`గత ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్
`లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లతో భారీ తేడా
`విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న ఆందోళన
`ఈ ఎన్నికల్లో అలా జరక్కుండా జాగ్రత్తలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీకి క్రాస్ ఓటింగ్ బెంగ పట్టుకుంది. గత ఎన్నికల్లో ఇదే సమస్యతో కొన్ని నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ఎంపీ స్థానంలో విజయావకాశాన్ని కోల్పోయింది. ఈసారి కూడా అదే సమస్య ఎదురవుతుందేమోనన్న చర్చ ఆ పార్టీవర్గాల్లో సాగుతోంది. లెక్క ప్రకారం అసెంబ్లీ అభ్యర్థులు పోలైనన్ని ఓట్లే పార్లమెంటు అభ్యర్థికి లభించాలి. కానీ 2019 ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ అభ్యర్థి కంటే పార్లమెంటు అభ్యర్థికి ఎక్కువ, మరికొన్ని చోట్ల పార్లమెంటు అభ్యర్థికి తక్కువ, అసెంబ్లీ అభ్యర్థికి తక్కువ ఓట్లు లభించాయి. దాంతో అప్రమత్తమైన వైకాపా నాయకత్వం, అభ్యర్థులు ఈసారి అలా జాగ్రత్త పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన తీరు పరిశీలిస్తే..
ఎంపీ అభ్యర్థి ఓటమి
2019 ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా వైకాపా ఎంపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ 6,653 ఓట్లతో ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌తో పాటు మొత్తం 15,53,860 ఓట్లకుగాన 11,31,784 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీడీపీకి 5,34,544, వైకాపాకు 5,27,891 ఓట్లు దక్కాయి. నోటాకు 25,545 ఓట్లు పడ్డాయి. శ్రీకాకుళం ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు చోట్ల వైకాపా అభ్యర్థులు విజయం సాధించినా ఎంపీ అభ్యర్థి ఓడిపోయారు. ఇప్పటికీ దాని ప్రభావం వెంటాడుతోంది. అప్పటికీ, ఇప్పటికీ వైకాపాలో పెద్దగా మార్పులు లేవు. ఇచ్ఛాపురంలో పిరియా సాయిరాజ్ స్థానంలో ఆయన భార్య, జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ బరిలో ఉన్నారు. టెక్కలి అసెంబ్లీకి 2019లో పేరాడ తిలక్ పోటీలో ఉంటే ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. 2019లో దువ్వాడ ఎంపీగా పోటీ చేస్తే పేరాడ తిలక్ టెక్కలి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఇవి మినహా మిగతా నియోజకవర్గాల్లో 2019 నాటి అభ్యర్ధులే పోటీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఇచ్ఛాపురం, టెక్కలి అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, ఆమదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, శ్రీకాకుళం, పలాసల్లో వైకాపా విజయం సాధించాయి. ఈ ఐదు చోట్ల వైకాపా అభ్యర్ధులకు వచ్చినన్ని ఓట్లు ఆ పార్టీ ఎంపీ అభ్యర్ధికి పోలై ఉంటే ఆ పార్టీ ఎంపీ స్థానాన్ని కూడా గెలిచేది. దీంతోపాటు పోస్టల్ బ్యాలెట్‌లో వైకాపా అభ్యర్ధికి 5,149 ఓట్లు, టీడీపీ అభ్యర్ధికి 3,453 ఓట్లు వచ్చాయి. సర్వీస్ ఓటర్లు వైకాపా అభ్యర్ధికి 1,799, టీడీపీ అభ్యర్ధికి 1,871 ఓట్లు వేశారు. దాంతో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో క్రాస్ ఓటింగ్ జరిగిందని స్పష్టమైంది. ఇటీవల జరిగిన వైకాపా జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో క్రాస్ ఓటింగ్ గురించే పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త చిన్న శ్రీను పార్టీ అభ్యర్ధులకు సుతిమెత్తగా హెచ్చరించారు. కాగా బుధవారం జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ కూడా ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా డేటాను తెప్పించి క్రాస్ ఓటింగ్ జరిగిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ పరిశీలకులకు, ఐప్యాక్ టీంకు సూచించినట్టు తెలిసింది. క్రాస్ ఓటింగ్ జరిగితే ఉపేక్షించేది లేదని, 2019లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని గట్టిగా హెచ్చరించినట్టు సమాచారం. ఏ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ ఏమేరకు జరిగిందో పరిశీలిద్దాం.
పలాసలో..
పలాస అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోస్టల్ బ్యాలెట్ మినహాయిస్తే వైకాపా అభ్యర్ధి సీదిరి అప్పలరాజుకు 75,008, టీడీపీ అభ్యర్ధి గౌతు శిరీషకు 58,711 ఓట్లు రాగా 16,332 ఓట్లు మెజార్టీతో సీదిసరి విజయం సాధించారు. ఇదే సెగ్మెంట్‌లో వైకాపా ఎంపీ అభ్యర్ధికి 66,319 ఓట్లు రాగా టీడీపీ ఎంపీ అభ్యర్ధికి 3731 ఎక్కువగా 70,050 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైకాపా అసెంబ్లీ అభ్యర్ధికి ఎంపీ అభ్యర్ధి కంటే 8,689 ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ లెక్కన 12,601 ఓట్లు క్రాస్ అయినట్లు నిర్థారించారు. 14 పోలింగ్ కేంద్రాల పరిధిలో 200 కంటే ఎక్కువ ఓట్లు క్రాస్ అయినట్లు గుర్తించారు. 37 కేంద్రాల్లో 100 నుంచి 200 మధ్య క్రాస్ అయ్యాయి. మంత్రి అప్పలరాజు స్వగ్రామం దేవునల్తాడ పోలింగ్ కేంద్రం నెం.269లో 216 ఓట్లు, పోలింగ్ కేంద్రం నెం. 279లో 147 ఓట్లు క్రాస్ అయ్యాయి.
ఇచ్ఛాపురంలో..
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్ధి పిరియా సాయిరాజ్‌కు 71,931 ఓట్లు, టీడీపీ అభ్యర్ధి డాక్టర్ బెందాళం అశోక్‌కు 79,405 ఓట్లు వచ్చాయి. డాక్టర్ అశోక్ 7,474 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. కానీ వైకాపా ఎంపీ అభ్యర్ధికి 69,572 ఓట్లు రాగా, టీడీపీ ఎంపీ అభ్యర్ధికి 83,375 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడికి 13,803 ఓట్లు అధిక్యత లభించింది. వైకాపా అసెంబ్లీ అభ్యర్ధి కంటే ఆ పార్టీ ఎంపీ అభ్యర్ధికి 2,359 ఓట్లు తక్కువ రావడం గమనార్హం. అదే సమయంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధి కంటే ఆ పార్టీ ఎంపీ అభ్యర్ధికి 3,970 ఎక్కువ పడ్డాయి. ఈ లెక్కన ఈ నియోజకవర్గంలో వైకాపా అసెంబ్లీ, ఎంపీ అభ్యర్ధుల మధ్య క్రాస్ అయినవి 6,329 ఓట్లు. వంద అంతకంటే ఎక్కువ ఓట్లు క్రాస్ అయిన పోలింగ్ కేంద్రాలు నాలుగు ఉండగా, 50`100 మధ్య క్రాస్ అయిన పోలింగ్ కేంద్రాలు 21 ఉన్నాయి.
టెక్కలిలో..
టెక్కలి అసెంబ్లీలో పోస్టల్ బ్యాలెట్ మినహాయిస్తే వైకాపాకు 77,769, టీడీపీకి 86,357 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు 8,588 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సెగ్మెంట్‌లో వైకాపా ఎంపీ అభ్యర్ధికి 78,289 ఓట్లు రాగా టీడీపీ ఎంపీ అభ్యర్ధికి 86,897 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడికి 8,608 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక్కడ వైకాపా అసెంబ్లీ అభ్యర్ధి కంటే ఎంపీ అభ్యరికి 520 ఓట్లు అధికంగా వచ్చాయి. టీడీపీ ఎంపీ అభ్యర్ధికి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కంటే 540 ఓట్లు అధికంగా వచ్చాయి. టెక్కలి దువ్వాడ శ్రీను సొంత నియోజకవర్గం కావడం, ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్‌కు కూడా సొంత మండలం ఉండటంతో క్రాస్ ఓటింగ్ ప్రభావం తక్కువగా ఉంది.
పాతపట్నంలో..
ఈ సెగ్మెంట్‌లో పోస్టల్ బ్యాలెట్ మినహాయిస్తే వైకాపా అభ్యర్ధికి 75,669, టీడీపీ అభ్యర్ధికి 60,975 ఓట్లు వచ్చాయి. రెడ్డిశాంతి 14,694 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. కానీ వైకాపా ఎంపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్‌కు 72,134 ఓట్లు రాగా, టీడీపీ ఎంపీ అభ్యర్ధి రామ్మోహన్‌నాయుడికి 65,828 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైకాపాకు 6,306 ఓట్లు అధికంగా వచ్చాయి. కానీ ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధికి ఎంపీ అభ్యర్ధి కంటే 3,535 ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ లెక్కన వైకాపా అసెంబ్లీ, ఎంపీ అభ్యర్ధుల మధ్య క్రాస్ అయినవి 8,388 ఓట్లు. రెండు పోలింగ్ కేంద్రాల్లో వంద అంతకంటే ఎక్కువ ఓట్లు క్రాస్ కాగా, 59 కేంద్రాల్లో 50`100 మధ్య ఓట్లు క్రాస్ అయినట్లు గుర్తించారు.
శ్రీకాకుళంలో..
ఈ సెగ్మెంట్‌లో పోస్టల్ బ్యాలెట్‌ను మినహాయిస్తే వైకాపా అభ్యర్ధి ధర్మాన ప్రసాదరావుకు 82,388 ఓట్లు, టీడీపీ అభ్యర్ధి గుండ లక్ష్మీదేవికి 77,575 ఓట్లు వచ్చాయి. ధర్మాన ప్రసాదరావు 4,813 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. అదే సమయంలో వైకాపా ఎంపీ అభ్యర్ధికి 77,144, టీడీపీ ఎంపీ అభ్యర్ధికి 86,800 ఓట్లు వచ్చాయి. ఈ సెగ్మెంట్‌లో టీడీపీ ఎంపీ అభ్యర్థికి 9,656 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక్కడ వైకాపా అసెంబ్లీ అభ్యర్ధికి వైకాపా ఎంపీ అభ్యర్ధి కంటే 5,244 ఓట్లు అధికంగా వచ్చాయి. వైకాపా అసెంబ్లీ, ఎంపీ అభ్యర్ధుల మధ్య 14,469 ఓట్లు క్రాస్ అయినట్లు గుర్తించారు. 29 పోలింగ్ కేంద్రాల్లో 100 అంతకంటే ఎక్కువ ఓట్లు క్రాస్ కాగా, 126 కేంద్రాల్లో 50`100 మధ్య క్రాస్ అయినట్లు గుర్తించారు.
నరసన్నపేటలో..
ఈ సెగ్మెంట్‌లో పోస్టల్ బ్యాలెట్ మినహాయిస్తే వైకాపాకు 85,632, టీడీపీకి 66,597 ఓట్లు వచ్చాయి. కృష్ణదాస్ సుమారు 19,035 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. వైకాపా ఎంపీ అభ్యర్ధికి 81,714, టీడీపీ ఎంపీ అభ్యర్ధికి 72,773 ఓట్లు వచ్చాయి. వైకాపా అభ్యర్ధి దువ్వాడకు 8,941 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక్కడ వైకాపా అసెంబ్లీ అభ్యర్ధికి వైకాపా ఎంపీ అభ్యర్ధి కంటే 3,918 ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ లెక్కన నియోజకవర్గంలో వైకాపా అసెంబ్లీ, ఎంపీ అభ్యర్ధుల మధ్య క్రాస్ అయిన ఓట్లు 10,094గా గుర్తించారు. 78 పోలింగ్ కేంద్రాల్లో 50`100 ఓట్ల మధ్య ఓట్లు క్రాస్ కాగా 16 కేంద్రాల్లో 100 కంటే ఎక్కువ ఓట్లు క్రాస్ అయ్యాయి.
ఆమదాలవలసలో..
ఈ సెగ్మెంట్‌లో పోస్టల్ బ్యాలెట్ మినహాయిస్తే వైకాపాకు 76,801, టీడీపీకి 63,274 ఓట్లు రాగా తమ్మినేని 13,527 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ వైకాపా ఎంపీ అభ్యర్ధికి 75,759, టీడీపీ ఎంపీ అభ్యర్ధికి 63,490 ఓట్లు వచ్చాయి. వైకాపా అభ్యర్ధి దువ్వాడకు 12,269 ఓట్లు అధికంగా వచ్చాయి. ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థికి ఎంపీ అభ్యర్ధి కంటే 1,042 ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ లెక్కన నియోజకవర్గంలో వైకాపా అసెంబ్లీ, ఎంపీ అభ్యర్ధుల మధ్య క్రాస్ అయినవి 1,258 ఓట్లు. 44 పోలింగ్ కేంద్రాల్లో 50`100 మధ్య ఓట్లు క్రాస్ కాగా ఏడు కేంద్రాల్లో వంద కంటే ఎక్కువ ఓట్లు క్రాస్ అయ్యాయి.
Opmerkingen