విశ్రాంత జీవితం ‘రాము’డుకి అంకితం
- NVS PRASAD
- Jan 4
- 5 min read
రాజకీయాల్లోకి వస్తాను
ఉద్యోగ సంఘ నాయకుడిగా సంతృప్తి
మా కుటుంబంలో ప్రజాస్వామ్యం ఎక్కువ
పదవులు రాకపోయినా ఫర్వాలేదు.. క్యారెక్టర్ వదులుకోను

అధికారిగా ఆయన సంతకానికి కాలం చెల్లిపోయివుండొచ్చు.. ఉద్యోగ సంఘ నాయకుడిగా ఆయన పదవీ కాలం పూర్తయి వుండొచ్చు.. ఒక ఉద్యోగికైనా, ఉద్యోగ సంఘ నాయకుడికైనా ఇది సాధారణం. ఏదో ఒకరోజు పదవీ విరమణ తప్పదు. కానీ ఇక్కడ ప్రజల హృదయాల్లో ఉద్యోగుల మస్తిస్కాలలో పూర్తిగా ఆయనే నిండిపోయిన తర్వాత విరమణ ఉద్యోగానికే గాని, ప్రజా హృదయాల నుంచి కాదని రుజువు చేస్తున్నారు. గత నెల 31న కాశీబుగ్గ జీఎస్టీ అధికారిగా ఆయన పదవీ విరమణ చేసినా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న అనేకమంది ఆకాంక్షల నేపధ్యంలో రాష్ట్ర ఎన్జీజీవోస్ ప్రధాన కార్యదర్శి పురుషోత్తంనాయుడు పయనంపై ‘సత్యం’ జరిపిన ఇంటర్వ్యూ..
సత్యం: జిల్లా ఎన్జీవో నాయకుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, సహాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, జీఎస్టీ అధికారుల సంఘం జోనల్ అధ్యక్షుడిగా, జీఎస్టీ అధికారిగా 39 ఏళ్ల సర్వీసులో నిరంతరం బిజీగా గడిపిన మీరు ఇప్పుడు విశ్రాంత జీవితాన్ని ఎలా ప్లాన్ చేశారు?
నాయుడు: నాకు రాజకీయాలంటే ఇంట్రస్ట్. వాటిని ఉద్యోగ సంఘాల వైపు మళ్లించి, వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించాను. భవిష్యత్తులో సామాజిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తాను. రాజకీయాల్లో చేరాల్సిన అవసరమైతే ఉంది. నాకు రామ్మోహన్‌నాయుడు గారంటే చాలా ఇంట్రస్ట్. ఆయన అడుగుజాడల్లో నడుద్దామని భావిస్తున్నాను. ఆయనంటే ఉద్యోగులకు చాలా ఇష్టం. 12 ఏళ్లుగా ఆయన వృద్ధిలోకి రావాలని కోరుకున్నాం. ఇప్పుడు పదవీ విరమణ ద్వారా ఆయనతో కలిసి నడిచే అవకాశం కలిగింది.
సత్యం: ఉద్యమ రాజకీయాల్లో ఉన్న మీరు ఆదివారం మీ సన్మాన కార్యక్రమం వేదిక మీదే టీడీపీలో చేరుతారని ప్రకటించే అవకాశముందా?
నాయుడు: అలా ఏం లేదు. ముందుగా రామ్మోహన్‌నాయుడు గారు చేస్తున్న ప్రజాసేవకు అండగా నిలబడతాను. ఉద్యోగంలో ఉండటం వల్ల గతంలో ఆయనకు బహిరంగంగా మద్దతు తెలపలేకపోయాం గానీ, లోపాయికారిగా ఆయన కోసం పని చేశాం. కొన్నాళ్లు ఆయనతో ప్రయాణించిన తర్వాత పరిస్థితులను బట్టి రాజకీయ తీర్థం పుచ్చుకునే అవకాశాలు లేకపోలేదు. ఆయన మంచిమనసుకు, ప్రజాసేవకు ఇంతకుముందే ఇంప్రెస్ అయ్యాను.
సత్యం: గడిచిన మూడు సార్వత్రిక ఎన్నికల నుంచి మీరు ప్రత్యక్ష బరిలో ఉంటారని వింటున్నాం. ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేస్తారని భావించేవారు. ఆ విధంగా అప్పట్లో మీకు ఏదైనా పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందా?
నాయుడు: అప్పట్లో కొంతమంది అడిగిన మాట వాస్తవమే. ఇంటెలిజెన్సీ నుంచి, కొన్ని పార్టీల నుంచి పోటీ చేస్తారా అంటూ అభిప్రాయాన్నయితే అడిగేవారు. మా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రతిభాభారతి మేడమ్ గారిని చూస్తూ పెరిగాం. మా తాత గారు ఎమ్మెల్యే కావడం, ప్రతిభాభారతి నాన్నగారు ఎమ్మెల్యే కావడం వల్ల రాజకీయాల పట్ల నాకు ఆసక్తి కలిగింది. దీనికి తోడు ప్రతిభాభారతి గారు ఎమ్మెల్యే కావడం, స్పీకర్ కావడం, మంత్రి కావడం వంటివి దగ్గరుండి చూశాను. మేం హైదరాబాద్ వెళితే ఆమె క్వార్టర్‌లో ఉండటం, అలా కుటుంబ పరంగా మేడమ్‌తో మంచి అనుబంధం మాకు కొనసాగేది. ప్రతిభాభారతి గారు వేరే నియోజకవర్గానికి మారిన తర్వాత రామ్మోహన్‌నాయుడు మీద అభిమానం పెంచుకున్నాం. మధ్యలో బంధుత్వం వల్ల కృపారాణి గారితో కూడా నడిచాం. అప్పుడే మా అబ్బాయి సతీష్ ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత కృపారాణి గారితో పయనించాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే పార్టీలు కాకుండా నాయకులతోనే నా రిలేషన్ కొనసాగింది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో నాకు బాగా కావాల్సిన నాయకుడు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు. ఇది పూర్తిగా నా పర్సనల్ రిలేషన్. ఇంతవరకు ఆయన్ను పార్టీ మనిషిగా నేను చూడలేదు. ఇప్పుడు నేను ఫ్రీ అయ్యాను కాబట్టి భవిష్యత్తులో ఏం చేయాలనేది ఆయన ద్వారానే నిర్ణయం తీసుకుంటాను.
సత్యం: మీ చిన్నాన్న చౌదరి బాబ్జీ టీడీపీలో ఉన్నారు. మీరు టీడీపీకి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. కానీ మీ అబ్బాయి సతీష్ మాత్రం వైకాపాలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు మీరు టీడీపీకి వెళ్తే.. సతీష్ కూడా పార్టీ మారుతారా?
నాయుడు: మా కుటుంబంలో ప్రజాస్వామ్యం నాలుగు పాదాలా నడుస్తుంది. కమ్యూనిస్టు పార్టీలో ఉన్న గ్రూపులన్నింటిలోనూ మా పెద్దలున్నారు. ఎవరి ఇండివిడ్యువాలిటీ వారిది. ఒకరు ఎంఎల్ గ్రూపులో ఉండొచ్చు, ఒకరు సీపీఎంలో ఉండొచ్చు, ఒకరు వైకాపాలో ఉండొచ్చు.. మాది పెద్ద ఫ్యామిలీ. మా నాన్న తరఫు పదిమంది, అమ్మ తరఫు పదిమందితో పాటు వారి చుట్టాలు, బంధువులు రకరకాల పార్టీల్లో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సహజం. ఎవరు ఏ పార్టీలో ఉంటారన్నది వారిష్టం. ఎవర్నీ మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేం. ఎవరు ఏ పార్టీలో ఉన్నా కుటుంబంతో కలిసి వుండటం, పార్టీ కోసం బలంగా పని చేయడమే మాకు తెలిసిన విద్య. ప్రస్తుతం సతీష్ వైకాపాలో ఉన్నా ఆ పార్టీలో క్రియాశీలక పదవిలో లేడు. ఆ పార్టీ గత కొన్నాళ్లుగా ప్రజలకు దూరంగా ఉంది. సతీష్ ప్రస్తుతం కార్యకర్తగా మాత్రమే ఉన్నాడు. ప్రస్తుతానికి పార్టీలో ఇన్‌యాక్టివ్‌గానే ఉన్నాడు. భవిష్యత్తులో ఏం నిర్ణయం తీసుకుంటాడో ఆయనిష్టం. ఆ విషయంలో నేనైతే ఆయనపై ఒత్తిడి తీసుకురాను. నేనైతే రామ్మోహన్‌నాయుడు గారితోనే ఉంటాను.
సత్యం: మీరు పదవీ విరమణ చేసిన తర్వాత జీఎస్టీ ఆఫీసర్స్ & ఎంప్లాయీస్ అసోసియేషన్‌లో గ్రూపులు లేనట్టు, అంతా కలిసిపోయినట్టు కనిపిస్తుంది. నిజమేనా?
నాయుడు: కమర్షియల్ టాక్స్ ఉద్యోగ సంఘం విషయంలో విజయనగరం జోన్ వరకు ఎప్పుడూ వన్‌సైడెడే. 90 శాతం ఉద్యోగులు నాతోనే ఉండేవారు. విజయనగరం డివిజన్ ప్రెసిడెంట్‌గా నేను ఏడుసార్లు ఎన్నికయ్యాను. కేఆర్ సూర్యనారాయణకు, ప్రస్తుత ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు ఉన్న వైరం వల్ల ఏపీఎన్జీవో సంఘాన్ని వదిలేయమని నాకు చెప్పడం, నేను అంగీకరించకపోవడంతోనే జీఎస్టీ ఉద్యోగుల సంఘంలో రెండు వర్గాలు మీకు కనిపించాయి. సంఘం వేరైనా తనతో వ్యక్తిగతంగా ఎవరూ విభేదించలేదు. అందుకు కారణం నేను ఎవర్నీ నష్టపర్చలేదు. జెండాలు, అజెండాలు వేరైనా వ్యక్తిగతంగా నా పట్ల వైరుధ్యం ఎవరికీ లేకపోవడం వల్లే ఇప్పుడంతా ఒకటిగానే కనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన సంఘంలో వారుండవచ్చు. నా పనితీరు చూసి చాలామంది మారారు. ఎందుకంటే.. ఉద్యోగులంటేనే ఇంటిలెక్చువల్స్. సమస్యల కోసం ఎవరు చిత్తశుద్ధిగా పని చేస్తున్నారో వారికీ తెలుసు.
సత్యం: సుదీర్ఘ కాలం ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యవర్గానికి మీరు ఎన్నికవుతూవచ్చారు. జిల్లాలో మీరు ఎవర్ని నిలబెడితే వారే అధ్యక్ష కార్యదర్శులు లేదా మిగిలిన సభ్యులుగా కొనసాగుతూవచ్చారు. అసలు ఈ ఎన్జీవో సంఘం మీద మీకు అంత పట్టు ఎలా వచ్చింది?
నాయుడు: ఎంప్లాయీస్ మధ్య చిన్న చిన్న బేదాభిప్రాయాలు వస్తుంటాయి. ఒక లైవ్ ఆర్గనైజేషన్‌లో ఇవన్నీ కామన్. ఎంత బాగున్నా దగ్గర దగ్గర పనిచేయడం వల్ల చిన్న బేదాభిప్రాయాలు ఉంటాయి. వాటిని మనం మనస్ఫూర్తిగా సెట్ చేయాలి. దాన్ని రాజేసి రాజకీయాలు చేయాలని చూస్తే మరో రకంగా ఉంటుంది. వారి మధ్య రాజీ కుదర్చడం, ఐకమత్యంగా పని చేయించగలగడమే నా సక్సెస్ మంత్రం. ఎవరైతే యాక్టివ్‌గా ఉన్నారో వారిని నాయకత్వంలోకి తీసుకొచ్చాం. కులసమీకరణాలను లెక్కలోకి తీసుకోకుండా పని చేసేవాడే పదవిలో ఉండాలన్న సిద్ధాంతమే మమ్మల్ని బలోపేతం చేసింది. నేను పని చేస్తాను, నాకు పదవి కావాలనేవాడ్ని తొక్కేస్తే సంఘం ముందుకు నడవలేదు. అటువంటివారిని గుర్తించి ముందువరుసలో పెడితేనే మనకు బలం. ఇబ్బందీ ఉండదు.
సత్యం: పక్క రాష్ట్రాల్లో ఉద్యోగుల సంఘాలు పార్టీకి అఫ్లియేటెడ్‌గా పని చేస్తున్నాయి. మన దగ్గర మాత్రం ఏపీ ఎన్జీవో సంఘం న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ ఎలా మనగలిగింది? దానికి తోడు ఉద్యోగులు ఏదో ఒక పార్టీతో అంటకాగుతున్న రోజుల్లో న్యూట్రల్ ప్లాట్‌ఫామ్ అంటూ ఏపీ ఎన్‌జీజీవోస్ ఎలా నిలదొక్కుకుంది?
నాయుడు: 74 ఏళ్లుగా ఏపీ ఎన్జీవో సంఘం రాజకీయంగా తటస్థ వైఖరినే అవలంభిస్తుంది. ముఖ్యమంత్రిగా ఎవరు పని చేసినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మా డిమాండ్లు నెరవేర్చుకోవడం కోసమే వారితో కలిసి నడిచాం తప్ప రాజకీయ పార్టీల కోసం ఏనాడూ పని చేయలేదు. సంఘ నాయకులు, ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి ఒక్కో పార్టీ మీద మోజు ఉండొచ్చు. కానీ అది సంఘం మీద రిఫ్లెక్ట్ కాకుండా చూసుకోగలిగాం. ముఖ్యమంత్రి ఎవరైనా గుడ్ రిలేషన్ మెయింటైన్ చేశాం. ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభించనంత వరకు ముఖ్యమంత్రులతో మంచిగానే ఉన్నాం. ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరించిన అనేక ముఖ్యమంత్రులతో విభేదించిన సందర్భాలూ ఉన్నాయి.
సత్యం: ఎన్జీవో సంఘంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు అనేక పదవులు నిర్వహించిన మీరు ఏ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారని భావించారు?
నాయుడు: కచ్చితంగా గత వైకాపా ప్రభుత్వమే. 27 శాతం ఉన్న ఐఆర్‌ను 23 శాతానికి తగ్గించేశారు. ఫిట్మెంట్ బెనిఫిట్ కూడా తగ్గించిన ప్రభుత్వం వైకాపాయే. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. పెద్ద ఉద్యమాన్ని చేపట్టినా ఉక్కుపాదంతో అణిచేశారు. అద్దాల పెట్టెలో ఉన్న ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వం తలచుకుంటే పెద్ద పనేం కాదు. అదే పని వైకాపా చేసింది. దాని పర్యవసానమే తర్వాత ఎన్నికల్లో చూశాం. ట్రేడ్ యూనియన్లయితే ప్రభుత్వం మీద దండయాత్ర చేయగలవు. కానీ ఉద్యోగ సంఘాలు ఆ పని చేయలేవు. ఏదో ఒక పార్టీతో అనుబంధంగా ట్రేడ్ యూనియన్లు పని చేస్తున్నందున వారికిది సులువు. కానీ ఉద్యోగులు పార్టీలతో అనుబంధంగా ఉండరు. సమయం వచ్చినప్పుడు మాత్రమే ఉద్యోగులు సత్తా చూపిస్తారు.
సత్యం: ఇప్పటి వరకు అందరివాడిగా ఉన్న పురుషోత్తమనాయుడు భవిష్యత్తులో ఒక పార్టీ వైపు వెళ్లిపోతే కొందరివాడిగా మిగిలిపోతాడన్న భయం మీకు లేదా?
నాయుడు: ఒక ఉద్యోగిగా, ఉద్యోగుల సంఘ నాయకుడిగా ఉద్యోగులందరికీ అందరివాడిగా ఉండగలిగాను. ఇందులో ఎక్కడా పార్టీలతో సంబంధం లేకుండా వ్యవహరించగలిగాను. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్లగలిగాను. కానీ ప్రజాసేవ చేయాలనుకుంటే మాత్రం రిటైరైన తర్వాత ఏదో ఒక పార్టీ వైపు వెళ్లకతప్పదు. పార్టీ పాలసీ ప్రకారం మాట్లాడటమే తప్ప వ్యక్తిగత విమర్శలు, దూషణలు నావల్ల కాదు.
సత్యం: ప్రస్తుత రాజకీయాల్లో దూషణలు, తిట్లు, వ్యక్తిగత విమర్శలు చేసినవారికే పదవులు ఇస్తున్నారు కదా.. మీరు పాలసీ మీదే మాట్లాడతామంటే పదవులొస్తాయా?
నాయుడు: పదవులు రాకపోయినా ఫర్వాలేదు కానీ, ఎవర్నీ ఊరకనే తిట్టడం, ట్రోల్ చేయడం వంటివి నావల్ల కాదు. పదవి రాకపోయినా ప్రజల కోసం పని చేసుకుపోతాను. నాయకుడికి అనుకూలంగానో, పార్టీ పాలసీని జనం మధ్యకు తీసుకువెళ్లడానికో పనికొస్తాను గాని, వ్యక్తిగతంగా తిట్టడమంటే నావల్ల కాదు.
సత్యం: సుదీర్ఘ కాలం ఉద్యోగ సంఘ నాయకుడిగా పని చేసిన మీరు మీ హయాంలో ఇది సాధించాను అని చెప్పుకోవాలంటే దేన్ని ముందుకు తెస్తారు?
నాయుడు: వాస్తవానికి 19వ రాష్ట్ర మహాసభలు జిల్లాలో నిర్వహించాం. అప్పుడు నేను రాష్ట్ర సహాధ్యక్షుడిగా ఉన్నాను. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పని చేస్తున్న ఉద్యోగులకు 20 శాతం హెచ్‌ఆర్‌ఏ తీసుకువచ్చాం. నిజానికి 2 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతానికి 20 శాతం హెచ్‌ఆర్‌ఏ రాదు. అప్పటికి మనం 14 శాతం హెచ్‌ఆర్‌ఏతో ఉన్నాం. ఈ మహాసభల ద్వారా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఒప్పించి 20 శాతం చేయగలిగాం. దీనివల్ల జిల్లా కేంద్రంలో ఉన్న 7వేల మంది ఉద్యోగులకు మేలు జరిగింది. మనతో పాటు విజయనగరం, మచిలీపట్నం, చిత్తూరు వంటి జిల్లాలకు కూడా ఇదే హెచ్‌ఆర్‌ఏ వచ్చేటట్టు చేశాం. అలాగే అంతవరకు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మాత్రమే ఉన్న చైల్డ్‌కేర్ లీవును కూడా రాష్ట్రంలో చేయించగలిగాం. ఇది దేశంలోనే 60 రోజుల పాటు చైల్డ్‌కేర్ లీవ్ తీసుకువచ్చిన రికార్డు మనకే దక్కింది. ఈ రెండూ శ్రీకాకుళంలో జరిగిన ఎన్జీవోల రాష్ట్ర మహాసభలకు వచ్చిన ముఖ్యమంత్రిని ఒప్పించగలిగాననే ఆనందం ఇప్పటికీ ఉంది.
Comments