top of page

వారానికి నలుగురు కుభేరులు

Writer: DV RAMANADV RAMANA

మొన్ననే ఆక్స్‌ఫామ్‌ నివేదిక విడుదలైంది. మానవజాతి చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఎరగని అసమానతలపర్వం ఇప్పుడు సమాజాన్ని కలవరపెడుతున్నది. ప్రపంచంలో సంపదంతా ఒకవైపు పోగుపడు తుండగా, పేదరికం, దారిద్య్రం దానికి రెండింతలు వేగంగా అభివృద్ధి చెందుతున్నది.ఇది ఆందోళన కలిగించే అంశం. ప్రతి ఏడాదిలాగే ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) వార్షిక సమావేశం ప్రారంభమయ్యే రోజు ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ అసమానతలపై ఓ నివేదికను విడుదల చేస్తుంది. ప్రపంచీకరణ సంస్కరణలు ప్రారంభమైన 1990వ దశకం నుంచి పేదల జీవితాల్లో ఎలాంటి మార్పురాలేదని, కోటీశ్వర్ల సంపద మాత్రం అమాంతం పెరిగిపోయిందని నివేదిక పేర్కొంది.

ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో 2024 సంవత్సరంలో 204 మంది చేరారు. అంటే వారానికి సగటున సుమారు నలుగురు వ్యక్తులు కుబేరులవుతున్నారన్నమాట. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన పదిమంది సంపద కరోనా మొదలైనప్పటి నుంచీ ఇప్పటివరకు మధ్య కాలంలో రెట్టింపు కాగా, ప్రపంచ జనాభాలో తొంభైతొమ్మిది శాతం ఆదాయం అదేకాలంలో పడిపోయింది. ప్రజలు పనుల్లేక పస్తులున్నారు. పైసల్లేక విలవిల్లాడారు. ఈ పదిమంది సంపద మాత్రం రోజుకు సగటున రూ.8.60లక్షల చొప్పున పెరిగింది. ప్రపంచ జనాభాలో సుమారు ఇరవై ఐదు లక్షల మంది దగ్గర యాభై లక్షల కోట్ల డాలర్ల సంపద పోగైంది.ఎందుకీ కోటీశ్వరుల సంఖ్య పెరుగుతోంది? కార్మికులను చేస్తున్న దోపిడీ ప్రభుత్వాలు వారికి అండగా నిలవడమే కారణం.

సంపదలో 36శాతం వారసత్వం నుంచి వచ్చిందే. ‘కోటీశ్వరుల సంపద మాత్రమే పెరగలేదు, దీంతోపాటు ఆర్థికరంగంపై వారి పెత్తనం కూడా పెరుగుతోంది’ అని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అమితాబ్‌ బెహర్‌ చెప్పిన మాటల్ని తేలిగ్గా తీసుకోకూడదు, ఎందుకంటే, ఈ రోజు ప్రపంచ దేశాల్ని పన్నులు, సుంకాల రూపంలో పీల్చి పిప్పిచేస్తున్న అగ్రరాజ్యం, దానికి కుబేరుడు ప్రెసిడెంట్‌ అయ్యాడు. ఆయనకు మద్దతిచ్చిన ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ‘ఎక్స్‌’ అధినేత ఎలాన్‌మస్క్‌ ఇతను రాబోయే కాలంలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నడుపుతారని వస్తున్న వార్తల్లో ఆశ్చర్యం లేదు. రాష్ట్రాలు, దేశాలు, ఖండాల్లోని ఆర్థిక అసమానతల్లో తేడాలుండొచ్చు, మూలం మాత్రం పెట్టుబడిదారీ విధానమేనన్న సంగతి మరవకూడదు.

మన దేశంలో చూస్తే అసమానతలు పెరగడానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రధాన కారణం. కార్పొరేట్ల స్వప్రయోజనాల కోసం పాటుపడటం, వారికి లబ్ది చేకూర్చే విధంగా చట్టాల్ని తీసుకురావడం, రూల్స్‌ని రూపొందించడం, యథేచ్ఛగా సాగుతున్న అవినీతికి వంతపడటం. ఇంకా ప్రమాదకరమైన అంశం ఏమిటంటే? పాలకులే ఏకంగా బడా పారిశ్రామికవేత్తలతో మిలాఖత్‌ అవ్వడం. ఇలాంటి నాయకులు దేశాన్ని ఏలుతుంటే సంపద కొద్దిమంది వద్దే కేంద్రీకరణ కాకుండా ఎలావుంటుంది?ఇప్పుడు భారత్‌లో జరుగుతున్నది కూడా అదే. మోడీ ఈ పదేండ్ల పాలన చూస్తే సంపద కేంద్రీకరణ విషయంలో అసమానతలు గరిష్ట స్థాయికి చేరి ధనవంతులు కుబేరులయ్యారు.2022-23 నాటికి దేశంలో అత్యంత సంపన్నులుగా ఉన్న ఒక్కశాతం మంది సంపద 22.6శాతం నుండి నలభై శాతానికి ఎకబాకింది. చారిత్రకంగా ఇది అత్యధిక పెరుగుదల. బ్రిటీష్‌వలస పాలన కాలం కన్నా మోడీ హయాంలోనే ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయని ఒక అధ్యయనం వివరించింది. నేలచూపులు చూస్తున్న వినిమయ వస్తు పరిశ్రమ, తలసరి రుణాల పెరుగుదల, పొదుపు రేటు తగ్గడం ఈ వాస్తవానికి బలం చేకూర్చే అంశాలు.

స్వాతంత్య్రం ఆవిర్భవించినప్పటి నుంచి పాలకవర్గాలు చేస్తున్న స్వప్రయోజిత నిర్ణయాలు కార్పొరేట్‌ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్థానంలో అదనంగా కులం, మతం, ప్రాంతం చేరాయి. ఇవి ప్రజల్ని విభజించి పాలించే విధానానికి దోహదం చేస్తున్నాయి. నేడు కేంద్ర పాలకులు అదానీ, అంబానీలాంటి కార్పొరేట్లకు కట్టబెట్టే భూగర్భ గనులు, విమానాశ్రయాలు, రైల్వేలు, టెలికాం, విద్యుత్‌ ఇవన్నీ కూడా భారత ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా భారాలు వేసే చర్యలే! పాలకులు అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాల ఫలితమే అసమానతల స్థాయి పెరగడానికి కారణం. ఇది పేదరికాన్ని మరింత పెంపొదిస్తున్నది. ఉపాధిని కబళిస్తున్నది. ఉద్యోగాల ఊసే లేకుండా చేస్తున్నది. ప్రజల్ని మరింత దారిద్య్రానికి దిగజారుస్తున్నది.గతంలో ఎన్నడూ లేని విధంగా అదానీ,అంబానీ లాంటి కార్పొరేట్‌ దిగ్గజాలకు రూ.పదహారు లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల్ని మాఫీ చేసింది మోడీ సర్కార్‌. ఈ డబ్బంతా ఎవరిది? ప్రజలదే కదా. అందుకే ప్రపంచ ఆకలిసూచీలో మన దేశానిది నూట ఐదవ స్థానం.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page