
ఆ మధ్య పూణేలో పన్నెండేళ్ల విద్యార్థి రెంతస్తుల భవనం మీద నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. సెల్‌ఫోన్లో బ్లూవేల్ గేమ్ ఆడుతూ, ఛాలెంజ్‌లో భాగంగా పైనుంచి దూకేశాడు. మహారాష్ట్రలో పదమూ డేళ్ల బాలుడు ఎత్తయిన భూభాగం నుంచి లోయలోకి ఉరికాడు. హనుమాన్ చాలీసా పఠిస్తూ, దూకితే, గాల్లో ఎగరవచ్చునని అతడు భావించాడు. నీటి కొలనులో ఈత నేర్చుకుంటున్న ఇద్దరు పిల్లలు ఈత వచ్చులే అన్న ధీమాతో నది మధ్యలోకి వెళ్లి, ప్రమాదంలో చిక్కుకుపోయిన సంఘటన ఇటీవల తెలం గాణాలో జరిగింది. కథలకు, ఊహలకు, వాస్తవాలకు మధ్య ఉన్న తేడా గురించి పిల్లలకు స్పష్టంగా తెలి యాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి అవాంఛిత పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ప్రతిదీ నేర్చుకుంటారు. ఆ నేర్చుకోవడంలో కథలూ, ఊహలూ వాస్తవాన్ని అర్థం చేసుకోవటానికి దోహదపడాలి తప్ప- ఆ వాస్తవానికి విరుద్ధంగా ఉండకూడదు. అందువల్లనే చదువులో శాస్త్రీయ దృక్పథం ఉండాలి. ఏది నిజమో అదే పిల్లలకు తెలియాలి. ప్రకృతిలోని ప్రతి చర్య వెనుకా ఒక క్రమబద్ధమైన కారణం ఉంటుందని తెలియాలి. మహత్తుల వల్ల, నమ్మకాల వల్ల ఏదీ జరగదని తెలియ జెప్పాలి. ఎవరికి ఏ నమ్మకం ఉన్నా వారంతా వాస్తవంలోనే బతుకుతారు. శాస్త్రీయ దృక్పథం ఆధారంగా రూపొందిన వస్తు సముదాయపు సహకారంతోనే జీవిస్తారు. తమ నమ్మకాలను సైతం సైన్సు ఆధారంగా రూపొందిన పుస్తకాల ద్వారా, పత్రికల ద్వారా, మైకుల ద్వారా, ఇంటర్నెట్ ద్వారానే ప్రచారం చేసుకుం టారు. మానవ శ్రమ, మేథ తయారుచేసిన వస్తువులను మాత్రమే వారూ వాడతారు. అందుకు అతీత మైన, భిన్నమైన మహత్తు వస్తువులు, ప్రత్యామ్నాయ పద్ధతులూ వారి వద్ద ఉండవు. మరి దృశ్యం ఇంత స్పష్టంగా మన కళ్లకు కనపడుతున్నప్పుడు పిల్లలను అమోమయానికి గురి చేసే నమ్మకాల వైపు ఎందుకు మళ్లించాలి? పిల్లల్లో ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దానినే ‘విజ్ఞాన జిజ్ఞాస’ అంటారు. ఎందుకు? ఏమిటి? ఎలాగ? ఎప్పుడు? వంటి క్వశ్చన్లను పిల్లలు నిరంతరంగా సంధి స్తారు. వాటికి ఓపికగా జవాబులు చెబుతూ ఉంటే, మళ్లీ మళ్లీ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుం టారు. ఆ జవాబుల్లో సైన్సు ఉంటే, పిల్లలు శాస్త్రీయంగా ఆలోచిస్తారు. చాదస్తం నూరిపోస్తే అందుకు అనుగుణంగానే తయారవుతారు. మనుషులు తొలినుంచీ విజ్ఞాన జిజ్ఞాసతో ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టే- రాతియుగం నుంచి రాకెట్టు యుగం దాకా ప్రస్థానం సాగించారు. ‘‘ఇది ఇంతే! ఇదిలాగే ఉంటుంది.. ఎవరూ ప్రశ్నించకూడదు. ఎవరూ గొంతెత్తకూడదు.’’ అనుకుంటే- మనమింకా పురాతన కాలంలోనే ఉండేవాళ్లం. మిగతా జంతు సమూహాలన్నిటి కన్నా మనుషులు తెలివైన వారు కాబట్టి, మెదడు అభివృద్ధి చెందిన వారు కాబట్టి- ఆలోచించకుండా ఉండలేరు. చుట్టూ ఉన్న పరిస్థితులను పట్టించుకోకుండా ఉండలేరు. ప్రశ్నించకుండా, పరిష్కరించకుండా అసలే ఉండలేరు. అచేతనంగా ఉండలేని చైతన్యంలో నుంచే నూతన భావాలు, ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. పురాతన భావాలూ, పద్ధతులూ కాలగర్భంలో కలిసిపోతాయి. ఇది నిత్యం మన కళ్లముందు జరుగుతూనే ఉంది. పక్షుల వలె గాలిలో ఎగరాలని, చంద్రుడి మీదికి చేరాలని, చేపల వలె నీటిపై చరించాలని ఆదిమ కాలపు మనుషుల ఆశ. ఆ ఆశ ఆలం బనగానే అనేక ఊహలను, కథలను అల్లుకున్నారు. ఆధునిక కాలంలో కొందరు ఆ కలలను వాస్తవం లోకి తెచ్చే అనేక ప్రయత్నాలు చేశారు. పక్షుల వలె భుజాలకు రెక్కలను కట్టుకొని గాల్లో ఎగిరే ప్రయత్నం చేశారు. ఎందరో గాయపడ్డారు. కొందరు ప్రాణాలను సైతం కోల్పోయారు. మనిషి తనకు తానుగా ఎగరలేడని వందేళ్ల క్రితమే నిర్ధారణకు వచ్చారు. పక్షులు ఎగరటానికి, చేపలు ఈదటానికి ఏఏ ప్రత్యే కతలు అనుకూలిస్తున్నాయో అధ్యయనం చేశారు. ప్రతి చర్య వెనుకా, సామర్థ్యం వెనుకా ఒక ప్రత్యేకమైన సూత్రం ఉంటుందని కనుగొన్నారు. వాటి ఆధారంగా విమానాలను, ఓడలను నిర్మించుకున్నారు. సూత్ర బద్ధత అంటే సైన్సు. విమానం, రాకెట్టు, ఓడ, కారు, టూవీలరు, కుక్కరు, మిక్సీ, ట్యూబులైటు, టెలివి జన్, సెల్‌ఫోను.. ఇలాంటి సర్వ వస్తు సామగ్రి సైన్సు సూత్రాల ఆధారంగానే నడుస్తున్నాయి. ఆధునిక కాలంలో ఇంత దూరం వచ్చాక, పురాతన కాలంలోనే గొప్పగా ఉన్నామన్నట్టుగా ప్రచారం చేసుకోవటం ఆత్మవంచన అవుతుంది. ముఖ్యంగా రేపటి పౌరులుగా, సమాజ నిర్మాతలుగా ఎదగాల్సిన పిల్లల మనసు ల మీద ప్రతికూలంగా ప్రభావం పడుతుంది. పురాణ కథలను కథలుగానే పిల్లలకు పరిచయం చేయాలి. వాటినిండా అద్భుతాలు, అతీత శక్తులూ నిజంగానే ఉన్నట్టు నూరిపోయకూడదు.
Comentarios