శ్రీవారు కరుణించినా భక్తులు శపిస్తారు
మందిమార్బలంతో వీవీఐపీ బ్రేక్‌లు
సాధారణ భక్తుడికి చుక్కలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

‘ప్రజలకు డి.బి.టి. ద్వారా అనేక ప్రయోజనాలు చేకూర్చినా ఎందుకు ఓడిపోయామో తెలియడంలేదు’ ఇదీ వైకాపా పరాజితులను పరామర్శిస్తున్నవారికి చెబుతున్న కారణం. 2019లో అధికారంలోకి రాగానే, అది కూడా అప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో లేని విధంగా 151 స్థానాలు దక్కడంతో దైవాంశ సంభూతులుగా భావించిన జగన్మోహన్‌రెడ్డి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు వీవీఐపీల పేరుతో దేవుడి దగ్గర కూడా దర్పం చూపించినందుకు ప్రతిఫలమే ఇప్పటి 11 సీట్ల పరిమితి. రెండు రోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో శ్రీవారి దర్శనాల్లో వైసీపీ నేతల రికార్డ్ ‘బ్రేక్’ పేరిట ఓ కథనం వచ్చింది. నిజంగా ఇది ఆలోచింపజేసే వ్యాసమే. సాధారణంగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు సాధారణమే అన్న భావన అందరిలోనూ ఉంది. కానీ గత ప్రభుత్వ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వందిమాగదులను పొలోమని వెంటేసుకొని ఎల్`1 బ్రేక్ దర్శనం చేయించడం చూస్తే నిజంగా దేవుడి దగ్గర కూడా ఈ వీవీఐపీ వేషాలేంటన్న ప్రశ్న తలెత్తక మానదు. జిల్లాలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా పని చేసిన సీదిరి అప్పలరాజు ఓసారి 150 మందికి పైబడి తన మనుషులను తీసుకువెళ్లి వీవీఐపీ ప్రోటోకాల్‌లో దర్శనం చేయించారు. అలాగే ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరో 150 మందికి పైబడి తీసుకువెళ్లి ప్రోటోకాల్ దర్శనం చేయించారు. అసలే అది తిరుమల. వరదనీరు కట్టలు తెంచుకొని వచ్చినట్టు ఎప్పుడు భక్తజనం వచ్చిపడిపోతారో తెలియదు. క్యూలైన్లలో సాధారణ భక్తులు రోజులు తరబడి అన్నపానీయాలకు నోచుకోక, చంటిబిడ్డలకు పాలిచ్చే పరిస్థితి కూడా లేక కునారిల్లిపోతుంటే, వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు తమ ఓటుబ్యాంకు రాజకీయం కోసం దేవుడితో వీఐపీ వేషాలేశారు. నేరుగా వాలంటీర్లు వచ్చి ఇంటికి సొమ్ములు పంచేస్తుండటం వల్ల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడుతున్నందున తామేం చేసినా భగవంతుని మారురూపమేనని భావించినవారికి ఇది ఏరోజూ అధర్మమనిపించకపోవడం గమనార్హం. సాధారణంగా ఒక ఎమ్మెల్యే సిఫార్సు లేఖతో రోజుకు ఆరుగురు బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. అదే మంత్రి అయితే రెండు లేఖలు ఇచ్చుకోవచ్చు. ఈమేరకు సంబంధిత నియోజకవర్గంలో ప్రజలు నిత్యం బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖలు తీసుకువెళ్తారు. కానీ నేరుగా మంత్రే వెళ్తే.. ఆయన్ను బంగారు వాకిలి దాటి గర్భాలయం ముందు నుంచి బయటకు నెట్టేసే యంత్రాంగం అక్కడ ఉండదు. ఎందుకంటే.. వారు వీఐపీలు. వీరితో వెళ్లిన 150 మంది కూడా వీవీఐపీలే. అందుకే అక్కడ మిగిలిన బ్రేక్ దర్శనాలకు వచ్చినవారిని సాధారణ భక్తజనాలను రెక్కపట్టుకొని లాగేసినట్లు వ్యవహరించరు. ఎంతసేపు స్వామిసన్నిధిలో ఉన్నా బయటకు వెళ్లమనే ధైర్యం చేయలేరు. ఇలా ఒక్కొక్క మంత్రి, ఎమ్మెల్యేలు మందీమార్బలంతో వీవీఐపీ బ్రేక్‌లకు వెళ్తే అది నిబంధనలకు విరుద్ధమన్న విషయం పక్కన పెడితే భక్తజన సులభుడు అయిన వేంకటేశ్వరుడు ఊరుకుంటాడా? ఆ ఫలితమే అనామకుడి చేతిలో కూడా వైకాపా నేతలు ఓడిపోవడం. అసలు వీఐపీ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలే సాధారణ భక్తులకు పెద్ద శాపమంటే, ఇలాంటివారు వచ్చి వెళ్లినప్పుడు స్వామివారు ఏమీ చేయలేక నిస్తేజంగా ఉండిపోవచ్చు. కానీ ఫలితాలు మాత్రం అంతిమంగా వేరే రకంగా అందిస్తారనడానికి మొన్నటి ఎన్నికలే నిదర్శనం. ఊ.. అంటే తిరుమల వెళ్లిపోవడం, వెంట మందీమార్బలంతో వీవీఐపీ దర్శనాలు చేయించడం వైకాపాలో చాలామందికి సాధారణమైపోయింది అప్పట్లో. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది చిత్తూరు కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 12న నాలుగు తోమాల సేవ, ఆరు ప్రోటోకాల్ దర్శనాలు, 12 మంది కల్యాణోత్సవాలు, 51 మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలు, 74 మందికి ఆర్జిత సేవ, బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు చేశారట. ఇక మాజీమంత్రి రోజా నిర్వహించిన శాఖే టూరిజం. గడిచిన ఐదేళ్లలో కొత్త టూరిజం ప్రాజెక్టు ఏదీ రాకపోయినా, టెంపుల్ టూరిజం కింద తిరుమల దర్శనాలకే ఆమె ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె ఎప్పుడు వెళ్లినా 30 మందితో తరలివెళ్లేదట. మరో మంత్రి ఉషశ్రీ చరణ్ ఒకసారి 50 మందితో శ్రీవారి దర్శనం చేయించారట. వీరంతా వీఐపీలు కదా.. దర్శనాలు చేయిస్తే తప్పేంటన్న ప్రశ్న తలెత్తితే, ఒక్కసారి గడిచిన ఐదేళ్లలో వీఐపీ బ్రేక్ దర్శనాల పరిస్థితి ఎలా తయారైందో తెలుసుకోండి. ఉదయం 5 గంటలకు మొదలయ్యే వీఐపీ బ్రేకులు మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగాయి. అంటే ఈ సమయంలో క్యూలైన్‌లో ఉన్నవారి పరిస్థితి ఏమిటో ఆలోచించండి. గడిచిన ఐదేళ్లలో తిరుమల క్యూలైన్‌లో జగన్‌ను తూలనాడని భక్తుడు కనిపిస్తే ఒట్టు. ప్రజలేమీ పట్టించుకోరు, వారికి ఏదో ఉచితంగా పడేస్తే చాలు.. మనం ఎంత అరాచకంగా వ్యవహరించినా వారికి పట్టదనే భావన వాస్తవం కాదని, ప్రజలు అన్నీ గమనిస్తుంటారని ఇప్పటికైనా అర్థమైతే చాలు. జగన్ ఓడిపోవడానికి అనేక కారణాలుండొచ్చు. కానీ రోజుకు 65 వేల మందికి తక్కువ కాకుండా దర్శనం చేసుకునే తిరుమలలో భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కూడా ఓ ప్రధానమైన కారణమని గుర్తించాలి. తాను ప్రవేశపెట్టిన చీప్‌లిక్కర్, ఇసుక విధానం మాత్రమే ఆయన్ను ఓడిరచలేదు. గడిచిన ఐదేళ్లలో తిరుమలకు వెళ్లిన ప్రతిభక్తుడు ఈసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేయలేదంటే అతిశయోక్తి కాదు. టీటీడీ బోర్డు మీటింగులో అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి టిక్కెట్ ధరలు పెంచే విషయంలో వేలంపాట మాదిరిగా మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అప్పుడే జగన్ ప్రభుత్వం టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతుందన్న భావన ప్రజల్లో ఏర్పడిరది. దానికి తోడు వందలమందితో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలయంలోకి ప్రవేశించి సాధారణ భక్తులను గాలికి వదిలేశారు. విగ్రహాల తలల నరికివేతలు, ఊరేగింపు రథాల దహనం వంటివాటితో తిరుమలలో నాయకుల ఓవరాక్షన్, పెత్తనాలు కూడా జగన్ ఓటమికి ఓ కారణం. చంద్రబాబు పాలనలోనైనా దీన్ని సరిదిద్దుకోకపోతే మళ్లీ వెంకన్నకు ఆగ్రహం కలగకమానదు.

Commentaires