top of page

వెసులుబాటు బాగు.. కానీ ఎందుకింత జాగు!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Apr 30
  • 2 min read
  • వేట నిషేధ భృతి ఎక్కువమందికి వర్తించేలా మార్గదర్శకాలు

  • ఇప్పటికీ పూర్తి కాని ఎంపిక ప్రక్రియ

  • మత్స్యవేట నిషేధం మొదలై 15 రోజులైనా అతీగతీ లేదు

  • జాబితాలు ఎప్పుడు సిద్ధమవుతాయో తెలియని దుస్థితి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

చేపల పునరుత్పత్తి సీజను కావడంతో సముద్రంలో వేట నిషేధం మొదలై అప్పుడు పక్షం గడిచిపోయింది. కానీ వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇచ్చే భృతి ఎప్పుడు చెల్లిస్తారన్నదానిపై స్పష్టత లేదు. మరోవైపు ‘మత్స్యకార సేవ’ పథకానికి ప్రభుత్వం మెరుగులు దిద్దింది. నిబంధనలను సడలించి ఎక్కువమందికి లబ్ధి చేకూరేలా పలు వెసులుబాటు కల్పించింది. ఈ పరిస్థితుల్లో ఎక్కువమందికి అవకాశం కల్పించినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు.. అదే సమయంలో ఇప్పటికీ నిధులు విడుదల చేయకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 170 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఉన్న జిల్లాలోని 11 మండలాల పరిధిలో 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. సముద్రంలో చేపలవేట సాగించే ఈ గ్రామాల్లోని మత్స్యకారుల వద్ద 2805 సంప్రదాయ పడవలపై 8600 మంది, 1623 మెకనైజ్డ్ బోట్లపై 9,950 మంది మత్స్యకారులు వేట చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు వీరంతా ద్వైదీభావంతో ఉన్నారు.

పెరిగిన లబ్ధిదారుల సంఖ్య

మత్స్యకార సేవ అర్హతలను ఈ ఏడాది ప్రభుత్వం సడలించింది. దీంతో జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 16 వేలకు దాటుతుందని మత్స్యశాఖ అధికారులు చెప్పారు. ఆ మేరకు ఈ నెల తొమ్మిదో తేదీన ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన, సబ్సిడీ అయిల్ కార్డు ద్వారా వంద లీటర్ల అయిల్ వాడుకున్న వారిని అనర్హులుగా పరిగణించేవారు. తాజాగా ఈ నిబంధనలను సడలించారు. సంప్రదాయ పడవలపై వేటకు వెళ్లే వారిలో బోటుకు ముగ్గురు, మెకనైజ్డ్ బోటు అయితే ఆరుగురు చొప్పున పరిహారం అందిస్తారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజులు పాటు సముద్రంలో చేపల వేట ప్రతి ఏటా నిషేధిస్తుండటం వల్ల ఆ సమయంలో జీవనభృతి కోల్పోయే మత్స్యకారులకు గత కొన్నేళ్లు ప్రభుత్వాలు భృతి చెల్లిస్తున్నాయి. మొదట రేషన్‌తో పాటు రూ.2 వేలు నగదు ఇచ్చేవారు. ఆ తర్వాత నగదు సాయాన్ని రూ.4 వేలు చేశారు. 2019లో ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచగా 2025లో దాన్ని రెట్టింపు అంటే రూ.20 వేలు చేశారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు జిల్లాలో ఈ నెల 17 వరకు ప్రత్యేక బృందాల ద్వారా సమాచార సేకరణ, పడవల తనిఖీ నిర్వహించారు. ఈ సర్వే ద్వారా ప్రాథమికంగా ఎంపిక చేసిన 16,616 మంది అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, 23న ఆ జాబితాలను గ్రామ సచివాలయాý నోటీసు బోర్డుల్లో ఉంచారు. ఈ జాబితాలపై 25 వరకు అభ్యంతరాలు సేకరించి, మార్పుచేర్పులు చేసిన జాబితాను 27న కలెక్టర్ ద్వారా విజయవాడ కమిషనరేట్‌కు పంపారు. ఈ జాబితాలను ప్రభుత్వం ఆర్టీజీఎస్‌లో వడపోత నిర్వహించి, ఆ వివరాలను జిల్లాకు తిరిగి పంపిస్తారు. ఆ వివరాల ఆధారంగా సిక్స్ స్టెప్(ఆరు అంచెల) వ్యాలిడేషన్ చేసిన తర్వాత గ్రీవెన్స్‌లో తుది పరిశీలన పూర్తి చేసి ఈ`కేవైసీ కూడా చేయించిన అనంతరం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.

కనీసం రెండు వారాలు

ఎక్కువమందికి అవకాశం లభిస్తున్నప్పటికీ.. ఇంతవరకు లబ్ధిదారుల జాబితాలే సిద్ధం కాకపోవడంతో ఎప్ప్పుడు భృతి జమ చేస్తారన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో వేట నిషేధకాల భృతి ఇవ్వలేదు. గత ఏడాది భృతిని రూ.20 వేలకు పెంచి జిల్లాలో 15,548 మంది లబ్ధిదారులకు అందజేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30న భృతి నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే జిల్లా అధికారులు పంపిన 16,616 మందితో కూడిన జాబితాకు ఇంకా ఆర్టీజీఎస్ క్లియరెన్స్ రావల్సి ఉంది. ఆ తర్వాత కూడా జిల్లా పరిధిలో నిర్వహించాల్సిన అధికారికి ప్రక్రియలకు కనీసం మరో రెండు వారాల సమయం పడుతుందని అధికారులే చెబుతున్నారు. ఆ తర్వాతే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని మత్స్యశాఖ డీడీ సత్యనారాయణ చెప్పారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page