క్వారీలో గొడవపడి దొరికిపోయిన బీహార్ గ్యాంగ్
వాస్తవాలు తెలుసుకోకుండా బైఠాయించిన మాజీమంత్రి
బడ్డ నాగరాజు హత్యకు సుపారీ
అధికారంలో ఉండగా నాగరాజును వేధించిన వైకాపా
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

పలాసలో టీడీపీ నేతను హత్య చేయడానికి కుట్ర జరిగిందంటూ కొందర్ని టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. అక్కడికి కొద్ది గంటల సమయంలో మాజీ మంత్రి, పలాస వైకాపా ఇన్‌ఛార్జి డాక్టర్ సీదిరి అప్పలరాజు తమ పార్టీ నేతలను ఇద్దర్ని కాశీబుగ్గ పోలీసులు కిడ్నాప్ చేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ రెండూ రెండు కథనాలు కావు. రెండు సంఘటనలు మాత్రమే. ఈ రెండిరటి వెనుక ఉన్న కామన్ పాయింట్ ఒకటే. ఆదివారం రాత్రి పలాస నియోజకవర్గాన్ని, సోమవారం ఉదయం జిల్లా మొత్తాన్ని కుదిపేసిన ఆ సంఘటన కథాకమామీషు గ్రౌండ్ రిపోర్టు...

టెక్కలిలో ఒక క్వారీ వద్ద బీహార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన చిన్న వివాదం మొత్తం ఈ కథను మలుపుతిప్పేసింది. క్వారీలో గొడవ పడిన వారి వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడంతో అక్కడకు వచ్చిన టెక్కలి పోలీసులు వారి నుంచి ఒక నాటు తుపాకీతో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకొని విచారించారు. సుపారీ తీసుకొని హత్య చేయడానికి వచ్చినట్టు గుర్తించారు. ముగ్గురు బీహారీలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వైకాపా మద్దతుదారులుగా ఉన్న పలాసకు చెందిన ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అంపోలు శ్రీనివాసరావు ఒకరు. ఈయన స్వగ్రామం చిన్నబడాం. అయినప్పటికీ మందస మండలం వరదరాజపురం గ్రామంలోని అత్తవారింటి వద్ద ఉంటున్నాడు. కూర్మాపు ధర్మారావు రెండోవారు. చిన్నబాడాంలోని తన నివాసంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు కథలోకి వెళితే..
పలాస టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజును హత్య చేయించడానికి బీహార్‌కు చెందిన ముఠాకు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి జిల్లాలో దించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బీహార్ గ్యాంగ్‌ను టెక్కలిలో దింపిన కేసుతో సంబంధం ఉండటం వల్లే పలాసలో ఇద్దరు వైకాపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ పలాస పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా బాధితుడే. ఆయన ఇంటికి వేసుకున్న రోడ్డును తవ్వి దారి లేకుండా స్థానిక వైకాపా నాయకులు ఇబ్బందులకు గురిచేశారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చిన రాత్రే చిన్నబాడాంలో వైకాపా నాయకుడు డిక్కల నిరంజన్ ఇంట్లోకి చొరబడి తలుపులు బద్దలుగొట్టి కుటుంబ సభ్యులందరినీ చితకబాదారు. ఆ తర్వాత కూర్మాపు ధర్మారావు పొలంలో వరి విత్తనాలు వేస్తున్న సమయంలో బడ్డ నాగరాజుతో పాటు మరికొందరు దాడి చేశారు. ఈ దాడి ఘనటపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. ఆ తర్వాత చిన్నబాడాం పెట్రోల్‌బంకు ఎదురుగా, నర్సిపురంలో కూర్మాపు ధర్మారావుతో పాటు మరికొందరు వైకాపా నాయకులు వేసిన లే`అవుట్‌లో అక్రమాలు జరిగాయని బడ్డ నాగరాజు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల వైకాపా నాయకులు రమణ, బుజ్జి మాష్టారును పోలీసు స్టేషన్‌లో చితకబాదిన విషయంలో బడ్డ నాగరాజు ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు చిన్నబాడాం పరిధిలోని స్థానిక కౌన్సిలర్ కుటుంబంతోనూ బడ్డ నాగరాజుకు కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయని తెలిసింది.
పలాస జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న అంపోలు శ్రీనివాసరావు చిన్నబాడాం పరిధిలోని వార్డు కౌన్సిలర్‌కు సమీప బంధువు. కూర్మాపు ధర్మారావుతో పాటు, శ్రీనివాసరావుని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ వివాదంలో మరికొంత మంది పాత్రపై పోలీసులు దర్మాప్తు చేస్తున్నారు. అంపోలు శ్రీనివాసరావును మందస మండలం వరదరాజపురం గ్రామంలోని ఆయన అత్తవారి ఇంటిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పడు గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో విచారణకు తీసుకువెళ్లినట్టు పోలీసు సిబ్బంది చెప్పినట్టు తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్డ నాగరాజు నుంచి ధర్మారావుకు వేధింపులు ఎక్కువ కావడంతో బీహార్ గ్యాంగ్‌కు పని అప్పగించినట్టు పలాసలో ప్రచారం ఉంది. దీనిపై పోలీసులు నోరిప్పిన తర్వాతనే ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తేలుతుంది. పోలీసుల అదుపులో ఉన్న వైకాపా నేతలను ప్రస్తుతం నరసన్నపేట స్టేషన్‌కు తరలించగా, బీహార్ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారణ చేస్తున్నట్టు తెలిసింది.
Commentaires