top of page

వీడియోలపై వణుకు

Writer: NVS PRASADNVS PRASAD
  • విజయనగరంలో సెర్చింగ్‌

  • పోలీసులు, మాజీ ఆర్మీ ఉద్యోగులకూ వాటా

  • హాస్టల్‌లో నిండుకున్న బియ్యం

  • ఆకలితో మాడిపోతున్న విద్యార్థులు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
హాస్టల్‌ నుంచి హార్డ్‌డిస్క్‌, పెన్‌డ్రైవ్‌ల స్వాధీనానికి వచ్చిన వన్‌టౌన్‌ పోలీసులు
హాస్టల్‌ నుంచి హార్డ్‌డిస్క్‌, పెన్‌డ్రైవ్‌ల స్వాధీనానికి వచ్చిన వన్‌టౌన్‌ పోలీసులు

ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ పేరుతో ఆ సంస్థ వ్యవస్థాపకుడు చేసిన అరాచకాలకు సంబంధించిన మరిన్ని వీడియోలు విడుదల కానున్నాయని తేలడంతో దీనిని ఎవరు బయటపెడుతున్నారన్న కోణంలో ప్రస్తుతానికి పోలీసులు వెతుకుతున్నారు. సంబంధిత వ్యక్తులు దొరికితే మరిన్ని వ్యవహారాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు మాజీ ఆర్మీ అధికారుల సంఘం కూడా విజయనగరంలో ఈ వీడియోల కోసం గాలిస్తున్నట్టు భోగట్టా. శ్రీకాకుళం ఆర్మీ కేంటీన్‌కు బ్రిగేడియర్‌ స్థాయి అధికారి రావడంతో ఆయన దృష్టిలో కూడా జిల్లా మాజీ సైనికోద్యోగుల సంఘం ప్రతినిధులు ఈ అంశాన్ని పెట్టారు. ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ వ్యవస్థాపకుడు రమణ రాసలీలలు ఉన్నాయని కొందరంటుంటే, లేదు బాలికలను కూడా రాచిరంపాన పెడుతున్న వీడియోలు మాత్రమే ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు. ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తామని తమను మోసం చేశాడంటూ బాధితులు జిల్లా ఎస్పీని కలవకపోయుంటే ఈమేరకు వీడియోలు రిలీజైవుండేవని, ఇప్పుడు డబ్బులు తీసుకొని ఫేక్‌ అడ్మిషన్లు చూపించి బీవీ రమణ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడం వల్ల కేసు ఎలాగూ బలపడిరది కాబట్టి భవిష్యత్తులో రమణ చేతిలో దెబ్బలు తిన్న యువకులు సాక్ష్యం చెప్పే సమయానికి చేతులెత్తేసినా రమణకు శిక్ష తప్పదని తేలడంతో ఈ వీడియోలను బయటపెట్టలేదని భావిస్తున్నారు. మరిన్ని వీడియోలు బయటకు వచ్చి మొత్తం పోలీస్‌ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని భావిస్తున్న ఆ శాఖ ఇందుకు సంబంధించి ఇప్పుడు అలెర్ట్‌ అయింది. స్థానిక దీపామహల్‌ వెనుక శ్రీనివాసనగర్‌ కాలనీలో ఉన్న ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ మహిళా హాస్టల్‌లో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్‌ డిస్క్‌, 4 పెన్‌డ్రైవ్‌లు వన్‌టౌన్‌ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి వీటిని బయటకు తీసుకువచ్చి నేరుగా పోలీస్‌ బాస్‌కే ఇవ్వాలని ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితులు భావించారు. ఈలోగా వన్‌టౌన్‌ పోలీసులు అక్కడికి వచ్చి ఇలా చేస్తే మరో పోలీస్‌ కేసు అవుతుందని బెదిరించి వాటిని స్వాధీనం చేసుకుని వెళ్లిపోయారు. అయితే బీవీ రమణ, అక్కడ ఏవోగా పని చేస్తున్న ల్యాప్‌టాప్‌లను మాత్రం ఇంతవరకు పోలీసులు స్వాధీనం చేసుకోలేదని తెలుస్తుంది. అందులోనే రమణకు ఎవరితో సంబంధాలున్నాయి? ఎవరు ఇందులో పెట్టుబడులు పెట్టారు? అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేస్తున్నదెవరు? ఎవరి దగ్గర ఎంత నొక్కేశాడన్న వివరాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇది కాకుండా హాస్టల్‌లో ఫుడ్‌ లేదనో, ఉద్యోగాలు రావడంలేదనో ప్రశ్నించినవారిని భయపెట్టడం కోసం రమణ కొందర్ని చితకబాది స్వయంగా తానే ఆ వీడియోలు తీయించి విద్యార్థులకు చూపించిన ఫుటేజ్‌ కూడా ఆ ల్యాప్‌టాప్‌లలో ఉన్నట్టు వినికిడి. ఇదిలా ఉండగా, రెండు రోజులుగా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకుపోతున్నారు. ఎవరికైతే ఇల్లు గడవడం కష్టంగా ఉందో వారు మాత్రం చావోరేవో ఇక్కడేనని వదిలేశారు. ఆర్మీకాలింగ్‌ హాస్టల్‌లో ఉన్న బియ్యం నిల్వలు మంగళవారంతో పూర్తయిపోయినట్లు తెలుస్తుంది. బుధవారం నుంచి విద్యార్థులు పస్తులతో ఉన్నారని భోగట్టా. దీనిపై అధికారులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి భోజనాలు ఏర్పాటుచేయాలన్న వాదన కూడా వినిపిస్తుంది. ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ రమణ మాటలు నమ్మి డబ్బులిచ్చినవారిలో పోలీసులు, మాజీ ఆర్మీ ఉద్యోగులు కూడా ఉన్నారు. మాజీ ఆర్మీ అధికారి ఇక్కడకు వచ్చిన తర్వాత ఇక్కడ మాజీ ఆర్మీ ఉద్యోగులు ఇద్దరు, అప్పుడు అడిషనల్‌ ఎస్పీ స్థాయిలో ఉన్నవారు ఇద్దరు రమణకు సన్మానం చేసి ఆకాశానికి ఎత్తేయడంతో అప్పుడు ఎస్‌ఐలుగా పని చేసిన ఇద్దరు ఇందులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేశారు. ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకుంటే ఈ వివరాలు బయటపడతాయి. ఒక సంస్థలో పెట్టుబడులు పెట్టడం తప్పు కాకపోవచ్చు. కానీ ఆ సంస్థ మీద ఫిర్యాదులు వచ్చినప్పుడు బాధితుల్నే బెదిరించడం మాత్రం తప్పు. ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ రమణకు అప్పనంగా భూమి కట్టబెట్టేందుకు శ్రీకాకుళంలో పని చేసిన అనేకమంది కలెక్టర్ల వద్దకు ఒక జర్నలిస్ట్‌ నాయకుడు పట్టుకెళ్లి పబ్బం గడుపుకున్నాడని భోగట్టా.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page