
నలభై ఏళ్ల క్రితం మాట. ఏడో తరగతిలో పబ్లిక్ పరీక్షలు ఉండేవి. అదొక వార్నింగ్ సిగ్నల్. అటుపై పది పరీక్షలు. సరిగా చదవని వాళ్లు ఫెయిల్ అయ్యేవారు. పదిలో తప్పించుకున్నా.. సరుకు లేనివారు ఇంటర్‌లో ఫెయిల్ అయ్యేవారు. ఇష్టపడి చదివేవారు, ప్రతిభ ఉన్నవారు మాత్రమే డిగ్రీ దాక చేరేవారు. డిగ్రీకి ఒక విలువ, గౌరవం. డిగ్రీ చదువంటే సొంతకాళ్లపై నిలబడి గౌరవంగా జీవించడానికి పాస్‌పోర్ట్.
ఇక తొంభై దశకంలో నూటికి అరవై, డెబ్భై మంది పది లేదా ఇంటర్‌లో ఫెయిల్ అయ్యేవారు. వారికి వాస్తవం తెలిసొచ్చేది. నిజాయితీ, కష్టపడడం లాంటి విలువలు తెలిసొచ్చేది. ఆలస్యంగానైనా చదువు విలువ తెలుసు కొన్నవారు కష్టపడి చదివి పది, ఇంటర్ పాస్ అయి ఉన్నత చదువులకు వెళ్లేవారు. డిగ్రీ పూర్తయ్యాక ఆ`సెట్ లాంటి పరీక్షలు రాసి యూనివర్సిటీల్లో పీజీలో జాయిన్ అయ్యేవారు. ఇంగ్లీష్ లిటరేచర్ లాంటి సబ్జెక్టులు చదివేవారు. డిగ్రీలో బోటనీ చదివి ఆసక్తికొద్దీ ఇంగ్లీష్, తెలుగు లిటరేచర్ చదివినవాళ్లు చాలామంది ఉన్నారు. వారందరూ ఇప్పుడు లెక్చరర్లు. అంతెందుకు పదిలో ఫెయిల్ అయ్యి, అటుపై ఐఏఎస్ సాధించినవారు కూడా వున్నారు. చిన్నప్పుడే దెబ్బ తగలడంతో ఐటీఐ లాంటి చదువు చదివినా బీహెచ్‌ఈఎల్ లాంటి సంస్థలో జాబ్ కొట్టేవారు. మరి కొంతమంది వారి వృత్తుల్లో స్థిరపడ్డారు. వృత్తి ఏదైనా కష్టపడి పని చేసేవారు.
ఇప్పుడు ఇది దిక్కుమాలిన కాలం. చదువుల మాయా ప్రపంచం. ఏడో క్లాస్ పరీక్షల్ని ఎత్తేసారు. ఇప్పుడు పదో తరగతి పరీక్షలంతా బోగస్ వ్యవహారం. ప్రపంచంలో ఇలాంటి విధానం ఎక్కడా ఉండదు. కంచె దగ్గరుండి మరీ చేను మేయిస్తుంది. మాస్ కాఫీయింగ్ కూడా రానివారు, ఆన్సర్ సీట్‌పై కనీసం ప్రశ్నలని అయిదారు సార్లు రాయడం రానివారు మాత్రమే పదిలో ఫెయిల్ అవుతారు. వారిని కూడా జూన్‌లోగా ఇంకో ఎగ్జామ్ పెట్టి పాస్ చేయించి ఇంటర్‌లో చేరేలా చేస్తారు. నిజాయితీగా పదో తరగతి పరీక్షలు జరిగితే ఉత్తీర్ణతా శాతం ముప్పై దాటదు. అలా జరిగితే మాలాంటి ఇంటర్ కళాశాలలు సగానికి పైగా మూసేసుకోవాల్సిందే.
పదో క్లాసులో మాస్ కాపీయింగ్‌లో పాసయిన చెత్త సరుకు కార్పొరేట్ జూనియర్ కాలేజీలో చేరుతుంది. ‘మావాడు కార్పొరేట్‌లో ఐఐటీ సెక్షన్‌లో ఉన్నాడు’ అని తల్లిదండ్రులు గొప్పలు చెప్పుకుంటారు. కైనెటిక్ ఎనర్జీ అనే పదాన్ని తప్పులు లేకుండా రాయడం రాదు. వాడికి శృతిదండం అంటే ఏంటో తెలియదు. వెర్నియర్ కాలిపర్స్ అనడం రాదు. వాడికి ఐఐటీ సీట్ వస్తుందని ఆ కార్పొరేట్‌వాడు చెప్పడం, దాన్ని వీళ్లు నమ్మడం, కిట్టి పార్టీలలో మందు పార్టీలలో గొప్పలు చెప్పుకోవడం, మరోవైపు ఇంటర్‌లో కొంతమంది ఫెయిల్. బట్టీ కొట్టి, అటుపై కాపీ కొట్టి, ఉదార మార్కుల స్కీమ్స్‌తో మిగతావారు పాస్. ఫెయిల్ అయినవాడు సప్లిమెంట్‌లో పాస్ అవుతాడు.
ఐఐటీలో సీట్ కొట్టేవాడు ఎవడో కార్పొరేట్ వాడికి ముందుగానే తెలుసు. వారికి సీవో బ్యాచ్ కోచింగ్. మిగతా వారికి జనరల్ బ్యాచ్‌లో.. ఇంటర్మీడియట్‌లో ఇంగ్లీష్ తప్పులు లేకుండా రాయడం కూడా రాని లక్షలాది మంది. చదువు ‘కొన్న’ నిరక్షరాస్యులు ఇంటర్ సర్టిఫికెట్ పట్టుకొని ఉన్నత విద్య కోసం తయరైపోతారు. ‘‘అమ్మ నాన్న దగ్గర డబ్బుంది.. నాకు మంచి కాలేజ్‌లో సీట్ గ్యారెంటీ’’ అని వారికి తెలుసు. డాబుసరి పేరెంట్స్.. డబ్బు లేకపోయినా పొలం పుట్రా అమ్మేయాలి. తప్పదు!!
‘‘మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు?’’ అని పక్కింటివాళ్లు, పై ఇంటి వాళ్లు ప్రాణాలు తోడేస్తారు. కడుపు చించుకొంటే కాళ్లపై పడుతుంది. బిల్డప్ ఇక్కడ తప్పదు. సరిగ్గా ఇలాంటి పొట్ట పొడిస్తే అక్షరం రాని వారి కోసమే గత ఇరవై ఏళ్లగా దేశవ్యాప్తంగా అనేక ఇంజినీరింగ్ కళాశాలలు, స్టార్ హోటల్స్‌ను తలపించే ప్రైవేట్ యూనివర్సిటీలు వెలిసాయి. తాజ్ హోటల్, గ్రాండ్ కాకతీయ హోటల్స్ లెవెల్‌లో వీరి బిల్డింగ్‌లుంటాయి. పేరు గొప్ప యూనివర్సిటీలు, ఇమేజ్ బిల్డ్‌అప్ కోసం ప్రైవేట్ యూనివర్సిటీ వాడు వీవీఐపీలను తెస్తుంటాడు. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు పండగ. రామోజీ ఫిలింసిటీని మరిపించేలా సెట్టింగ్స్ వేసి హంగామా చేస్తారు. మావాడు ఫలానా కాలేజీ, యూనివర్సిటీ అని డాబుసరి పేరెంట్స్ గొప్పలు. పొట్ట పొడిస్తే అక్షరం రాని సుంటకు డబ్బు కట్టి సీట్ ఇప్పించామని వాళ్లకు తెలుసు. ఆ మాటకొస్తే అందరికీ తెలుసు. ఎవడూ మాట్లాడడు.
రాజు గారి దేవతా వస్త్రాల సీక్వెల్ స్టోరీ. అక్కడ ఒకటో, అయిదు శాతం ఫ్యాకల్టీ మాత్రమే చదువు చెప్పే ప్రతిభ కలిగుంటారు. 10 శాతం విద్యార్థులు చదువుపై ఫోకస్ పెడితే ఎక్కువ. మిగతా వారికి చదువు అలవాటు ఎప్పుడో ఆరో తరగతిలోనే తప్పింది. ఇప్పుడు ఎలా చదవగలరు? అసలు అంత అవసరం ఏమొచ్చింది? తల్లిదండ్రుల దగ్గర సంపాదించిన డబ్బు ఉందని వారికి తెలుసు.. ‘చేరింది క్లబ్ లాంటి విద్య సంస్థలో.. బయటే అదొక విద్యాసంస్థ.. లోన జరిగేది వేరు..’ ఏదోలా చేతికి డిగ్రీ సర్టిఫికెట్ వచ్చిన దగ్గర్నుంచి.. ‘మీ వాడికి జాబ్ వచ్చిందా? ప్యాకెజీ ఎంత??’ అని పొడుచుకొని తినే పక్కింటి, పైఇంటి వాళ్లు ఎలాగూ ఉన్నారు. డొల్ల డొక్కు సర్టిఫికెట్‌తో ఉద్యోగం ఎవడిస్తాడు? ఎవరిదీ పాపం? తొలి విలన్ ఎవరు..?
(మావాడు మెయిన్స్‌లో దెబ్బేశాడనుకుని ఓ తండ్రి తీవ్ర ఆవేదన పడి షుగర్ టెస్ట్‌కి వెళ్లాక రాసిన వ్యాసం)
వాసిరెడ్డి అమర్నాధ్
Commentaires