top of page

విషం కాదు ప్రగతి కాముక పరిశ్రమలు కావాలి!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 25, 2025
  • 2 min read

ఫార్మా పరిశ్రమల కాలుష్యం, ప్రమాదాలతో రాష్ట్రం విలవిల్లాడుతోంది. గత నెలలో బలభద్ర పురంలో వెలుగు చూసిన క్యాన్సర్‌ వ్యాధులే దీనికి ఉదాహరణ. కానీ అక్కడే క్యాన్సర్‌ కారక రసాయనాలు వాడే పరిశ్రమకు అనుమతివ్వడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. శాస్త్రీయ దృక్పథం లేని అభివృద్ధి కోసం ఆరాటం, లాభాల కోసం పని చేసే కంపెనీలకు ప్రోత్సాహం కారణంగా రాష్ట్రం శాపగ్రస్తమవుతోంది. ప్రపంచం తిరస్కరించిన హానికర రసాయనాలను తాత్కాలిక లాభాల కోసం వాడటం భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఇదే తరహా రసాయనాలతో ఐరోపా దేశాలపై పడిన ఆర్థిక భారం రెండు లక్షల కోట్ల డాలర్లు అని అంచనా. ప్రజలను, పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభు త్వాలు ఆ విషయంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. విచక్షణారహితంగా హానికర పరిశ్రమలకు పర్యావరణ అనుమతులు ఇస్తున్నారు. ప్రపంచం తిరస్కరించిన పెర్‌ ఫ్లోరో ఆక్టోనయేక్‌ యాసిడ్‌తో ఉత్పత్తులు ప్రారంభిస్తున్నారు. దీనిపైనే మే 14న ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నారు. అయితే పెర్‌ ఫ్లోరో ఆక్టోనయేట్‌ అనే పీఎఫ్‌వోఏ రసాయనం ప్రపంచానికి ఇప్పటికే చేసిన కీడు గురించి ప్రజలకు తెలియజేయడం అత్యవసరం. భూమి ఎదుర్కొంటున్న తొమ్మిది కీలక పర్యావరణ సమస్యల్లో రసాయన కాలుష్యం ఒకటి. ఇప్పటికే శాశ్వత రసాయన కాలుష్యం హద్దులు దాటిందని 2022 నాటి పరిశోధన స్పష్టం చేస్తోంది. ఇది ప్రపంచానికి పెను సమస్య. ఎందుకంటే.. జీవజాలం అంతరించినా శాశ్వత రసాయనాలు మాత్రం మిగిలే ఉంటాయి. వీటిని ఉత్పత్తి చేసే కంపెనీలు ఈ విషయాన్ని దాచిపెడుతున్నాయి. పీఎఫ్‌వోఏ వినియోగంపై పరిమితులున్నప్పటికీ భారత వంటి పలు దేశాల్లో దీని వినియోగం కొనసాగుతోంది. పారిశ్రామిక ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న ప్రజల్లో కూడా ఈ రసాయనాలు లేని రక్తం దొరకలేదు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ వర్షం కురిసినా ఆ నీటిలో ఈ రసాయనాలు ఉంటున్నాయి. న్యాయ పోరాటంలో భాగంగా ఏర్పాటు చేసిన సీ8 సైన్స్‌ ప్యానల్‌ పీఎఫ్‌వోఏ వల్ల అధిక కొలెస్ట్రాల్‌, అల్సరేటివ్‌ కోలిటిస్‌, థైరాయిడ్‌, వృషణాల క్యాన్సర్‌, మూత్రపిండాల క్యాన్సర్‌, గర్భధారణ ప్రేరిత రక్తపోటు వంటి ఆరు రకాల వ్యాధులు వస్తాయని నిర్ధారించింది. 2019లో స్టాక్‌హోమ్‌ కన్వెన్షన్‌ ద్వారా 180 దేశాలు శాశ్వత రసాయనాల వాడకం నిలిపివేయాలని ఒప్పందం చేసుకున్నాయి. భారత్‌ ఈ ఒప్పందంలో భాగం కాకపోవడం కంపెనీ లకు అనుకూలంగా మారింది. దీని వల్ల ముఖ్యంగా మన రాష్ట్రానికి ముప్పు పొంచి ఉంది. గ్రాసిం, బలభద్రపురంలోని గ్రాసిం ఫ్యాక్టరీ తమ కాస్టిక్‌ సోడా ప్రాజెక్టు విస్తరణలో క్లోరిన్‌ వినియోగం పెంచేందుకు వీలుగా పలు క్లోరిన్‌ రసాయనాల ఉత్పత్తికి 2024 ఫిబ్రవరిలో పర్యావరణ అనుమతి పొందింది. దీనికోసం 2023 ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయ సేకరణను తూతూ మంత్రంగా కానిచ్చే శారు. ఈ కంపెనీ కార్యకలాపాల్లో భాగంగా ఉత్పత్తి అయ్యే ఓజోన్‌ పొరకు నష్టం కలిగించే 70 టన్నుల టెట్రాక్లోరైడ్‌ను రోజూ ఇన్సినరేటర్‌లో తగలబెడతారట. అయితే ఆ క్రమంలో అత్యంత ప్రమాదకర డయాక్సిన్లు, ఫ్యూరాన్లు ఉత్పత్తి అయ్యి గాలిలో కలుస్తాయి. అవి క్యాన్సర్‌ కారకాలు. అవి గాలిలో వేయి కోట్లలో ఒక భాగమున్నా ప్రమాదకరమే. పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక లో ఆర్‌23 ఉత్పత్తిని దాచిపెట్టారు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా, ప్రజల అభ్యంతరాలను పరిశీలించకుండానే పర్యావరణ అనుమతి ఇచ్చేశారు. పర్యావరణ అనుమతికి సిఫార్సు చేసిన నిపు ణులు పీఎఫ్‌వోఏ వాడుక గురించి చర్చించిన దాఖలాలు లేవు. వాటి నుంచి రక్షణపై ఎలాటి షరతులూ లేవు. గ్రాసిం, టీజీవీ ఎస్‌ఆర్‌ఎఎసిఎల్‌ వంటి కంపెనీలు కేవలం లాభాల కోసం ప్రజా రోగ్యం, పర్యావరణంతో చెలగాటమాడుతున్నాయి. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ పరిశ్రమలు భవి ష్యత్తులో పెను విషాదాలకు కారణం కావచ్చు. హైదరాబాద్‌, అమరావతి ప్రజలు అదేనీరు తాగు తారు. లక్ష కోట్లలో నాలుగు భాగాల పీఎఫ్‌వోఏ ఉన్న నీరు తాగడానికి అసలు పనికి రాదు. ప్రస్తుత నీటి శుద్ధి వ్యవస్థలు పీఎఫ్‌వోఏలను తొలగించలేవు. ఇక మన ఆరోగ్యం సంగతి అంతే! బాధితుల గోడు వినేదెవరు? మన ఆరోగ్యం, మన పర్యావరణం, మన భవిష్యత్తు కోసం గట్టిగా నిలబడాల్సిన సమయం ఇది. లాభాపేక్షతో కూడి విషపూరిత పరిశ్రమలను తిరస్కరించి శాస్త్రీయ దృక్పథంతో కూడిన అభివృద్ధిని ప్రజలు డిమాండ్‌ చేయగలగాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page