top of page

విలువలు.. విశ్వసనీయత.. కొత్తిమీరకట్ట

Writer: ADMINADMIN

విలువలు, విశ్వసనీయత. ఈ రెండు పదాలు బహుశా జగన్మోహన్‌ రెడ్డికి పంపింగ్‌ స్కీం పద్ధతిలో ఉపయోగపడతాయి. అసలు విలువలు అంటే ఏంటో, విశ్వసనీయత అంటే ఏంటో ఎంత ఆలోచించినా మనకు బోధపడవు. ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటికి వచ్చేశాడట విలువల కోసం. అసలు బయటకు వచ్చేయడం దేనికి? నీ తండ్రి మరణించిన తర్వాత నీకు జన్మహక్కు లాగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని తలంచి, అలా చేయకపోతే కోపగించి బయటకు వచ్చేసావ్‌. అది విలువంటారా?

కడప ప్రజలకు ఐదేళ్లు పార్లమెంటు సభ్యుడుగా సేవలందిస్తానని చెప్పి కదా మీరు పోటీ చేసింది? ఈ లోపులో అనుకోని అవాంతరం మీ తండ్రి మృత్యురూపంలో ముంచుకొస్తే మీరు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయటం, పార్టీలో ముసలం రేపటం ఏ రకం విలువల పాటింపు? పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి రావటమే విలువని మీరు అనుకుంటున్నారు. అసలు రాజీనామా చేయడమే పరమ ఘోరమనే విషయం మీరు అంగీకరించరు. తండ్రి చనిపోతే అందులో రెండవసారి గెలిచి నెలల్లోనే ప్రమాదవశాత్తు మాయమైపోతే రాష్ట్రమంతా ఒక రకమైన సానుభూతి వాతావరణం పుట్టుకొస్తే దానిని క్యాష్‌ చేసుకోవడానికి మీరు లాభాన్ని ఆశించి మీ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసలు అలా రాజీనామా చేయడమే విలువలను మంటగలపటం. అది చంద్రబాబు వైస్రాయ్‌ ఘటనకు ఏమాత్రం తీసిపోదు. కాకపోతే ఆయన వెన్నుపోటుదారుడని ముద్ర వేయించుకున్నారు, మీరు విలువల కోసం అంటూ టముకు వేయించుకున్నారు. ఇద్దరి లక్ష్యం ఒకటే.. రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం. అసలు లక్ష్యమే భారీ స్వలాభమైనప్పుడు ఇంకా విలువలు ఏంటంట? వాటి పాటింపేంటట?

ఒకపక్క రాష్ట్ర విభజన ఉద్యమం ముదిరి పాకాన పడినప్పుడు, కేసీఆర్‌ అనే వ్యక్తి తన స్కందారావాలతో అవకాశం కోసం పొంచి చూస్తున్నప్పుడు, ఆ బూచిని చూపించి మీరు అప్పటి మీ కేంద్ర నాయకత్వం మీద మైండ్‌గేమ్‌ ఆడదామని ప్రయత్నం చేశారు. కాకపోతే మొండిఘటాలకే నిజమైన మొండిఘటం సోనియా ముందు మీ ఆటలు సాగలేదు. తర్వాత రాష్ట్ర విభజన వగైరా వగైరా అనేక అవాంఛిత పరిణామాలు చోటుచేసుకుని రాష్ట్రం చింపి చాట అయింది.. అది వేరు. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం వెంట ఉండడం, ఎదురుగా విశ్వసనీయత లేనివాడు అనబడే బలహీనమైన ప్రత్యర్థి ఉండటం, రాష్ట్రం రెండు కులాల గుప్పెట్లో చిక్కుకుని పోవటం, అప్పటిదాకా రాష్ట్రాన్ని ఏలిన జాతీయ పార్టీ కాస్త రాష్ట్ర విభజన చేసేసి ఆ మంటల్లో పడి కాలిపోవడం ఇన్ని అవకాశాల మధ్య ముఖ్యమంత్రి కావాలనే మీ ఏకైక లక్ష్యం కోసం దూరంగానైనా స్పష్టంగా కనబడుతున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి అలా నడిచిపోవడం ఇవన్నీ చాలా సహజంగా జరిగిపోయాయి. విశ్వసనీయత అంటారా?

అమరావతిలో ఇల్లు కట్టి, రాజధానిని కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా సొంతంగా కట్టేస్తానని అని మీరు చెప్పిన మాట నిజం కాదా? చంద్రబాబు హయాంలో చిన్నాన్న హత్యకు ఎలా గురయ్యాడో సోదాహరణంగా వివరించిన మీరు తర్వాత అధికారంలోకి వచ్చి ఆ కేసు విషయంలో ఎంత విశ్వసనీయత పాటించారో జనం చూడలేదనుకుంటున్నారా? మీ పినతండ్రి హత్య కేసులో న్యాయం జరగాలని ఆయన కూతురు తన ఉద్యోగం వదిలేసి హైకోర్టు మెట్ల ముందు బికారిలా ఎలా తిరిగిందో జనం చూడలేదనుకుంటున్నారా?

అన్నట్టు మీ సంపూర్ణ మద్యనిషేధం ఏమైనట్టు? 151/175 సీట్లు మీకు ఇచ్చి వైరిపక్షాన్ని 23కు కుదించేసిన ఆంధ్ర ప్రజానీకం మీరు పాటించిన విలువలు, విశ్వసనీయతల తీరు చూశాక తిరిగి వాళ్లను 164/175 చేసేసి, మిమ్మల్ని 11కు కుదించేశాక మీరు ఇంకా అవే విలువలు విశ్వసనీయతలంటూ పదాలు వల్లెవేయటం హాస్యాస్పదం. మీ తీరును, మీ సజ్జల, మీ విజయసాయి, మీ రోజా, మీ కొడాలి, ఈ వంశీ వగైరా వగైరాలను, వారి తిట్లను చూసి జనంలో ఏనాడూ తెలుగుదేశం పార్టీ గుర్తు మీద ఓటు వేయని వాళ్లు కూడా చంద్రబాబు అధిపత్యంలోని పార్టీకి ఓటు వేయించిన ఘనత మీదేననే పరమ సత్యాన్ని మీరు గుర్తించాలి. మీరు పాటించిన విలువలు, విశ్వసనీయత వగైరాలు చూశాక జనం ఇచ్చిన తీర్పు ఇది. వాళ్లు పెనం నుంచి పొయ్యిలో పడితే అది వేరే విషయం. మీ పాలన అంత అద్భుతంగా సాగింది అనేది మీరు కూడా గుర్తుంచుకోవాలి.

విలువలతో కూడిన రాజకీయంతో మీరు మీ పదవికి రాజీనామా చేశారా? అసలు రాజీనామా చేయడమే విలువల్ని తుంగలో తొక్కడం అనే సత్యం మీకు, మీ అంతేవాసులకు ఏనాటికి అర్థం కాదు. అన్నట్టు ఇప్పుడు మీతో ఉన్నది చంద్రబాబు ఇచ్చిన కొడాలి, వంశీ, రోజా, రజిని ఆ నలుగురే. పచ్చిగా చెప్పాలంటే చంద్రబాబు ఇచ్చిన బహుమతి అని అనాలి. వినేవాళ్ల వివేకాన్ని శంకించే ఈ మాటలు బాధాకరం. అంతే సార్‌.

- పెపకాయల రామకృష్ణ


2019లో జగన్మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 151 మంది ఎమ్మెల్యేలతో వైకాపా నిర్వహించిన వర్క్‌షాప్‌కి, గురువారం వైకాపా అధినేత జగన్‌ జిల్లా అధ్యక్షులతో ఇన్‌ఛార్జిలతో, అనుబంధ సంఘాలతో నిర్వహించిన వర్క్‌షాప్‌కు తేడా ఏమైనా ఉందా? తేడా ఏమీ లేదు. అధికారంలో ఉన్నప్పుడు బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత మ్యానిఫెస్టో అంటూ వర్ణించడం, ప్రతిపక్షంలో ఉన్నా అవే పథకాలు వర్ణించడం. ఆ పథకాలు పెట్టిన మిమ్మలని నమ్మలేదు కాబట్టి చంద్రబాబుకు ఓటు వేశారు అనే నిజం జీర్ణించుకోలేకపోతే ఎలా? మీకంటే చంద్రబాబు పథకాలు ఎక్కువ ఇస్తానని చెప్పినప్పుడు ప్రజలు నమ్మి ఓట్లు వేశారు? మీరూ అవే పథకాలు పట్టుకొని ఉంటే ఎలా? కొంచెం అప్డేట్‌ అవ్వండి జగన్‌మోహన్‌రెడ్డి. పాత కాలం చింతపండును రోట్లో వేసి దంచినట్టు, మీ సంక్షేమ పథకాలు ఎత్తి పక్కన పెట్టండి. అవి మీకు దండగని ఎప్పుడు తెలుసుకుంటారో? రైతులు, ఉద్యోగులు, మందుబాబులు ఎందుకు ఓట్లు వేయలేదో ఆలోచించారా? టీడీపీ గెలిచాక కూడా మనం చేసిన మేలు ప్రజలకు తెలుసు అనుకుంటూ ఉంటే యుద్ధం చేయలేరు. యుద్ధం చేయడానికి మీ దగ్గర ఉన్న బలం ఏంటో.. బలహీనత ఏంటో తెలుసుకోండి. అసలు మీ బలం ప్రజలు అయితే.. మీ భజన కోటరీ దేనికి? భ్రమలో ఎందుకు ఉన్నారు? రియాలిటీలోకి రారా? ఓడిపోవడానికి ఈవీయం కారణం ఒకటే అనుకుంటే ఎలా? మీ ఓటమికి ఈవీయం కారణం కాదు. మీ వైఖరి, మీ భజన కోటరీ.. గెలిచాక ప్రజలను కలవకపోవడం, పార్టీని, కార్యకర్తలను గాలికి వదిలేయడం, నమ్మిన కార్యకర్తలను నట్టేట ముంచడం..వైయస్‌ లాగా నమ్మకం ఏర్పరచుకోలేకపోవడం..వైయస్‌ వేరు,జగన్‌ వేరు అని మీరే నిరూపించారు. సీఎం అయ్యాక పరదాలు కట్టి తిరగడం ఏంటి? మాస్‌ లీడర్‌ ఎవరు అయిన ప్రజలకు కనపడతారు. మీ పులివెందుల నియోజకవర్గంలో పరదాలు దేనికి? జగన్‌మోహన్‌ రెడ్డి మీరు ఏ మీటింగ్‌లో ఎవరినీ మాట్లాడనివ్వరు. మీరు చెప్పేది సోది అని మీ పార్టీ కార్యకర్తలు కూడా వినలేకపోతున్నారు. లీడర్‌ తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఎంతసేపు మీరు చెప్పేది ఏకపక్షంగా వినాలనుకుంటే ఎలా? నలుగురితో ఆఫీసులో కూర్చుని టీ తాగుతూ మాటాడితే నిజాలు బయటికి వస్తాయి. పార్టీ అనేది ఒక సమూహం.. పార్టీ అంటే జగన్‌,సజ్జలే కాదు. 40శాతం ఓట్లు వేసిన ప్రజలది కూడా పార్టీలో భాగస్వామ్యం ఉంటుంది.40 శాతం ఓటర్లకు అనుకూలంగా మీ విధానాలు ఉండాలి. వైకాపా అనేది వైయస్‌ రాజశేఖరరెడ్డి బలం, మీ బలం కాదు. మీ బలం 11 సీట్లు మాత్రమే.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బలం 151సీట్లు. మీ పార్టీకి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆస్తి. వైఎస్‌ అనే ముద్ర లేకుండా ఎన్నికలకు వెళితే మీకు 11 సీట్లు ఇచ్చారని గుర్తు పెట్టుకోవాలి. నాది, నేనే, నేను చెప్పినట్టు అనే అహంకారం వదిలి.. మనది, మనం, మనందరం అనే మాటలు మాట్లాడితే బెటర్‌.. కొద్ది రోజులు పథకాల సోది ఆపి మిమ్మలని కలవడానికి వచ్చే పిచ్చి అభిమానులను కలవండి.. తాడేపల్లిలో ఖాళీగా ఉన్నా కలిసే ఓపిక లేకపోతే విజిటర్స్‌కి ఎలౌ లేదని బోర్డు పెట్టండి. ముందు మీలో ఉన్న నెగ్లజెన్సీ వదలండి.. ప్రతిపక్షంలో ఉంటే బాగా పని చెయ్యొచ్చు అని మీరే చెప్పారు. ముందు ఆ సూత్రం మీరు పాటించండి.. ముందు మీ పార్టీ కార్యకర్తలను కలవండి.. బిజీగా ఉన్నా అని సొల్లు చెబితే ఎవరూ వినరు. ప్రతిపక్షంలో బాగా పని చేయొచ్చని చెప్పిన మీరు ఆచరించి మళ్లీ సూక్తులు చెబితే బాగుంటుంది.. ముందు జగన్‌ తన వైఖరి మార్చుకోకుండా ఎన్ని వర్క్‌ షాపులు పెట్టినా వృథానే..!

-కిరణ్‌రెడ్డి

 
 
 

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page