అక్రమ రొయ్యల చెరువులతో దిశ మార్చుకున్న నాగావళి
గ్రామాలను వరద ముంచెత్తుతుందని స్థానికుల ఆందోళన
కోర్టు స్టేల పేరుతో పబ్బం గడుపుకుంటున్న అక్రమార్కులు
నామమాత్రపు తొలగింపులతో సహకరిస్తున్న అధికారులు

నాగావళి నది సముద్రంలో కలిసే ప్రాంతం పూర్తిగా కోతకు గురై నదీప్రవాహ దిశ పూర్తిగా మారిపోయిందని, దీనికి తక్షణ పరిష్కారం చూపించాలని గత నెల 28న జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. నదీ ప్రవాహ దిశ మారడానికి పెద్దగనగళ్లపేట వద్ద అక్రమంగా నిర్మించిన రొయ్యల చెరువులే కారణమని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రవాహ దిశ మారడం వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని పలు నాగావళి తీర గ్రామాల్లో ఆక్వా సాగు పెరిగింది. నదీసాగర సంగమ ప్రాంతంలో సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించి శ్రీకాకుళానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు రొయ్యల చెరువులు తవ్వించి ఆక్వాసాగు ద్వారా దండిగా లాభాలు ఆర్జిస్తున్నారు. దీనిపై మత్స్యకార సంఘాలు ఆందోళనలు చేసినా, అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా అక్రమ చెరువులకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ముందుకు రావడంలేదు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఆక్వా రైతుల ముసుగులో నగరానికి చెందిన కొందరు వ్యాపారులు, రాజకీయ నాయకులు నాగావళి ప్రవాహ మార్గంలోనే చెరువులు నిర్మించి రొయ్యల సాగు చేస్తున్నారు. రమేష్, వాసు, రాము, జగపతి, సూర్యనారాయణ, సుధ అనే వ్యక్తులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీరంతా వైకాపా, టీడీపీ నాయకులతో చెలిమి చేస్తూ చెరువులను తొలగించే ప్రక్రియను అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో జాలారిపేట వద్ద బంగాళాఖాతంలో నాగావళి నది కలిసే ప్రాంతాల్లో భారీ యంత్రాల సాయంతో చెరువులు తవ్వించారు. చేపల వేటే తమ జీవనాధారమని.. పెద్దగనగళ్లపేట, మోపసుబందర్, జాలరిపేటల్లో నివాసం ఉంటున్నట్టు చూపించి మత్స్యకార సంఘం పేరుతో సుమారు 100 ఎకరాలు ఆక్రమించి 70కి పైగా చెరువులు తవ్వేశారు. ఈ భూమి కోస్టల్ రెగ్యులేటరీ జోన్(సీఆర్‌జెడ్)లో ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నా వీరంతా మత్స్యకారుల ముసుగు వేసుకొని ఆ భూమి తమ సాగులో ఉన్న అసైన్డ్‌ల్యాండ్‌గా న్యాయస్థానాన్ని నమ్మించేందుకు ప్రయత్నించారు.
తూతూమంత్రంగా తొలగింపులు
శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలో 16 రొయ్యల చెరువులకే కోస్టల్ రెగ్యులేటరీ అనుమతులు ఉన్నాయి. మిగతా చెరువులన్నీ అక్రమంగా నిర్వహిస్తున్నవేనని స్వయంగా మత్స్యశాఖ అధికారులే న్యాయస్థానానికి రెండుసార్లు నివేదించారు. అయినా ఆక్రమణదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఏదో ఒక విధంగా ఆక్రమణలను తొలగించకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆక్రమణదారులకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియడం, హైకోర్టు కూడా స్టే ఇవ్వడానికి నిరాకరించడం, చెరువులను తక్షణమే తొలగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సైతం ఆదేశించడంతో గత ఏడాది ఆగస్టులో రెవెన్యూ, పోలీసు అధికారులు అక్రమ చెరువుల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. కానీ అది తూతూమంత్రంగానే జరిగింది. రెవెన్యూ అధికారులు యంత్రాల సాయంతో రోడ్డుకు సమీపంలో ఉన్న చెరువు గట్లను మాత్రమే కొంతమేర తొలగించి మిగతావాటిని విడిచిపెట్టేశారు. దీనికి ఆర్ధికపరమైన సమస్యలతో పాటు చెరువులను పూర్తిస్థాయిలో తొలగించే అవకాశం లేకపోవడం కారణమని చెబుతున్నారు. పెద్దగనగళ్లపేట పరిధిలో అక్రమంగా చెరువుల తవ్వకాలు జరిపి రొయ్యలు సాగు చేస్తున్నవారంతా రాజకీయ పార్టీలకు చెందినవారే. వీరంతా 2019కి ముందు టీడీపీలో ఉండగా తర్వాత వైకాపా అధికారంలోకి రావడంతో కండువాలు మార్చి అధికార పార్టీ నాయకుల చెంతకు చేరిపోయారు. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కొందరు జనసేన నాయకులుగా, మరికొందరు టీడీపీ నాయకులుగా చెలామణీ అవుతున్నారు.
12 మినహా అన్నీ అక్రమ చెరువులే
కోస్టల్ ఆక్వా రెగ్యులేటరీ చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు బంగాళాఖాతం భూభాగంలో (అన్ సర్వే ల్యాండ్‌లో) అనధికారికంగా చెరువులు నిర్మించి రొయ్యలు సాగు చేస్తున్నారు. వీటిని చట్టబద్దం చేసుకోవడానికి 2021 మార్చి 12 నుంచి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికారుల నిర్ణయాలపై పదే పదే న్యాయస్థానాలకు వెళ్లి స్టేఆర్డర్లు తెచ్చుకుంటూ చెరువులను తొలగించకుండా అడ్డుకుంటున్నారు. 2023 జూలై 19న పెద్దగనగళ్లపేట, మోపసుబందర్, జాలారిపేట, కళ్లేపల్లి పరిధిలోని అక్రమ రొయ్యల చెరువులను తొలగించాలన్న న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడానికి పోలీసుల సాయంతో రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. కానీ అదే రోజు ఆక్రమార్కులు హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో చెరువుల తొలగింపు ప్రక్రియకు బ్రేక్ పడిరది. అదే నెల 26న హైకోర్టు నుంచి రెండు వారాల స్టే తెచ్చుకున్నారు. పిటిషన్లు సాగు చేస్తున్న రొయ్యల చెరువులను మరోసారి పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆ సందర్భంగా కోర్టు జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. దానికి సిద్ధమైన అధికారులు 2023 ఆగస్టు 26న కలెక్టర్ ముందు విచారణకు హాజరు కావాలని 27 మంది పిటిషనర్లకు నోటీసులు పంపారు. అయితే అనివార్య కారణాలు అన్న సాకుతో అప్పటి అధికార పార్టీ నాయకుల సూచనలతో ఉన్నతాధికారులు విచారణను వాయిదా వేశారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆక్రమణదారులు రొయ్యల చెరువుల తొలగిస్తే తీవ్రంగా నష్టపోతామని, అందువల్ల పునఃపరిశీలించాలని కలెక్టర్‌కు మరో వినతిపత్రం ఇచ్చారు. ఈ వ్యవహారంలో రెండు పార్టీలవారు ఏకమై రొయ్యల సాగుకు అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతూ వచ్చారు.
పలుమార్లు స్టేలు.. వాయిదాలు
అక్రమ చెరువుల వల్ల నాగావళి ప్రవాహ దిశ మారుతోందని స్థానికులు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులను తొలగించకుంటే వరదల సమయంలో నదీ ప్రవాహం గ్రామాలను ముంచెత్తే ప్రమాదముందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కొందరు కోర్టును కూడా ఆశ్రయించడంతో జిల్లా ఉన్నతాధికారులు చెరువులను వెంటనే తొలగించాలని 2021 మార్చి 16న మండల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీన్ని ఆక్రమణదారులు న్యాయస్థానంలో సవాల్ చేయగా 2023 ఫిబ్రవరి 28న పిటిషన్ 21420/2021ను కొట్టేస్తూ చెరువుల తొలగింపునకు కోర్టు అనుమతినిచ్చింది. ఆ నోటీసులు అందుకున్న ఆక్రమణదారులు కలెక్టర్ వద్దకు వెళ్లి చెరువుల్లో రొయ్యల సాగు కొనసాగుతోందని, అది పూర్తి అయ్యేవరకు నాలుగు నెలల గడువు తెచ్చుకున్నారు. అది కూడా 2023 జూన్ 28తో పూర్తయింది. దీంతో జూలై 5న ఒకసారి, కోర్టు ఆదేశాలతో జూలై 12న ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి జూలై 19న తొలగించడానికి మరోసారి రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఆక్రమణదారులు మళ్లీ కోర్టును ఆశ్రయించి రెండు వారాల స్టే సంపాదించారు. కాగా 2023 జూలై 13న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బృందం రొయ్యల చెరువుల ప్రభావిత గ్రామాలతోపాటు నదీ, సముద్రం కలిసే ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత తక్షణమే చెరువులను తొలగించాలని, అనంతరం నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించింది. కానీ రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా ఆ పని అయ్యిందనిపించి చాలా చెరువులును వదిలేశారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు హడావుడిలో అధికారులు ఉండిపోవడంతో రొయ్యల చెరువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
Comments