీశాఖ సొమ్మును భారీగా దిగమింగిన వారందర్నీ లూప్ లైన్లలోకి పంపేశారు.
అక్రమార్కెలందరిదీ అదే వరస
శాంతిస్వరూప్‌తో సహా అటువంటి కొందర్ని మళ్లీ ఫోకల్ పాయింట్లకు తేవడానికి సంబంధిత మంత్రి పవన్‌కల్యాణ్‌కు తెలియకుండానే పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. విచిత్రమేమిటంటే.. వీరందరి మీదా ఏసీబీ కేసులు ఉన్నాయి.
అనకాపల్లిలో వెంకటరమణమÖర్తిది ఈయన బ్యాచే. శ్రీకాకుళానికి చెందిన వెంకటరమణమÖర్తి ఉత్తరాంధ్రలో ముఖ్యమైన పోస్టులు చేశారు. 2016 నవంబరులో ఒక మైనింగ్ కేసులో రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి ప్రస్తుతం ఫారెస్ట్ అకాడమీలో పాఠాలు చెప్ప్పుకుంటున్నారు. శాంతిస్వరూప్ తరహాలోనే ఇప్పుడాయన వీఎంఆర్‌డీఏ డీఎఫ్‌వోగా రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. ఈయన గతంలో శ్రీకాకుళంలో పని చేసినప్ప్పుడు ఏసీబీ కేసు నమోదు కాగా.. కిందిస్థాయి ఉద్యోగిని బలి చేసేశారు. పోగేసిన అవినీతి సొమ్ముతో వైజాగ్‌లో ఎండాడ వద్ద ఉన్న ఎంకే గోల్డ్‌లో రూ.1.5 కోట్లు విలువ చేసే ఒక విల్లాలో ఉంటూ సిరిపురం దగ్గర ఒక ప్లాట్, విజయనగరం, ఆమదాలవలస ప్రాంతాల్లో అనేక ప్లాట్లు కొనుగోలు చేసిన ఈయన ఇప్ప్పుడు మంత్రుల పేషీల చుట్టూ తిరుగుతున్నట్టు చెబుతున్నారు.
ఇక శ్రీకాకుళం జిల్లాకే చెందిన బి.రాజారావు వీఎంఆర్‌డీఏ డీఎఫ్‌వోగా అనేక అక్రమాలు చేసి, ఉడా చరిత్రలోనే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఫార్సులతో ఒక ఛార్జిషీటు వేయించుకున్న ఘనుడు. అనంతరం అనకాపల్లి డీఎఫ్‌వోగా పోస్టింగ్ తెచ్చుకొని అక్కడ ఒక పట్టా పర్మిట్ మంజూరు విషయంలో లంచం తీసుకుంటూ దొరికిపోయి జైలుకు వెళ్లి, బెయిల్ మీద ఉన్న ఈయన ఇప్ప్పుడు ఫోకల్ పోస్టింగ్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు.
అలాగే జె.గణేష్ 1997లో కె.డి.పేట రేంజర్‌గా, నర్సీపట్నం రేంజర్‌గా ఉన్నప్ప్పుడే ఏసీబీ కేసులో దొరికిపోయి, ఆ తర్వాత కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకొని ఉడాను పరిపాలించి కోట్లు కొల్లగొట్టేశారు. ఇప్ప్పుడు ఈయన కూడా రాబోతున్నారు జాగ్రత్త అంటూ ఫారెస్ట్ ఉద్యోగుల గ్రూపుల్లో వాట్సప్ సందేశాలు హల్‌చల్ చేస్తున్నాయి.
టేకు చెట్ల ప్రొఫెసర్‌గా గుర్తింపు పొందిన బి.వి.ఎ.కృష్ణమÖర్తి నర్సీపట్నానికి చెందిన టీడీపీ నాయకుని అండదండలతో విశాఖలో పోస్టింగ్‌కు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈయనకు వైజాగ్ పనోరమ హిల్స్, ఎంవీపీల్లో చెరో విల్లా, విజయనగరం జిల్లాలో తోటలు దండిగా ఉన్నాయట.
`ఇక చివరిగా సంజయ్ ఎల్లా వైజాగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వోగా రావడానికి ఒక మంత్రితో రికమండేషన్ చేయించుకున్నట్లు తెలుస్తుంది.
వీరంతా ఉత్తరాంధ్రలోనే ప్రధానమైన పోస్టింగ్‌ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. కాస్త అటూఇటుగా అందరి మీదా అవినీతి ఆరోపణలున్నాయి. కొందరి వద్దయితే ఏకంగా రాష్ట్ర అటవీశాఖ బడ్జెట్ అంత ఆస్తులు ఉన్నాయి. అటువంటి వారిని ఉత్తరాంధ్రకు తీసుకువచ్చి ఫోకల్ పాయింట్లలో నియమిస్తే పవన్ కల్యాణ్ మీద ఉన్న నిజాయితీ ముద్ర పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని జనసైనికులు నేరుగా పవన్‌కే ఓ లేఖ రాసినట్లు తెలిసింది.






Comments