top of page

వెలుగు దివిటీలతో మేం సిద్ధం!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Mar 26
  • 2 min read

నాస్తి సత్యాత్పరో ధర్మః నాస్తి సత్యాత్పరం తపః !

నాస్తి సత్యాత్పరం జ్ఞానం తస్మాత్‌ సత్యం సమాచరేత్‌ !!

సత్యం కంటే గొప్ప ధర్మం లేదు. సత్యం కంటే గొప్ప తపస్సు లేదు.. సత్యం కంటే గొప్ప జ్ఞానం లేదు. కాబట్టి సత్యాన్ని ఆచరించాలి.

సరిగ్గా ఇరవై ఏళ్ల కిందట రవి అస్తమించే వేళ.. సిక్కోలు నుదుట వెలుగు తిలకాన్ని అద్దడానికి ఉదయించింది సత్యం సాయంకాల దినపత్రిక. గోధూళి వేళ, సూరీడి ప్రభ తగ్గుతున్న సమయాన... సత్యం ఉదయిస్తుంది. వార్తల కాంతుల్ని పంచుతుంది. అక్రమార్కుల చీకటి బతుకుల్ని ఎండగడు తుంది. రెండు దశాబ్దాల కిందట మొదలైన ఈ పరుగు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఈ ఇరవై ఏళ్లలో సత్యం పేరు జిల్లా వాసులకు చిరపరిచితమైపోయింది. నిజాయితీ, నిబద్ధత, జనం సమస్యల పరిష్కారమే అజెండాగా నడుస్తున్న పత్రిక సత్యం ఒక్కటే అని సగర్వంగా చెప్పగలం. కరోనా మహమ్మారి సమయంలో కూడా నిరంతరాయంగా కొనసాగిన ఒకేఒక స్థానిక పత్రిక సత్యం.

మాకు ఏ నాయకుడూ శత్రువు కాదు. ఎవ్వరూ మిత్రుడు కాదు. ప్రకటనల మీదే ఆధారపడి ఉన్నా కూడా, ఆర్థిక ప్రయోజనాల కోసం ఎవ్వరినీ తలకెత్తుకోలేదు. కిందకు దించలేదు. ఈ ఇరవై ఏళ్లలో కేవలం మీ అభిమానాలే కాదు.. చాలా బెదిరింపులు కూడా వెనకేసుకున్నాం. అట్రాసిటీ కేసులు, పరువునష్టం కేసులు, అత్యాచారం కేసులు, చివరకు మా కార్యాలయం మీద భౌతిక దాడు లు, మమ్మల్ని నిర్మూలిస్తామనే వార్నింగులూ... వీటికి మేం బెంబేలెత్తిపోలేదు. రౌడీయిజం మీద వార్తలు రాస్తే, మమ్మల్ని అంతు చూస్తామన్నారు. ఇప్పటికీ మేం అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఇదీ.. సత్యం అంటే. బహుశా ఈ జిల్లాలో మా మీద ఉన్నన్ని కేసులు మరో పత్రికకు లేవనే భావిస్తున్నాం.

ఆరంభించిన నాటినుంచి రాష్ట్రంలో జరిగిన రాజకీయ వ్యవహారాలను పూర్తిగా నిష్పాక్షికంగా, పారదర్శకంగా అందించిన పత్రిక సత్యం మాత్రమే. 2014, 2019, 2024 ఎన్నికల్లో మా అంచనాలకు తగ్గట్లుగానే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సత్యానిది ఎప్పుడూ ప్రతిపక్షమే, ప్రజాపక్షమే.

ఇప్పటికీ అద్దె కార్యాలయంలోనే బతుకీడుస్తున్న మధ్యతరగతి పత్రిక సత్యం. జర్నలిజం అంటే వ్యాపారం కాదని మా నమ్మకం. సత్యం బతకడానికి మాత్రమే మాకు ప్రకటనలు కావాలి. కానీ ప్రకటనల కోసం సత్యం కాదు. మా నిబద్ధతనీ, జనంలో మాకున్న ఆదరణనీ నమ్మినవాళ్లు ప్రకటన రూపంలో మాకు ఆక్సిజన్‌ అందించి, సహకరించిన వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. పత్రికగా మీ నిబద్ధతను తప్పుపట్టలేం.. కానీ ప్రకటనలంటే ఇవ్వలేం.. మీకిస్తే వందమంది మా మీద సవారీ చేస్తున్నారంటూ ప్రకటనకర్తల వేదనను అర్థం చేసుకోగలం. కాకపోతే సత్యంకు ప్రకటనలు తప్ప మరో ఆదాయ మార్గం లేదు. అయినా అన్ని కష్టాలను, నష్టాలను భరించి ముందుకు సాగుతున్నాం. భవిష్యత్తులో ఎన్నాళ్లు నడుపుతామో తెలీదు గానీ.. ప్రస్తుతానికి ఒక స్థానిక పత్రిక, అదీ శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో 20 ఏళ్లు నడపడం, దానికి పాఠకులు అగ్రతాంబూలం ఇవ్వడం కచ్చితంగా పాఠకులు, ప్రకటనకర్తల ప్రోత్సాహమే. సోషల్‌మీడియా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రింట్‌ మీడియా నడపడమే ఓ సాహసం. దీనికి తోడు రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం అక్కడ ఏ మేరకు విధ్వంసం సృష్టించిందో తెలీదు గానీ ఇక్కడ మాత్రం న్యూస్‌ప్రింట్‌ అందని పరిస్థితి. అయినా సిక్కోలు కోసం, ఇక్కడి పాఠకుల కోసం ఈ అసిధారా వ్రతాన్ని చేస్తునే ఉన్నాం.. చేస్తుంటాం.. అందుకు మీ సహకారం మాకు ప్రాణసమానం.

ప్రపంచాన్ని మార్చడమే ఇప్పటికీ మీ ఆయుధం అయితే, పాత్రికేయమే అత్యవసర, స్పల్పకాలిక ఆయుధం అన్నాడు బ్రిటన్‌ సాహితీవేత్త టామ్‌ స్టాపర్డ్‌. మేం సత్యం పత్రికనే ఆయుధంగా మలుచుకున్నాం. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉన్నాం. జనానికి సత్యాన్ని తెలియజేస్తూనే ఉంటాం. ఇక మార్పు అనేది సమాజం, వ్యవస్థల చేతుల్లో ఉంది. సందె చీకట్లు అలుముకుంటున్న వేళ సత్య కాంతుల్ని పంచడానికి వెలుగు దివిటీలతో మేం సదా సిద్ధంగా ఉంటాం. సదా, సర్వదా, శతథా, సహస్రదా సిక్కోలు సంక్షేమానికి పునరంకితమవుతాం.

2 Comments


Kumaraswamy Baratam
Kumaraswamy Baratam
Mar 27

👌👌👌🙏🙏🙏👍👍👍


Like
Unknown member
Mar 29
Replying to

😏

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page