top of page

విశాఖ ఉక్కు పీక నొక్కేస్తున్నారు!

Writer: DV RAMANADV RAMANA
  • వీఆర్‌ఎస్‌, డిప్యూటేషన్ల పేరుతో సగానికిపైగా సిబ్బంది కుదింపు

  • ఇప్పటికే ఉత్పత్తిని మూడొంతులు తగ్గించేసిన యాజమాన్యం

  • ఆఫీసర్‌ క్యాడర్‌ ఉద్యోగుల జీతాల్లో కోత.. విద్యుత్‌ ఛార్జీల భారం

  • ప్లాంట్‌ను ఉద్దేశపూర్వకంగానే ఖాయిలా చేసేస్తున్నారన్న ఆరోపణలు



‘స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు. 45 రోజుల్లో అన్నీ చక్కబడతాయి’.. అని సాక్షాత్తు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి ఆ మధ్య విశాఖ పర్యటనలో భాగంగా స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించినప్పుడు భరోసా ఇచ్చి వెళ్లారు. దాంతో ఉక్కు భవితవ్యంపై ఆందోళనతో ఉన్న రాష్ట్ర ప్రజలు, వేలాది ప్లాంట్‌ ఉద్యోగుల కుటుంబాలు కొంత ఊరట చెందాయి. కానీ మంత్రి వెళ్లిన తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోగా మరింత వేగంగా దిగజారుతున్నాయి. కేంద్ర మంత్రి చెప్పినట్లు 45 రోజుల్లో అన్నీ చక్కబడటం మాటేమోగానీ.. మూసివేత దిశగా అన్నీ చక్కబెట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్దిరోజులుగా ప్లాంట్‌ యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూస్తే స్టీల్‌ప్లాంట్‌ను మూసివేసేందుకు వీలుగా కావాలని వనరులు, ఉత్పత్తి లేమితో దాన్ని ఖాయిలా పడేలా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఉత్పత్తిని గణనీయంగా తగ్గించేయడం, సిబ్బందిని ఇంటికి సాగనంపే చర్యలు చేపట్టడం, డిప్యూటేషన్‌ పేరుతో ఇతర ప్రాంతాలకు పంపడం, ఉన్నతస్థాయి ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం వంటి చర్యలతో విశాఖ ఉక్కు పీక నొక్కేస్తున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ప్లాంట్‌ను మరింత నష్టాల్లో మునిగిపోయేలా చేసి ప్రైవేట్‌పరం చేసేయాలన్నది కేంద్రం పన్నాగమని ప్లాంట్‌ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ నినదించి, పలువురి త్యాగాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్నారు. విశాఖ సాగరతీరంలో అసియాలోనే అతిపెద్ద పరిశ్రమగా ఆవిర్భవించి ఉత్పత్తిలో ఎన్నో రికార్డులు సృష్టించి మహారత్న హోదా పొందిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ మనుగడ ప్రస్తుతం డోలాయమానంలో పడిరది. ఆ ఫ్యాక్టరీలో తనకు ఉన్న పూర్తిస్థాయి వాటాను ప్రైవేట్‌ యాజమాన్యలకు అప్పగించడం ద్వారా దీన్ని ప్రైవేటీకరించాలన్న లక్ష్యంతో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు మూడేళ్ల నుంచి కసరత్తు చేస్తోంది. ప్రత్యక్షంగా వేలాదిమందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ విశాఖ నగరంతోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందేలా చేసి, వాటి రూపురేఖలనే పూర్తిగా మార్చేసిన ప్లాంట్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్లాంట్‌ ఉద్యోగులు, విశాఖవాసులే కాకుండా యావత్తు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆందోళన చెందారు. ప్లాంట్‌ పరిరక్షణకు ఆ సంస్థ ఉద్యోగులు దాదాపు రెండేళ్ల నుంచి వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. కార్మిక సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర రాజకీయ నాయకులు ఢల్లీి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ప్లాంట్‌ను కొనసాగించాలంటూ వినతిపత్రాలు సమర్పించారు. చూస్తాం.. చేస్తాం.. అంటూనే కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ దిశగా నిర్ణయాలు తీసుకుంటూనే పోతోంది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్ర హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇంకా విచారణ కొనసాగుతోంది. కాగా సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు విశాఖ ఉక్కు విషయంలో భయపడాల్సిందేమీ లేదని, ప్రస్తుతానికి ప్రైవేటీకరణ ప్రతిపాదన పక్కనపెట్టామని ప్రచార సభల్లో చెప్పుకొచ్చారు. ఎన్నికలు పూర్తి అయ్యాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే కొలువుదీరాయి. దాంతో స్టీల్‌ప్లాంట్‌ భవితవ్యంపై కొత్త ఆశలు చిగురించాయి. దానికి తగినట్లే రెండు నెలల క్రితం స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించిన కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని, 45 రోజుల్లోనే పరిస్థితులను చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. కానీ ఆయన వెళ్లిన తర్వాతే పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అవన్నీ మంత్రి భరోసాకు విరుద్ధంగా ఉండటమే ఆందోళన కలిగిస్తోంది.

చేటు చేస్తున్న నిర్ణయాలు

గత కొద్దిరోజులుగా స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దాని చిత్తశుద్ధిని సంకించేలా చేస్తున్నాయి. ప్రభుత్వం చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అన్నట్లుగా ఉందని స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల కుదింపు నిర్ణయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకే నిర్ణయంతో, ఒకే సమయంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడమో, వేరే ప్రాంతాలకు పంపడమో చేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది.

తాజా నిర్ణయాలతో ఉత్కంఠ

స్టీల్‌ప్లాంట్‌లో ప్రస్తుతం 19 వేలకుపైగా ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. అయితే వచ్చే ఏడాదినాటికి ఈ సంఖ్య ఎనిమిది వేల దిగువకు పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే ప్లాంట్‌ ఉత్పత్తిపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. 2025 నాటికి 2500 మందికి వీఆర్‌ఎస్‌ పేరుతో ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం రూ.1260 కోట్లు సిద్ధం చేసినట్లు యాజమాన్యమే స్వయంగా ప్రకటించింది.

  • మరోవైపు నాగర్‌నార్‌ స్టీల్‌ప్లాంట్‌లో అనుభవజ్ఞులైన సాంకేతిక ఉద్యోగుల కొరత ఉందని, అక్కడికి కొందరిని పంపాలని కేంద్రం కోరిన వెంటనే విశాఖ ఉక్కు యాజమాన్యం 500 మందిని డిప్యూటేషన్‌పై పంపాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఈ ఏడాది చివర నాటికి 1400 మంది ఉద్యోగులు, అధికారులు రిటైర్‌ కానుండటంతో విశాఖ ఉక్కు ఉద్యోగులపరంగా చిక్కిపోతుందంటున్నారు.

  • ప్లాంట్‌లో మూడు బ్లాస్ట్‌ఫర్నెస్‌లు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఒక్కటే నడుస్తోంది. దీని వల్ల ప్లాంట్‌లో రోజుకు 21 వేల మిలియన్‌ టన్నులు ఉత్పత్తి కావాల్సి ఉండగా అది గణనీయంగా తగ్గిపోయింది. ఈ నెల ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు రోజుకు ఆరు వేల టన్నులే ఉత్పత్తి జరగడం ప్లాంట్‌ ఆర్థిక పరిస్థితిని ప్రమాదంలోకి నెట్తేస్తుంది.

  • వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి మొదలుపెట్టినప్పటి నుంచీ అవసరమైన ఇనుప ఖనిజం, బొగ్గు సరఫరా చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. దాంతో సాధారణంగా కనిపించే కొరత స్థానంలో ప్రస్తుతం బొగ్గు నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్లాంట్‌కు సంబంధించి రెండు లక్షల టన్నుల బొగ్గు నిల్వలు కొన్నాళ్లుగా గంగవరం పోర్టులోనే మూలుగుతున్నాయంటే ఉత్పత్తి ఎంతమేరకు తగ్గించేశారో అర్థం చేసుకోవచ్చు.

  • ఖర్చులు తగ్గించుకునే సాకుతో ప్లాంట్‌లో పని చేస్తున్న ఆఫీసర్‌ క్యాడర్‌ ఉద్యోగుల జీతాల్లో యాజమాన్యం ఆరు శాతం కోత విధించింది.

  • టౌన్‌షిప్‌ క్వార్టర్లలో నివాసం ఉంటున్న కార్మికులు, ఉద్యోగులకు యూనిట్‌ విద్యుత్‌ వినియోగానికి 40 పైసలు మాత్రమే వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని ఏకంగా యూనిట్‌ రూ.8కి పెంచేశారు. ఆరు నెలల విద్యుత్‌ బిల్లుల బకాయిలను ప్లాంట్‌ యాజమాన్యం చెల్లించలేదు. వాటిని తక్షణమే చెల్లించాలని ఈపీడీసీఎల్‌ ప్లాంట్‌ యాజమాన్యానికి లేఖ రాయడంతో ఆ భారాన్ని క్వార్టర్లలో ఉంటున్న ఉద్యోగులపై యాజమాన్యం మోపింది.

సీఎండీ తొలగింపు

స్టీల్‌ ప్లాంటు సీఎండీ అతుల్‌భట్‌ను కేంద్రం విధుల నుంచి తప్పించింది. రిటైర్మెంట్‌ వరకు సెలవుపై వెళ్లాలని ఆయన్ను ఆదేశించింది. పోనీ ఆయన స్థానంలో కొత్త సీఎండీని నియమించలేదు. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లకే కమిటీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో ప్లాంట్‌ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది

భేటీలో ఏం నిర్ణయిస్తారో?

వరుసగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్లాంట్‌ ప్రైవేటీకరణ దిశగా వెళ్లిపోతోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవన్నీ ప్లాంట్‌ మనుగడను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఢల్లీిలో స్టీల్‌ప్లాంట్‌పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. ఈ సమావేశంలో ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఉక్కు ఫ్యాక్టరీపై ఆధారపడిన వారందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి కూడా ఈ పరిస్థితి ఇరకాటంలోకి నెడుతోంది. ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదన్న ఎన్నికల ముందు నుంచీ భరోసా ఇస్తున్న కూటమి నేతలు ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారో, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page