వైద్యఆరోగ్యశాఖలో సామూహిక బదిలీలు
- NVS PRASAD

- Mar 16
- 2 min read
రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సిందేనని ఆదేశించిన ఎస్టీ కమిషన్
కడప ట్రైనింగ్ స్కూల్ వ్యవహారాన్ని మండలిలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ
జిల్లా కేంద్రంలో 45 మంది ఉద్యోగులకు తప్పని స్థానచలనం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో సామూహిక బదిలీలకు రంగం సిద్ధమైంది. డీఎంహెచ్‌వో పరిధిలో బదిలీలు, డెప్యుటేషన్లకు అవకాశం ఉన్న ప్రతీ ఉద్యోగిని జిల్లా కార్యాలయం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు సోమవారం సాయంత్రం జారీ కానున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో దాదాపు 45 మంది ఉద్యోగులకు ఒకేసారి బదిలీ కావడం ఇదే తొలిసారి. సాధారణ బదిలీలు జరిగినప్ప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఉద్యోగుల బదిలీ జరగదు. ఏళ్ల తరబడి రాజకీయ సిఫార్సులతో ఇక్కడ కొనసాగుతున్న ఉద్యోగులకు జీతంతో పాటు గీతం కూడా గట్టిగా కిడుతుండటంతో ఇక్కడి నుంచి ససేమిరా అంటారు. తాము అక్రమంగా సంపాదించిన దానిలో కొంతమేరకు ఖర్చుచేసి ఇక్కడే కొనసాగుతుంటారు. అటువంటిది ఇప్ప్పుడు 45 మందిని నిర్మొహమాటంగా బదిలీ చేయాల్సి వచ్చింది.

ఇటీవల జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. డీఎంహెచ్‌వోగా ఎవరు పని చేసినా.. ఇక్కడి సిబ్బందిదే పైచేయి. అందుకే వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఎటువంటి పోస్టింగులకు నోటిఫికేషన్ వేసినా, ఇందులో కనీస పద్ధతులు పాటించరు. ఇప్ప్పుడదే వారి పీకల మీదకు వచ్చింది. గత ఏడాది ఏఎనఎం పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వంద పోస్టులకు ఆరు పోస్టులు ఎస్టీ అభ్యర్థులకు కేటాయించాలి. అలా కాకుండా డబ్బులెవరిచ్చారో వారికి మాత్రమే పోస్టింగ్ ఇచ్చారని, రోస్టర్ విధానాన్ని తుంగలో తొక్కారంటూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి కొద్ది కాలం క్రితం జాతీయ ఎస్టీ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కలెక్టర్ కూడా సమాధానం చెప్పాల్సిరావడంతో డీఎంహెచ్‌వో దీనంతటికీ కారణం సిబ్బందేనంటూ తప్పించుకున్నారు. తాజాగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సిందేనని, ఇచ్చిన ఉద్యోగాల్లో ఎవర్ని పీకేస్తారో తమకు అనవసరమని, 6 శాతం రిజర్వేషన్ ఎస్టీలకు ఇవ్వాల్సిందేనంటూ సోమవారం ఎస్టీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏఎనఎంల మెరిట్ జాబితా తయారుచేసినవారి దగ్గర్నుంచి సర్టిఫికెట్ల వెర్ఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూసిన సూపరింటెండెంట్ల వరకు అందర్నీ బదిలీ చేయాలంటూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శుక్రవారం ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో డాక్టర్లుగా పని చేస్తూ, పోస్టుగ్రాడ్యుయేషన్‌లో సీట్లు సంపాదించిన 21 మందిని రిలీవ్ చేయడానికి సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు సొమ్ములు వసూలు చేశారు. ఇది వైద్యఆరోగ్యశాఖ పుట్టినప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియే. ఎప్ప్పుడైతే ఎస్టీ కమిషన్ చీవాట్లు పెట్టిందో, మొత్తం కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని కలెక్టర్ నిర్ణయించుకున్నారు. అలాగే శ్రీకాకుళం డీఎంహెచ్‌వో పరిధిలో ట్రైనింగ్ స్కూల్ ఒకటుంది. ఎప్పట్నుంచో ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం మానేసింది. అయినా ట్రైనింగ్ స్కూల్ పేరుతో 12 మంది ఇక్కడ పని చేస్తున్నారు. కడపలో కూడా ఇటువంటి ట్రైనింగ్ స్కూల్ మీదే అక్కడి ఎమ్మెల్సీ శాసనమండలిలో ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీకాకుళం ట్రైనింగ్ స్కూల్‌లో ఏం జరుగుతుందని ఆరా తీయడంతో, ఈ 12 మంది వేర్వేరు విభాగాల్లో ఇప్పటికే సర్దుకుపోయారని తేలింది. దీంతో వీరిని కూడా బదిలీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అటెండర్ దగ్గర్నుంచి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వరకు మొత్తం 25 మందికి పైబడి ఇప్ప్పుడు బదిలీ వేటుకు గురయ్యారు.. వీరికి అదనంగా 12 మంది ట్రైనింగ్ స్కూల్ సిబ్బంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో డెప్యుటేషన్ మీద పని చేస్తున్నవారు ఎక్కువమందే ఉన్నారు. వీరు వారి సొంత స్థానానికి వెళ్లిపోగా, పూర్తిస్థాయి బదిలీలు ఎంతమందికి జరుగుతాయనేది ఇంకా తేలలేదు. ప్రస్తుతానికి శ్రీకాకుళం హెడ్‌క్వార్టర్‌కు దగ్గర్లో ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయించుకొని, ఆ తర్వాత నెమ్మదిగా మళ్లీ ఇక్కడికే చేరడానికి వీలుగా ఉత్తర్వులు జారీ అవుతున్నాయని తెలుస్తుంది.






Comments