top of page

వైకాపాలో వంచనకు గురయ్యాను

Writer: ADMINADMIN
  • పదవి కాదు.. గౌరవం కోరుకున్నా

  • పోటీలో నిలబడి నా తడాఖా చూపిస్తా

  • జగన్‌ పార్టీకి రాజీనామా చేసిన కిల్లి కృపారాణి

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

వైకాపాకు ఐదేళ్లు జైకొట్టినందుకు వంచనకు గురిచేశారని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి బావోధ్వేగానికి గురయ్యారు. స్థానిక గ్రాండ్‌ హోటల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైకాపాకు రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపాలో పదవి ఎప్పుడూ కోరుకోలేదని, గౌరవం ఇస్తే సరిపోతుందని ఆలోచించినని, కనీస గౌరవం దక్కలేదన్నారు. దేశానికి ఒక కేంద్ర మంత్రిగా పరిచయం చేసిన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు వైకాపాకు రాజీనామా చేసేముందు తాను తీసుకున్న నిర్ణయంపై పూర్తి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మాభిమానం తాకట్టు పెట్టి వైకాపాలో పని చేయాల్సిన అవసరం లేదని రాజీనామా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. 2019లో వైకాపాలో చేరడానికి తనతో సంప్రదించినవారు తగిన విధంగా గౌరవిస్తామని చెప్పి రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్‌ హోదాలో న్యూఢల్లీిలో అవకాశం కల్పిస్తామన్నారని తెలిపారు. 2019 మార్చి 14న శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధం కావాలని విజయసాయిరెడ్డి ద్వారా కబురు పంపించి, జాబితాలో తన పేరును తప్పించారని ఆమె వాపోయారు. ఆ తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎందుకు పదవిచ్చారో, ఎందుకు తొలగించారో తెలియదన్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఒక్క ఎంపీటీసీకీ బి`ఫారం ఇచ్చుకోలేని, ఒక్క సర్పంచ్‌ అభ్యర్ధి పేరు సిఫార్సు చేయలేని పరిస్థితికి దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఓపికతో సీఎం జగన్‌ మీద నమ్మకంతో ఒక కార్యకర్తగా కొనసాగానని, ఆ నమ్మకమే తనను పూర్తిగా ముంచేసిందన్నారు. రెండేళ్ల క్రితం జిల్లాకు వచ్చిన సీఎం జగన్‌ను కలిసేందకు హెలీప్యాడ్‌ వద్దకు రానీయకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓదార్పు యాత్రపై ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి వైఎస్‌ తనయుడుగా జగన్‌కు అండగా ఉండాలని తన భర్త రామ్మోహన్‌రావు జిల్లా అంతా ఆయనతో కలిసి తిరిగారని, పార్టీలో తగిన గౌరవం ఇస్తామని హమీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్న జగన్‌ నట్టేట ముంచారని కన్నీరుమున్నీరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన రోజు స్పీకర్‌ తమ్మినేని సీతారాం సాక్షిగా ఒక లేఖను స్వయంగా సీఎం జగన్‌కు ఇచ్చానని, దాన్ని బుట్టదాఖలు చేశారని, సీఎం మానవతావాదిగా నమ్మానని, లేఖను చదివుంటే కబురుపెట్టి తన ఆవేదనను వినుండేవారని ఆమె అన్నారు. సుబ్బారెడ్డిని కలిసి సీఎంతో మాట్లాడిరచాలని కోరినా ఫలితం లేకపోయిందన్నారు. వైకాపా ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక రాజ్యాంగం ప్రకారం నడుచుకున్న వారికే గౌరవం లభిస్తుందన్నారు. విద్యావంతులు, సంస్కారవంతులకు వైకాపాలో స్థానం లేదని, వైకాపా నుంచి పోటీలో నిలిచిన స్థానిక అభ్యర్ధులు, పార్టీ పరిశీలకులుగా ఉన్నవారికి తన అవసరం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు. టెక్కలి డివిజన్‌లో పథకం ప్రకారం తనను అణిచివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారని తెలిపారు. అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉందన్నారు. ఏ పార్టీలో గౌరవం దక్కుతుందో అందులో చేరి కచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసి తన తడాఖా చూపిస్తానని అధికార పార్టీకి హెచ్చరించారు. తనను వైకాపా తక్కువ అంచనా వేసిందని, తన బలమేంటో ఎన్నికల్లో చూపిస్తానన్నారు. సమావేశంలో డాక్టర్‌ రామ్మోహనరావు, గుప్తా, గోరింట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 
 
 

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page