వైజాగ్ గ్రోత్‌హబ్ గొడుగులో సిక్కోలు!
- DV RAMANA

- Apr 17
- 2 min read
విశాఖ ఆర్థిక మండలిపై నీతీ ఆయోగ్ నివేదిక
అందులో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలకు చోటు
జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, కార్యాచరణ
జీవీఎంసీ, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు
ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగానికి ప్రాధాన్యం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
ఇప్పటికే మూలపేట వద్ద సీపోర్టు, పలాస వద్ద కార్గో విమానాశ్రయంతో ప్రగతికి బాటలు వేసుకుంటున్న శ్రీకాకుళం జిల్లా మరింత అభివృద్ధి నోచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపాదిత వైజాగ్ గ్రోత్ హబ్ లేదా విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) పరిధిలో శ్రీకాకుళం జిల్లాను చేర్చాలని నీతీ ఆయోగ్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో సూచించింది. విశాఖ నగరం, శ్రీకాకుళంతోపాటు మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటినీ గ్రోత్ హబ్ గొడుగు కిందకు తీసుకొచ్చి అభివద్ధి చేయాలని సిఫారసు చేసింది. వైజాగ్ గ్రోత్ హబ్ ఇనీషియేటివ్ పేరుతో విశాఖ ఆర్థిక మండలిని ప్రపంచ ఆర్థిక హబ్ (గ్లోబల్ ఎకనమిక్ హబ్)గా అభివద్ధి చేసే అంశంపై రూపొందించిన ఈ నివేదికలో పలు అంశాలను నీతీ ఆయోగ్ ప్రస్తావించింది. విశాఖ నగరాన్ని కాన్సెప్ట్ బేస్డ్‌గా ఆయా రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేయాలని సూచించింది. కైలాసగిరి`భీమిలి మధ్య వైజాగ్ బే సిటీగా, అక్కడి నుంచి భోగపురం వరకు విస్తరించిన ప్రాంతాన్ని వైజాగ్ 2.0గా, గంభీరం సమీపంలో విద్యానగరం, భోగపురం సమీపంలో హెల్త్ హబ్‌లతోపాటు మధురవాడ, ఆనందపురం, కాపులుప్పాడ పరిసర ప్రాంతాల్లో ఐటీ క్లస్టర్‌లను అభివద్ధి చేయడంతోపాటు.. విశాఖ రీజియన్ పరిధిలోని ప్రత్యేక జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి చేయాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ప్రధానంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో విశాఖ ఆర్థిక మండలి పరిధిలో ప్రతిపాదిత అభివృ ద్ధి ప్రాజెక్టుల అమలు బాధ్యతను గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కి అప్పగించారు. దీనికి సంబంధించిన కార్యాచరణకు, పనులు పర్యవేక్షణకు ప్రత్యేక ంగా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు చేయాలంటూ దానికి ఒక కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేసే బాధ్యతను జీవీఎంసీ ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.
పెద్ద ముందడుగు
విశాఖపట్నం మహానగర(మెట్రోపాలిటన్) ప్రాంతాన్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాలను అంతర్జాతీయ ఆర్థిక జోన్‌గా తీర్చిదిద్దే ప్రతిపాదనల్లో ఇదో పెద్ద ముందడగు అని అధికారులు చెబుతున్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక కార్యక్రమం. దీని పరిధిలో విశాఖపట్నం నగరంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు సహా తొమ్మిది జిల్లాలు చేరనున్నాయి. ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)గా ఎంపికయ్యే సంస్థ ఈ గ్రోత్ హబ్ ప్రాంతాల్లో చేపట్టాల్సిన ప్రాజెక్టులు, చేయాల్సిన అభివృద్ధిపై ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలుగా వ్యవహరించే విశాఖ నగరపాలక సంస్థ, విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్లకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సలహాలు, నివేదికలు ఇస్తుంది. అవసరమైన సూచనలు చేస్తుంది. ఇప్పటికే ఉన్న ప్రణాళికలు, డేటాను సమీక్షించి తాజా లక్ష్యాలు, అవసరాలకు అనుగునంగా మార్పుచేర్పులు చేయడం, గృహనిర్మాణం, రవాణా, తాగునీరు, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్) నిర్వహణతోపాటు అవసరమైన సామాజిక, ఆర్థిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థలను గుర్తించి వాటికి వీఈఆర్‌లో చోటు కల్పిస్తారు. గ్రోత్ హబ్ అభివద్ధిలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం సాధిస్తూ తదనుగుణంగా ఓవరాల్ మాస్టర్ ప్లాన్లు, సెక్టార్ ప్లాన్లు, ప్రాంతాలవారీ అభివద్ధి వ్యూహాల తయారీకి కూడా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ సహకరిస్తుంది.
కలిసివచ్చే వ్యూహాత్మక స్థానం
తయారీ(మాన్యుఫాక్చరింగ్), లాజిస్టిక్స్, ఐటీ/ఐటీఈఎస్, పోర్టు ఆధారిత అభివృద్ధి, క్లీన్ ఎనర్జీ, నాలెడ్జ్ బేస్డ్ పరిశ్రమల్లో భారీ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేలా వీఈఆర్ లక్ష్యాలుగా ఉండేలా చూడాలని నీతీ ఆయోగ్ నివేదికలో పేర్కొన్నారు. ప్రతిపాదిత విశాఖ ఆర్థిక రీజియన్ వ్యూహాత్మకంగా చెన్నై-కోల్‌కతా పారిశ్రామిక కారిడార్‌లో ఉండటం, డీప్ సీపోర్టు ఉండటం, దీని పరిధిలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుండటం, విస్తత రైలు, రహదారి కనెక్టివిటీతోపాటు నైపుణ్యం కలిగిన మానవవనరుల లభ్యత వంటి అవకాశాలు, సౌలభ్యాలు గ్రోత్ హబ్‌ను బాగా కలిసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు. ప్రధాన సాంకేతిక సలహా విభాగంగా భావించబడుతున్న పీఎంయూ ప్రాజెక్టుకు సంబంధించిన అధ్యయనాల నుంచి వాటాదారుల భాగస్వామ్యం, విధాన రూపకల్పన, ఆర్థిక నిర్మాణం, పర్యవేక్షణ వరకు పూర్తిస్థాయి మద్దతును అందిస్తుంది. బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి మూడు నెలల్లో ఒక ప్రారంభ నివేదిక, పరిస్థితి విశ్లేషణ, ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకుపోవాల్సిన రీతి.. ఆ తర్వాత రంగాలవారీ మాస్టర్ ప్లాన్లను రూపొందించాల్సి ఉంటుంది. పీఎంఐఎస్ డాష్‌బోర్డ్ మద్దతుతో తుది ప్రాజెక్ట్ నివేదికను కూడా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ సమర్పించాల్సి ఉంటుందని నీతీ ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది.






Comments