top of page

వినేష్ పునరాగమనానికి ‘ఫెడరేషన్’ బ్రేక్!

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • May 14
  • 2 min read
  • గొండాలో హైడ్రామా

  • వెరిఫికేషన్ సమయంలో అడ్డుకున్న WFI

  • రిటైర్మెంట్ నిబంధనలు ఉల్లంఘించారంటూ షోకాజ్ నోటీసు

  • నన్ను చూసి భయపడుతున్నారు

  • రెజ్లింగ్ సమాఖ్యపై వినేష్ ఫోగాట్ నిప్పులు

భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ మ్యాట్‌పైకి రావాలనుకున్న ఆశలకు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫఐ) ఆదిలోనే అడ్డుకట్ట వేసింది. మాతృత్వ పారవశ్యం తర్వాత పతకమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్‌లోని గొండాలో జరుగుతున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను ఫెడరేషన్ అనర్హురాలిగా ప్రకటించింది. క్రమశిక్షణా చర్యల విచారణ పెండింగ్‌లో ఉందన్న సాకుతో ఆమెను వెరిఫికేషన్ ప్రక్రియ నుంచే తప్పించడంతో గొండా వేదికగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అసలేం జరిగింది?

57 కిలోల విభాగంలో పోటీ పడేందుకు వినేష్ ఫోగాట్ మే 11న తన భర్త సోమ్‌వీర్, భద్రతా సిబ్బందితో కలిసి నందినీనగర్ మహావిద్యాలయానికి చేరుకున్నారు. అయితే, ఆమెకు అంతకుముందే షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్న డబ్ల్యూఎఫఐ, జూన్ 26 వరకు పోటీల నుంచి నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. వేదిక వద్దే డబ్ల్యూఎఫఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్‌ను వినేష్ కలిసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

‘నోటీసుపై సమాధానం ఇవ్వడానికి నాకు 14 రోజుల సమయం ఉంది. ప్రస్తుతం పసిబిడ్డను చూసుకోవాల్సిన బాధ్యత వల్ల ప్రాథమిక సమాధానం మాత్రమే ఇచ్చాను. నన్ను పోటీ చేయనివ్వండి, నా వివరణ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు చర్య తీసుకోండి అని కోరాను. కానీ వారు వినలేదు’ అని వినేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

వివాదానికి కారణాలు ఇవే..

వినేష్ ఫోగాట్‌పై ప్రధానంగా మూడు ఆరోపణలను ఫెడరేషన్ తెరపైకి తెచ్చింది:

` పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అదనపు బరువు కారణంగా అనర్హతకు గురవ్వడం వల్ల ఫెడరేషన్ ప్రతిష్ట దెబ్బతిన్నదని డబ్ల్యూఎఫఐ పేర్కొంది.

` వినేష్ సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ప్రకటించారని, తిరిగి రావాలంటే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఆరు నెలల ముందే సమాచారం ఇవ్వాలని డబ్ల్యూఎఫఐ వాదిస్తోంది.

` డోపింగ్ పరీక్షల కోసం తన ఆచూకీ వివరాలను సకాలంలో నమోదు చేయలేదని ఆరోపించింది.

‘అదంతా కుట్ర’.. వినేష్ ధ్వజం

తనపై వస్తున్న ఆరోపణలను వినేష్ తీవ్రంగా ఖండించారు. తాను అంతర్జాతీయ నియమ నిబంధనలన్నీ పాటించానని, 2026 జనవరి 1 నుంచే పోటీలకు అర్హురాలినని యుడబ్ల్యూడబ్ల్యూ, ఐటీఏ స్పష్టం చేసినట్లు ఆమె గుర్తుచేశారు. ‘నేను మళ్లీ పతకాలు గెలుస్తాననే భయం వారిలో ఉంది. ఆసియా క్రీడల్లో నేను పాల్గొనకుండా అడ్డుకోవడమే వారి లక్ష్యం. డబ్ల్యూఎఫఐ ఒక నియంతృత్వ సంస్థలా వ్యవహరిస్తోంది’ అని ఆమె నిప్పులు చెరిగారు.

రాజకీయ కోణం..

ఈ వివాదం వెనుక పాత కక్షలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో నిరసన చేపట్టిన వారిలో వినేష్ ముందున్నారు. ప్రస్తుతం ఫెడరేషన్ ఆయన సన్నిహితుడైన సంజయ్ సింగ్ చేతుల్లో ఉండటం, బ్రిజ్ భూషణ్ ఇలాఖా అయిన గొండాలోనే ఈ టోర్నీ నిర్వహించడం గమనార్హం.

మద్దతుగా సాక్షి మాలిక్

ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్, వినేష్‌కు అండగా నిలిచారు. ఒక అథ్లెట్ మాతృత్వం తర్వాత మళ్లీ క్రీడల్లోకి వస్తున్నప్పుడు ప్రోత్సహించాల్సింది పోయి, ఇలా అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆమె అధికారులను కోరారు. ప్రస్తుతానికి వినేష్ ఫోగాట్ కెరీర్ అనిశ్చితిలో పడింది. క్రమశిక్షణా విచారణ ముగిసే వరకు ఆమె దేశీయంగా మ్యాట్‌పై అడుగుపెట్టే అవకాశం కనిపించడం లేదు.

- సత్యం స్పోర్ట్స్‌డెస్క్

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page