top of page

వైరస్‌కు కూడా సీక్వెల్స్‌ ఉంటాయి

Writer: DV RAMANADV RAMANA

బాహుబలి-1, బాహుబలి-2, కెజిఎఫ్‌-1, కెజిఎఫ్‌-2, పుష్ప-1, పుష్ప-2.. ఇప్పుడు సీక్వెల్‌ సినిమాలు సాధారణమయిపోయాయి. వైరస్‌కు కూడా సీక్వెల్స్‌ ఉంటాయి. కరోనా-1, కరోనా-2. ఈ రెండు పాండెమిక్‌ దశలు. అటుపై కరోనా-3 అంటే ఓమిక్రాన్‌ వచ్చింది. మనం లెక్క వేసుకోలేదు కానీ.. ఇప్పటికి కరోనా 4, 5, 6 వచ్చి పోయుంటాయి. ఇది ఎండెమిక్‌ దశ. రెండు దాటితే.. పాండె మిక్‌.. ఎండెమిక్‌ అయిపోతుంది. పాండెమిక్‌కు, ఎండెమిక్‌కు తేడా తెలుసుకోవడం అవసరం. వైరస్‌ తొలిసారిగా పుట్టినప్పుడు (కరోనా విషయంలో పుట్టించినప్పుడు అని వాడాలి) అది పాండెమిక్‌ అయ్యే అవకాశముంది. గాలి ద్వారా వ్యాపించేది.. అంటే శ్వాసకోస సంక్రమణ. సహజంగానే వేగంగా విస్తరి స్తుంది. వైరస్‌ను చంపే మందు ఇప్పటి వరకు రాలేదు. భవిషత్తులో రావడం అంత ఈజీ కాదు. వైరస్‌ వేగంగా సంతానోత్పత్తి చేయకుండా ఇతర కణాలకు చొరబడకుండా చేసే మందులు మాత్రం వచ్చాయి. కాబట్టి అది వందేళ్ల నాటి స్పానిష్‌ ఫ్లూ కావొచ్చు, మొన్నటి కరోనా కావొచ్చు. వైరస్‌ను చంపింది మనుషుల శరీరంలోని ఇమ్మ్యూనిటీ వ్యవస్థే. వ్యక్తి ఇమ్మ్యూనిటీ బాహుబలిలా బలీయంగా ఉంటే, కనీసం మాదిరిగా ఉంటే.. వైరస్‌ చచ్చి ఊరుకుంటుంది. ఇమ్మ్యూనిటీ బలహీనంగా ఉన్నవారు పాండె మిక్‌ దశలో మరణిస్తారు. పాండెమిక్‌ దశలో వైరస్‌ ఇంచుమించు జనాభా మొత్తానికి సోకుతుంది. (ముఖ్యంగా గాలి ద్వారా వ్యాపించే కరోనా లాంటివి) కనీసం ఎనభై శాతానికి సోకినప్పుడు హెర్డ్‌ ఇమ్మ్యూనిటీ వస్తుంది. వైరస్‌ సోకినప్పుడు.. ఇమ్మ్యూనిటీ కనీసం ఒక స్థాయిలో ఉన్నవారు బతుకుతారు. ఇమ్మ్యూనిటీకి మనలాగే సెల్ఫీ పిచ్చి. అదే మానవాళిని కాపాడేది. వైరస్‌ అంటే శత్రువు కదా. శత్రువు ను చంపుతున్నప్పుడు అది సెల్ఫీ తీసుకొని భద్రపర్చుకుంటుంది. ఇమ్మ్యూనిటీకి ఫోటోగ్రాఫిక్‌ మెమరీ ఉంటుంది. ఇమ్మ్యూనిటీలోని మెమరీ-బి సెల్స్‌, మెమరీ-టి సెల్స్‌ వైరస్‌ను గుర్తు పెట్టుకొంటాయి. ఒక్క సారి వైరస్‌/బాక్టీరియా సోకితే టి సెల్స్‌ రక్షణ వచ్చేస్తుంది. టి సెల్స్‌ ఆ రోగకారక జీవిని గుర్తుపెట్టుకొని ఇంకోసారి సోకితే టక్కున చంపేస్తాయి. సీక్వెల్‌ మాదిరిగా రెండోసారి, మూడోసారి సోకితే ప్లాప్‌ అయ్యే అవకాశం ఎక్కువ. అందుకే పాండెమిక్‌ దశ దాటితే వచ్చేది ఎండెమిక్‌ దశ. పాండెమిక్‌లో ఒకటా? రెండా? ఎన్ని వేవ్‌లు? అనేది మొదటి దశలో వ్యాధి ఎంతమందికి సోకింది? అనేదానిపై ఆధారపడు తుంది. కరోనా మొదటి వేవ్‌లో పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ మందికి సోకడం, హెర్డ్‌ ఇమ్మ్యూనిటీ రావడం జరిగిపోయింది. ఇక్కడ తొలి దశలోనే ఎక్కువ నష్టం జరిగింది. రెండో దశ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేదు. అదే ఎక్కువ జాగ్రత్తలు తీసుకొన్న చోట్ల హెర్డ్‌ ఇమ్మ్యూనిటీ రాక రెండో దశ అరివీర భయంకరం అయ్యింది. ఎండెమిక్‌ దశ అంటే వైరస్‌ పోదు. పాండెమిక్‌ దశ తర్వాత అది మన మధ్య స్థిరపడిపోతుంది. మన శరీరాల్లో అప్పటికే దానికి సంబంధించిన సహజ ఇమ్మ్యూనిటీ ఉంటుంది. అదేనండి టి సెల్స్‌ రక్షణ. దానితో వైరస్‌ తోక ముడిస్తుంది. మరీ బలహీన మైన ఇమ్మ్యూనిటీ వ్యవస్థ వున్నవారిని తప్పించి అది సీక్వెల్‌లో ఎవరినీ ఏమీ చేయలేదు. అంటే వారి ఇమ్మ్యూనిటీ ఇటీవల బాగా బలహీనం అయి ఉంటే టి సెల్స్‌ రక్షణ కూడా ఏమీ చేయలేదు. అలాంటి వారే ఎండెమిక్‌ దశలో కూడా చనిపోతారు. హెచ్‌ఎంపీవీ దీన్ని 2001లో గుర్తించింది. దానికి కనీసం యాభై ఏళ్ల ముందు నుంచి ఇది ఉందని శాస్త్రవేత్తల అంచనా. ఇది గాలి ద్వారా సోకే వైరస్‌. మన దేశంలో జనాభా, జనసాంద్రత ఎక్కువ. అప్పట్లో సరిగా రికార్డు చేయలేదు కానీ ఇది ఏనాడో.. అంటే మన తాతల కాలంలోనే పాండెమిక్‌ దశ దాటి ఎండెమిక్‌ అయిపోయుంటుంది? 2 తర్వాత 1 ఎలా వస్తుంది పుష్పా? హెచ్‌ఎంపీవీ ఇప్పుడు పాండెమిక్‌ కాబోతుంది అని ప్రచారం. ఎండెమిక్‌ అయ్యింది.. పాండెమిక్‌ ఎలా అవుతుంది? ఇది మనందరికీ ఏనాడో సోకి ఉంటుంది. ఒకటి కాదు.. అనేక సార్లు సోకివుంటుంది. దీనికి సంబంధించిన టి సెల్స్‌ రక్షణ మనకు ఉంది. ఇంకో మాట.. హీరో గారు పిల్లి గడ్డం పెట్టుకొని వస్తే... విలన్‌ గుర్తించలేడు.. ఇది సినిమాల్లో. కానీ ఇది నిజజీవితం. ఇక్కడ ఉన్నది బాహుబలి ఇమ్మ్యూనిటీ హీరో. వైరస్‌ ఎన్ని వేషాలు వేసినా.. అంటే ఎన్ని మ్యుటేషన్‌లు పొందినా బి సెల్స్‌, టి సెల్స్‌ టక్కున పట్టేస్తాయి. ఇది ఖాయం. కాబట్టి హెచ్‌ఎంపీవీ పాండెమిక్‌ కాబోదు. టెస్ట్‌లు చేస్తే కేవలం నాలుగు నగరాల్లో కాదు. ఊరువాడా దీని ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇప్పుడు.. ఆ మాట కొస్తే ఎప్పుడూ... కావలసింది బలమైన ఇమ్మ్యూనిటీ వ్యవస్థ. అదే శ్రీరామరక్ష.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page