‘‘బురిడీబాబా దేవుడెలా అయ్యాడు?’’ అంటూ సత్యసాయిబాబాపై వార్తాకథనం సీరియల్‌గా ప్రచురిస్తే, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ డీజీపీ దొరకు చాలా కోపం వచ్చింది. ఆ కథనం ప్రచురించిన ‘విజయవిహారం’ పత్రికపై దాడి చేశారు. పోలీసులకు ఏమీ దొరక్క కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఆ దాడితో ‘విజయవిహారం’ పత్రిక రాష్ట్రమంతా పరిచయమైంది. వెలువడిన ప్రతి సంచికనూ ఒక విశేషమైన సంచికగా తీర్చిదిద్దడంలో ఆ పత్రిక సంపాదకుడు టి.వి.రమణమూర్తిది అనితరసాధ్యమైన శైలి. సమాజ రుగ్మతలు, అవినీతిపై విరుచుకుపడిన విజయవిహారం, అదే స్థాయిలో మానవత్వానికి పట్టం కట్టింది. ఏ స్థాయిలో మంచి జరిగినా నెత్తికెత్తుకుని ప్రపంచానికి చాటిచెప్పింది. మాసపత్రికలో పేజీకొక కోర్టు సమన్ అందుకున్న చరిత్ర ఆ పత్రికది. ఆ పత్రిక చదవకపోతే చెప్పలేం గానీ, చదివిన తర్వాత విడిచిపెట్టలేని ఒక అడిక్షన్‌ను అప్పటి పాఠకులకు అందజేసింది. మన ఆలోచనల ప్రపంచాన్ని తలకిందులు చేస్తూ.. కొత్త ఆలోచనలతో, సరికొత్త వాక్య విన్యాసాలతో, రెక్క విదుల్చుకుని వేకువ ఉదయించేట్టుగా ప్రతి సంచిక ఒక డైనమైట్‌లా పేలేది. ‘మార్పునకు పిడికిలి అడ్డు పెడుతున్న మార్క్సిస్టులు’ అంటూ కమ్యూనిస్టు పార్టీలపై వెలువరించిన వ్యాసం ఇప్పటికీ కమ్యూనిస్టుల చర్చల్లో నలుగుతుంటుంది. ‘రిటర్న్ ఆఫ్ వీరప్పన్’ అంటూ కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసిన మూడు రోజులకే రెడ్ సాండల్ స్మగ్లర్‌పై సమగ్ర కథనం ప్రచురించడం ఇంగ్లిష్ పాత్రికేయులను సైతం అబ్బురపరిచింది. పిడికెడు మంది సిబ్బందితో కొంచెం అటూఇటుగా 100 పేజీల సంచికను డైనమైట్‌లాగా దట్టించి అందించడం, అది కూడా నెలానెలా ఆ సాహసం చేయడం జర్నలిజంలో ఒక అద్భుతం.

నరసారావుపేటలో అప్పటి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మంత్రి కోడెల శివప్రసాద్ ఆసుపత్రిలో బాంబులు పేలడం ఒక కలకలం. ఆ కేసులో కోడెలకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ఈనాడు పత్రిక ప్రచురించింది. ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించే ఆ కథనాన్ని పల్లెత్తుమాట అనకుండా, ‘కోడెలా రాజీనామా చెయ్’ అంటూ నేరుగా కోడెలను ఛాలెంజ్ చేస్తూ ప్రచురించిన వార్తాకథనాన్ని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టలేకపోయింది. కోడెలపై నమోదైన కేసుల పుట్టను కదిపింది. ఎంవివిఎస్ మూర్తి విశాఖపట్నంలో గీతం ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం మొదలైనప్పుడే ‘ఈ ఎంపీ ల్యాండ్ గ్రాబర్’ అంటూ కొండను తొలుస్తున్న వైనాన్ని హెచ్చరించింది. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగినప్పుడు అటల్ బిహారి వాజ్‌పేయిని ‘ధృతరాష్ట్ర చక్రవర్తి’ అంటూ చేసిన విమర్శ తెలుగునాట పెను సంచలనం. ‘ఎన్‌కౌంటర్’ పత్రిక ఎడిటర్ దశరథరాం గురించి తెలియని విషయాలు ఎన్నో తెలియజెప్పి అతనిలోని మానవీయ పార్శ్వాన్ని పరిచయం చేసింది. ఎఎంజి తదితర చంద్రబాబునాయుడి అవినీతి భాగోతాలను సాక్ష్యాలతో మొదటిసారి బయటపెట్టింది ‘విజయవిహారమే’’.
వార్త పత్రికాధిపతి గిరిష్ సంఫీుకి తప్పక జవాబు చెప్పాల్సిన వంద ప్రశ్నలు సంధించగానే విజయవిహారం పత్రికపై కేసుల పరంపర మొదలైంది. విజయవిహారం ఆర్థిక మూలమైన జనహర్ష గ్రూప్ ఆఫ్ కంపెనీలపై నిఘా దృష్టిసారించి వేట సాగించారు. దాంతో విజయవిహారం పత్రిక ఆగిపోయింది. ఎడిటర్ రమణమూర్తి తొలి సంచిక నుంచి కులం పట్ల, మతం పట్ల తీసుకున్న వైఖరి క్రమంగా జైభారత్ సంస్థ ఏర్పాటుకు దారి తీసింది. తాను నమ్మిన సిద్ధాంత వ్యాప్తి దేశవ్యాప్తంగా జరిగేట్టు మహాసభలు మొదలుపెట్టింది. అయితే విజయవిహారం పత్రిక ఎడిటర్ రమణమూర్తి ఏమయ్యారు. ఎప్పుడు ఫోన్ చేసినా చిక్కటి నవ్వును మనసునిండా పువ్వులు పూయించేలా విరజిమ్మే రమణమూర్తి వివరాలు తెలియకుండా పోయాయి. రమణమూర్తి ఏం చేస్తున్నారని తెలుసుకుందామని ‘సత్యం’ ప్రయత్నించింది. విజయవిహారం అందించిన స్ఫూర్తితో తెలుగునేలపై ఎన్నో పరిశోధనాత్మక పత్రికలు ప్రారంభమయ్యాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిజాన్ని గొంతెత్తి నినదించాలని విజయవిహారం అందించిన ఆనాటి స్ఫూర్తి కార్చిచ్చుతో వెలుగులొంది విరాజిల్లుతున్న పత్రికలలో సిక్కోలుగడ్డపై ఉదయించిన ‘‘సత్యం’’ ఒకటి.
ప్రస్తుతం రమణమూర్తి ఖదిజ్ఞాసిగా మారారు. ఖదిజ్ఞాసి అంటే ఏమిటి? సన్యాసమా? హిమాలయాలకు వెళ్లారా? కాదు. సత్యాన్వేషిగా మారారు. నిత్యచలనస్ఫూర్తిగా నిలిచారు. యోగి జీవితం గడుపుతున్నారు. ఆయన ఆలోచనలు వినాలంటే యూట్యూబ్‌లో ఖదిజ్ఞాసి, విజయవిహారం రమణమూర్తి, జై భారత్ పేర్లతో సెర్చ్ చేయండి. ఆయన చేస్తున్న ప్రస్తుత కృషి గురించి మరో పాత్రికేయుడు గౌరవ్ మాటల్లో చదువుదాం.
తెలుగునేల మీద ‘జై భారత్’ ప్రభంజనం !!
కార్యోన్ముఖమే కర్తవ్యం - ఖదిజ్ఞాసి ఆశ్రమం!
విజయవిహారం పత్రిక ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జై భారత్ సంస్థ 2015 నుంచి తనదైన అన్వేషణా మార్గంలో చేస్తోన్న శోధనే, ‘ఖదిజ్ఞాసి పథం’. మతాలలోని అన్ని మానవీయ కోణాల్నీ, వాదాల్లోని విలువైన ఆదర్శాల్ని కలగలిపి ఒక ఉన్నతమైన జీవన విధానాన్ని రూపొందించుకుని, పాటించే వారే ఖదిజ్ఞాసులు!
హైదరాబాదులోని ఎల్‌బి నగర్‌లో ఖల్సా భవనం ఉంది. వ్యక్తి ఆంతరిక, బాహ్య తలాల్లో జరిపే సమగ్రమైన సంఘర్షణే జీవన సాఫల్యత అని ఖదిజ్ఞాసులు నమ్ముతారు. అందులో భాగంగా చేసే దీక్షలో అధ్యయనం, యోగాసనం, పుడక దహనం, శ్రమైక జీవనాల్ని నిబద్ధతతో అవలంబిస్తారు. ప్రవాహానికి ఎదురీది, చరిత్రని మలుపు తిప్పేవాడే ‘ఖదిజ్ఞాసి’! నిర్మోహత్వం, ద్వేషరాహిత్యం, సమదర్శిత్వం, కరుణ, నిరాడంబరత్వం, నిష్కామకర్మ, నిరంతర విప్లవం, సంయమిత్వం, శ్రమ, నిబద్ధత, దేహపటుత్వం, హేతుజిజ్ఞాస ఖదిజ్ఞాసుల 12 లక్షణాలు, లక్ష్యాలు. ఏకత్వ భావన దిశగా సమగ్ర పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం కోసం పనిచేసేవారే ఖదిజ్ఞాసులు. అన్వేషణకీ, ప్రశ్నలకీ ఫుల్‌స్టాప్ ఉండకూడదనే భావనతో భవిష్యత్తులో ఈ విలువలకి అదనంగా చేర్చే సంభావ్యతను ఊహించిన ఖదిజ్ఞాసులు, ఆనందమే జీవనసారమనీ, అదే మానవ లక్ష్యమనీ భావిస్తారు. ప్రకృతి పట్ల, సకల చరాచర జగత్తులోని ప్రాణుల పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరిస్తారు.
ఖల్సాపంథి, జిహాది, జ్ఞానాన్వేషి, సాహసి, సన్యాసి, సత్యోపాసి, సమదర్శి, ఏకదర్శి, హేతు జిజ్ఞాసి, జ్ఞానఖడ్గధారి, జ్ఞానాసి, కర్మయోగి, సూఫీ, ఫకీర్, క్రాంతికారీ వంటి ఎన్నెన్నో పద బంధాల్ని, భావనల్ని సమన్వయించుకుంటూ, స్ఫురింపజేస్తూ, ధ్వనింపచేస్తూ జై భారత్ విప్లవకారులు ‘ఖదిజ్ఞాసి’ అనే కొత్తపదం సృష్టించారు. ఒక్క తెలుగులోనే కాదు, దేశంలోనే విశిష్టమైన తాత్వికతతో దూసుకుపోతున్న ఖదిజ్ఞాసి పథం, 5 రాష్ట్రాల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు, అలాగే, సుమారు 15 రాష్ట్రాలతో వివిధ స్థాయిల్లో సత్సంబంధాలు కలిగి ఉంది. పదివేలకు పైచిలుకు సభ్యత్వం దిశగా ముందుకు సాగిపోతోంది. మిత్రులు, పెద్దలు ఖదిజ్ఞాసి ఆజాద్ షేక్ స్మృతి భవనంతో సహా, అద్వితీయమైన గ్రంథాలయం, సొంత సినిమా హాలు, విశాలమైన కాన్ఫరెన్స్ హాల్‌లతో నిత్యం పాతిక ముప్పై మంది ఉండే ప్రాంగణంతో మత సమైక్యతకి మాత్రమే కాదు, మానవాళి జీవన్ముక్తి వరకూ తనదైన శైలిలో భాష్యం చెప్పగల సత్తా గలది ఖదిజ్ఞాసి ఆశ్రమం. తెలుగులో కనీవినీ ఎరుగని మహా రచయిత చలం స్మృతి భవన్ నుండీ భారత ఉపఖండంలో సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ స్మృతిలో నిర్మించిన ఏకైక భవనం వరకూ అనేక ఉద్యమాల వెలుగులో ప్రవహించే జై భారత్‌ది అసంఖ్యాక స్ఫూర్తిదాతల పథ ప్రవాహం. ఎందరో విప్లవకారుల ఆశయ సమాహారం.
కులనిర్మూలన, స్త్రీపురుష సమానత, మత సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, విస్మృత యోధులపై రచనలు, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, ఒకటా రెండా విశ్లేషించడం మొదలెడితే జై భారత్‌ది సుదీర్ఘమైన చారిత్రక ప్రస్థానం. ఎవరికెన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా జైభారత్ తెలుగు నేలమీద చూపించిన శక్తిమంతమైన యువ ప్రభంజన ప్రభావాన్ని ఒప్పుకుని తీరాలి. అద్భుతమైన తాత్వికత దిశగా కొనసాగుతున్న ఖదిజ్ఞాసి పథం ఒక సమగ్రమైన స్వతంత్ర భావ విప్లవంగా భాసించి, భావితరాలకు మహోన్నత స్ఫూర్తిని అందిస్తుంది.
- గౌరవ్
Comments