top of page

‘వెంకటేశ’ మహత్యం

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • బాధితుల నుంచే సొమ్ముల వసూళ్లు

  • కేసు నమోదుకూ ఓ రేటు

  • జనరల్‌ కానిస్టేబులే అక్కడ సర్వం

  • రెండువైపులా సొమ్ములు పిండేస్తున్న వైనం

  • సొమ్ముల వసూళ్ల కోసం ప్రైవేటు ఏజెంట్లు




సత్యంన్యూస్‌, శ్రీకాకుళం

దేశంలో జీఎస్టీ అమలులోకి రాకముందు రాష్ట్ర సరిహద్దు ఇచ్ఛాపురం శివార్లలో పురుషోత్తపురం వద్ద కమర్షియల్‌ టాక్స్‌ టోల్‌గేట్‌ ఉండేది. పక్క రాష్ట్రం నుంచి వచ్చే సరుకులను మినహాయించేందుకు ఇక్కడ సొమ్ములు వసూలుచేయడానికి ఈ శాఖతో సంబంధం లేని ఉద్యోగులు పని చేసేవారు. ఎన్నిసార్లు ఏసీబీ రైడ్‌ జరిగినా ఈ థర్డ్‌పార్టీ ఉద్యోగులే దొరికేవారు. ఇప్పుడు సరిగ్గా అటువంటి వ్యవస్థనే జిల్లాలో అనేక పోలీస్‌ స్టేషన్లలో జనరల్‌ కానిస్టేబుళ్లు నడుపుతున్నారు. కలెక్షన్ల కోసం వీరిని వాడుకుంటూ అనధికారిక పోలీస్‌ హోదాను ఇస్తున్నారు. ఒకవేళ ఏసీబీ లాంటి రైడ్‌లు జరిగితే తమకు ప్రమాదం లేకుండా చూసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ తాజా ఉదాహరణను చూద్దాం.

స్థానిక హయాతినగరంలో పెళ్లయిన పదేళ్ల తర్వాత తన భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నారని ఒక మహిళ రాగోలులో కన్నవారింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సలహా మేరకు మే 23 మధ్యాహ్నం తిరిగి తన ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న భర్త ఆమెపై విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అడ్డుకున్న బాధితురాలి తల్లిని కూడా చితకబాదాడు. ఈ కథ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో, ఆమెను రిమ్స్‌ జనరల్‌ ఆసుపత్రిలో చేర్పించి నాలుగు రోజుల పాటు చికిత్స చేయించారు. మే 25న టూటౌన్‌లో ఈమె భర్తపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఓ కానిస్టేబుల్‌ బాధిత మహిళకు న్యాయం చేస్తానని, అతనికి వేరే మహిళతో ఉన్న అక్రమ సంబంధాన్ని కూడా బయటపెడతానని చెప్పి బాధిత మహిళ నుంచి రూ.1.50 లక్షలు నొక్కేశాడు. తన భర్తకు బుద్ధి చెప్పి వేరే మహిళ మాయ నుంచి బయటపడేస్తారన్న ఆశతో ఏదో ఒకటి చేసి ఆమె ఈ సొమ్ములు సమర్పించింది. సీన్‌ కట్‌ చేస్తే.. అదే సమయంలో భార్యపై దాడి చేసిన భర్త వద్ద నుంచి కూడా రూ.30వేలు తీసుకొని తేలికపాటి సెక్షన్లు నమోదుచేసి స్టేషన్‌ బెయిల్‌ వచ్చే విధంగా కేసును తిప్పేశారు. అంటే.. గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు తీసుకోడానికే రూ.1.50 లక్షలు ఖర్చయినట్లు లెక్క. మొత్తం భార్యాభర్తల నుంచి రూ.1.80 లక్షలు నొక్కేసి పోలీసులు చేతులెత్తేశారు.

ఈ కేసులో భార్య మీద దాడి చేసిన నిందితుడు కార్‌డ్రైవర్‌గా ఓ ట్రావెల్‌ ఏజన్సీలో పని చేసేవాడు. పోలీసులు చేసిన పనికి బాధితురాలు హయాతినగరంలోనే తన భర్త ఇంటికి దగ్గరగా వేరే ఇల్లు తీసుకొని ఇద్దరు పిల్లలతో నివసిస్తోంది. ట్రావెల్‌ ఏజెన్సీ యజమాని భార్యతో వివాహేతర సంబంధాన్ని గట్టి చేసుకోడానికి తనకు విడాకులు ఇవ్వబోతున్నట్టు తెలుసుకున్న బాధితురాలు ఈ నెల 14న తన సోదరిని పట్టుకొని భర్తను నిలదీసే ప్రయత్నం చేసింది. దీంతో మరోసారి బాధితురాలి మీద దాడి జరిగింది. ఈ గొడవలో బాధితురాలి సోదరి లక్ష్మి కాలు కూడా విరిగింది. మళ్లీ పోలీసులే రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. గతంలో భార్య ఫిర్యాదు చేస్తే రూ.1.50 లక్షలు తీసుకున్న కానిస్టేబుల్‌ ఇప్పుడు మళ్లీ దాడి చేసిన వారిని ఈ కేసు నుంచి తప్పించడానికి డబ్బులు దండుకుంటున్నట్టు తెలుస్తుంది. డ్రైవర్‌తో వివాహేతర సంబంధం నెరుపుతున్న ట్రావెల్స్‌ యజమాని భార్య ఇంతకు క్రితం తన కుమార్తెను పావుగా వాడుకొని భర్త మీద పోక్సో కేసు పెట్టించి జైలుకు పంపించింది. ఈయన జైలులో ఉన్నప్పుడే కలెక్టరేట్‌, ఎన్‌ఏసీఎల్‌ నుంచి ట్రావెల్‌ ఏజెన్సీ పేరుతో వచ్చిన రూ.28 లక్షలు చెక్కులను ఈ డ్రైవర్‌, ట్రావెల్‌ ఏజెన్సీ యజమాని భార్య కలిసి విత్‌డ్రా చేసినట్లు స్వయంగా ట్రావెల్స్‌ నడుపుతున్న వ్యక్తే అప్పటి ఎస్పీకి మార్చి 27న రిజిస్టర్‌ పోస్టు ద్వారా ఫిర్యాదు పంపారు. దీనిపై విచారణ జరపాలని అప్పటి రూరల్‌ ఎస్‌ఐకి ఎస్పీ రాధిక ఆదేశించారు. అయితే ఈ కేసును రిజిస్టర్‌ చేయడానికి రూ.90వేలు డిమాండ్‌ చేసినట్లు ట్రావెల్‌ ఏజెన్సీ యజమాని చెబుతున్నారు. అక్రమంగా విత్‌డ్రా చేసిన సొమ్ముకు సంబంధించిన ఆధారాలు సమర్పించినా రూరల్‌ పోలీసులు స్పందించలేదు. అలాగే తన తల్లి అసలు రంగు తెలియక తండ్రి మీద ఫిర్యాదు చేశానని, ఇందులో వాస్తవం లేదని, దీని వెనుక కుట్ర ఉందంటూ జరిగిన కథను మైనరైన బాలిక మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినా దీని మీదా ఎటువంటి స్పందనా లేదు. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయిస్తామని రూ.90వేలు తీసుకున్న మధ్యవర్తి ఎస్‌ఐ బదిలీపై వెళ్లిపోవడంతో రూ.45వేలు వెనక్కు ఇచ్చి మిగతాది ఖర్చయిపోయిందని చేతులు దులుపుకొన్నట్టు తెలుస్తుంది. ఈ రెండు పోలీస్‌స్టేషన్లలోనూ బాధితుల నుంచే సొమ్ములు వసూలుచేయడం ఒక నేరం కాగా, ఈ వసూలు కోసం మూడో వ్యక్తిని పెట్టుకొని కథ నడపడం రెండో తప్పు. అందుకే పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కాలంటే సామాన్యులు భయపడిపోతున్నారు.

ఫ్రెండ్లీ పోలీస్‌ అన్న మాటకు పోలీస్‌ శాఖలో కొందరు అధికారులు, సిబ్బంది అర్ధం మార్చేస్తున్నారు. సాధారణంగా ఫేవర్‌ చేసినప్పుడు మాత్రమే లంచం తీసుకుంటారు. కానీ వారి డ్యూటీ చేయడానికి కూడా ఇక్కడ లంచాలు అడుగుతున్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఒక కానిస్టేబల్‌ను ప్రైవేట్‌ సెటిల్‌మెంట్‌ కోసం ఒకరిని ప్రోటోకాల్‌ పేరుతో ఏర్పాటు చేసుకుంటారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ సంప్రదాయం పోలీస్‌ స్టేషన్లలో కొనసాగుతుంటుంది. పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. వీరిని కలిసి మాట్లాడిన తర్వాతే వ్యవహారం ముందుకు కదులుతుంది.

 
 
 

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page