వినాశకారి కాదు.. గేమ్ ఛేంజర్!
- Prasad Satyam
- Sep 23
- 4 min read
ప్రభుత్వరంగ జెన్‌కో ఆధ్వర్యంలోనే పవర్‌ప్లాంట్
అటు సీ పోర్టు.. ఇటు ఎయిర్‌పోర్టు.. మధ్యలో పవర్ ప్లాంట్
దాంతో జిల్లాలో పరుగులు తీయనున్న అభివృద్ధి
రైతుల భూములకు ముప్పు లేదు.. మౌలిక వసతులు పుష్కలం
కాకరాపల్లి, సోంపేట ప్లాంట్లతో దీనికి సాపత్యం లేదు
ఇంకా తుది నిర్ణయం తీసుకోకముందే ఉద్యమాలు అనుచితం
‘సత్యం’తో కూన రవికుమార్ ఫేస్ టు ఫేస్

‘పవర్‌ప్లాంట్ పేరుతో ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవితాలతో మళ్లీ చెలగాటమాడుతోంది. అభివృద్ధి, ఉద్యోగులు అన్న ఎర చూపుతూ గ్రామాలకు గ్రామాలను ఖాళీ చేయించి పవర్‌ప్లాంట్ పేరుతో కార్పొరేట్లకు భూములు ధారాదత్తం చేసేందుకు పన్నాగం పన్నుతోంది. ఇటువంటి విధ్వంసక అభివృద్ధి వద్దే వద్దు.. సోంపేట, కాకరాపల్లిల్లో ప్రతిపాదిత విద్యుత్ ప్లాంట్లకు వ్యతిరేకంగా విజయపోరాటం జరిపిన స్ఫూర్తితోనే సరుబుజ్జిలిలో కొత్తగా ప్రతిపాదిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తాం’.. అంటూ ఏకంగా పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ పేరుతో కొద్దిరోజులగా ప్రతిపక్షాలు, కొన్ని సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. అసలు ఇంతకూ పవర్ ప్లాంట్ ఎక్కడ నిర్మించాలన్నది ఖరారైందా? కాకరాపల్లి, సోంపేట ప్లాంట్ల మాదిరిగా ఇది కూడా ప్రమాదకరమైనదేనా? ఈ ప్లాంట్ ప్రైవేట్ సెక్టార్‌లో ఏర్పాటు వస్తోందా? ఉద్యమకారులు చెబుతున్నట్లు 20కిపైగా గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది? అన్నింటికీ మించి ఇది విధ్వంసక అభివృద్ధి కిందకు వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టడం, జిల్లా ప్రజలకు ఈ వివాదంపై ఒక క్లారిటి ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఆమదాలవలస ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ ఛైర్మన్ కూన రవికుమార్‌తో ‘సత్యం’ ఎడిటర్ ఎన్.వి.ఎస్.ప్రసాద్ అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలోనే ముఖాముఖి చర్చ జరిపారు. ఈ ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో కూన రవికుమార్ చెప్పిన వివరాలు యథాతథంగా..
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం.. అన్నట్లు ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నదానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకముందే వైకాపా, కమ్యూనిస్టు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ వంటి పలు పార్టీలు, సంఘాలు ఉద్యమాల పేరుతో హడావుడి చేయడం సమంజసం కాదు. ప్లాంట్ ఏర్పాటుపై ప్రాథమిక ప్రతిపాదనే తప్ప.. దీనిపై ఇంకా క్షేత్రస్థాయి సర్వే జరగలేదు. ప్రాంతాన్ని ఎంపిక చేయలేదు. ఒకవేళ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే మాత్రం ఈ ప్రాంత ప్రగతిలో అది ఒక గేమ్ ఛేంజర్ అవుతుందన్నది వాస్తవం. ప్లాంట్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, నిరసనకారులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రతిపాదిత థర్మల్ ప్లాంట్‌ను కార్పొరేట్ సంస్థలు నిర్మించడంలేదు. దీన్ని ప్రభుత్వ సంస్థ అయిన ఏపీ జెన్‌కో స్వయంగా నిర్మిస్తుంది. అందువల్ల కార్పొరేట్ వర్గాల నుంచి నేను కోట్లు దండుకున్నానని ఆరోపించడం అసమంజసం, నిర్హేతుకం. గతంలో కాకరాపల్లి, సోంపేటల్లో ప్రతిపాదించిన పవర్ ప్రాజెక్టులకు ప్రస్తుతం ఆమదాలవలస నియోజకవర్గంలో చేపట్టేదానికి ఏమాత్రం సాపత్యం లేదు. కాకరాపల్లి ప్లాంట్‌ను సముద్ర బ్యాక్ వాటర్స్ వెళ్లే చోట నిర్మించడం వల్ల సంతబొమ్మాళి మండలంలో కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయని భయపడ్డారు. సోంపేట ప్లాంట్‌ను తంపర భూముల్లోనూ ప్రతిపాదించడం వల్ల పర్యావరణం, జీవ వైవిధ్యం దెబ్బతింటాయన్న ఆందోళనలు మిన్నంటాయి. దానివల్లే ప్రభుత్వాలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ ప్రచారం జరుగుతున్నట్టు సరుబుజ్జిలిలోనే ఈ ప్లాంట్‌ను నిర్మిస్తే, ఆ సమస్యలు రావు. పైగా ప్లాంట్ల నిర్మాణ టెక్నాలజీలో అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అందువల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. ఒకవేళ అటువంటిదే ఉంటే గ్రీన్ ట్రిబ్యునలే ప్లాంట్ నిర్మాణానికి అనుమతి ఇవ్వదు కదా!
భారీ భూసేకరణ అవసరంలేదు
ప్లాంట్ ఖరారైనా భూసేకరణ పెద్ద ఇబ్బంది కాబోదు. ప్రతిపక్షాలు చెబుతున్నట్లు 20 గ్రామాలను తరలించాల్సిన అవసరం కూడా లేదు. సరుబుజ్జిలి మండలంలో ఉన్నవి ప్రైవేట్ వ్యక్తులు వందల ఎకరాలు కొనుగోలు చేసి లేఅవుట్లు వేసిన భూములే. అలాగే కొండలే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల భూసేకరణ వల్ల వ్యవసాయ భూములు పెద్దగా పోవు. స్థానిక రైతులకు ఇబ్బంది ఉండదు. ఇక పెద్ద ఎత్తున ఎస్టీలను తరలించాల్సి ఉంటుందని, దానివల్ల వారి జీవన విధానం దెబ్బతింటుందన్న ఆందోళనలో అర్థం లేదు. ఎందుకంటే సరుబుజ్జిలి మండలంలో 200 కుటుంబాలకు మించి ఎస్టీలు లేరు. ఒకవేళ కొద్దో గొప్పో వ్యవసాయ భూములు తరలించాల్సి వచ్చినా.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం జిరాయితీ భూములకు మార్కెట్ ధరకు రెండు రెట్ల పరిహారం ఇస్తారు. డీ పట్టా భూములకు సైతం ఇదే ప్యాకేజీ ఇవ్వనున్నారు. రైతులు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు 50 శాతం రేటు కట్టి చెల్లిస్తారు.
అభివృద్ధికి విద్యుత్తే ఆధారం
రెండు పంటలు పండే భూములున్నా ఈ ప్రాంతంలో వాటికి రేటు లేదు. కారణం అభివృద్ధి చెందకపోవడమే. పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే విద్యుత్ తదితర మౌలిక వసతులు అందుబాటులో ఉండాలి. జిల్లాలో 440 కేవీ సబ్‌స్టేషన్లు లేవు. 220 కేవీ లైన్లు కూడా లేవు. వాటి కోసం గతంలో నేను అనుమతులు సాధించినా, గత ప్రభుత్వం లైన్లు వేయలేదు. రణస్థలం మండలాన్నే తీసుకుంటే అక్కడ విద్యుత్ సహా అన్ని సౌకర్యాలు ఉండటం వల్లే ఆ మండలం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. భూములు రేట్లు పెరిగాయి. అలాగే తెలంగాణ భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలను తీసుకుంటే ఒకప్పుడు అక్కడ కిన్నెరసాని వాగు తప్ప ఇంకేమీ ఉండేది కాదు. కానీ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటైన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి ఊపందుకుంది. పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాలు కలిసిపోయి భద్రాచలం వరకు విస్తరిస్తున్నాయి. ప్లాంట్ వల్ల టౌన్‌షిప్‌లు ఏర్పడటం, అనుబంధ రంగాలు ఏర్పడటం వల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. అదే రీతిలో ఆమదాలవలస నియోజకవర్గం, జిల్లా అభివృద్ధి చెందాలంటే పవర్ ప్లాంట్లు అవసరం. జిల్లాలో మూలపోర్టు సీ పోర్టు నిర్మాణంలో ఉంది. ఇటువైపు భోగాపురం ఎయిర్‌పోర్టు త్వరలో మొదలవుతుంది. వీటికి తోడు నియోజకవర్గంలో పవర్ ప్లాంట్ ఏర్పాటైతే ఈ ప్రాంతాలన్నీ అభివృద్ది చెందుతాయి. పవర్ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గును తాల్చేరు నుంచి మూలపేట పోర్టుకు షిప్పుల్లో తెప్పిస్తారు. అక్కడి నుంచి ప్లాంట్‌కు రవాణా చేసేందుకు వీలుగు రోడ్డు, రైలు ట్రాక్ నిర్మిస్తారు. ఈ రెండూ కూడా అభివృద్ధి చోదకాలుగా పని చేస్తాయి.
ఇక్కడైతే నిర్మాణ ఖర్చు ఆదా
సరుబుజ్జిలి ప్రాంతంలో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే నిర్మాణ ఖర్చులు ఆదా అవుతాయి. దీని నిర్మాణానికి రూ.35వేల కోట్లు అవసరమని అంచనా. దానికి కావలసిన వసతులను కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఖర్చు తగ్గి.. ఈ మేరకు అవుతుందని అంచనా వేశారు. సమీపంలోనే వంశధార ప్రాజెక్టు ఉంది. దూరదృష్టితోనే వంశధార కుడికాలువ సామర్థ్యాన్ని గతంలోనే 600 క్యూసెక్కులకు పెంచాం. ఇందులో వ్యవసాయానికి వంద క్యూసెక్కులు సరిపోతాయి. మిగతా నీరు పవర్ ప్లాంట్ కూలింగ్, ఇతరత్రా అవసరాలకు పోగా, ఇంకా ఆ ప్రాంతంలో ఆయకట్టుకు 200 క్యూసెక్కులకు పైగా నీరు మిగులుతుంది. దీనివల్ల నీటి వసతికి పెట్టాల్సిన వందల కోట్ల ఖర్చు ఆదా అయినట్లే. అలాగే ఈ ప్రాంతం మీదుగా 440 హైటెన్షన్(హెచ్‌టీ) విద్యుత్ లైను ఉండటం వల్ల మరో రూ.వంద కోట్లు ఆదా అవుతాయి. ఇక పవర్ ప్రాజెక్టు ఏర్పాటైతే.. ఆ వెంటనే ఈ ప్రాంతంలో సిమెంటు ఫ్యాక్టరీల ఏర్పాటుకు రెండు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. పెద్దగా నష్టం లేని వపర్ ప్లాంట్ వద్దని ఉద్యమాలు చేయడం అభివృద్ధిని కాలదన్నుకోవడమే అవుతుంది. కొన్ని పక్షాలు, సంఘాలు ఇప్పటికీ ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీని పట్టుకుని వేలాడుతున్నాయి. దాన్ని తిరిగి తెరిపించడం సాధ్యం కాదని గత ఎన్నికల సమయంలోనే చెప్పాను. దశాబ్దాలనాటి చట్టాల ప్రకారం సుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. వాటికి కాలం చెల్లిపోయింది. ఇప్పటి చట్టాల ప్రకారం వీటికి పర్యావరణ అనుమతులు రావు. ప్రస్తుతం ఉన్న సుగర్ ఫ్యాక్టరీలకే సరిపడే చెరకు పంటను రైతులు పండిరచడంలేదు. దాన్ని తెరిపించడం కుదరదు. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు గ్రహించి.. ఇప్పటి అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్న అభివృద్ధిని ఆహ్వానించాలి. పవర్ ప్లాంట్‌కు మాత్రమే భూసేకరణ జరగదు. దాని చుట్టూ టౌన్‌షిప్ నిర్మాణం కోసం కూడా భూమి సేకరించడం వల్ల ఆమదాలవలస నియోజకవర్గంలో ఒక పారిశ్రామికవాడ రణస్థలం, పైడిభీమవరం మాదిరిగా ఏర్పడుతుంది. దీన్ని అందరూ ఆహ్వానించాలని కోరుకుంటున్నాను.










Comments