top of page

వైద్యుల వంకర బుద్ధి..అనర్హులకు వైకల్య సిద్ధి!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Aug 23, 2024
  • 3 min read
  • బ్రోకర్ల ప్రమేయంతో సదరం పత్రాల జారీ

  • పత్రాలు ఇచ్చేది.. వెరిఫికేషన్‌ చేసేదీ వారే

  • 20న జరిపిన నిజనిర్ధారణ పరీక్షల్లోనూ అక్రమాలు

  • విశాఖకు పంపించి పరీక్షలు చేయించాలని డిమాండ్‌

దరఖాస్తుదారులకు అసలు వైక్యలం ఉందా లేదా? ఉంటే.. ప్రభుత్వ రాయితీలు పొందేంత అర్హత ప్రమాణాల మేరకు ఉందా? అనేది నిర్ధారించి వైకల్య సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వ వైద్యులదే. సదరం కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుదారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అర్హతను నిర్థారిస్తూ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు జిల్లాస్థాయిలో ఒక మెడికల్‌ బోర్డు ఉంటుంది. అయితే వైకల్యాన్ని నిర్థారించాల్సిన వైద్యులే వంకరబుద్ధితో వ్యవహరిస్తుండటంతో జిల్లాలో పెద్దసంఖ్యలో అనర్హులు సదరం సర్టిఫికెట్లు పుట్టించి ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, ఉద్యోగాలను అప్పనంగా కొట్టేసి దర్జాగా అనుభవిస్తున్నారు. ఈ విషయంలో బ్రోకర్లు కూడా జిల్లావ్యాప్తంగా పని చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు అటు వైద్యులు, ఇటు దరఖాస్తుదారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేలా ఒప్పందాలు కుదిర్చి వైకల్యం లేనివారికి.. ఉన్నా అర్హత ప్రమాణాలు లేనివారికి కూడా వైకల్య సర్టిఫికెట్లు జారీ చేయించేస్తున్నారని స్పష్టమవుతోంది. ఇటువంటి ఉదంతాలు తరచూ ఫిర్యాదుల రూపంలో వెలుగులోకి వస్తున్నా జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

సదరం ద్వారా తప్పుడు ధ్రువపత్రాలు పొంది వికలాంగ పింఛన్లు, ఇతర ప్రభుత్వ రాయితీల అందుకుంటున్న ఉదంతాలు పుంఖానుపుంఖాలుగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌, పొందూరు మండలం ధర్మవరం గ్రామాలకు చెందిన కొన్ని కేసులు ఇప్పటికే నలుగుతుండగా.. తాజాగా ఆ జాబితాలో జలుమూరు మండలం సైరిగాం గ్రామం కూడా చేరింది. ఈ మూడు గ్రామాలకు చెందిన 61 మందికి నోటీసులు జారీ చేసి ఈ నెల 20న వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో పదిమంది నిర్ధారణ పరీక్షలకు హాజరుకాలేదు. హాజరైనవారిలో 26 మందిని అర్హులుగా, 18 మందిని అనర్హులుగా గుర్తించారు. మరో ఏడుగురికి బేరా టెస్ట్‌(వినికిడి సమస్యకు సంబంధించి మరింత అడ్వాన్స్‌డ్‌ పరీక్ష) చేయించాలని రిఫర్‌ చేశారు. సైరిగాంలో 33 మందిపై ఫిర్యాదులు అందగా వారిలో ఏడుగురు గైర్హాజరయ్యారు. పరీక్షలు చేయించుకున్నవారిలో 16 మంది అర్హులుగా, ఐదుగురిని అనర్హులుగా గుర్తించారు. మరో ఐదుగురిని బేరా టెస్ట్‌కు రిఫర్‌ చేశారు. ఇబ్రహీంబాద్‌కు సంబంధించి వైకాపా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న 11 మందిలో ముగ్గురు గైర్హాజరు కాగా ఆరుగురిని అనర్హులుగా గుర్తించారు. ఇద్దరి వైకల్యాన్ని మాత్రమే పూర్తిస్థాయిలో నిర్ధారించారు. అదే గ్రామానికి చెందిన ఎన్డీయే కూటమి ఇచ్చిన ఫిర్యాదులోని ఎనిమిది మందిలో ఇద్దరు అనర్హులని తేలారు. ఒకరు గైర్హాజరయ్యారు. అయితే నిజనిర్ధారణలో వైద్యులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇబ్రహీంబాద్‌కు చెందిన మొత్తం 19 మందికి వైద్య పరీక్షలకు రావాలని నోటీసులు ఇచ్చారు. వీరిలో తొమ్మిదిమంది రణస్థలం సీహెచ్‌సీలో సదరం ద్రువపత్రాలు పొందినవారు కాగా నలుగురు రిమ్స్‌ నుంచి, ఆరుగురు పాలకొండ, టెక్కలి, నరసన్నపేట, ఏలూరు తదితర ఆస్పత్రుల్లో ధ్రువపత్రాలు పొందారు. ఇప్పుడు ఆర్హత సాదించిన వారంతా రిమ్స్‌లో సదరం చేయించుకున్నవారే కావడం విశేషం.

మెడికల్‌ బోర్డు స్థాయిలోనూ ఒప్పందాలు

జిల్లాలో ఎక్కడ సదరం పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్లు పొందినా వాటికి రిమ్స్‌ మెడికల్‌ బోర్డు అనుమతి తప్పనసరి. ఈ సర్టిఫికేట్‌ రద్దు చేయాలన్నా అదే మెడికల్‌ బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మెడికల్‌ బోర్డులో సభ్యులుగా ఎవరు ఉండాలన్నది రిమ్స్‌ సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంవో నిర్ణయిస్తారు. బోర్డు సభ్యులు ఎప్పటికప్పుడు మారుతుంటారు. సదరం వైద్య పరీక్షలు నిర్వహించే వైద్యులను ఆ బోర్డులోకి తీసుకోకూడదు. కానీ ఈ నిబంధన చాలా సందర్భాల్లో అమలు కావడంలేదు. ఎందుకంటే సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు రిమ్స్‌లోనూ పనిచేసినవారే. జిల్లాలో సదరం ధ్రువపత్రాలు జారీ చేసే రణస్థలం, నరసన్నపేట, పలాస తదితర సీహెచ్‌సీల్లో వైద్యులుగా పనిచేసి రిమ్స్‌కు బదిలీపై వచ్చినవారూ ఉన్నారు. ఇబ్రహీంబాద్‌లో తొమ్మిదిమంది 2022లో రణస్థలం సీహెచ్‌సీ నుంచే సదరం పత్రాలు పొందారు. వీటిని డాక్టర్‌ రవికిరణ్‌ పేరుతో జారీ చేశారు. కాగా ఈ తొమ్మిదిమందికి ఈ నెల 20న రిమ్స్‌లో నిజనిర్ధారణ పరీక్షలు చేసిన మెడికల్‌ బోర్డులో డాక్టర్‌ రవికిరణ్‌ ఉన్నారు. దీనిపై అభ్యంతరాలు రావడంతో అయన్ని తొలగించారు. మెడికల్‌ బోర్డుకు ఆర్థోపెడిక్‌ విభాగం హెచ్‌వోడీ నేతృత్వం వహించారు. నోటీసులు అందుకున్న 61మందికి వైద్య పరీక్షలు నిర్వహంచే మందు హెచ్‌వోడీ బోర్డులోని ఇతర వైద్యులతో సమావేశమై రణస్థలం సీహెచ్‌సీ నుంచి జారీఅయిన సదరం పత్రాలపై అభ్యంతరాలు తెలుపవద్దని సూచించినట్టు తెలిసింది. ఆ మేరకు డాక్టర్‌ రవికిరణ్‌ జారీ చేసిన ఆ పత్రాలు కలిగిన వారిని ఆర్హులుగా గుర్తించి పంపించేశారని తెలిసింది. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో హెచ్‌వోడీని రిమ్స్‌ ఉన్నతాధికారులు పిలిపించి వివరణ కోరినట్టు తెలిసింది. అనంతరం ఆ తొమ్మిదిమందిని అనర్హుల జాబితాలో చేర్చారు.

అసమగ్రంగా నివేదికలు

 నిజనిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత పూర్తి సమాచారం ఇవ్వడానికి మెడికల్‌ బోర్డు అధికారులకు రెండు రోజులు పట్టింది. వారిచ్చిన సమాచారం కూడా సమగ్రంగా లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పరీక్షలు చేయించుకున్న కొందరి వివరాల నమోదులో గోప్యత పాటించారు. 11 మంది ఏ మండలానికి, గ్రామానికి చెందినవారన్న వివరాలు కూడా ఇవ్వలేదు. 15 మంది చెందిన సదరం ఐడీలను నమోదు చేయకుండా వైకల్య శాతాన్ని మాత్రమే నమోదు చేశారు. 11 మంది విషయంలో సదరం ఐడీలతోపాటు గతంలో ఎంత వైకల్య శాతం పేర్కొన్నారో నమోదు చేయకుండా తాజా పరీక్షల్లో గుర్తించిన వైకల్య శాతాన్నే నమోదు చేశారు. బేరా టెస్ట్‌కు రిఫర్‌ చేసిన ఏడుగురికి గతంలో ఇచ్చిన వైకల్య శాతాన్ని ప్రస్తావించకుండా తాజాగా నిర్వహించిన పరీక్షల్లో గుర్తించిన వైకల్యశాతాన్నే నమోదు చేశారు. వైద్య పరీక్షల నివేదికలోనే ఇన్ని తేడాలుంటే అసలు నిజనిర్ధారణ పరీక్షలు ఎలా జరిపి ఉంటారోనన్న అనుమానాలు పెరుగుతున్నాయి.

మళ్లీ ఫిర్యాదులకు సిద్ధం

ఇబ్రహీంబాద్‌తో పాటు సైరిగాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, ఫిర్యాదు చేసినవారందరూ ఆయా గ్రామాలకు చెందినవారే. తమ గ్రామాల్లో ఎవరు వైకల్యంతో బాధపడుతున్నారో స్థానికులకు తెలియకుండా ఉండదు. వీరంతా 2022 తర్వాతే వికలాంగులుగా సదరం ధ్రువపత్రాలు పొందడం గమనార్హం. ఆరోపణలున్న 61 మందిలో 26 మందిని అర్హులుగా నిర్ధారించడంపైనా జాతీయ దివ్యాంగుల సంఘం జిల్లా ప్రతినిధులు ఆనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వైద్యులపైనా ఫిర్యాదు చేయనున్నట్టు చెబుతున్నారు. డాక్టర్లే బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ వైకల్యం లేనివారికి సదరం పత్రాలు మంజూరు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అర్హులుగా నిర్ధారారించిన 26 మందిని విశాఖపట్నం తరలించి పరీక్షలు నిర్వహస్తే వైద్యుల బండారం బయట పడుతుందని అంటున్నారు. కాగా ఇబ్రహీంబాద్‌లో మరో నలుగురు సదరం పత్రాలతో పింఛన్లు పొందుతున్నారు. వీరిలో సీపాన నాగరాజు అనే తాపీ మేస్త్రీకి గ్రహణంమొర్రి ఉందంటూ సదరం పత్రం ఇచ్చారని ఆరోపిస్తున్నారు. 61 మందికి నోటీసులు ఇస్తే 51 మందే పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 26 మందికి క్లీన్‌చీట్‌ ఇవ్వగా ఏడుగురికి మరికొన్ని పరీక్షలు చేయాలని రిఫర్‌ చేసినందున ఆ 33మందికే పింఛన్లు మంజూరు చేసి మిగతా 28 మందికి నిలిపివేయాలి. కానీ వారందరికీ పింఛన్లు ఆప్రూవ్‌ చేస్తూ ఈ నెల 21న జాబితాలను సెర్ప్‌కు పంపించారు. అయితే అనర్హులకు, వైద్య పరీక్షలకు హాజరు కానివారికి పింఛన్లు ఉన్నతాధికారులు మంజూరు చేస్తారా, నిలుపదల చేస్తారా లేదా చూడాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page