top of page

వ్యవస్థల్లో కదలిక.. పనులు చకచకా

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • `ప్రభుత్వంతోపాటే మారుతున్న అధికారుల తీరు

  • `సమీక్షలు, పర్యటనలతో పరుగులు పెట్టిస్తున్న ప్రజాప్రతినిధలు

  • `ఎత్తిపోతలు, పంటకాల్వల దుస్థితిపై ప్రధాన దృష్టి

  • `శ్రీకాకుళం నగరంతోపాటు గ్రామాల్లో మౌలిక సమస్యలపై ప్రత్యేక డ్రైవ్‌

  • `వినతులతో ఎమ్మెల్యేల వద్దకు జనప్రవాహం

ఆకస్మిక తనిఖీలు.. అధికారులతో రివ్యూలు.. నీటి వనరులు, ప్రభుత్వ నిర్మాణాల పరిశీలనలు.. ప్రజావినతుల స్వీకరణలు.. ఇలా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచీ క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు. దాంతో ప్రజాప్రతినిధులతోపాటు అధికార యంత్రాంగం సైతం పరుగులు తీయాల్సి వస్తోంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత స్థూలంగా కనిపిస్తున్న గణనీయ మార్పు ఇది. ఒకవైపు పార్టీ నాయకులు, కార్యకర్తల తాకిడితో ఎమ్మెల్యేల కార్యాలయాలు కిక్కిరిసిపోతుంటే మరోవైపు తమ సమస్యలు చెప్పుకొని వినతిపత్రాలు ఇచ్చేందుకు సామాన్యప్రజలు ఎమ్మెల్యేల ఇళ్లు, ఆఫీసులకు పోటెత్తుతున్నారు. తమకు మళ్లీ ఉద్యోగాలు ఇవ్వాలని రాజీనామా చేసిన వలంటీర్లు.. తమకు అన్యాయం చేయవద్దని రాజీనామా చేయని వలంటీర్లు నిత్యం వస్తున్నారు. ఎన్నికల తర్వాత బదిలీలు సర్వసాధరణం కావడంతో అనుకూల బదిలీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాగా మండలలాల వారీగా సమీక్షలు నిర్వహించి ప్రభుత్వ వ్యవస్థలను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రభుత్వపరంగా జరుగుతున్న విద్యార్థులకు కిట్ల పంపిణీ, రైతులకు విత్తనాల పంపిణీ, ఈ నెల ఒకటో తేదీన జరిగిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరు ఎమ్మెల్యేలు పాల్గొనగా.. జలవనరుల శాఖ అధికారులతో కలిసి పంటకాల్వల స్థితిగతులను స్వయంగా తెలుసుకునే పనిలో కొందరు ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం.. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం పూర్తి అయిన తర్వాత గత నెల 18న తొలిసారి జిల్లాకు వచ్చిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆ మరుసటి రోజే అన్ని ప్రభుత్వ శాఖలతో జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించి తమ ప్రభుత్వ అజెండాను, ప్రాధాన్యతలను స్పష్టంగా వివరించారు. ఆ సమావేశంలోనే పలు నిర్ణయాలు తీసుకుని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడం ప్రారంభించారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో జలవనరుల శాఖ ప్రక్షాళనపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. వంశధార ఎడమ కాలువ శివారు ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించారు. కలెక్టర్‌ నిధుల నుంచి నిధులు విడుదల చేయించి నందిగాం మండలం కణితూరు నుంచి పలాస, వజ్రపుకొత్తూరు వరకు కాలువలో పేరుకుపోయిన డెబ్రిస్‌, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపట్టారు. ఈ విషయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఎన్నికల్లో ఇచ్చిన హమీని నెరవేర్చాలన్న కృతనిశ్చయంతో పట్టుదలగా పని చేస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు జలవనరులశాఖ అధికారులను వెంటబెట్టుకొని శివారు ప్రాంతాల్లో కాల్వలు, షట్టర్ల దుస్థితిని అంచనా వేశారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి మరోసారి పర్యటించి పనులు చేయించారు. ఫలితంగా ఐదేళ్ల తర్వాత శనివారం ఉదయం టెక్కలిపట్నం సమీపంలోని మోదుగులపుట్టి వద్దకు వంశధార నీరు చేరడంతో రైతులు, స్థానికులు ఎమ్మెల్యే గౌతు శిరీషకు హారతులు పట్టి సంబరాలు చేసుకున్నారు.

ఎత్తిపోతలపై అచ్చెన్న ఫోకస్‌

టెక్కలి నియోజకవర్గంలో గతంలో మంత్రి అచ్చెన్నాయుడు హయాంలో నిర్మించిన సౌడాం, చినసాన, మదనగోపాలపురం, టెక్కలిపాడు ఎత్తిపోతల పథకాలు గత ఐదేళ్లలో పడకేశాయి. వీటికి ఏర్పాటుచేసిన ట్రాన్స్‌ఫార్మర్లను దుంగులు ఎత్తుకెళ్లిపోవడం, కొన్నిచోట్ల ట్రాన్‌ఫార్మర్లలోని కాపర్‌ వైర్‌ చోరీ కావడంతో మూలకు చేరాయి. గత నెలలో జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వీటిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం శుక్రవారం ప్రత్యేక మెమో నెంబర్‌ 171 జారీ చేసి రూ.78.85 లక్షలు మంజూరు చేసింది. దాంతో ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా టెక్కలి, సంతబొమ్మాళి, నిమ్మాడ మీదుగా విశాఖకు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును శుక్రవారం ప్రారంభించారు.

నారాయణపురం ఆయకట్టుపై కూన పట్టు

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ నారాయణపురం ఆనకట్టతో పాటు నాగావళి ఎడమ కాలువను ఆ ప్రాంత రైతులు, అధికారులతో కలిసి పరిశీలించి కాలువ పరిస్థితిని అంచనా వేశారు. ఈ ఖరీఫ్‌లో కచ్చితంగా సాగునీరందించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. శివారు ఆయకట్టుకు నీరందించడానికి అవసరమైన పనుల కు అంచనాలు తయారు చేయాలని సూచించారు. దీంతోపాటు మండల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఇంటి వద్ద గ్రీవెన్స్‌ స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి హమీ ఇస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు యత్నాలు ప్రారంభించారు.

ఎన్‌ఈఆర్‌ దూకుడు

ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మండల అధికారులు, సచివాలయ ఉద్యోగులతో సమీక్షలు నిర్వహించి పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూనే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నారాయణపురం కుడికాలువ ఆయకట్టుకు సాగునీరు అందుతున్న తీరును జలవనరుల శాఖ అధికారులు, రైతులను వెంటబెట్టుకొని పరిశీలించారు. సాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో పర్యటించి ఇంటింటికీ కుళాయి పనులను పరిశీలిస్తున్నారు. నియోజకవర్గంలో గ్రామీణ రోడ్ల దుస్థితిని తెలుసుకొని వాటి మరమ్మతులకు భరోసా ఇస్తున్నారు.

మామిడి తనిఖీల జోరు

పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆకస్మిక పర్యటనలతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. రెండు రోజుల క్రితం బైదలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు, మందులను పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చి వారిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. దీంతో పాటు గ్రామాల్లో పర్యటిస్తూ జలజీవన్‌ మిషన్‌ పనులను పరిశీలిస్తున్నారు.

గ్రామాలపై అశోక్‌ దృష్టి

ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఖరీఫ్‌ విత్తనాల పంపిణీలో పాల్గొంటునే గత ప్రభుత్వం పెండిరగ్‌లో పెట్టిన పనులను పునరుద్ధరించే చర్యలు ప్రారంభించారు. గ్రామాల్లో జలజీవన్‌ పనులు, ఉద్దానం నీటి ప్రాజెక్టు నుంచి శుద్ధజలాలు అవుతున్న తీరును పరిశీలిస్తున్నారు. మండల అధికారులతో సమీక్షలు నిర్వహించి మౌలిక సౌకర్యాల కల్పనపై ఆరా తీస్తున్నారు.

ఆస్పత్రులపై బగ్గు అసంతృప్తి

నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి జలవనరుల అధికారులను వెంటబెట్టుకొని సాగునీటి కాలువల వెంట తిరుగుతున్నారు. దీంతోపాటు నరసన్నపేట సామాజిక ఆస్పత్రిని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఆస్పత్రిలో ప్రసవాలు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది పనితీరులో మార్పు రావాలని హితవు పలికారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పనులు పర్యవేక్షిస్తున్నారు.

నగరంలో శంకర్‌ ప్రత్యేక డ్రైవ్‌

వీరందరికీ భిన్నంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ రోజుకు 20 గంటలు పని చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని పంటకాలువలను జలవనరులశాఖ అధికారులతో కలిసి పరిశీలించి గార మండలంలోని శివారు ఆయకట్టుకు నీరందించే చర్యలు వేగవంతం చేశారు. శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న పారిశుధ్య ప్రత్యేక డ్రైవ్‌పై రోజూ అధికారులతో సమీక్షిస్తున్నారు. నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి రూ.కోటి వెచ్చించి మురుగుకాలువల్లో సిల్ట్‌ తొలగించే ప్రక్రియ చేపట్టారు. నగరంలో మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌ అండ్‌ బీ, జలవనరులు, మైన్స్‌, మత్స్యశాఖ, గృహనిర్మాణ శాఖల అధికారులతో సమీక్షించి పెండిరగ్‌ సమస్యలకు పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు. నగరంలో ఇటీవల భారీ వర్షం కురిసినప్పుడు తడుస్తూనే పలు మార్గాలు, లోతట్టు ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పర్యటించి ముంపు సమస్యలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భవిష్యత్తులో నీరు నిలవకుండా చేపట్టాల్సిన పనులపై అంచనాలు తయారుచేయాలని అధికారులను కోరారు. కేంద్ర, రాష్ట్రమంత్రులు అచ్చెన్న, రాము సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. ఇలా జిల్లాలో ప్రజాప్రతినిధులు బిజీబిజీగా గడుపుతున్నారు.


 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page