విదేశీ బంగారు నిల్వలు వెనక్కి!
- DV RAMANA

- Nov 3
- 2 min read

సుదీర్ఘకాలంగా సాగుతున్న రష్యా`ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాలకు వాటిల్లుతున్న ప్రాణ, ఆస్తి, ఇతర నష్టాల సంగతి పక్కనపెడితే ఆ యుద్ధం వల్ల భారత్‌తోపాటు మరికొన్ని దేశాలు పరోక్షంగా ప్రభావితమవుతున్నాయి.. ఒకవిధంగా నష్టపోతున్నాయి. ఆ జాబితాలో భారత్ కూడా చేరింది. ప్రపంచంలో యుద్ధాలను ఆపించానన్న ఖ్యాతిని కొట్టేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న రకరకాల విన్యాసాలే దీనికి కారణమన్నది సుస్పష్టం. ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం, బలమైన దేశమన్న దర్పంతో ఒకవిధమైన బలప్రయోగానికి పాల్పడుతున్నారు. ఆంక్షల కత్తి రaుళిపిస్తున్నారు. ఒకవైపు యుద్ధానికి స్వస్తి పలకాలని రష్యాపై అనేక రూపాల్లో ఒత్తిడి తెస్తున్న ఆయన అదే సమయంలో ఉక్రెయిన్‌కు సైనిక, ఆయుధ సాయం చేస్తూ ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నారు. మరోవైపు తమ దేశం తరఫున రష్యాపై ఆంక్షలు విధిస్తూనే ఈయూ, నాటో కూటమి దేశాలపై ఒత్తిడి తెచ్చి ఆంక్షలు అమలు చేయించారు. రష్యాతో వాణిజ్యం చేయరాదని మిగతా ప్రపంచ దేశాలకు సైతం సూచించారు. అయితే రష్యా తన ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా తమ ముడిచమురుపై భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో భారత్, చైనాలు దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రష్యా నుంచి భారీగా ముడిచమురు కొనుగోలు చేయడం ప్రారంభించాయి. తన హెచ్చరికలను ఖాతరు చేయనందుకు ట్రంప్ భారతీయ దిగుమతులపై అదనపు సుంకాలు, వాటిపై జరిమానాలు విధించి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూశారు. దాంతో అప్రమత్తమైన భారత్ అమెరికాకు ప్రత్యామ్నాయంగా కొత్త ఎగుమతి మార్కెట్ల వైపు దృష్టి సారించింది. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడమే కాకుండా పలు దేశాల్లో ఉన్న రష్యా ఆస్తులు, బంగారు నిల్వలను సైతం పశ్చిమ దేశాల సాయంతో అమెరికా స్తంభింపజేయడం భారత్‌ను ఆ విషయంలోనూ అప్రమత్తం చేసింది. ఆ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగి విదేశాల్లో దాచిన మన బంగారు నిల్వలను క్రమంగా వెనక్కి తీసుకోవడం ప్రారంభించింది. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారు నిల్వలను దేశం బయట ఉంచడం శ్రేయస్కరం కాదని భావించి వాటిని దేశీయంగానే ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవస్థలను అస్థిరతలు, క్షీణతల నుంచి రక్షించి సుస్థిరంగా ఉంచేందుకు వీలుగా ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తూనే ఉంటాయి. దానికోసం దేశీయ కరెన్సీల కంటే ప్రపంచంలో ఎక్కడైనా చెలామణీ చేయగలిగే, డాలర్ మారకం రేటు వల్ల ప్రభావితం కాకుండా ఉండే బంగారాన్ని వీలైనప్పుడల్లా కొనుగోలు చేస్తూ నిల్వ చేసుకుంటుంటాయి. భద్రతా కారణాలతో చాలా దేశాలు తమ బంగారం నిల్వలను ఎక్కువగా అంతర్జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంటాయి. భారతదేశం కూడా తన గోల్డ్ రిజర్వులను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్ (బీఐఎస్)లలో దాచింది. రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల కారణంగా ఇదే పరిస్థితి భారతదేశానికి కూడా ఎదురుకావచ్చనే భయంతో బంగారాన్ని తిరిగి దేశంలోకి తీసుకువచ్చే చర్యలను రిజర్వ్ బ్యాంకు వేగవంతం చేసింది. ఇప్పటికే 65 శాతానికి పైగా నిల్వలను దేశానికి రప్పించేసింది. దాంతో నాలుగు సంవత్సరాల క్రితం ఉన్న దానికంటే ప్రస్తుతం దేశీయ నిల్వలు దాదాపు రెండు రెట్లు అధికంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే సుమారు 64 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి వెనక్కి తీసుకొచ్చింది. దీని కారణంగా ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి విదేశాల నుంచి తీసుకువచ్చిన బంగారు నిల్వల శాతం 11.70 శాతం ఉండగా సెప్టెంబర్ చివరి నాటికి 13.92 శాతానికి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల చివరినాటికి భారతదేశం మొత్తం 880 టన్నుల బంగారు నిల్వలు కలిగి ఉంది. అందులో 575.8 టన్నులు ప్రస్తుతం దేశంలోనే ఉంది. ఇంత పెద్ద పరిమాణంలో మన ప్రభుత్వ బంగారు నిల్వలను దేశంలోనే ఉంచడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మిగిలిన 290.2 టన్నుల నిల్వలు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంకు ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్‌లో ఉన్నాయి. 2022 సెప్టెంబర్‌లో ఈ నిష్పత్తి 38 శాతం మాత్రమే. అంటే గత కొన్నేళ్లుగా భారతదేశం తన బంగారు నిల్వలపై దేశీయ నియంత్రణను పెంచుకుంటోందని అర్థమవుతోంది. గత నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచనల ప్రకారం.. ఆర్‌బీఐ తన విదేశీ నిల్వలను కేంద్రీకృత స్థితి నుంచి వికేంద్రీకరించే దిశగా నిర్ణయాలు తీసుకుంటూ వెంట వెంటనే ఆచరణలో పెడుతోంది. అనవసర పెత్తనం చెలాయిస్తున్న అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని కూడా తగ్గించి బంగారం వంటి నమ్మదగిన ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడమే ఈ డైవర్షిఫికేషన్ లక్ష్యం. బంగారంతోపాటు ఇతర అంతర్జాతీయ ఆస్తులను కూడా భారత్ ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తోంది. అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి ని కూడా క్రమంగా తగ్గించుకుంటోంది. రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు ఇప్పటికే 50 శాతం సుంకాలు బాదిన అమెరికా విదేశాల్లో ఉన్న తన ద్రవ్య నిల్వలపై కన్నేస్తే ఇబ్బందులు తప్పవని గుర్తించిన భారత్ ముందుజాగ్రత్తగా బంగారం నిల్వలను వెనక్కి తెచ్చుకుంటోంది. అక్టోబర్ 17 నాటికి భారతదేశ ఖజానాలో702.3 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచంలో నాలుగో అతిపెద్ద నిల్వ. ఏకథాటిగా 11 నెలల కంటే ఎక్కువ రోజులపాటు దిగుమతులు చేసుకోగలిగేటంత బలాన్ని ఇస్తుంది. భారత తాజా నిర్ణయం భవిష్యత్తు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న రక్షణ చర్యగా నిపుణులు అంచనా వేస్తున్నారు.










Comments