top of page

విచ్చలవిడితనానికి ముద్దుపేరే రేవ్‌ పార్టీ

Writer: ADMINADMIN

- డి.వి.మణిజ

మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి ఆహ్వానాలు అందించాలంటే.. ఒక జాబితా తయారు చేసుకుంటాం కదా. అందులో ముందు వరుసలో రక్త సంబంధీకులను గుర్తు తెచ్చుకుని రాసుకుంటాం. తర్వాతి వరుసలో దూరపు బంధువులను జత చేసుకుంటాం. చివరి వరుసలో స్నేహితులను, పరిచయస్తులను, ఆత్మీయులను చేర్చుకుంటాం. ఇదే వరుస కాస్త అటూఇటూగా ఏ కార్యక్రమానికైనా వర్తింపజేసుకుంటాం. వారందరినీ మన ఇంటికి ఆహ్వానించేటప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా రమ్మంటాం, అది కూడా ఒక రోజు ముందే వచ్చేయమంటాం. మనవాళ్లు అనుకుంటున్న వారందరూ కార్యక్రమానికి విచ్చేస్తే అదొక ఆనందం. హాజరు శాతాన్ని బట్టి కార్యక్రమం విజయవంతం కావడం ఆధారపడుతుంది. దాదాపుగా ప్రపంచంలో ప్రతిచోటా ఇదే జరుగుతుంది.

అయితే 75 ఏళ్ల కిందట అమెరికాలో ఒక పెద్దాయనకు ఒక వింత కోరిక కలిగింది. తెలిసిన వాళ్లు కాకుండా తెలియని వారంతా మన ఫంక్షన్‌కు వస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. ముక్కూముఖం తెలియని వారంతా వచ్చి, తాము సమర్పించిన ఆతిథ్యం స్వీకరించి, నిండు మనసుతో ఆశీర్వదిస్తే చాలనుకున్నాడు. బయటకు నవ్వుతూ లోపల వెక్కిరించే బాదరబందీ బంధువుల పెడసరపు మాటలకు దూరంగా ఉండాలనుకున్నాడు. అలా పార్టీ ఏర్పాటు చేశాడు. ఎవరికి ఎవరూ తెలియరు కాబట్టి, ఊరికి దూరంగా ఫంక్షన్‌ ఏర్పాటు చేసుకున్నాడు. పాశ్చాత్య దేశాల్లో బాగా అలవాటున్న మందూమాకూ ఏర్పాటు చేశాడు. వింతగా ఉంది కాబట్టి వచ్చినవారంతా బాగా ఎంజాయ్‌ చేశారు. ఒక సాహసంగా తొలిసారి కార్యక్రమం చేశాడు కాబట్టి రేవ్‌ పార్టీ అని నామకరణంతో గొప్ప పబ్లిసిటీ వచ్చింది. అలా మొదలైన రేవ్‌పార్టీ కాలక్రమంలో దేశదేశాలకు విస్తరించి, చివరకు మూడు దశాబ్దాల కిందట మన దేశంలోనూ చేరింది. అయితే ముక్కూమొఖం తెలియని అతిధులు అలానే ఉన్నారు. అంటే పార్టీకి వచ్చే వరకూ ఎవరూ ఎవరికీ తెలియరన్న మాట. కానీ, మందూమాకూ కాస్త రూపం మార్చుకుంది. మందుతో పాటు భారతదేశంలో నిషేధించబడ్డ మాదకద్రవ్యాలు వచ్చి చేరాయి.

దొరికింది గోరంత.. దొరకంది కొండంత..

ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌ లాంటి మెట్రోపాలిటన్‌ నగర శివార్లలో మొదలైన రేవ్‌ పార్టీలు ఒక వింత కల్చర్‌గా మన దేశంలో స్థిరపడ్డాయి. సంపన్నులు మాత్రమే వెళ్లగలిగే ఈ పార్టీలలో మద్యం పొంగిపొర్లడంతో పాటు విచ్చలవిడి లైంగిక కార్యకలాపాలు, మితిమీరిన మాదకద్రవ్యాల వినియోగంతో రచ్చకెక్కుతున్నాయి. అయితే ఏడాదిలో నాలుగైదు చోట్ల రేవ్‌పార్టీలపై పోలీసులు దాడులు చేసినప్పుడు, నిందితులలో సినిమా నటులు, పారిశ్రామికవేత్తల బిడ్డలు, క్రీడాకారులు, బుల్లితెర నటీనటులు ఉంటేనే నాలుగు రోజులు వార్తల్లో నలుగుతున్నాయి. వారు దొరకకపోతే, దొరికినా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించకపోతే అవి జరిగిన సంగతి కూడా మనకు తెలియట్లేదు. ఇప్పుడు కనిపిస్తున్నదంతా జస్ట్‌ ఎ టిప్‌ ఆఫ్‌ ది ఐస్‌బెర్గ్‌ అని సీనియర్‌ పోలీసు అధికారులు వాపోతున్నారు. దొరకని దొంగలు ఎక్కడికక్కడ గప్‌చుప్‌గా పార్టీలకు హాజరవుతూనే ఉన్నారని, డ్రగ్స్‌ వినియోగిస్తూనే ఉన్నారని ఖరాఖండిగా చెప్తున్నారు. నిజానికి ఆ పార్టీలకు వచ్చేవారిలో అధిక శాతం ఒకరికొకరు తెలియకపోవడం వల్ల ‘అతిథులంతా’ మరుసటి రోజు ఒకరి సమాచారం మరొకరికి తెలియజెప్పడానికి ఆస్కారం లేకుండా పోతోంది. కాని పార్టీలు నడుస్తున్నకొద్దీ శిథిలమైపోతున్న జీవితాలెన్నో లెక్క తెలియడం లేదు. మన చట్టాలలో ఉన్న లొసుగుల ఆధారంగా నిందితులందరూ తప్పించుకు తిరుగుతున్నారు. ఆనందం కోసం, నిషా కోసం ఖర్చు చేసే డబ్బు గురించి ఖాతరుచెయ్యని సంపన్నుల మనస్తత్వం వల్ల రేవ్‌ పార్టీలు నిరంతరం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయి. ఈ పార్టీలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కలిగిస్తున్న కీడు గురించిన అవగాహన ఎవరికీ లేకుండా పోతోంది.

ఒక రోజు నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ పార్టీలకు హాజరయ్యేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లు తీసుకురావడానికి అనుమతించరు. పార్టీ జరిగే ప్రదేశంలో సీసీ కెమెరాలు ఉండవు. పార్టీ జరగబోయే ప్రదేశం చివరి క్షణం వరకూ ప్రకటించరు. డబ్బు చెల్లించిన అతిథులు ఎక్కడ నిరీక్షించాలో చెప్తారు. అనుకున్న సమయానికి అక్కడి నుంచి నిర్వాహకులు తమ వాహనాలలో పికప్‌ చేసుకుంటారు. ఫంక్షన్‌ పూర్తయ్యాక అదేచోట డ్రాప్‌ చేస్తారు. ఫంక్షన్‌లో లభించే మద్యం, మగువ, మాదకద్రవ్యాలను బట్టి ప్రవేశ రుసుం నిర్ణయిస్తారు. అది పాతిక వేలనుంచి కోటి రూపాయల వరకూ ఉంటుందని భోగట్టా. నిర్దేశిత ప్రదేశానికి చేరుకున్న ‘అతిథులు’ ఛిల్‌ అవడం అంటే మద్యం సేవించడం, నృత్యాలు చేయడం మాత్రమే అనుకుంటే మనం పూర్తిగా అమాయకులమే. మాదకద్రవ్యాల తర్వాత అక్కడ ముఖ్య వినిమయ వస్తువు సెక్స్‌. నచ్చినవారితో నచ్చిన విధంగా లైంగిక కార్యకలాపాల కోసమే అక్కడికి వచ్చేవారు డబ్బు చెల్లిస్తారని కొందరు నిత్యం అతిధులుగా వెళ్లేవారు లీకులిస్తున్నారు. తమ ఫ్యాంటసీలకు గమ్యస్థానాలుగా ఆ ప్రదేశాలుంటాయని చెప్తున్నారు. భాగస్వాములను మార్చుకోవడం (స్వాపింగ్‌), బహు భాగస్వామ్యం (మల్టిపుల్‌ పార్టనర్‌ సెక్స్‌), విపరీత లైంగిక ప్రక్రియలు రేవ్‌ పార్టీలలో చాలా సహజమైన విషయాలని వివరిస్తున్నారు. గత వారం బెంగళూరు శివార్లలో జరిపిన దాడుల్లో దొరికిన 85 మంది అతిథులకు వైద్య పరీక్షలు జరిపినపుడు అందులో ప్రతిఒక్కరి రక్తనమూనాలలో ఎయిడ్స్‌తో పాటు మాదకద్రవ్యాలు ఉన్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్తాకథనం ప్రచురించింది.

పబ్‌లతోనే మొదలు

పబ్‌లకు వెళ్లి కాస్త మద్యం సేవించి, శరీరం అలసిపోయేంత వరకూ నృత్యాలు చేసుకుని వచ్చేయడం ఈరోజు సమాజంలో ఆక్షేపణీయం కాదు. పబ్బులకు పోవడం పెద్ద పట్టణాలలో ఒక తప్పనిసరి వీకెండ్‌ వెసులుబాటుగా మారింది. వారమంతా గొడ్డు చాకిరి చేసి వారాంతంలో కాస్త విశ్రాంతి తీసుకోవడానికి సామాజిక సమ్మతి (సోషల్‌ ఏక్సెప్టెన్స్‌) లభించింది. అక్కడే రేవ్‌ పార్టీల సంస్కృతికి బీజం పడుతోంది. మద్యం కంటే మరికాస్త మత్తెక్కించే భంగ్‌, గంజాయి, నల్లమందు లాంటి ప్రాథమిక స్థాయి మాదకద్రవ్యాలకు లభ్యస్థానాలు పబ్‌లేనని పోలీసులు గుర్తిస్తున్నారు. వాటి నుంచి నెమ్మదిగా ఛరస్‌, హెరాయిన్‌, మెతాంపెతామైన్‌ లాంటి కృత్తిమ నార్కొటిక్స్‌ వరకూ ఈ ప్రయాణం సాగుతుంది. నిజానికి దక్షిణ ఆఫ్రికా తదితర దేశాల నుంచి ఇరాన్‌ మీదుగా ఇండియా చేరుకుంటున్న ఈ మాదకద్రవ్యాల రవాణాపై మన దేశం ఉక్కుపాదం మోపుతోంది. కాని మన ప్రభుత్వాలు ఈ చీకటి మార్కెట్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయలేకపోతున్నాయి. వీటికి అలవాటుపడిన వారు వాటికోసం ఎంతకైనా తెగిస్తారు. నిజానికి మగ, ఆడ తేడా లేకుండా సెక్స్‌టాయ్స్‌గా ఈ రేవ్‌పార్టీలలో మారుతున్న చాలామంది డ్రగ్స్‌ బానిసలే. ఒకసారి డ్రగ్స్‌ ఉచ్చులో పడితే చాలా ప్రయత్నపూర్వకంగా మాత్రమే ఆ రొంపినుంచి బయటపడగలరు. దానికి రీహాబిటేషన్‌ సెంటర్లు చాలావరకు సహకరిస్తున్నాయి.

ఇలాంటి దుర్ఘటనలు బయటపడినప్పుడల్లా మాదకద్రవ్యాల వాడినవారిని నిందితులుగా కాకుండా, బాధితులుగా మన చట్టం గుర్తిస్తోంది. దాంతో వారికి ఒకట్రెండు రోజులు పోలీస్‌ కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నారు. డ్రగ్స్‌ వాడొద్దని హితవులు చెప్పి, విడిచి పెట్టేస్తున్నారు. ఆ పార్టీలలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న పెడ్లర్స్‌ను బంధించలేక పోతున్నారు. విచ్చలవిడిగా సరఫరా అవుతున్న మాదక ద్రవ్యాలను సేకరించలేకపోతున్నారు. రేవ్‌ పార్టీలు నిర్వహిస్తున్న నిర్వాహకులు దొరకకపోవడం వల్ల చాలాసార్లు పోలీసులు దాడులు చేసినా కేసు నమోదు చేయలేకపోతున్నారు. భవన యజమానులు సైతం ఈ నేరాల నుంచి సురక్షితంగా బయటపడుతున్నారు. చివరకు ఈ దేశంలో మన కళ్లెదురుగా జరుగుతున్న అనైతిక, అసాంఘిక కార్యకలాపాలను అటు పౌర సమాజంగాని, ఇటు పోలీసు వ్యవస్థగాని నియంత్రించ లేకపోతున్నాయి. మనమంతా ఇలాంటి దారుణమైన సామాజిక విపరిణామాలను చూసీచూడనట్లు, నాలుగు రోజుల ముచ్చట్ల స్థాయికి కుదించేస్తున్నాం. ఊరిచివర బంగాళాల్లో హడావిడి జరుగుతున్నప్పుడు ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇస్తేనే ఈ కాస్త దాడులైనా జరుగుతున్నాయి. పౌరసమాజం కఠినంగా ప్రతిస్పందిస్తేనే వీటిని కాస్తయినా నియంత్రించగలం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page