`జిల్లా శాఖలోని సిబ్బందికి బెదిరింపులు

`పత్రికలకు సమాచారమిస్తే ఖబడ్దార్ అంటూ హూంకరింపులు
`తన హయాంలో ఎస్బీఐ లైఫ్ పాలసీలకే ప్రాధాన్యం
`బ్యాంకులో పని అవ్వాలంటే పాలసీ కట్టాల్సిందేనని ఒత్తిడి
`కమీషన్ల కక్కుర్తితో బ్యాంకుకు నష్టం చేకూరేలా వ్యవహారాలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం రీజనల్ మేనేజర్‌గా పని చేసి కాలంలో పలు శాఖల్లో జరిగిన కుంభకోణాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రస్తుతం గాలిలో ఉన్న టీఆర్‌ఎం రాజు ఆగడాలు ఇంకా కొనసాగుతున్నాయి. జిల్లాలోని ఎస్‌బీఐ బ్రాంచిల్లో పని చేస్తున్న సిబ్బందిని తన అనుచరులతో ఫోన్‌లో ఆయన బెదిరిస్తున్నట్టు ఎస్‌బీఐ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విశాఖపట్నం జోనల్ కార్యాలయంలో విచారణలో ఉన్న టీఆర్‌ఎం రాజు అక్కడే ఒక ఉద్యోగితో శ్రీకాకుళం జిల్లాలోని పలు బ్రాంచిల్లో పని చేస్తున్న సిబ్బందికి ఫోన్ చేయించి పత్రికల్లో వస్తున్న కథనాలను ప్రస్తావిస్తూ.. ఆ వివరాలు ఎవరు ఇస్తున్నారో ఆరా తీస్తున్నామని, బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా పత్రికలకు సమాచారమిస్తే చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపు కాల్స్ చేసినట్టు భోగట్టా.
జోనల్ కార్యాలయం పేరుతో
వాస్తవానికి ఎస్‌బీఐ ఆర్‌ఎం రాజు ఇక్కడి నుంచి వెళ్లిపోయినప్పుడు సిబ్బంది పండుగ చేసుకున్నారు. నగరంలోని ఓ బ్రాంచిలో అయితే ఏకంగా కేక్ కట్ చేసి సిబ్బంది పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఏ ఉద్దేశంతో బ్యాంకులు జాతీయీకరణ చేశారో దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి తన స్వప్రయోజనాల కోసం పాకులాడిన రాజు కింద పని చేయలేక అనేకమంది సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు. ఆ లెక్కన శ్రీకాకుళం రీజియన్ పరిధిలో టీఆర్‌ఎం రాజు బాధితులు ఎక్కువ మందే ఉన్నారు. తన హయాంలో జరిగిన కుంభకోణాలన్నీ ఒక్కొక్కటీ బయటపడుతుండటంతో విచారణలో ఉన్న తనపై పెద్ద కేసే నమోదవుతుందని భయపడిన రాజు సరికొత్త ఎత్తుగడకు తెరలేపారు. జోనల్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ ఒకరు శ్రీకాకుళంలో ఉన్న సిబ్బందిని రెండు రోజుల క్రితం భయపెట్టారట. ఇది పూర్తిగా రాజు నిర్వాకమేనని పలువురు చెబుతున్నారు. గార, నరసన్నపేట బ్రాంచిల వ్యవహారం వెలుగు చూసినప్పుడు కూడా ఆయన ఇటువంటి ఎత్తుగడలతోనే సూత్రధారులను తప్పించి పాత్రధారులను బలిచేశారని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఎస్‌బీఐలో ప్రొటోకాల్ ఉండదు. కానీ ఆర్‌ఎంగా రాజు పని చేసినప్పుడు లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి ఉన్నతాధికారుల ప్రొటోకాల్ చూస్తున్నానంటూ పట్టుచీరలు, ఖరీదైన బహుమతులు ఇచ్చి ప్రసన్నం చేసుకున్నారు. ఇప్పుడు ఈయన పని చేసిన రీజియన్ పరిధిలో జరిగిన కుంభకోణాలు వెలుగుచూస్తున్నా ఇంకా విచారణ పేరుతో జాప్యం చేస్తుండటానికి కారణం కాస్ట్‌లీ గిఫ్టులేనని తెలుస్తోంది.
పాలసీలు, కమీషన్లపైనే దృష్టి
గార బ్రాంచిలో తాకట్టు నగలు మాయమైనప్పుడు ఆ కేసు మొత్తాన్ని స్వప్నప్రియ మీదకు నెట్టేసి ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి ఎవరూ వెళ్లకుండా రాజు అడ్డుకున్నట్లు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. స్వప్న ఇంటికి వెళితే అసలు విషయాలు బయటపడతాయని భావించిన టీఆర్‌ఎం రాజు పోలీసు బూచీ చూపించి ఎస్‌బీఐ సిబ్బందిని అడ్డుకున్నట్టు చెబుతున్నారు. రాజు హయాంలో ఎస్‌బీఐని పూర్తిగా డబ్బున్నవారి సొంత బ్యాంకుగా మార్చేసి దాని ద్వారా వచ్చే కమీషన్‌తో స్టార్ హోటల్‌లో ఎంజాయ్ చేసేవారు. పేదవారికి, రైతులకు రుణాలివ్వడానికి స్వయంగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలోనే బ్యాంకర్ల సమావేశం జరిగితే, దానికి ఏరోజూ రాజు వెళ్లిన పాపాన పోలేదు. ఎంతసేపూ ఆయన కమీషన్లు ఇచ్చే ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల మీదే దృష్టి పెట్టారు. తాను పని చేసిన రెండేళ్లలోనే రూ.25.35 కోట్ల ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించారు. ఇందులో పెద్ద ఎత్తున కమీషన్లు రావడంతో పాటు స్టార్ హోటళ్లలో మందు పార్టీలు కూడా ఇస్తుండటంతో ఆ సేవలకే ఆయన పరిమితమైపోయారు. ఎస్‌బీఐ లైఫ్ పాలసీలు చేయించడానికి ప్రైవేటు ఏజెన్సీలు నానా తిప్పలు పడుతుంటాయి. ఒక కస్టమర్‌తో పదిసార్లు సంప్రదించి ఆ పాలసీ ఫీచర్స్ అన్నీ వివరించి ప్రీమియం కట్టిస్తుంటారు. కానీ బ్యాంకుకు వివిధ పనుల మీద వచ్చేవారికి పాలసీ కడితేనే వారికి అవసరమైన పని చేసి పెడతామని ఆర్‌ఎం షరతులు పెట్టి తన పరిధిలోని బ్రాంచిల ద్వారానే రూ.25.35 కోట్ల ఇన్సూరెన్స్ వ్యాపారం చేశారు. ఆర్‌ఎంతో పనుంది కాబట్టి, ఆయనేం చెప్పారు? అది మనకు ఉపయోగమా, లేదా అన్నది పక్కన పెట్టి అనేకమంది ఎస్‌బీఐ లైఫ్ పాలసీలు తీసుకున్నారు. నగరంలో పేరుమోసిన ఓ కంటి డాక్టరు సుమారు రూ.2 లక్షల ప్రీమియంతో ఓ పాలసీ తీసుకున్నారు. ఒక సంవత్సరం కడితే సరిపోతుందని ఆయన్ను మభ్యపెట్టి ప్రతి ఏడాది కట్టే విధంగా సంతకాలు చేయించుకున్నారు. తీరా ఆయన తన కుమార్తెను నామినీగా పేర్కొంటే రిలేషన్ కాలమ్ దగ్గర భార్యగా నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన ఎన్నిసార్లు దీన్ని మార్చాలని మొత్తుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆర్‌ఎంకు టార్గెట్ పూర్తయిందా? కమీషన్ జేబులో పడిరదా? అన్న తీరలో వ్యవహరించడంతో చాలామంది వేరే బ్యాంకుల వైపు మొగ్గు చూపుతున్నారు.
Comments