top of page

వైకాపా కష్టం పగోడికీ రాకూడదు..!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Apr 17
  • 2 min read


ఎక్కడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకమవుతాయి. మన రాష్ట్రంలో మాత్రం మోడీ ప్రయోజనాల కోసమే అన్ని పార్టీలు ఏకమవుతాయి. బీజేపీతో జతకట్టిన పార్టీలు, ఇండియా కూటమికి మద్దతునిస్తున్న పార్టీలు కాకుండా బయట ఉన్న రాజకీయ పార్టీల్లో డీలిమిటేషన్ కోసం రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతున్న ఏకైక పార్టీ బహుశా వైకాపాయేనేమో. బీజేపీతో ఎలియన్స్‌లో ఉన్నాం కాబట్టి, దీన్ని వ్యతిరేకించలేమని చంద్రబాబు సమర్ధించుకోడానికి ఒక అవకాశం దొరికింది. కానీ జగన్మోహన్‌రెడ్డి చేతికి అందివచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకుంటున్నారు. దేశంలో చిన్న పిల్లలకు కూడా అర్థం అయిపోయింది. కురుక్షేత్రంలో భీష్ముడిని పడగొట్టేందుకు శిఖండిని ఎలా అడ్డం పెట్టుకున్నారో.. ఇప్పుడు డీలిమిటేషన్‌ను సాధించుకునేందుకు మహిళా రిజర్వేషన్లను అడ్డం పెట్టుకున్నారు.

2026లో మొదలైన జనాభా లెక్కలు 2027లో పూర్తయ్యాక డీలిమిటేషన్ కోసం ఆలోచించాలి. తమ అధినేత కేంద్రంలో కూటమి పెట్టిన బిల్లులకు యమా స్పీడుగా మద్దతు ఇస్తున్నా కూడా రాష్ట్రంలో కూటమితో పోరాటం చేసే వైకాపా శ్రేణులకు సానుభూతి తెలపడం తప్ప ఏం చేయలేం. చంద్రబాబు, జగన్, పవన్ ఓ సాయంత్రం పూట కలిసి 42,36,14 పైసల వాటాతో రాష్ట్రాన్ని పంచేసుకుని, మిగిలిన 8 శాతాన్ని బీజేపీకి ట్యాక్స్‌గా చెల్లించేలా ఒప్పందం చేసుకుంటే ఎన్నికల పేరుతో వాళ్లు చేసే కోట్ల ఖర్చు మిగులుతుంది, వారికి రాష్ట్రమంతా తిరిగే శ్రమ తప్పుతుంది, అన్నిటికంటే మరీ ముఖ్యంగా హాయిగా నిద్ర పడుతుంది. పైగా వాళ్లు రాష్ట్రంతో పాటు వారి వారి వ్యాపారాలను కూడా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక రాజధానులు అంటారా నలుగురూ తలో ఒక రాజధాని వారికి నచ్చిన చోట కట్టుకోవచ్చు!!!

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తున్న వైకాపా కోసం ఆలోచించుకోవలసింది జగన్ని సమర్ధించే ఓటర్లే. బీజేపీని సపోర్ట్ చేయటంలో జగన్ చంద్రబాబు కన్నా ముందుంటారు. కానీ, బీజేపీ వారు జగన్‌ను, ఆయన మతాన్ని అనుక్షణం ఉతికి ఆరేస్తుంటారు. ఈ ఇంట్లో తిని ఆ ఇంట్లో చేతులు కడగటం అంటారు. జగన్ బీజేపీ సపోర్ట్ అలాగే ఉంది. రాష్ట్రంలోని జగన్ ఓటర్లు ఎన్డీయే మీద ఎందుకు పోరాడి పోలీస్ కేసులు పెట్టించుకోవాలి!? జగనేమో హ్యాపీగా ఎన్డీయేకి సపోర్ట్ చేస్తారు. భలేగుంది ఆంధ్రా రాజకీయం. తమలో తమకు ఎంత సవతి పోరు ఉన్నా కూడా మోడీకంటూ వీళ్ల అవసరం రావాలే కాని, అదొక సువర్ణ అవకాశంగా భావిస్తారు మొత్తం మన తెలుగోళ్లంతా.

నవీన్ పట్నాయక్.. సుమారు 24ఏళ్ల పాటు ఒడిశా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన నాయకుడు. మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయినా, ఇప్పటికి ఒడిశాలో అతడికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. వ్యక్తిగతంగా ఎలాంటి ఆరోపణలు ఆయన మీద లేవు. ఇన్నాళ్లూ కేంద్రంలోని బీజేపీకి నవీన్ పట్నాయక్ ఒక ‘అప్రకటిత మిత్రుడు’. 2019 తర్వాత బీజేపీ ఏ కీలక బిల్లు తెచ్చినా బిజు జనతా దళ్ (బీజేడీ) వెనుకాడకుండా మద్దతు ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లు, అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకే ఓటేశారు. ఇంతలా సహకరించిన నవీన్, ఇప్పుడు మాత్రం కేంద్రంపై తిరుగుబాటు ప్రకటించారు. ప్రస్తుతం కేంద్రం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి కారణం చాలా స్పష్టం. జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు పెంచితే.. పద్ధతిగా జనాభాను నియంత్రించిన ఒడిశాకు అన్యాయం జరుగుతుంది. ఒడిశా సీట్ల వాటా 3.9% నుండి 3.4%కి తగ్గిపోతుంది. అంటే, మీ మాట విన్నందుకు మా గొంతు నొక్కుతారా? అని ఆయన నిలదీస్తున్నారు. నిజానికి బీజేపీని గుడ్డిగా నమ్మడం వల్ల నవీన్ పట్నాయక్ తన సొంత రాష్ట్రంలో అస్తిత్వాన్ని కోల్పోయారు. ఎప్పుడూ బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో బిజు జనతాదళ్ క్యాడర్ దెబ్బతింది. ఆ గ్యాప్‌ను వాడుకుని బీజేపీ ఒడిశాలో పాగా వేసింది. బీజేపీకి బి-టీమ్ అనే విమర్శ రావడంతో, ప్రజలు మార్పు కోరుకుని చివరకు నవీన్‌ను ఓడించి బీజేపీకే అధికారం అప్పగించారు. మిత్రుడనుకున్న వాడే ఇంటిని గుల్ల చేశాడు. రాజకీయాల్లో రాష్ట్ర ప్రయోజనం కంటే ఏ నాయకుడూ ఎక్కువ కాదు. మన రాష్ట్రంలో కొందరు నాయకులు కేంద్రం ముందు సాగిలపడుతున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా నోరు మెదపడం లేదు. కానీ నవీన్ పట్నాయక్ ఇవాళ అధికారం లేకపోయినా, తన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే పాత మిత్రుడిని సైతం ఎదిరించి నిలబడ్డారు. తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి సిద్ధపడ్డారు. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు, ఒక రాష్ట్ర ఆత్మగౌరవ పోరాటం. పదవుల కోసం ఢిల్లీ ముందు మోకరిల్లే నాయకులకు ఇదొక గట్టి హెచ్చరిక!

మహిళల భుజం మీద తుపాకీ ఎక్కుపెట్టి దక్షిణాది రాష్ట్రాలను దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ చేస్తున్న 131వ రాజ్యాంగ సవరణలో ప్రవేశపెడుతున్న మూడు బిల్లులు ఏంటి? ఈ మూడు బిల్లల గురించి బయట ఏం ప్రచారం చేశారు వాస్తవంగా ఏముంది ఇవి నిజంగానే దక్షిణాది రాష్ట్రాలను దెబ్బతీస్తాయా? అన్నిటికీ మించి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఇందులో పెట్టిన ఒక క్లాజ్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు శాశ్వతంగా నష్టం జరుగుతుందన్న విషయం మన నాయకులకు తెలియనిది కాదు. కానీ ఎవరికి వారు ఒక డిమాండ్‌ను కేంద్రం ముందు పెట్టి, దానికి మోడీ అంగీకరించారని మోసం చేసుకొని అనుకూలంగా ఓటేయడానికి సిద్ధపడుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page