విన్నపాలు.. అభాసుపాలు
- BAGADI NARAYANARAO
- Jun 5
- 2 min read
పెట్రోల్‌తో వెళ్లినా గుర్తించని సెక్యూరిటీ
నోట్లకట్టలు విసిరినా స్పందించని అధికారులు
పరిష్కరించకుండానే గ్రీవెన్స్ క్లోజ్ చూపిస్తున్న వైనం
ప్రజాగ్రీవెన్స్‌పై సన్నగిల్లుతున్న ఆశలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాపరిషత్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజాగ్రీవెన్స్‌కు వందలకొద్దీ వినతులు ప్రతీ వారం వస్తున్నాయి. నిజంగా వీరంతా సమస్యలున్నవారేనా? అదే నిజమైతే ప్రతీ వారం నిర్వహిస్తున్న వినతులిచ్చేవారి సంఖ్య పెరుగుతుంది తప్ప.. ఎందుకు తరగడంలేదన్న అనుమానం కలగొచ్చు. వాస్తవానికి కొద్ది వారాల క్రితం సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చినవారే, ఆ పని కాకపోవడం వల్లే మళ్లీ మళ్లీ గ్రీవెన్స్ మెట్లెక్కుతున్నారు. ప్రజాగ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలనే నిబంధనల ఉండటంతో సమస్య పరిష్కారం కాకపోయినా, మీ పని పూర్తయిపోయిందంటూ సంబంధిత బాధితుడికి మెసేజ్ పెట్టేస్తున్నారు. మా సమస్య ఇంకా అలానే ఉంది మహాప్రభో అంటూ మళ్లీ గ్రీవెన్స్‌కు వస్తే, పరిష్కారమైపోయిందని కంప్యూటర్‌లో నమోదైపోయింది కాబట్టి ఈ సమస్య మళ్లీ తీసుకోవడం కుదరదంటూ వెనక్కు పంపించేస్తున్నారు. అలాంటప్పుడు ప్రజాదర్బార్‌లు ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది. పరిష్కారం కాని సమస్యల కోసం నిర్వహిస్తున్న ఈ గ్రీవెన్స్ కూడా వివాదాస్పదం కావడం కొసమెరుపు.
గ్రీవెన్స్‌లో హడావుడి
గతంలో ఎప్పుడూ లేనివిధంగా జిల్లాలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ ప్రతివారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. దీనికి ప్రధాన కారణం పోలీసుల నిర్లక్ష్యం కాగా, అధికారులు సమస్యకు పరిష్కారం చూపించడంలో విఫలం కావడం, కొన్ని రకాల ఫిర్యాదులు గ్రీవెన్స్‌లో నమోదు చేయకుండా తిప్పి పంపించడమే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రీవెన్స్‌కు అర్జీదారుడు ఫిర్యాదు ఇచ్చిన 15 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపించాలి. ప్రతి గ్రీవెన్స్‌ను జిల్లా, రాష్ట్రస్థాయిలో మోనటరింగ్ చేస్తుండడంతో ఫిర్యాదులు, వినతులకు కచ్చితంగా పరిష్కారం చూపించాలి. ఫోన్‌కు సూక్ష్మసందేశం పంపండం, లేదంటే అర్జీదారుడికి హార్డ్‌కాపీ ద్వారా సమస్య పరిష్కారంపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో అన్ని వినతులు, ఫిర్యాదులకు పరిష్కారం చూపించినట్టు అర్జీదారుడికి ఏదో ఒక రూపంలో సమాచారం పంపిస్తున్నారు. మళ్లీ ఆ అర్జీదారుడు సమస్య పరిష్కారం కాలేదని గ్రీవెన్స్‌కు వస్తే, దాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలతో పలు దఫాలుగా వచ్చి గ్రీవెన్స్‌లో హడావుడి చేస్తున్నారు.
అర్జీదారులు హల్‌చల్
గత నెల 5న నగరంలోని బాకర్‌సాహెబ్‌పేటకు చెందిన వృద్ధురాలు లొట్టి మంగమ్మ దీర్ఘకాలికంగా ఉన్న పెండిరగ్‌కు పరిష్కారం చూపడం లేదనిం వాటర్ బాటిల్‌లో పెట్రోల్ నింపుకొని గ్రీవెన్స్‌లోకి వచ్చేసింది. కలెక్టర్, జేసీ ఇతర అధికారుల వద్దకు నేరుగా వెళ్లి పెట్రోల్‌ను ఒంటి మీద పోసుకుంది. దీన్ని గమనించిన మరుక్షణమే కలెక్టర్ స్పందించి గ్రీవెన్స్‌లో ఉన్న మహిళా కానిస్టేబుల్స్‌ను పిలిపించి వృద్ధురాలిని పక్కకు తీసుకువెళ్లి సముదా యించారు. అలాగే ఈ నెల 2న గ్రీవెన్స్‌లో మరో ఘటన చోటుచేసు కుంది. ఆమదాలవలస మండలంకు చెందిన సనపల సురేష్‌కుమార్ జేబులో నుంచి నోట్లకట్టలు బయటకు తీసి సమస్యలు పరిష్కరించడానికి ఎంత లంచం ఇవ్వాలని గ్రీవెన్స్‌లో జేసీ, ఇతర అధికారులకు ప్రశ్నించారు. ఆమదావలసలో ప్రభుత్వ మార్గదర్శ కాలకు విరుద్ధంగా, వాల్టాచట్టాన్ని తుంగలో తొక్కి ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారని ఫిర్యాదు చేస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గ్రీవెన్స్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేయకుండా బాధ్యులపై చర్యలు తీసుకోకుండా రెవెన్యూ, మైన్స్ అధికారులు లంచాలు తీసుకొని విడిచిపెట్టేస్తున్నారని అధికారులను నిలదీశారు. లంచాలు కావాలంటే తాను ఇస్తానని, తక్షణమే ఇసుక అక్రమ రవాణా నిలుపుదల చేయించాలని జేబులో నుంచి నోట్ల కట్టలు చేతిలో పట్టుకొని అధికారులందరికీ చూపించారు. ఎవరికి లంచం కావాలంటే వారు తీసుకొని తన ఫిర్యాదుపై స్పందించాలని సురేష్ అన్నారు. ప్రతివారం గ్రీవెన్స్‌లో ఫి˜ిర్యాదు చేస్తున్నా సమస్యకు పరిష్కారం చూపించలేదన్నారు. తాను వారి మాదిరిగానే ఎంత కావాలంటే అంత లంచం ఇస్తానని, దీనికి ప్రతిగా ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలని, కాదంటే పదే పదే ఫిర్యాదు చేస్తున్నందుకు తననైనా అరెస్టు చేయాలని, లేదా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలన్నారు. సురేష్ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందించాలో తెలియక నచ్చజెప్పి పంపించేశారు.
పోలీసు సిబ్బంది వైఫల్యం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ వద్ద గతం కంటే భిన్నంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. జెడ్పీ సమావేశ మందిరం ప్రధాన గేటు వద్ద ఏర్పాటుచేసిన డిటెక్టర్ నుంచి పంపించి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మీడియా ప్రతినిధులను అడ్డుకొని మీడియా గుర్తింపు కార్డు చూపిస్తేనే లోపలికి పంపిస్తామని అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో గ్రీవెన్స్‌లో హాజరు కావడానికి వచ్చే అధికారులు, ఉద్యోగులను నిలిపి మీరెవరని ప్రశ్నించిన సందర్భాలూ ఉన్నాయి. గ్రీవెన్స్‌లో కొందరు కానిస్టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. అయినా లొట్టి మంగమ్మ పెట్రోల్ బాటిల్‌ను తనతో పట్టుకొని, సురేష్ నోట్ల కట్టలను తీసుకొని లోపలికి ఎలా వెళ్లగలిగారు. గతంలో సురేష్ ఫిర్యాదు చేయడం వల్ల ఆమదాలవలస పరిధి రాగోలుపేట సమీపంలో ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఆతర్వాత సురేష్‌కుమార్‌పై దాడిచేసి గాయపరిచారు. ప్రతి వారం సురేష్ ఇసుక అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి వస్తూనే ఉన్నాడు. అయినా పోలీసులు తనిఖీలు చేయలేదు, గ్రీవెన్స్‌లో నోట్లకట్టలు తీసి హంగామా చేసినా స్పందించలేదు. దీంతో పోలీసు గ్రీవెన్స్ వద్ద విధులు నిర్వహించే పోలీసుల వ్యవహారంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటారా? లేదంటే మళ్లీ విమర్శలు పాలవుతారో చూడాలి.
Comments