
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో తెలుగుదేశం సీనియర్లను కాదని ప్రకటించిన రెండు స్థానాల్లో ట్విస్ట్‌లు సగటు తెలుగు సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తున్నాయి. పాతపట్నం నుంచి కలమట రమణ, శ్రీకాకుళం నుంచి గుండ లక్ష్మీదేవిలకు హైదరాబాద్ రమ్మని చంద్రబాబు కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఆదివారం అక్కడకు వెళ్లిన ఈ రెండు గ్రూపులు చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత చంద్రబాబు వీరితో మాట్లాడుతారని తెలుస్తుంది. టిక్కెట్ విషయంలో పునరాలోచిస్తారా? లేదూ అంటే బుజ్జగించి పంపిస్తారా? అనే లెక్క తేలడంలేదు. ఆశావహులైతే తాము మళ్లీ టిక్కెట్ ప్రకటనతోనే జిల్లాలో అడుగు పెడతామని చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో సీనియర్లకు టిక్కెట్ దక్కని చోట్ల పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఎవరికైతే టిక్కెట్లు ప్రకటించిందో, వారితోనే ఎన్నికలకు వెళ్లడానికి నిర్ణయించుకుంది. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా చంద్రబాబు న్యాయం చేస్తారన్న నమ్మకంతో వీరంతా హైదరాబాద్ పయనమయ్యారు. సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతానికి చంద్రబాబు నివాసం వద్దే పాతపట్నం, శ్రీకాకుళం గ్రూపులు ఉన్నా సమావేశం మొదలవలేదు. తమకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటే వద్దని స్పష్టం చేయడానికి గుండ లక్ష్మీదేవి సిద్ధంగా ఉండగా, టిక్కెట్ లక్ష్మీదేవికే ఇవ్వాలని కోరుతూ ఆమె అనుచరులు సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని చంద్రబాబుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గుండ లక్ష్మీదేవికి టిక్కెట్ రాకపోతే రెడ్డి చిరంజీవులును ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దింపి గుండ వర్గీయులు మద్దతు తెలుపుతారని తెలుస్తుంది.
Comments