
గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణ అధ్వానం
మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి
(సత్యంన్యూస్, పాతపట్నం)
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యాధులు విజృంభిస్తున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణలో ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని ఆరోపించారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం వల్ల ప్రజలు వివిధ రకాల వ్యాధులు, విషజ్వరాల బారిన పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజావైద్యాన్ని సీఎం చంద్రబాబునాయుడు గాలికొదిలేసారని విమర్శించారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల వైద్యం కోసం కార్పోరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి దాపురించిందని విమర్శించారు. వైకాపా హయాంలో ప్రజారోగ్యాన్ని పటిష్టం చేసేందుకు పలు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని గుర్తుచేశారు. గ్రామాలు, పట్టణాల్లో నీటిని క్లోరినేషన్ చేయకుండా చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలతో అనారోగ్య పీడితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయని, మలేరియా, డెంగ్యూ, డయేరియా, విషజ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులను నియంత్రించి బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆమె అన్నారు. ఫీవర్ సర్వేలు నిర్వహించి వైరస్ జ్వరాలు, వైరస్ వ్యాప్తిపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజారోత్యం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని హితవుపలికారు.
Comentarios