top of page

వైకాపాకు సలహాల్రావులే దిక్కా?

Writer: ADMINADMIN
  • అధికారంలో ఉన్నప్పుడు చాలామందికి పునరావాసం

  • తాజాగా పార్టీపరంగా సలహాదారుడి నియామకం

  • గతంలో తెలంగాణలో బీజేపీకి పని చేసిన సాయిదత్‌

  • ఢిల్లీ మొహమాటాలతోనే నియమించారన్న చర్చ

కొత్త సబ్జెక్ట్‌.. పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌, ఎలెక్షన్‌ స్ట్రాటజిస్ట్‌. కానీ తెలుగు వారికి ఇవి బాగా సుపరిచితమైన పదాలే. వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ఒక హద్దు లేకుండా సలహాదారుల నియామకాలు జరిగాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడే అనుకుంటే అధికారం పోయిన తర్వాత కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆ కోవలో పార్టీపరంగా ఆశ్చర్యకరమైన నియామకం ఒకటి జరిగింది. పార్టీ నిర్మాణంపై జగన్‌మోహన్‌ రెడ్డికి నమ్మకం ఉన్నట్లుగా గత ఏడు ఎనిమిది సంవత్సరాల్లో.. ముఖ్యంగా నాగార్జున యూనివర్సిటీలో 2017లో జరిగిన ప్లీనరీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ను పరిచయం చేసిన తరువాత నుంచి అనిపించలేదు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలను నియమించి వాటికి బాధ్యతలు అప్పజెప్పడం, నెలనెలా ఆ కమిటీల సమావేశాలు, పార్టీ సభ్యత్వ నమోదు, ఏడాదికో రెండేళ్లకో పార్టీ ప్లీనరీ లేదా మహాసభ నిర్వహించడం లాంటివి గత ఏడేళ్లలో ఒకటి రెండుసార్లు మాత్రమే జరిగాయి. 2017 తరువాత మళ్లీ 2022లోనే పార్టీ ప్లీనరీ జరిగింది. అంతే మళ్లీ ఇంతవరకు జరగలేదు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఐదేళ్లకోసారి సభ్యత్వ నమోదు, ప్లీనరీ జరపటం, అధ్యక్షుడితో సహా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలన్నది ఎన్నికల సంఘం నిబంధనల్లో ఒకటి. అలా చేయని పార్టీల గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉంది. ఎవరో సలహా ఇచ్చారో గానీ.. 2022 ప్లీనరీలో వైఎస్‌జగన్‌ను వైకాపాకు శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సి.రాంచంద్రయ్య లాంటి సీనియర్‌ నేతలు ఉండి కూడా ఇలా శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారేంటి? అని చాలామంది ఆశ్చర్యపోయినా వారి సలహా తీసుకొని ఉంటారా? అనే అనుమానం కూడా కలిగింది. అయితే తర్వాత శాశ్వత అధ్యక్షుడిని గుర్తించబోమని ఈసీ చెప్పటంతో దాన్ని తొలగించారు.

ఎవరీ మోహన్‌సాయిదత్‌?

పార్టీ నిర్మాణ సలహాదారుడు, ఎన్నికల వ్యూహాకర్తలు, పొలిటిల్‌ స్ట్రాటజిస్ట్లులు మాత్రమే పాపులర్‌ అయిన ఈ రోజుల్లో పార్టీ నిర్మాణంలో అధ్యక్షుల వారికి సలహాదారుగా ఆళ్ల మోహన్‌ సాయిదత్‌ను నియమించినట్లు రెండు రోజుల క్రితం వైకాపా కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన జారీ అయ్యింది. దాంతో ఎవరీ మోహన్‌సాయిదత్‌ అంటూ చాలా కాల్స్‌ వచ్చాయి. ఇతని గురించి ఎవరికీ తెలియదని దీన్ని బట్టి అర్థమవుతుంది. కానీ సాయిదత్‌ టీమ్‌ 2024 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి పనిచేసిన విషయం కొద్దిమందికి తెలుసు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా వైరల్‌ అవుతోంది. వీరి టీమ్‌ గతంలో ఢల్లీి లెవల్లో ఒక బీజేపీ పెద్ద నాయకుడికి ఫీడ్‌బ్యాక్‌ టీమ్‌గా కూడా పనిచేసింది. చెన్నై ఐఐటీలో చదివిన ఆళ్ల మోహన్‌ సాయిదత్‌ కరోనా సమయంలో రెండేళ్లపాటు నారా లోకేష్‌కు మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహాలు, పథకాల అమలు, పర్యటన ప్లానింగ్‌ సమన్వయకర్తగా పని చేశారు. 2024 ఎన్నికల ముందు ఎన్నికల విశ్లేషకుడిగా టీవీ9 నిర్వహించిన చాలా డిబేట్లలో పాల్గొన్నారు.

పార్టీ నిర్వహణ.. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కాదు

పార్టీ నిర్మాణం అంటే.. సింపుల్‌గా చెప్పాలంటే కార్యకర్తలు, నాయకులు, కమిటీలు, బాధ్యతలు, నిరంతర పర్యవేక్షణ. ఈ విషయం మీద 2018లో ఒకసారి, 2023 నవంబర్లో మరొకసారి పోస్ట్‌ రాశాను. నిర్మాణం - ఆలోచన, ఆచరణకు మధ్య అంతరం లేకుండా చూడటమే నిర్మాణం, నిర్మాణాత్మకం. వ్యవస్థ లేదా సంస్థను నడపడటంలో నిర్మాణాత్మక ఆలోచన, పనితీరు అత్యంత కీలకం. ఇంద్రధనస్సులా నిర్మాణాత్మక పనితీరులో పెరిగే క్రమం, తగ్గే క్రమం ఉంటుంది. రాజకీయ వ్యవస్థలో నిర్మాణాత్మక పనితీరు క్రమంగా తగ్గుతూ స్వల్పకాలిక లక్ష్యాల కోసం తాత్కాలిక ప్రణాళికల ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. అంతిమంగా ఎన్నికల వేళ పార్టీల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్ట్రాటజీ అంటే మ్యాజిక్‌, స్ట్రాటజిస్ట్‌ అంటే మెజీషియన్‌ అని భావించేలా పరిస్థితి మారిపోయింది. పార్టీ నిర్మాణ క్రమంలో కిందిస్థాయిలో క్యాడర్‌, దాని పైన స్థానిక నాయకత్వం, ఆపైన అధిష్టానం పిరమిడ్‌ రూపంలో ఉంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీ స్థిరంగా, పటిష్టంగా ఉంటుంది. ఎన్నికల్లో గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా పునాదిలో అగ్రనాయకత్వం, దానిపై మెట్టులో స్ట్రాటజీ, దాని పైన స్థానిక నాయకత్వం, ఆపైన క్యాడర్‌ ఉండే పార్టీ నిత్యం అస్థిరతతో సతమతం అవుతుంటుంది. గెలుపు అవకాశాలు తక్కువ. వ్యాపారులే ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగటం మొదలైన తరువాత ఎన్నికలు కూడా ఈవెంట్‌ మాదిరిగా మారిపోయాయి. వందమంది కార్యకర్తల పేర్లు గుర్తుండవు, ద్వితీయశ్రేణి నాయకత్వ హార్దిక, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు ఎవరికీ పట్టదు. ఈ ధోరణే కొందరు సీనియర్‌ నేతల ఓటమికి కారణం. మార్పు వస్తుందా? సలహాదారులతోనే ఆ మార్పు సాధ్యమవుతుందా? అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ అధినేతలు అనుకుంటే ఏ సలహాదారులు లేకున్నా మార్పు వస్తుంది. రాజకీయ నాయకులకు తెలియని అంశాలు ఏ సలహాదారుడికీ తెలియవు. సలహాదారుడైనా, వ్యూహకర్త అయినా చేసేది పార్టీ బలాన్ని స్థిరంగా ఉండేలా చూస్తూనే మరింత పెరిగేలా చూడటం, దాన్ని సరైన గాడిలో పెట్టి విజయావకాశాలను పెంచడమే. జగన్‌ తన పార్టీ నిర్మాణం కోసం సలహాదారుడిని నియమించుకోవడానికి కారణం.. కొందరు ఢల్లీి పెద్దలతో ఉన్న మొహమాటంతోనా లేకా నిజంగానే సలహాదారుడి అవసరం ఉంది అని భావించారా? అనేది ఆళ్ళ మోహన్‌ సాయిదత్‌ పని మొదలు పెట్టిన తరువాత తెలుస్తుంది.

- శివరాచర్ల

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page