‘వెన్నుపోటు’ నేర్పిన పాఠం
- NVS PRASAD
- Jun 6
- 2 min read
యాక్టివ్ అయిన ధర్మాన, సీతారాం
టెక్కలిలో విజయవంతం చేసిన తిలక్
ఇచ్ఛాపురాన్ని మోనిటర్ చేసిన కృష్ణదాస్
బలం పెంచుకోడానికి చింతాడకు వచ్చిన అవకాశం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

కూటమి ఏడాది పాలనలో హామీలు విస్మరించారంటూ వెన్నుపోటు పేరుతో జిల్లాలో వైకాపా చేపట్టిన కార్యక్రమం విజయవంతమైన అంశం పక్కన పెడితే జిల్లా వ్యాప్తంగా ఉన్న వైకాపా శ్రేణులకు, ప్రత్యర్థి టీడీపీకి ఓ సందేశాన్ని పంపగలిగింది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గాల్లో వైకాపా చేపట్టిన ఇన్‌ఛార్జిల మార్పు, తత్ఫలితంగా తలెత్తిన అసంతృప్తి చల్లబడినట్లు ఈ కార్యక్రమం రుజువు చేసింది. ఆమదాలవలసలో కొత్త ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ వెనుక ఎవరున్నారు? ఇప్పటికీ కలసిరానివారిని ఎలా కలుపుకోవాలన్న అవగాహన ఈ కార్యక్రమం ద్వారానే ఏర్పడిరది. ఇక్కడ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనను కాదన్నప్పుడు తన కుమారుడికైనా అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని కోరారు. అయినా చింతాడ రవి వైపే పార్టీ మొగ్గు చూపింది. సీతారాంను పార్లమెంట్ స్థానానికి పంపుతామన్న సంకేతాలు పంపింది. అప్పట్నుంచి సీతారాం అలకపాన్పుపైన ఉన్నారు. కానీ వెన్నుపోటు కార్యక్రమానికి టెక్కలి నియోజకవర్గంలో ఆయన హాజరవడం అచ్చెన్న ఇలాఖాలో కూడా వెన్నుపోటు కార్యక్రమం విజయవంతమైంది. స్వతహాగా ఇది కాళింగుల నియోజకవర్గం కావడంతో సీతారాం ఆ పార్టీలో ఆ సామాజికవర్గానికి పెద్దనేత కావడంతో సహజంగానే వైకాపా శ్రేణులంతా టెక్కలిలో విజయవంతం చేశారు. దీనికితోడు ఇన్‌ఛార్జి పేరాడ తిలక్ కూడా పక్కలో బల్లెం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోటు లేకపోవడం వల్ల పార్టీ సింబల్‌తో ప్రతీ ఒక్కర్నీ కలవగలగుతున్నారు. అందుకే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నా ఆ నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు రోడ్డెక్కడానికి వెనకడుగు వేయలేదు. ఇక గడిచిన ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన దగ్గర్నుంచి కార్యక్రమాలకు దూరంగా ఉన్న ధర్మాన ప్రసాదరావు వెన్నుపోటు కార్యక్రమానికి రోడ్డెక్కకపోయినా కేడర్‌తో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఏడాదిగా స్తబ్ధుగా ఉండిపోయిన కొందరు కార్యకర్తల జాబితా తెప్పించుకొని నేరుగా ధర్మానే ఫోన్ చేసి కథంతొక్కాలని పిలుపునిచ్చారు. వైకాపా ఓటమిపాలైన తర్వాత ప్రధానంగా పార్టీ రెండు నిరసన కార్యక్రమాలు నిర్దేశించింది. కాకపోతే ఈ రెండిరటికంటే వెన్నుపోటు విజయవంతమైంది. పాతపట్నం లాంటి గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో కూడా పెయిడ్ ఆర్టిస్టులు లేకుండా కార్యకర్తలే 500 మంది వరకు పాల్గొన్నారని టీడీపీ శ్రేణులు చెబుతుండటం విజయవంతమైందని చెప్పడానికి ఓ సాక్ష్యం. ఇచ్ఛాపురంలో పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో పాటు పరిశీలకుడు కుంభా రవిబాబు కూడా పాల్గొనడం వల్ల జనాల సంఖ్యతో ప్రమేయం లేకుండా అటువైపు మీడియా అటెన్షన్ పెరిగింది. మిగిలిన నియోజకవర్గాల కంటే ఇచ్ఛాపురంలో కూడా వైకాపా శ్రేణుల సంఖ్య తీసిపోలేదు. సిట్టింగ్ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్లు కాల వ్యవధి ఉన్నందున సహజంగానే ప్రతిపక్షం నిర్వహించే నిరసనలకు ప్రజల మద్దతు కనిపించదు. దీనికి తోడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా కొత్త రేషన్‌కార్డులు, కొత్త పింఛన్లు, తల్లికి వందనం వంటి పథకాలు మొదలవుతున్నాయని తెలిసిన తర్వాత ప్రతిపక్షం తరఫున రోడ్డెక్కి వాటిని పోగొట్టుకోడానికి ఎవరూ ఇష్టపడరు. బుధవారం జరిగిన వెన్నుపోటు కార్యక్రమంలో పాల్గొన్నవారంతా వైకాపా శ్రేణులే. టెక్కలిలో కింజరాపు కుటుంబాలను ఢీకొట్టాలంటే మాస్ ఇమేజ్ ఉన్న దువ్వాడకు మాత్రమే సాధ్యమన్న భావనలో దాదాపు అన్ని పార్టీలూ ఉండేవి. కానీ పార్టీకి క్రౌడ్‌పుల్లర్ తానేనని తిలక్ ఈ కార్యక్రమం ద్వారా నిరూపించగలిగారు. సమీప కాలంలో అచ్చెన్నాయుడు, అంతకు ముందు ఎర్రన్నాయుడులు ఎమ్మెల్యేలుగా గెలవడం వల్ల ఇది వెలమ నియోజకవర్గమని భావిస్తున్నారు కానీ, ఇక్కడ కాళింగ ఓటర్లే ఎక్కువని నిరూపించడం కోసం సీతారామ్‌ను తీసుకొచ్చి తిలక్ వ్యూహాత్మక విజయం సాధించారు. తాను పార్టీ కార్యక్రమాలకు హాజరైనా, కాకపోయినా నియోజకవర్గం తన గ్రిప్‌లోనే ఉందని ధర్మాన నిరూపించుకోగలిగారు. పాతపట్నం టిక్కెట్ తమ కుటుంబం నుంచే వేరేవారు ఆశిస్తూ, కేడర్ తనతోనే ఉందని రెడ్డి శాంతి నిరూపించగలిగారు. ఇచ్ఛాపురంలో నాలుగు గ్రూపులున్న మాట వాస్తవమేనని పరోక్షంగా పార్టీ అంగీకరించినట్లయింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు, పరిశీలకుడు అక్కడకు వెళ్లకపోతే సిట్టింగ్ ఇన్‌ఛార్జికి వ్యతిరేకంగా కొందరు దీన్ని ప్లాప్ చేయడానికి ప్రయత్నిస్తారన్న సంకేతం పార్టీకి ఇచ్చినట్లయింది. ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశందో, బీజేపీదో తెలియకపోయినా ఇక్కడ గ్రూపులున్నా సక్సెస్ క్రెడిట్ మాత్రం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఖాతాలోనే వేసింది. ఓవరాల్‌గా తెలుగుదేశం ఈ కార్యక్రమాన్ని లైట్‌గా తీసుకున్నా నిద్రాణంలో ఉన్న బ్యాటరీకి ఒక్కసారి ఛార్జింగ్ పెట్టినట్టు వైకాపా భావిస్తుంది.
Kommentare