వారు వద్దనుకున్నవే.. మనకు ముద్దు!
- DV RAMANA

- Oct 15
- 2 min read

గూగుల్, మెటా.. ఇలా అమెరికన్ కంపెనీలు ఒక్కుమ్మడిగా, పోటాపోటీగా విశాఖ నగరం వైపు పరుగులు పెడుతున్నాయి. తమ డేటా సెంటర్లను అక్కడ ఏర్పాటు చేసి అంతర్జాతీయ మహానగరంగా తీర్చదిద్దనున్నాయి. వీటివల్ల ఉద్యోగాలు కోకొల్లలుగా వచ్చి పడిపోతాయి. డాలర్ల వర్షం కురుస్తుంది.. అని కేంద్ర, రాష్ట్రాల పాలకులు ఊదరగొడుతున్నారు. కానీ ఈ ప్రచారాలను దాటి ఒక్కక్షణం మనసు పెట్టి ఆలోచించండి.. విస్తరణ ప్రాజెక్టులను ఇతర దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో కాకుండా అమెరికాలోనే చేపట్టి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించాలని సాక్షాత్తు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ఐటీతో సహా అన్ని బహుళజాతి కంపెనీల పీకపై కత్తి పెట్టిన విషయం బహిరంగ విషయం. అయినా అమెరికన్ కంపెనీలైన గూగుల్, మెటాలు మనదేశానికి రావడం.. అందులోనూ మన విశాఖలో రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ఎందుకు ఉత్సుకత చూపిస్తున్నాయి? తన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సదరు కంపెనీలు గడప దాటుతున్నా మరి ట్రంప్ ఎందుకు మౌనం వహిస్తున్నారు?? వీటికి సమాధానాలు చెప్పడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాలు తమకు పనికిరాని లేదా నష్టం చేకూరుస్తాయని భావించే కంపెనీలను వదిలించుకోవడానికి పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలను బలిపశువులను చేస్తుంటాయి. తమ కుట్రలకు ఆయా దేశాల ప్రగతికి చేయూత అని కలరింగ్ కూడా ఇస్తుంటాయి. మనలో చాలామందికి గుర్తుండే ఉంటుంది.. గతంలో అమెరికన్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి మూయించేసిన థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఎలాగైన వదిలించుకుని, ఏదో విధంగా సొమ్ము చేసుకోవడానికి ఎన్రాన్ వంటి కంపెనీలు మన దేశాన్ని థర్మల్ డస్ట్‌బిన్‌గా మార్చేయడానికి సాయశక్తులా ప్రయత్నించాయి. ఎటువంటి విజన్, అవగాహన లేని నాయకులు వాటిని మహాప్రసాదంగా స్వీకరించి.. అభివృద్ధి చెందిన దేశాలు వదిలించుకున్నవాటినే మనపాలిట మహా ప్రాజెక్టులుగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాలు పొందుతుంటారు. అదృష్టవశాత్తు ఏ పార్టీ జెండా పెట్టుకోకుండా గతంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు సాగించిన ప్రజాపోరాటాల వల్ల సోంపేట, కాకరాపల్లితో సహా ఎక్కడా ప్రభుత్వాల ఆటలు సాగలేదు. ఇప్పుడు మళ్లీ అటువంటి కథే మొదలైంది. ఈసారి అది డేటా సెంటర్ల రూపం సంతరించుకుంది. కానీ గతంలో మాదిరిగా ప్రజలను అప్రమత్తం చేయడానికి బాలగోపాల్ లేరు. కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగి ప్రజలకు పరిణామాలను వివరించేంత ఓర్పు, సంయమనం ఉన్న ఉద్యమకారులూ కరువయ్యారు. మరోవైపు బైపోలార్‌గా మారిన రాజకీయ వాతావరణంలో విధిలేని పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీని చంకన పెట్టుకుని.. ఆ పార్టీ అధినేత తీసుకునే ఎటువంటి నిర్ణయాన్ని అయినా సమర్ధించాల్సి రావడం ప్రస్తుత విషాద వాస్తవం. విశాఖకు, మన రాష్ట్రానికి, దేశానికి డేటా సెంటర్లు వరప్రసాదం అన్నట్లు పాలకులు బిల్డప్ ఇస్తున్న ఈ తరుణంలో మనం కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకుని తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. యూరోప్‌లోని ఐర్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్ వంటివన్నీ అభివృద్ధి చెందిన దేశాలే. విశాఖకు రావడానికి ముందు ఐర్లాండ్‌లో డేటా సెంటర్ పెట్టాలని గూగుల్ ప్రయత్నించగా ఆ దేశ ప్రజలందరూ ఏకోన్ముఖంగా అడ్డుకున్నారు. ‘మేమంతా కలిసి వాడేంత విద్యుత్ ఒక్క మీ డేటా సెంటర్‌కే ఇవ్వాలి.. అందువల్ల మీ డేటా సెంటర్ వద్దు’ అంటూ ఐర్లాండ్ ప్రభుత్వం కూడా తిరస్కరించింది. అలాగే నెదర్లాండ్స్‌లో డేటా సెంటర్ పెట్టాలని మెటా చేసిన ప్రయత్నాన్నీ ఆక్కడి ప్రజలు వ్యతిరేకించటంతో ఆ సంస్థ పెట్టుకున్న దరఖాస్తును అక్కడి ప్రభుత్వం తిరస్కరించింది. అక్కడితో ఆగకుండా.. దేశంలో పెద్ద డేటా సెంటర్లు పెట్టడానికి వీల్లేకుండా ఏకంగా చట్టమే చేసింది. డెన్మార్క్ సైతం పెద్ద డేటా సెంటర్లు పెట్టడం వల్ల పవర్ గ్రిడ్లు దెబ్బతినటం తప్ప ఉపయోగం ఉండదన్న ఉద్దేశంతో అనుమతులు ఇవ్వటం లేదు. లాటిన్ అమెరికా దేశాలైన చిలీ, ఉరుగ్వే, మెక్సికో దేశాల్లో డేటా సెంటర్లు పెట్టాలని గూగుల్ ప్రయత్నించింది. ఆయా ప్రభుత్వాల నుంచి కొంత సానుకూలత వ్యక్తమైనా ప్రజలు, పర్యావరణవేత్తల నిరసనలతో ఆగిపోయింది. ఇక అమెరికాలో డేటా సెంటర్ హబ్‌గా పేరొందిన వర్జీనియా రాష్ట్రం పరిస్థితి చూస్తే.. డేటా సెంటర్ల వల్ల పవర్‌గ్రిడ్ మీద పడే లోడు, పెరిగిన కరెంట్ బిల్లులు, వాటి నుంచి నిరంతరం వచ్చే ఎమిషన్స్, శబ్దాలు, నీటి వినియోగం, వందల ఎకరాల భూములు.. ఇలా అన్నీ తలకు మించిన భారంగా, కష్టంగా మారాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే డేటా సెంటర్ల వల్ల వచ్చే ఉద్యోగాల కంటే నష్టపోయేది ఎక్కువ అని గ్రహించిన అక్కడి ప్రజలు డేటా సెంటర్లను వ్యతిరేకిస్తున్నారు. వాటికి మద్దతుగా మాట్లాడితే నేతలను సైతం అక్కడి ప్రజలు ఎన్నికల్లో ఓడిస్తున్నారు. దాంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా డేటా సెంటర్లను వ్యతిరేకిస్తున్నాయి. చెప్పులు, గుడ్డలతో సహా అన్నీ ఇక్కడే తయారు చేయాలని.. విదేశాల్లో ఇన్వెస్ట్ చేయటానికి వీల్లేదంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వీటి విషయంలో మాత్రం మౌనం వహించడానికి కారణం ఇదే. ఆ దేశాల్లో అవసరాన్ని మించి కరెంట్ ఉత్పత్తి అవుతుంది. నీటి వనరులూ ఎక్కువే. అయినా డేటా సెంటర్లు పెట్టటానికి ఒప్పుకోకపోవటంతో ఈ పెద్ద కంపెనీలు తృతీయ ప్రపంచ దేశాల వైపు చూస్తున్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు తమ ఈ వేస్ట్, బయో వేస్ట్‌లను పలు ఆఫ్రికా, ఆసియా దేశాల్లో డంప్ చేస్తున్నాయి. కొంచెం అటుఇటుగా ఈ డేటా సెంటర్లు కూడా అటువంటివే! కానీ మన ప్రభుత్వాలు వారు అడగని బెనిఫిట్లు కూడా ఇచ్చి ఎర్ర తివాచీ పరవటమే విషాదం.










Comments