గతంలో దోచేసిన అనుభవమే కొలమానం
హయాతినగరం ర్యాంపు తోటపాలెంకు షిప్ట్
కిల్లిపాలెంలో తవ్వుతున్నవారే తోటపాలెంకు రోడ్డేస్తున్నారు
రవాణా ఛార్జీలు తగ్గుతాయని నగరాన్ని తవ్వేస్తున్నారు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఉచిత ఇసుక పాలసీకి స్పష్టమైన తలాతోక లేకపోవడంతో ఇసుక వ్యాపారం ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకువస్తోంది. సంక్షేమ పథకాల అమలు కోసం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇసుక మీద సీనరేజ్‌ను వసూలు చేయాల్సివున్నా గ్రామాల్లో పదిమంది బతకడం కోసం, తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి వస్తే నిర్మాణ రంగం ఊపందుకుంటుందనే కోణంలో ఇసుకను ఉచితంగా సరఫరా చేసేందుకు అనుసరిస్తున్న విధానం ఇప్పుడు కూటమి ప్రభుత్వ కొంప ముంచుతోంది. పేరుకే జిల్లాలో 16 ర్యాంపుల్లో తవ్వకాలకు అనుమతులిచ్చినా జిల్లా పొడవునా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. చివరకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నా, అక్కడ ఇసుక లేదని స్వయంగా మైన్స్ Ê జియాలజీ శాఖ నివేదికలిచ్చినా అధికారులు మాత్రం ఎక్కడికక్కడ ఇసుక తవ్వుకోడానికి పచ్చజెండా ఊపుతున్నారు. కేవలం శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ర్యాంపులకు విపరీతమైన డిమాండు ఉండటంతో ఇక్కడ ఎన్ని అక్రమాలు చేసైనా సొమ్ములు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం స్థానిక టీడీపీ నేతలకు పచ్చనోట్ల వాసన చూపించి పెద్దఎత్తున దోపిడీకి తెర లేపుతున్నారు. కిల్లిపాలెంలో అసలు ఇసుకే లేదని, ఇక్కడ నదిలో మట్టి బయటకు వచ్చిందని, దీనివల్ల నీరు కలుషితమైపోయిందని, పంటలకు కూడా సాగునీరు అందడంలేదని స్థానికులు పోరాడుతుంటే, సరిగ్గా అదే ర్యాంపులో ఇసుకను తవ్వుకుపోతున్నారు. కారణం ఇది శ్రీకాకుళం హెడ్‌క్వార్టర్‌కు రెండు కిలోమీటర్ల లోపే ఉంది. విశాఖపట్నం వెళ్లాలంటే 100 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అందువల్ల జిల్లాలో అనేక చోట్ల ఇసుక లభ్యత ఉన్నా వద్దన్నచోటే తవ్వకాలు చేపడుతున్నారు. దూరం ఎంత తగ్గితే రవాణా ఛార్జీలు అంత తగ్గుతాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న పోటీలో మిగతావారి కంటే తక్కువకు ఇసుకను అమ్మొచ్చని శ్రీకాకుళం చుట్టూ తవ్వకాలు జరుపుతున్నారు. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్`9లో ఉంటున్న మెస్సర్స్ వెంకటేష్ హోతా ప్రాపర్టీస్‌కు కిల్లిపాలెంలో ఇసుకను తవ్వుకునే మహద్భాగ్యాన్ని మన అధికారులు కల్పించారు. అలాగే ఇప్పటి వరకు నగర పరిధిలో హయాతినగరం ర్యాంపునకు కూడా అనుమతులు ఇచ్చారు. కాకపోతే ఈ ప్రాంతంలో ఉన్న ర్యాంపునకు లారీలు వెళ్లడానికి సరిపడా రోడ్డు లేదు. అందుకే నాటుబళ్లు ద్వారా ఇక్కడ ఇసుక వ్యాపారం జరుగుతుంటుంది. ఒక్కసారి నదిలోకి లారీలను క్యూ కట్టించి ప్రొక్లయినర్ ద్వారా గంటల్లో నింపేసి రోజుల్లో సొమ్ములు లెక్కించుకోవాల్సిన చోట టైరుబళ్లతో తలనొప్పి ఎందుకనుకున్నారో ఏమో..? ఇక్కడ ర్యాంపును తోటపాలెం వైపునకు తరలించి ఇసుకను పెద్ద ఎత్తున తోడేస్తున్నారు. ఇది కూడా కిల్లిపాలెంలో నిరసనలు వ్యక్తమవుతున్న చోట ఇసుక తవ్వకాలకు కాంట్రాక్ట్ పొందిన వెంకటేష్ హోతా సంస్థకే అధికారులు కట్టబెట్టారు. అదేంటి..? టెండర్‌లో దక్కించుకున్నదానికి కట్టబెట్టారు అని చెబుతున్నారు అంటే.. అందుకూ ఒక కారణముంది. ఇసుక తవ్వకాలకు పిలిచిన టెండర్లలో బిడ్ ప్రకారమో, లేదూ అంటే నిబంధనల ప్రకారమో ఎవరికీ తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదు. కేవలం తాత్కాలికంగా ఏడు రోజుల పాటు తవ్వుకోడానికి అనుమతులిచ్చారు. ఈ పుణ్యకాలం గడిచిపోయి చాలా రోజులైంది. అయినా ఇసుక తవ్వకాలు ఆగలేదు సరికదా.. హద్దులను మార్చుకొని మరింత జడలు విప్పి జిల్లా సరిహద్దులు దాటిపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ నేతలకు ఉపాధి కల్పించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటువంటి పాలసీని తీసుకువచ్చారని భావిస్తే, తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. శ్రీకాకుళం నగరానికి ఆనుకొని ఉన్న కిల్లిపాలెం, హయాతినగరం పేరుతో తోటపాలెంలో నడుపుతున్న ర్యాంపులను దక్కించుకున్న హోతా వెంకటేష్ ప్రాపర్టీస్ గతంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనధికారికంగా ఆమదాలవలస నియోజకవర్గంలో ఇసుక ర్యాంపులు నిర్వహించి పెద్ద ఎత్తున అప్పటి ఆమదాలవలస వైకాపా నాయకుడికి సొమ్ములు ముట్టజెప్పి మిగిలిన మూటలు ఈయన పట్టుకుపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. వైకాపా హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలను జేపీ వెంచర్స్‌కు గంపగుత్తగా కట్టబెట్టారు. ప్రతీచోట వారే ఇసుకను తవ్వుకున్నారు. ఒక్క ఆమదాలవలస నియోజకవర్గంలో మాత్రం జిల్లాలో జేపీకి సమాంతరంగా ఇసుక దందా నడిచింది. దీనికి అడ్డుకట్ట వేయడం కోసం క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెడితే, దానికి ప్రతిగా ఇక్కడా ఒక క్యూఆర్ కోడ్ వచ్చింది. దీంతో పని కావడంలేదని ఒక డివైజ్‌ను ఇసుక కోసం మార్కెట్‌లోకి తెస్తే, దానికి డూప్లికేట్ డివైజ్ తయారు చేసి, ఆమదాలవలస నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఇసుక పట్టుకుపోయారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదట్లో అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోపుతారని ప్రచారం జరగడంతో శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉన్న తోటాడ, సింగూరు ర్యాంపులకు చెందిన సూత్రధారులు కొన్నాళ్లు పరారైపోయి, తర్వాత ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో ఇక్కడ ఇసుక తరలించినదంతా హోతా వెంకటేష్ ప్రాపర్టీసేనని ప్రచారంలో ఉంది. ఇప్పుడు అదే సంస్థకు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెండు కీలకమైన ర్యాంపులు కట్టబెట్టడం వెనుక ఏం జరిగివుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ఇసుకను అక్రమంగా తరలించిన అనుభవం ఉన్నవారికి మాత్రమే ఈసారి ర్యాంపులు వచ్చాయి. గత ప్రభుత్వం నేరుగా ఇసుక వ్యాపారం చేసినా, దానికి సమాంతరంగా తాము ఇసుకను తోలుకుపోయేవారమన్న క్వాలిఫికేషన్‌తోనే ఇటువంటి సంస్థలన్నీ ఇప్పటి తెలుగుదేశం నాయకులను కలిసి గతంలో వైకాపా నేతలకు ఎలా తినిపించారో, ఇప్పుడు ఎలా వడ్డించబోతున్నారో చెప్పడంతో గత ప్రభుత్వ హయాంలో ఇసుకను తోడినవారే ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. హయాతినగరం శ్రీకాకుళం నగర పరిధిలోకి వస్తుంది. తోటపాలెం ఎచ్చెర్ల పరిధిలోకి వస్తుంది. రెండూ నడి ఒడ్డునే ఉన్నా నాగావళికి వరద వస్తే హయాతినగరం మునగదు. తోటపాలెంలో పంటలు మాత్రం కోతకు గురవుతాయి. అందుకే అటువైపు ర్యాంపు ఇవ్వరు. కానీ ఇప్పుడు అక్కడి టీడీపీ నాయకులను ముందుకు పెట్టి తోటపాలెం నుంచి లారీలు యథేచ్చగా వెళ్లడానికి బాటలు వేస్తుండటంపై ఇప్పటికే మైన్స్ డీడీకి ఫిర్యాదు వెళ్లింది. ఏం జరుగుతుందో చూద్దాం.
Comments