`హింసాత్మక ఘటనల మధ్య రాష్ట్రంలో భారీ పోలింగ్
`మధ్యాహ్నం 3 గంటల వరకు 56 శాతం నమోదు
`పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన మహిళలు, వృద్ధులు
`పల్నాడు, రాయలసీమ జిల్లా అనేకచోట్ల ఘర్షణలు
`నరసరావుపేట వైకాపా అభ్యర్థి ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి
`ఎంపీ రావుశ్రీకృష్ణదేవరాయలు కాన్వాయ్ కార్లు ధ్వంసం
`విజయనగరం జిల్లా పోలింగ్ ఆఫీసర్ అరెస్టు
`గుండెపోటుతో ఓట్లు వేయడానికి వచ్చిన ఇద్దరి మృతి
`తెనాలిలో ఓటరుపై చేయి చేసుకున్న వైకాపా ఎమ్మెల్యే
`ఉదయం పలు కేంద్రాల్లో పనిచేయని ఈవీఎంలు
`మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. ఓటర్ల ఇక్కట్లు
(సత్యం ప్రత్యేక ప్రతినిధి, శ్రీకాకుళం)
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా, భారీగా జరిగింది. అదే సమయంలో పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటుకున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 55.49 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలుకాగా ఏజెన్సీ ఏరియాలోని కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకు, మరికొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. అయితే ఆ సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూల్లో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. దాంతో మొత్తం పోలింగ్ ముగిసేసరికి రాత్రి ఏడు, ఎనిమిది గంటలు కావచ్చు. వేసవి ఎండల కారణంగా ఓటర్లు ఉదయాన్నే పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, కొత్తగా ఓటుహక్కు పొందిన యువత పెద్దఎత్తున తరలివచ్చి ఓట్లు వేశారు. ఉదయం అనేక కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనా ఓటర్లు ఓపిగా వేచి ఉండి మరీ ఓట్లు వేశారు. ఓటర్ల ఉత్సాహం కారణంగా మధ్యాహ్నానికే పోలింగ్ 50 శాతం మార్క్ చేరుకుంది. ఉదయం తొమ్మిది గంటల వరకు 9 శాతం, పది గంటలకు 18.81 శాతం, 11 గంటలకు 25 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 40.26 శాతం, రెండు గంటలకు 50 శాతం, మూడు గంటల సమయానికి 55.49 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ సమయానికి కడప, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా 60 శాతం పోలింగ్ జరగ్గా విశాఖ జిల్లాలో అత్యల్పంగా 46 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికే రాష్ట్రవ్యాప్తంగా 1.70 కోట్ల మంది ఓటు వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలిరాగా, పట్టణ, నగర ప్రాంతాల్లో ఓ మోస్తరుగా పోలింగ్‌లో పాల్గొన్నారు. విశాఖ నగర పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లోనూ తక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయి.
`పాలకొండ నియోజకవర్గం అడ్డాకులగూడ పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటలకే 85 శాతం పోలింగ్ పూర్తి అయిపోయింది. ఈ బూత్‌లో మొత్తం 231 ఓట్లకుగాను ఆ సమయానికి 190 ఓట్లు పోలయ్యాయి.
`విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడ గ్రామంలోని 181 కేంద్రంలో ఈవీఎం రిపేర్ పోలింగ్ చాలాసేపు నిలిచిపోయింది.
`నెల్లిమర్ల నియోజకవర్గం బొప్పడాం బూత్ నెం.62లో ఈవీఎం పనిచేయకపోవడంతో అరగంట సేపు పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎం మార్చిన తర్వాత తిరిగి కొనసాగింది. విజయనగరం జిల్లాలో చాలాచోట్ల ఇవే సమస్యలు తలెత్తాయి.
`పెద్దబంటుపల్లిలో ఈవీఎం పనిచేయకపోవడంతో 10.30 వరకు పోలింగ్ ప్రారంభం కాలేదు. ఈవీఎం మార్చినా ఫలితం లేకపోయింది. విజయనగరంలోని మహారాణిపేట విజ్ఞానభారతి హైస్కూల్లోనూ ఈవీఎం మొరాయించగా మరమ్మతులు చేసిన అనంతరం ఆలస్యంగా పోలింగ్ మొదలుపెట్టారు.
`మచిలీపట్నం బూత్ నెం. 136, గన్నవరంలోని కొన్ని కేంద్రాల్లోనూ ఈవీఎంలు పని చేయకపోవడంతో గంటల తరబడి పోలింగ్ నిలిచిపోయింది.
`కర్నూలు జిల్లా హాలహర్విలో 74, బాపురంలో 22వ నెంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పని చేయలేదు.
`కైకలూరు మండలం వింజరం పోలింగ్ కేంద్రం 167లో గోలి రత్నప్రభాకర్‌రావు(65), అలాగే మరో పోలింగ్ కేంద్రంలో నాగమణి అనే ఓటరు గుండెపోటులో మృతి చెందారు.
`అల్లూరి జిల్లా పెదబయలు మండంలోని నాలుగు గ్రామాల ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు.
`అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి భారీ వర్షం ప్రారంభం కావడంతో ఓటర్లు అసౌకర్యానికి గురయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురిశాయి.
పోలింగ్ ఆఫీసర్ అరెస్ట్
విజయనగరం జిల్లా కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చిన వృద్ధులను టీడీపీకి ఓటు వేయాలని చెప్పి వేయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి పీవోను అరెస్టు చేశారు. దాంతో అక్కడ రెండు గంటలకుపైగా పోలింగ్ నిలిచిపోయింది.
ఓటరు చెంప పగులగొట్టిన ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా తెనాలి సిటింగ్ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ కేంద్రం క్యూలైనులో ఉన్న ఓటరుపై చేయి చేసుకోవడం వివాదంగా మారింది. ఓ పోలింగ్ కేంద్రం వద్ద మహిళలను వేధిస్తున్నారని సమాచారం అందడంతో ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని, కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన ఓటు వేయడానికి వెళ్తున్నారని భావించిన ఒక ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో వాగ్వాదం జరిగి, ఎమ్మెల్యే శివకుమార్ ఓటరు చెంపపై కొట్టారు. ఓటరు కూడా అదేస్థాయిలో తిరిగి ఎమ్మెల్యేను కొట్టారు. ఈ నేపథ్యంలో అటు వైకాపా, ఇటు టీడీపీ శ్రేణులు రంగంలోకి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేను కొట్టిన ఓటరును ఆయన అనుచరులు చితకబాదారు.
దాడులు.. ఘర్షణలు..
ఒకవైపు పోలింగ్ భారీగా జరుగుతుంటే.. మరోవైపు అదేస్థాయిలో పలు జిల్లాల్లో వాగ్వాదాలు, దాడులు, ఘర్షణలు తీవ్రస్థాయిలో జరిగాయి. ఫలితంగా కొన్ని కేంద్రాల్లో పోలింగ్‌కు అంతరాయం వాటిల్లింది. నరసరావుపేటలో సిటింగ్ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై సోమవారం మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిరది. ఎమ్మెల్యే అనుచరులు, వైకాపా కార్యకర్తలు వారిని ప్రతిఘటించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు.
`నరసారావుపేట మండలం దొండపాడులో పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లి సిటింగ్ ఎంపీ, టీడీపీ అభ్యర్థి లావుకృష్ణదేవరాయలుపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడి రాళ్లు రువ్వారు. ఆ ఘటనలో మూడు ఎస్కార్ట్ వాహనాలు ధ్వంసమయ్యారు.
`విజయనగరంలోని కంటోన్మెంట్ హైస్కూల్ కేంద్రం వద్ద వైకాపా, టీడీపీ మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
`కర్నూలు జిల్లా కారుమంచి పోలింగ్ కేంద్రం 225లో పోలింగ్ సిబ్బంది టీడీపీ అనుకూలంగా ఓటు వేయిస్తున్నారని ఆరోపిస్తూ వైకాపా శ్రేణులు పోలింగ్‌ను అడ్డుకున్నాయి. పోలింగ్ సిబ్బంది తీరుకు నిరసనగా అక్కడే ధర్నాకు దిగాయి.
` చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేసి దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టారని టీడీపీ వర్గీయులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
`అన్నమయ్య జిల్లా దలవాయి గ్రామంలో దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేయడంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది.
`అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. పట్టణంలోని ఓంశాంతినగర్ కమాన్ సర్కిల్ వద్ద టీడీపీ, వైకాపా కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. దాంతో వైకాపా సిటింగ్ ఎమ్మెల్యే, అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి కారుతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
`ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో వైకాపా, టీడీపీ అభ్యర్థులు వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది తారస్థాయికి చేరి ఘర్షణ జరిగే పరిస్థితి తలెత్తడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
`ప్రకాశం జిల్లా చీరాల మండలం గవినివారిపాలెంలో రెండు ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం రాళ్లదాడులు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు.
`కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరంలో వైకాపా నేత వెంకటేశ్వరరావు టీడీపీ కార్యకర్త ఒకరు దాడి చేసి తల పగులగొట్టాడు.
`పల్నాడు జిల్లా మాచర్లలో 205, 206, 207, 216 పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలను ధ్వంసం చేయడంతో ఆ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఇదే జిల్లా కంభంపాడులో వైకాపా, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైకాపా కార్యకర్తలు గొడ్డళ్లు, వేటకొడవళ్లు, రాడ్లతో దాడికి యత్నించారు. దాంతో పోలీసులు అదనపు బలగాలను అక్కడి తరలించి పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు. ఐజీ శ్రీకాంత్ స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో టీడీపీ ఏజెంట్లపై వైకాపా వర్గీయులు జరిపిన దాడిలో నలుగరు ఏజెంట్లు తీవ్రంగా గాయపడ్డారు.
`కడప జిల్లా జమ్మలమడుగులో వైకాపా, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగాయి.
`ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో పోలింగ్ కేంద్రం సందర్శనకు వెళ్లిన టీడీసీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని బృందంపై వైకాపా వర్గీయులు దాడి చేసి రాళ్ల వర్షం కురిపించారు.
`నెల్లూరు జిల్లా గూడూరు వైకాపా అభ్యర్థి మురళీపై టీడీపీ నేతలు దాడికి పాల్పడటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు పదిమంది అరెస్టు చేశారు.
`అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారిపల్లె పోలింగ్ కేంద్రంలో వైకాపా నేతలు టీడీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగేశారు. టీడీపీ ఏజెంట్ సుభాష్‌పై ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సుభాష్ కన్ను కోల్పోయాడు. ఇదే మండలం మల్లెవారిపల్లిలో టీడీపీ కార్యకర్త జడ రాంప్రసాద్‌ను వైకాపా కార్యకర్తలు చితకబాదారు.
`వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులో వైకాపా కార్యకర్తలు టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసి పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు లాగేశారు.
`శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వైకాపా అభ్యర్థి దుద్దికుంట శ్రీధర్ రెడ్డి స్వగ్రామం నల్లసింగయ్యపల్లిలోని 147వ కేంద్రంలోకి వైకాపా నాయకులు చొరబడి దౌర్జన్యంగా పది ఓట్లు వేయించుకున్నారని టీడీపీ ఆరోపించింది.
`బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం పరిశావారిపాలెంలో ఓటు వేసేందుకు వచ్చిన యువకుడితో వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. యువకుడు ఎదురు ప్రశ్నించడంతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువకుడి తలకు గాయమైంది.
`కొయ్యలగూడెంలో వంకబొత్తప్పగూడేన్ని ఐటీడీఏలో కలపాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు.
మార్కెట్‌యార్డ్ ఛైర్మన్‌పై ఎస్సై ప్రతాపం
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నారాయణమూర్తిపై చేయి చేసుకున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడినా పోలీసు అధికారులు జోక్యంతో సద్దుమణిగింది. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ అక్కడికి చేరుకున్నారు. అనవసరంగా చేయిచేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.
Comments