డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సంతాపం
(సత్యంన్యూస్, ఎచ్చెర్ల)

జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విశ్వక్సేన్ మాతృమూర్తి కాంతిశ్రీ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందారు. కాంతిశ్రీ మృతి పట్ల రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేస్తూ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ పట్ల కాంతిశ్రీకి, ఆమె కుటుంబానికి ఉన్న నిబద్ధత, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి చేసిన కృషిని కొనియాడారు. ఉత్తరాంధ్రలో పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన కాంతిశ్రీ మృతికి చింతిస్తూ ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచీ కాంతిశ్రీ జనసేనలో కార్యకర్తగా క్రియాశీలకంగా పని చేశారు. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైన కాంతిశ్రీ పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్‌తో నడిచి మొదట శ్రీకాకుళం ఆ తర్వాత ఎచ్చెర్లలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పిలుపుతో నిర్వహించిన అనేక పార్టీ కార్యక్రమాలను శ్రీకాకుళం వేదికగా జిల్లాస్థాయిలో నిర్వహించారు. జనసేన సీనియర్ నాయకురాలిగా కొనసాగుతున్న కాంతిశ్రీ ఇద్దరు కుమారులు డాక్డర్ విశ్వక్సేన్, వినీల్ ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్నారు. విశ్వక్సేన్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా, రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వినీల్ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగంలో సేవలందిస్తున్నారు. విశ్వక్సేన్ మాతృమూర్తి కాంతిశ్రీ మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, కూటమి ప్రజాప్రతినిధులు, జనసేన నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు.
Comments