వ్యక్తిగతంగా ‘పన్నూ’డగొడ్తున్నారు!
- DV RAMANA

- Apr 8
- 3 min read
కార్పొరేట్ల కంటే సామాన్యులు చెల్లించేదే ఎక్కువ
వ్యక్తిగత ఆదాయపన్ను విధానంతో నష్టం
జాయింట్ ఐటీఆర్ ఫైలింగ్ తీసుకురావాలని డిమాండ్
మార్కెట్ పెట్టుబడుల్లో లాభాలపైనా పన్ను వడ్డింపు
సామాన్యుడే ‘శర’మెత్తితే - 4

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
ఒకవైపు ప్రజాసంక్షేమ కార్యక్రమాలు.. మరోవైపు అభివద్ధి పథకాలు.. రెండింటినీ జోడుగుర్రాల్లా సమాంతరంగా నడపాలంటే ప్రభుత్వానికి తగిన ఆదాయ వనరులు ఉండాలన్నది నిర్వివాదాంశం. ఆ ఆదాయ వనరుల్లో కొంత పన్ను వసూళ్ల ద్వారా రాబట్టుకోవడం సర్వసాధారణం. కానీ పన్ను వసూళ్లలో సాపత్యం లేకపోతే.. ఆయా వర్గాలకు అనుగుణంగా పన్నుల వ్యవస్థ లేకపోతే అది సమాజంలోని అసమానతలను మరింత పెంచుతుంది. పార్లమెంటులో మొన్న ఫిబ్రవరిలో ప్రవేశపెట్టి సాధారణ బడ్జెట్ ప్రతిపాదనలపై జరిగిన చర్చల్లో పాల్గొన్న ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఈ వ్యత్యాసాలనే ఎత్తిచూపారు. ముఖ్యంగా ఆదాయ పన్ను(ఐటీ)లో వ్యక్తిగత, కార్పొరేట్ వర్గాల మధ్య ఉన్న తేడాలను, మళ్లీ వ్యక్తిగత ఆదాయ పన్నులో కుటుంబాల విషయంలో చోటుచేసుకుంటున్న వ్యత్యాసాల వల్ల పౌరులకు జరుగుతున్న నష్టాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పన్ను వ్యవస్థలోని ఈ డొల్లతనం వల్ల కార్పొరేట్ వర్గాల కంటే సామాన్యులే ఎక్కువ ఐటీ చెల్లిస్తున్న పరిస్థితి దాపురించిందని చద్దా ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేట్లకు లాభం
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన తాజా బడ్జెట్ లెక్కల ప్రకారం దేశంలో కార్పొరేట్లు చెల్లించే ఐటీ (ఆదాయ పన్ను) కంటే సామాన్యులే ఎక్కువ ఆదాయపన్ను చెల్లిస్తున్నట్లు వెల్లడవుతున్నది. గత ఆర్థిక సంవత్సరం(2025`26)లో కార్పొరేట్ సంస్థల నిర్వాహకులు రూ. 9.80 లక్షల కోట్ల ఆదాయపన్ను చెల్లించారు. కానీ దీని కంటే ఎక్కువగా సామాన్య పౌరులు చెల్లించిన ఆదాయ పన్ను రూ.11 లక్షల కోట్లుగా నమోదైంది. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ 2019 నుంచి సీన్ రివర్స్ అయ్యింది. దీనికి కారణం.. డమెస్టిక్ కంపెనీల పన్ను చెల్లింపు బేస్ రేట్‌ను కేంద్రం 30 నుంచి 25.17 శాతానికి తగ్గించడమే. దీని ఫలితంగా కార్పొరేట్ ఇన్‌కమ్ ట్యాక్స్ వసూళ్లు 62 శాతం నుంచి 47 శాతానికి తగ్గిపోగా.. సామాన్యుల నుంచి వసూళ్లు 38 శాతం నుంచి 53 శాతానికి పెరిగిపోయాయి. అంటే దేశంలో సంపన్నుల కంటే సామాన్యులే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నారన్నమాట. తన ఆదాయం కోసం సామాన్యులను ఏటీఎంలుగా ఉపయోగించుకుంటున్న సర్కారు వారికి తగిన సౌకర్యాలు మాత్రం కల్పించడంలేదని రాఘవ్ చద్దా విమర్శించారు. అలాగే పొదుపును, మార్కెట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మరోవైపు ఆ పెట్టుబడులు, పొదుపుల ద్వారా వచ్చే ఆదాయంపై మళ్లీ లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్(ఎల్‌టీసీజీ) పేరుతో పన్ను వేస్తున్నది. దీని ప్రకారం ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి కొన్న షేర్లను ఏడాది తర్వాత లాభానికి అమ్ముకుంటే.. ఆ లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఫిక్స్ డిపాజిట్లపై నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ వడ్డీ ఆదాయం లభిస్తే.. దానిపైనా టీడీఎస్ రూపంలో పన్ను చెల్లించాల్సి వస్తున్నది. దీనివల్ల సామాన్యులు తమ పెట్టుబడులను బంగారం, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ రంగాల్లో స్థిరత్వం ఉండనందున నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో సామాన్య మదుపరులను పన్ను భారం నుంచి మినహాయించాలని రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు.
ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను లెక్కించే విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండివిడ్యువల్ ఐటీ ఫైలింగ్ అంటే ఎవరికివారు వేర్వేరుగా ఆదాయపన్న చెల్లించే విధానం వల్ల ఒకే తరహా ఆదాయం ఉన్నప్పటికీ కుటుంబాల పన్ను చెల్లింపుల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. దీని వల్ల కొన్ని కుటుంబాలు లాభపడుతుంటే.. మరికొన్ని కుటుంబాలు అదనంగా పన్ను చెల్లించాల్సి వస్తున్నది. ఇది ఎలా జరుగుతున్నదో సోదాహరణంగా చద్దా వివరించారు. ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనపరులే. ఇద్దరూ చెరో రూ.10 లక్షలు చొప్పున రూ.20 లక్షలు సంపాదిస్తున్నారు. మరోవైపు కుటుంబ ఖర్చులను కూడా షేర్ చేసుకుంటూ ఆర్థికభారం నుంచి తప్పించుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ.. కుటుంబ ఖర్చులను చెరిసగం భరిస్తున్నప్పటికీ ఇన్‌కమ్ ట్యాక్స్ విషయానికి వచ్చేసరికి ఎవరి ఆదాయం వారే చూపించుకోవాలి. అంటే భార్య ఖాతాలో రూ.10 లక్షలు, భర్త ఖాతాలో రూ.10 లక్షలు ఆదాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆదాయ పన్ను లెక్కింపులో రూ.12 లక్షల స్టాండర్డ్ డిడక్షన్ అమల్లో ఉంది. అంటే ఒక వ్యక్తి ఆదాయ పన్నులో రూ.12 లక్షల వరకు మినహాయించి మిగిలిన మొత్తానికే పన్ను లెక్కించి వసూలు చేస్తారు. ఈ లెక్కన ఇక్కడ భార్యాభర్తలిద్దరి ఆదాయం వేర్వేరుగా చూస్తే రూ.12 లక్షల స్టాండర్డ్ డిడక్షన్ కంటే తక్కువే(రూ.10 లక్షలు) ఉన్నందున వారిద్దరూ పైసా పన్ను చెల్లించనక్కర్లేదు. ఇదే సమయంలో మరో కుటుంబ పరిస్థితి చూస్తే.. ఆ కుటుంబంలో పురుషుడొక్కడే సంపాదనపరుడు. భార్య గహిణిగా ఉంటూ ఇల్లూపిల్లల ఆలనాపాలన చూస్తుంటారు. ఆమె భర్త ఆదాయం రూ.20 లక్షలు. అందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ.12 లక్షలు మినహాయిస్తే.. మిగతా రూ. ఎనిమిది లక్షలకు ఆదాయపన్ను శ్లాబ్ ప్రకారం రూ.1.92 లక్షల పన్ను చెల్లించాల్సి వస్తున్నది. అంటే సింగిల్ ఐటీఆర్ ఫైలింగ్ విధానం వల్ల ఒకే ఆదాయం పొందుతున్న ఇద్దరు సంపాదనపరులున్న కుటుంబాలు పూర్తి పన్ను రాయితీ అనుభవిస్తుంటే.. ఒక్కడే సంపాదనపరుడున్న కుటుంబాలు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తున్నది. దీనికి కారణం.. ఇండివిడ్యువల్ ఐటీఆర్ ఫైలింగ్ విధానమే. కానీ అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వివాహిత జంటలు ఉమ్మడి ఐటీఆర్ దాఖలు చేసే వెసులుబాటు ఉందని, భారత్‌లో కూడా దాన్నే అమలు చేయాలని ఆయన కోరారు. రాఘవ్ చద్దా ప్రతిపాదనకు ఆర్థిక నిపుణుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కూడా ఇలాంటి ప్రతిపాదననే గతంలో ప్రభుత్వం ముందు పెట్టింది. దీన్ని అమల్లోకి తెస్తే కుటుంబ స్థాయిలో ఎక్కువ పన్ను మినహాయింపు లభిస్తుంది.






Comments