` టీజీఐ నుంచి తరలిపోయిన ఇసుకపై దర్యాప్తుకు రంగం సిద్ధం
` మినరల్ సెపరేషన్ ద్వారా దేశద్రోహానికి పాల్పడిన వైకాపా నేతలు
` సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరుపై కోర్టుకు వెళ్లే యోచన
` సిక్కోలు బీచ్‌శాండ్ మాయంపై కొత్త ప్రభుత్వం సీరియస్
` రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఎమ్మెల్యే శంకర్ ఆరా

మినరల్ సెపరేషన్ ప్లాంట్ అంటే.. సముద్రపు ఇసుకలో ఉండే ఖనిజాలు/ లోహాలను విడదీసే పరిశ్రమ. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది బంగారు బాతు. గుడ్లు పొదిగినంత కాలం ఈ వ్యాపారానికి తిరుగులేదు. సరిగ్గా ఈ బంగారు బాతును చంకలో పెట్టుకొని ఇప్పటికీ వ్యాపారం చేస్తున్నారు ఇక్కడి వైకాపా నాయకులు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గార మండలం సతివాడ వద్ద ప్రారంభమైన ట్రాన్స్‌వరల్డ్ గార్నెట్ ఫ్యాక్టరీ ఇటువంటి ఎంఎస్‌పీయే. ఇక్కడ సముద్రపు ఇసుక నుంచి ఖనిజాలు వేరుచేయడానికి సేకరించి, నిల్వ చేసిన లక్షలాది క్యూబిక్ మీటర్ల సముద్రపు ఇసుకను ఒడిశాలోని ఓ మినరల్ సెపరేషన్ ప్లాంట్‌కు అక్రమంగా తరలించి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైకాపా నాయకులు ఇదే దందాను కొనసాగిస్తుండటంతో కొద్ది రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మైనింగ్, పోలీసు అధికారులతో కలిసి ఈ ప్లాంట్‌ను పరిశీలించి అక్రమ రవాణాను ఆపాలని ఆదేశించారు. విచిత్రమేమిటంటే.. ఈ దందాలో పోలీసులు, అధికారులకు కూడా పెద్ద ఎత్తున వాటాలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అణుధార్మిక శక్తిని కలిగిన లోహాలు ఉన్న సముద్రపు ఇసుకను తరలించడం దేశభద్రతకు ముప్పు అని తెలుసో లేదో గానీ.. బీచ్‌శాండ్ పరిశ్రమల ఆవరణల్లో ఉన్న ఆ ఇసుకను తరలించరాదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసినా అక్రమార్కులు ఆగలేదు. గార మండలం సతివాడలోని టీజీఐ ఫ్యాక్టరీ స్టాక్‌యార్డులో ఉన్న లక్షలాది టన్నుల సముద్రపు ఇసుకను తరలించి ఆమ్మేసుకున్నారు. గత ప్రభుత్వం ఈ విషయం పట్టించుకోకపోయినా.. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అక్రమార్కులపై చర్యలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా ప్రభుత్వ సూచన మేరకే శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కొద్దిరోజుల క్రితం అధికారులను వెంటబెట్టుకుని సతివాడలోని బీచ్‌శాండ్ స్టాక్‌యార్డుకు వెళ్లి వివరాలు సేకరించినట్లు సమాచారం. పైవేట్‌రంగంలో బీచ్‌శాండ్ మైనింగ్‌ను సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో 2018 నవంబరులో ఇక్కడి టీజీఐ మూతపడిరది. ఈ పరిశ్రమ మనుగడలో ఉన్నప్పుడు ఖనిజాలు, లోహాల వెలికితీతకు అవసరమైన బీచ్‌శాండ్‌ను శ్రీకాకుళం రూరల్ మండలం కిల్లిపాలెం పరిధిలోని అచ్చెన్నపాలెంలో ఏర్పాటు చేసిన యూనిట్‌లో రీసైకిల్ చేసిన అనంతరం గ్రేడిరగ్ కోసం సతివాడలోని గార్నెట్ పరిశ్రమకు తరలిస్తుండేవారు. సుమారు 12 ఎకరాల్లో ఏర్పాటుచేసిన ఫ్యాక్టరీకి అనుకుని మరో 19 ఎకరాల సువిశాల ఆవరణలో రీసైకిల్ చేసిన బీచ్‌శాండ్‌ను గ్రేడిరగ్ కోసం నిల్వ చేస్తుండేవారు. 2018లో ఈ ఫ్యాక్టరీ మూతపడేనాటికి ఇక్కడ గ్రేడిరగ్‌కు సిద్ధం చేసిన ట్నులకొద్దీ ఇసుక నిల్వ ఉండిపోయిది. ఈ ఇసుకలో అణుధార్మికత కలిగిన ఖనిజాలు కూడా ఉన్నాయి. ఫ్యాక్టరీ మూతపడినా, ఈ ఇసుకను మాత్రం ఎటూ తరలించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఈ ఇసుకే అక్రమంగా ఒడిశా లోని పరిశ్రమకు తరలిపోతోంది. ఇసుక వ్యాపారంలో ఆరితేరిపోయిన వైకాపా నాయకులు నిర్మాణాలకు పనికిరాని ఈ సముద్రపు ఇసుకను కూడా భవన నిర్మాణదారులకు అమ్మేశారని ఇన్నాళ్లూ అంతా భావించారు. ఎందుకంటే.. ఇక్కడ మినరల్ సెపరేషన్‌కు అవసరమైన ఇసుకను నిల్వచేసిన యార్డును వైకాపాకు చెందిన మాజీమంత్రి కనుసన్నల్లో కొందరికి అమ్మేసిన తర్వాత ఫ్యాక్టరీ యార్డులో ఉన్న ఇసుక నిల్వలను ఖాళీ చేయించడం కోసం నది ఇసుకగా చూపించి అమ్మేశారని అంతా భావించారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని తరలించడం ఎంత పెద్ద నేరమో వెలుగుచూస్తోంది. సతివాడ ఫ్యాక్టరీలో గార్నెట్, ఇల్మనైట్ మాత్రమే వెలికితీసి, మిగిలిన ఇసుకను అక్కడే ఉంచడంతో పాటు అప్పటికే భారీగా సేకరించిన బీచ్ శాండ్, బ్లాక్ శాండ్ నిల్వలను సంస్థ స్టాక్‌యార్డులోనే ఉంచేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా..
సముద్రపు ఇసుకలో ఉన్న ఏ ఖనిజాలు దేశ భద్రతకు ముప్పు అని సుప్రీంకోర్టు చెప్పిందో.. ఏ ఖనిజాల ఎగుమతితో బీచ్ శాండ్ పరిశ్రమలు దేశ ద్రోహానికి ఒడిగడుతున్నాయని తీర్పునిచ్చిందో.. ఏ ఖనిజాలను ఎగుమతి చేయడం ద్వారా చైనాలో అణుబాంబుల తయారీకి సహాయపడుతున్నాయంటూ ఇక్కడ కంపెనీలకు వేల కోట్లలో జరిమానాలు విధించిందో.. ఎందుకోసం దేశవ్యాప్తంగా ప్రైవేట్ బీచ్‌శాండ్ ప్రాజెక్టులను మూసివేయించిందో.. ఇప్పుడు అవే పరిశ్రమలకు చెందిన సముద్రపు ఇసుకను దొంగతనంగా అమ్మేయడం ద్వారా గార మండల వైకాపా నాయకులు దేశద్రోహానికి ఒడిగట్టారని తెలుస్తోంది. సముద్రం నుంచి సేకరించుకొచ్చిన ఇసుక నుంచి ఇల్మనైట్, రూటైల్ ఖనిజాలను వెలికితీసి ఎగుమతి చేయడానికి జిల్లాలోని వత్సవలసలో ట్రైమాక్స్, సతివాడలో టీజీఐ (ట్రాన్స్‌వరల్డ్ గార్నెట్ ఇండియా) లాంటి కంపెనీలు నడిచాయి. అయితే ఇల్మనైట్, రూటైల్ ఖనిజాల మధ్యలో మోనోజైట్ అనే మరో భయంకరమైన ఖనిజం దాగి ఉంది. ఈ ఖనిజంలో ఉండే థోరియం అనే పదార్థానికి రేడియోధార్మిక లక్షణాలు ఉన్నాయి. రేడియోధార్మిక లక్షణాలున్న ఖనిజాలు లభించే చోట ఆటమిక్ ఎనర్జీ(అణుధార్మిక శక్తి) ఉద్భవిస్తుంది. దీన్ని అణుబాంబుల తయారీలో ఉపయోగిస్తారు. 2018లోనే థోరియం కిలో ధర రూ.8 లక్షలు ఉండేది.
మళ్లీ కోర్టు మెట్లెక్కనున్న వివాదం
సముద్రపు ఇసుక నుంచి మోనోజైట్‌ను వేరుచేసే టెక్నాలజీ ఇక్కడ లేదు. దీంతో థోరియం ఉన్న ఇసుకను గుంతల్లో కప్పెట్టేశామని యాజమాన్యాలు చెప్పుకొచ్చాయి. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని, ఆ ఇసుకను ఎగుమతి చేయడం ద్వారా సదరు పరిశ్రమలు లబ్ధి పొందాయంటూ విశాఖపట్నానికి చెందిన డాక్టర్ ఈఏఎస్ శర్మ 2018 జూలై 15న సుప్రీంకోర్టులో పిల్(ప్రజాప్రయోజన వ్యాజ్యం) వేశారు. దీన్ని పరిశీలించిన అపెక్స్ కోర్టు ద్విసభ్య బెంచ్ అక్రమాలు జరిగాయని నిర్థారిస్తూ 2018 సెప్టెంబర్ 18న తీర్పు ఇచ్చింది. దాంతో ప్రధానమంత్రి ఆధీనంలో ఉండే ఆటమిక్ ఎనర్జీ విభాగం దేశంలోని అన్ని ప్రైవేటు బీచ్‌శాండ్ ప్రాజెక్టులను మూసేయమని ఆదేశాలిచ్చింది. ఇకనుంచి సముద్రపు ఇసుకలో ఖనిజాలు తీసే అధికారం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (ఐఆర్‌ఈఎల్)కు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఫలితంగా శ్రీకాకుళంలో ట్రైమెక్స్‌తో పాటు సతివాడలో ఉన్న టీజీఐ పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక్క ట్రైమాక్స్ చేసిన మైనింగ్‌లోనే 9750 మెట్రిక్ టన్నుల మోనోజైట్ ఉన్నట్లు అప్పట్లో నిర్థారించారు. కానీ అప్పటికే సముద్రపు ఇసుక నుంచి ఇల్మనైట్ వంటి ఖనిజాలను వేరుచేయడానికి ఈ కంపెనీలు మోనోజైట్‌తో కూడిన కొన్ని లక్షల టన్నుల ఇసుకను సేకరించి నిల్వ చేశాయి. మూతపడిన పరిశ్రమల వద్ద ఉన్న ఇసుకను కూడా ఎవరూ తీసుకువెళ్లకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ గార మండల వైకాపా నేతలు టీజీఐ ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న ఖనిజాలతో కూడిన సముద్రపు ఇసుకను యథేచ్ఛగా తరలించుకుపోయారు. దీన్ని ఒడిశాలో ఉన్న మినరల్ సెపరేషన్ ప్లాంట్‌కు అమ్మేసి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని తెలుస్తోంది. ఇందులో ఉండే ఖనిజాలు విలువ కిలో కోట్లలో ఉండటం, సిక్కోలు రాజకీయ నాయకులకు దీని మీద పెద్దగా అవగాహన లేకపోవడంతో దేశభద్రతకు ముప్పుతెచ్చే పనికి పూనుకున్నారు. ఇదే విషయాన్ని ‘సత్యం’ గతంలో కథనాలు ప్రచురించినా వైకాపా అధికారంలో ఉండటం వల్ల ఇసుమంత కూడా యంత్రాంగం స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గొండు శంకర్ అక్కడికి వెళ్లి వివరాలు ఆరా తీయడంతో రాష్ట్ర ప్రభుత్వపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఇదే అంశంపై మళ్లీ కోర్టు తలుపు తట్టడానికి కొందరు సిద్ధపడుతుండటంతో మరోసారి వెలుగులోకి వచ్చింది.
Comments